You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మధ్యధరా సముద్రంలో మునిగిన పడవ... 79 మంది మృతి, వందల మంది వలసదారులు గల్లంతు
- రచయిత, జార్జి రైట్, లారా గోజి
- హోదా, బీబీసీ ప్రతినిధి
దక్షిణ గ్రీస్ తీరంలో ఫిషింగ్ బోటు బోల్తా పడడంతో 79 కంటే ఎక్కువమంది చనిపోయారు. 100 మందిని పైగా కాపాడగలిగారు.
అయితే, ఇంకా చాలామంది వలసదారులు బోటులో ఉన్నారని, వారి ఆచూకీ తెలియలేదని గ్రీస్ అధికారులు, ప్రాణాలతో బయటపడ్డవారు చెబుతున్నారు.
గ్రీస్‌లో అతిపెద్ద వలస విషాదాలలో ఇది ఒకటని ఆ దేశ ప్రభుత్వం చెబుతోంది. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.
పైలోస్‌కు సుమారు 80 కిమీ దూరంలో బోటు తిరగబడింది. మంగళవారం అర్థరాత్రి అంతర్జాతీయ జలాల్లో వెళుతున్న పడవను యూరోపియన్ యూనియన్ (ఈయూ) సరిహద్దు ఏజెన్సీ ఫ్రాంటెక్స్‌కు చెందిన విమానం గుర్తించిందని, అందులో ఉన్న వారెవరూ లైఫ్ జాకెట్లు వేసుకోలేదని కోస్ట్‌గార్డ్ తెలిపింది. సహాయానికి ముందుకొస్తే తిరస్కరించారని చెప్పింది.
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, అధికారులు శాటిలైట్ ఫోన్ ద్వారా పడవను చాలాసార్లు కాంటాక్ట్ చేశారు. సహాయం అందిస్తామన్నారు. కానీ, పడవ సిబ్బంది అందుకు అంగీకరించలేదు. "మాకు ఇటలీ వెళ్లడం తప్ప మరేమీ అక్కర్లేదని" వాళ్లు చెప్పినట్టు గ్రీక్ చానెల్ ఈఆర్‌టీ వెల్లడించింది.
కొన్ని గంటల తరువాత, అర్థరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో, పడవలో ఉన్న ఒకరు పడవ ఇంజిన్ పనిచేయట్లేదని గ్రీస్ కోస్ట్‌గార్డ్‌కు తెలిపారు.
మరికొద్దిసేపట్లోనే పడవ బోల్తాపడింది. 10 నుంచి 15 నిమిషాల్లో పూర్తిగా మునిగిపోయింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు కానీ, బలమైన గాలులు వీచడంతో అది కష్టమైంది.
"సహాయం పంపడానికి కొన్ని గంటల ముందు నుంచే పడవ ఆపదలో చిక్కుకున్నదని" అలారం ఫోన్ కోర్స్ట్‌గార్డ్‌కు సంకేతాలు అందించింది.
అలారం ఫోన్ అనేది వలసదారులకు సముద్రంలో ఇబ్బందులు ఎదురైతే సహాయపడేందుకు అందుబాటులో ఉండే ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్.
పడవ ఇబ్బందుల్లో ఉన్నదని అధికారులకు వివిధ మూలాల ద్వారా సమాచారం అందినట్టు కోస్ట్‌గార్డ్ చెప్పింది.
చాలామంది గ్రీస్ ప్రభుత్వాన్ని లేదా అధికారులను సంప్రదించడానికి వెనుకాడతారు. ఎందుకంటే, ఆ దేశంలో "చాలా కఠినమైన వలస చట్టాలు" ఉన్నాయి.
ఈ పడవ లిబియా నుంచి ఇటలీ వెళుతోందని, పడవలో ఉన్నవారిలో చాలామంది 20లలో ఉన్న పురుషులేనని భావిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా వాళ్లు ఆ పడవలో ప్రయాణిస్తున్నారని, మంగళవారం మధ్యాహ్నం మాల్టీస్ కార్గో షిప్ ఈ పడవను సమీపించి ఆహారం, నీరు అందించిందని స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి.
పడవలో 500 నుంచి 700 మంది ఉంటారని ప్రాణాలతో బయటపడ్డవారు చెబుతున్నారు.
బోటు సామర్థ్యామానికి మించి అందులో ఎక్కారని, ప్రమాదం జరగవచ్చని ప్రాంతీయ ఆరోగ్య డైరెక్టర్ యిన్నిస్ కర్వెలిస్ హెచ్చరించినట్టు తెలుస్తోంది.
