మెగలొడాన్: తిమింగలాలనే మింగేసే అతి పెద్ద షార్క్.. ఆ సొరచేప కోరను వెదికి పట్టుకున్న 9 ఏళ్ల బాలిక

    • రచయిత, సామ్ కాబ్రల్ 
    • హోదా, బీబీసీ న్యూస్

కొన్ని లక్షల సంవత్సరాల కిందట అంతరించిపోయిన భారీ షార్క్ (సొర చేప) జాతి శిలాజాన్ని ఒక తొమ్మిదేళ్ల బాలిక కనుగొనింది. 

మొల్లీ సాంప్సన్ (9) క్రిస్మస్ సంబరాల కోసం అమెరికాలోని మేరీల్యాండ్‌లో గల క్లావెర్ట్ బీచ్‌కు కుటుంబంతో కలిసి వెళ్లింది. సముద్ర తీరంలో తిరుగుతూ.. ‘అమ్మా! నేను మెగ్ కోసం వెతుకుతున్నా’ అని తన అమ్మతో మొల్లీ చెప్పింది.

‘మెగలొడాన్’ అనే ప్రాచీన భారీ షార్క్‌ను షార్ట్‌కట్‌లో ‘మెగ్’ అంటున్నారు. 2018లో ఈ షార్క్ కేంద్రంగా ‘మెగ్’ అనే హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది.

అయితే ఆ పాపకు నిజంగానే ‘మెగలొడాన్’‌ శిలాజం కనిపించింది. సముద్ర తీరంలో మోకాళ్ల లోతు నీటిలో ‘ఒటొడస్ మెగలొడాన్’కు చెందిన ఒక పెద్ద కోర ఆ పాపకు దొరికింది. 

జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటివి దొరుకుతాయని స్థానిక మ్యూజియంలో క్యూరేటర్‌గా పని చేసే వ్యక్తి అన్నారు. 

మొల్లీ సాంప్సన్‌కు దొరికిన మెగలొడాన్ కోర పొడవు 5 అంగుళాలు. అది ఆ పాప ముంజేయి కన్నా పెద్దగా ఉంది. 

మొల్లీ సాంప్సన్ తండ్రికి శిలాజాలను గుర్తించే అలవాటు ఉంది. చిన్నప్పటి నుంచి ఆయన ఆ పని చేస్తూ ఉండే వారు. మొల్లీ కూడా తండ్రి బాటలోనే నడుస్తోంది. ఇప్పటి వరకు 400కు పైగా శిలాజాలను గుర్తించిందని పాప తల్లి అలిసియా తెలిపారు. 

తమకు దొరికిన ఆ షార్క్ పన్నును తీసుకొని క్లావెర్ట్ మరీన్ మ్యూజియమ్‌కు వారు వెళ్లారు. దాన్ని మెగలొడాన్‌కు చెందిన పన్నుగా వారు ధ్రువీకరించారు. 

66 అడుగుల పొడవు.. 60 వేల కిలోల బరువు...

భూమీ మీద ఒకప్పుడు జీవించిన అతి పెద్ద సొర చేపల జాతుల్లో మెగలొడాన్ ఒకటి. గ్రీకు భాషలో మెగలొడాన్ అంటే ‘పెద్ద పన్ను’ అని అర్థం. సుమారు 35 లక్షల సంవత్సరాల కిందట ఇవి అంతరించి పోయాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

మెగలొడాన్‌ జాతికి చెందిన సొర చేపలు సుమారు 66 అడుగులు (20 మీటర్ల) పొడవు పెరుగుతాయి. సముద్రంలో ఇంత వరకు గుర్తించిన అతి పెద్ద చేపల్లో ఈ జాతి కూడా ఒకటి.

వీటి బరువు 60 టన్నులు అంటే 60 వేల కిలోల కంటే ఎక్కువ ఉంటుంది. అంటే సుమారు 6 ఆఫ్రికా ఏనుగుల బరువుకు సమానం.

అత్యంత భారీ పరిమాణంలో ఉండే ఈ మెగలొడాన్ షార్క్‌లు తిమింగలాలను సైతం తినేవి. అంటార్క్‌టికా చుట్టుపక్కల తప్ప ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లోనూ ఈ షార్క్‌లు ఆధిపత్యాన్ని చలాయించాయి. 

తిమింగలాలు వీటి ఇష్టమైన ఆహారం

ఈ సొరచేప తనకు నచ్చింది తినేది. తిమింగలాలు దానికి బాగా ఇష్టమైన ఆహారం. అప్పుడప్పుడు సీల్స్‌ను కూడా ఇష్టంగా తింటుంది. 

సముద్రంలో తిరుగుతూ ఉండే మెగలొడాన్, తిమింగలాలు వంటివి గాలి పీల్చుకోవడం కోసం నీటి పైకి వచ్చినప్పుడు దాడి చేసేది. చాలా వేగంగా ఈదుతూ వాటిని చుట్టుముట్టేది. 

మెగలొడాన్ తాను వేటాడే జీవి తోకను ముందుగా గాయపర్చేది. తోక దెబ్బతిన్న తరువాత ఆ జీవులు సరిగ్గా ఈదలేవు. అప్పుడు సులభంగా వాటి మీద దాడి చేసి తినేసిది మెగలొడాన్.

ఈ భారీ సొరచేపలు సుమారు 2.2 కోట్ల సంవత్సరాల కిందటి నుంచి 35 లక్షల సంవత్సరాల కిందటి వరకూ భూమి మీది సముద్రాల్లో జీవించాయి.

అంతరించిపోవడానికి కారణం?

మెగలొడన్ జాతి షార్క్‌లు ఎందుకు అంతరించి పోయాయో కచ్చితంగా కారణాలు తెలియవు. కానీ దాని భారీ ఆకారమే అందుకు ఒక కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అంత భారీ పరిమాణంలో ఉండే జీవికి ఆహారం చాలా ఎక్కువ కావాలి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సుమారు 26 లక్షల సంవత్సరాల కిందట సముద్రమట్టాల్లో మార్పులు వచ్చాయి. ఎక్కువగా సముద్రతీరాల్లో నివసించే మెగలొడన్ జాతికి అది ప్రమాదకరంగా మారింది. 

ఆ తరువాత కొన్ని లక్షల సంవత్సరాలలో షార్కులు, సముద్ర తాబేళ్లు, సముద్ర పక్షులతో పాటు ఇతర సముద్ర జీవజాలం 36 శాతం అంతరించిపోయింది.

అలా అంతరించి పోయిన అతి పెద్ద సొరచేపల్లో మెగలొడాన్ జాతి చివరిది. 

ప్రస్తుతం ఉన్న ‘ది గ్రేట్ వైట్ షార్క్’ వాటికి వారసులుగా కొనసాగుతున్నాయి. ఇవి మెగలోడాన్ పరిమాణంలో మూడో వంతుకన్నా చిన్నవి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)