You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- రచయిత, మాక్స్ మట్జా
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికాలో గూఢచర్యం చట్టాన్ని తీసుకొచ్చిన గత వందేళ్లలో నమోదైన అన్ని కేసుల్లో కేవలం కొన్ని మాత్రమే ‘‘విదేశాల తరఫున నిఘా పెట్టడం’’అనే నేరంగా నమోదయ్యాయి. వీటిని మాత్రమే చాలామంది అసలైన గూఢచర్యంగా భావిస్తుంటారు.
వివిధ కేసులతోపాటు గూఢచర్యానికి సంబంధించిన 31 రకాల అభియోగాలు ఎదుర్కొంటున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అయితే, ఆయనపై గూఢచర్యం అభియోగాలను తొలగించాలని, విదేశాల కోసం స్పై గా వ్యవహరించలేదని రిపబ్లికన్ పార్టీ వాదిస్తోంది.
"మీరు ఆయన ధైర్యాన్ని ద్వేషించవచ్చు, కానీ ఆయన గూఢచారి కాదు, గూఢచర్యం చేయలేదు" అని సౌత్ కరోలినా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు.
ట్రంప్ జాతీయ భద్రతకు హాని కలిగించడానికి అమెరికా శత్రువులతో కలిసి కుట్రలేమీ చేయలేదని ఫ్లోరిడా రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబియో అన్నారు.
"ఆయన దానిని ఒక విదేశీ శక్తికి విక్రయించారని, అది వేరొకరికి అక్రమంగా రవాణా అయిందని లేదా ఎవరైనా దానిని యాక్సెస్ చేశారని అనడానికి ఎలాంటి ఆధారం లేదు" అని రూబియో వాదిస్తున్నారు.
ఈ గూఢచర్యం చట్టం ఏంటి?
1917లో మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా ప్రవేశించిన రెండు నెలల తర్వాత గూఢచర్య చట్టాన్ని ఆ దేశ కాంగ్రెస్ ఆమోదించింది.
అమెరికా "దేశ రక్షణకు సంబంధించిన" ప్రభుత్వ రికార్డులను దుర్వినియోగం చేయడాన్ని ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది.
అయితే, దీన్ని అమెరికాకు హాని కలిగించాలని కోరుకునే గూఢచారులను శిక్షించడానికి పెద్దగా ఉపయోగించిన దాఖలాలు లేవు.
కానీ, ఇటీవలి సంవత్సరాలలో జర్నలిస్టులు, ప్రభుత్వ రహస్యాలను బహిర్గతం చేసే విజిల్-బ్లోయర్‌లను శిక్షించడానికి తరచుగా ఉపయోగించారు.
2020 జనవరి 20న ట్రంప్ అధ్యక్ష పదవి ముగిసింది. అయితే, అనధికారిక ప్రదేశంలో, ప్రైవేట్ పౌరుడైన ట్రంప్‌కు ప్రభుత్వ పత్రాలను తన దగ్గర పెట్టుకోవడానికి అనుమతి లేదు.
కానీ, పదవి నుంచి దిగిపోయిన ఏడాది తర్వాత కూడా ట్రంప్ రెండు రిసార్ట్‌లలో వందల పేజీల ప్రభుత్వ పత్రాలు ఉన్నాయని ప్రాసిక్యూటర్‌లు చెప్పారు.
అన్నింటినీ నేషనల్ ఆర్కైవ్స్‌కు అప్పగించాలంటూ పదేపదే అడిగినట్లు వారు గుర్తుచేశారు.
ట్రంప్‌పై ఆ చట్టం ఎంతవరకు ప్రభావం చూపవచ్చు?
అయితే, ఈ చట్టంలోని 8 US కోడ్ 793 (e) ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, మరొక దేశంలో కలిసి పని చేస్తేనే నిందితుడు కాడు.
పత్రాలను అనధికారికంగా తన దగ్గర పెట్టుకోవడం, యాక్సెస్ చేయడం లేదా కంట్రోల్‌లో ఉంచుకోవడం కూడా నేరమేనని ఈ నిబంధన చెబుతోంది.
అమెరికాకు నష్టం కలిగించడం లేదా విదేశాలకు ఏదైనా ప్రయోజనం కోసం వాటిని ఉపయోగించడం, దానిని ఉద్దేశపూర్వకంగా దాచుకోవడం, ఆ సమాచారం తీసుకోవడానికి అర్హత ఉన్న అమెరికా అధికారి లేదా ఉద్యోగికి దానిని ఇవ్వడానికి నిరాకరించడంలాంటి వాటిని ఈ కేసులో నేరంగా పరిగణిస్తారు.