కోస్ట్‌గార్డ్ కెప్టెన్ నికోలాస్ అలెక్సియో పభ్లిక్ టీవీలో మాట్లాడుతూ, పడవ డెక్‌పై జనం కిక్కిరిసి ఉన్నట్టు తన సహోద్యోగులు గమనించారని చెప్పారు. మధ్యధరా సముద్రంలో బాగా లోతైన ప్రాంతంలో పడవ మునిగిపోయిందని తెలిపారు.
బాధితులు ఏ దేశానికి చెందినవారన్న సమాచారం ఇంకా వెల్లడించలేదు.
బతికి బయటపడ్దవారిని కలమట పట్టణంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ముగ్గురిని ట్రాఫికర్లుగా అనుమానిస్తూ, కలమటలోని సెంట్రల్ పోర్ట్ అథారిటీకి తీసుకెళ్లి విచారిస్తున్నట్లు ఈఆర్‌టీ తెలిపింది.
గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా సకెల్లారోపౌలౌ ఈ విషాదం పట్ల విచారం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
ఏటా మధ్యధరా సముద్రాన్ని దాటడానికి ప్రయత్నిస్తూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతారు. ఫిబ్రవరిలో దక్షిణ ఇటలీలోని కాలాబ్రియా ప్రాంతంలోని కుట్రో సమీపంలో వలసదారులను తీసుకెళుతున్న ఒక బోటు తిరగబడింది. 94 మంది చనిపోయారు.
ఈయూ కఠినమైన వలస చట్టాలను అమలుచేయాలని, "నిజంగా అవసరం ఉన్నవారికి మాత్రమే అనుమతులివ్వాలని, స్మగ్లర్లకు డబ్బు చెల్లించే స్థోమత ఉన్నవారు కూడా వలస పడుతున్నారని, అలాంటివారిని నిరోధించగలిగే చట్టాలు తీసుకురావాలని" గ్రీస్ చాలాసార్లు కోరినట్లు ఆ దేశ వలస మంత్రిత్వ శాఖ అధికారి యిర్గోస్ మైఖలిడిస్ బీబీసీతో చెప్పారు.
"ఇప్పుడు పడవలో ఎవరికి ఎక్కించుకోవాలనేది స్మగ్లర్లు నిర్ణయిస్తున్నారు. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేది ఈయూ. కాబట్టి, చట్టాల విషయంలో ఈయూ బాధ్యత తీసుకోవాలి. గ్రీస్, ఇటలీ లేదా సైప్రస్‌కు ఎలాంటి సమస్యా లేదు" అని ఆయన అన్నారు.
మిడిల్ ఈస్ట్, ఆసియా, ఆఫ్రికాల నుంచి శరణార్థులు, వలసదారులు యూరోపియన్ యూనియన్‌లోకి ప్రవేశించడానికి ప్రధాన మార్గాలలో గ్రీస్ ఒకటి.
గత నెల గ్రీస్ శరణార్థులను సముద్రం మీదే తరిమికొట్టినట్టు చూపిస్తున్న ఒక వీడియో వైరల్ అయింది. దానిపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం, ఈ ఏడాది ఇప్పటికే 70,000 కంటే ఎక్కువ మంది శరణార్థులు, వలసదారులు యూరప్ తీరంలోని దేశాలకు చేరుకున్నారు. ఎక్కువ మంది ఇటలీలో దిగారు.
ఇవి కూడా చదవండి:
- మహాసముద్రాల్లో మునిగిన నౌకల్లోని సంపద వెలికి తీయడం ఎలా?
- ఆమె అఫ్గానిస్తాన్‌లో సక్సెస్ఫుల్ లేడీ పోలీసాఫీసర్, ఇరాన్ క్రిమినల్ గ్యాంగ్‌లకు ఎలా చిక్కారు?
- క్రానియోఫారింగియోమా: ఈ జబ్బు వస్తే 23 ఏళ్ల వ్యక్తి కూడా 13 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తాడు, ఎందుకిలా జరుగుతుంది?
- కొలంబియా అమెజాన్ అడవులు: 'విమానం కూలిపోతుంటే, అమ్మే మమ్మల్ని పారిపోయి ప్రాణాలు కాపాడుకోమంది'
- ‘నా శరీరం, ఆత్మ గాయపడ్డాయి, సైన్యంలో చేరాక నా కలలు ఎలా చెదిరాయంటే...’
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)