చట్టం ప్రకారం తన వద్ద ఉన్న సమాచారం బయటకు వస్తే జాతీయ భద్రతా ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని ట్రంప్‌కు తెలుసునని ప్రాసిక్యూటర్లు నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ అది చేయగల హానిని ఎవరైనా అర్థం చేసుకుంటారు.
సమాచారం అధికారులకు అప్పగించడానికి అనేక అవకాశాలు ఉన్నా కూడా ఇవ్వకుండా ట్రంప్ దగ్గరే పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చట్టప్రకారం ఆ పత్రాలు అమెరికా జాతీయ భద్రతకు సంబంధించినవా? లేదా అవి అమెరికా ప్రయోజనాలకు ఏదైనా నష్టం కలిగించాయా? అని నిరూపించాల్సిన అవసరం కూడా లేదు.
ఈ చట్టం కింద ఎవరెవరికి శిక్షలు పడ్డాయి?
గూఢచర్యం చట్టం ప్రారంభ రోజులలో సైనిక విధానాలను వ్యతిరేకించే రాజకీయ అసమ్మతివాదులు, శాంతి కార్యకర్తలను విచారించడానికి ఇది ఉపయోగించేవారు.
పెంటగాన్ పేపర్స్ లీక్ బయటపెట్టిన డేనియల్ ఎల్స్‌బర్గ్ , దేశీయ నిఘా చర్యలు బహిర్గతం చేసిన మాజీ ఇంటెలిజెన్స్ వర్కర్ ఎడ్వర్డ్ స్నోడెన్ వంటి విజిల్-బ్లోయర్స్ పై న్యాయశాఖ ద్వారా ఈ చట్టం ప్రయోగించారు.
అంతేకాకుండా వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేపై గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపారు. ఆయన్ను అమెరికాకు అప్పగించాలని కోరుతున్నారు.
ఇంటెలిజెన్స్ వర్కర్స్ చెల్సియా మానింగ్, రియాలిటీ విన్నర్‌లపై కూడా ఈ చట్టం కింద విచారణ జరిగింది. ఈ చట్టంలో శిక్షలు కూడా తీవ్రంగా ఉంటాయి.
1953లో జూలియస్, ఎథెల్ రోసెన్‌బర్గ్‌లు న్యూయార్క్‌లో సోవియట్ యూనియన్ కోసం గూఢచర్యానికి (సోవియట్ స్పై రింగ్) పాల్పడ్డారంటూ మరణశిక్ష విధించారు.
జోనాథన్ పొలార్డ్ ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తూ దొరికారు. సీఐఏ అధికారి ఆల్డ్రిచ్ అమెస్, ఎఫ్‌బీఐ ఏజెంట్ రాబర్ట్ హాన్సెన్‌లు సోవియట్ యూనియన్‌కు సమాచారం అందిస్తూ పట్టుబడ్డారు. వీరిపై గూఢచర్య చట్టం అమలు చేశారు.
జాతీయ భద్రతా పత్రాలను అక్రమంగా ఉంచుకున్నందుకు 2018 నుంచి గూఢచర్యం చట్టం కింద దాదాపు డజను క్రిమినల్ ప్రాసిక్యూషన్‌లు జరిగాయని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ఇవి కూడా చదవండి
- మధ్యధరా సముద్రంలో మునిగిన పడవ... 79 మంది మృతి, వందల మంది వలసదారులు గల్లంతు
- అమృత్సర్: ఆకలి ఎరుగని నగరం.. సిక్కుల సేవాగుణానికి ఇది ఎలా ఉదాహరణగా నిలుస్తోంది?
- చిత్తూరు: నిరుడు కేజీ రూ.70 పలికిన తోతాపురి మామిడిని రైతులు ఇప్పుడు రూ.10కే అమ్మాల్సి వస్తోంది? దీని వెనక ఎవరున్నారు?
- సౌదీతో చైనా ఒప్పందాలు చేసుకుంటే భారత్ ఎందుకు టెన్షన్ పడుతోంది?
- మహాసముద్రాల్లో మునిగిన నౌకల్లోని సంపద వెలికి తీయడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)