టైటానిక్ లాగా సముద్రంలో మునిగిపోయిన నౌకలెన్ని... వాటిలోని సంపద ఎంత?

    • రచయిత, జరియా గోర్వెట్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

సముద్రంలో మునిగిపోయిన నౌకలకు చెందిన మూడు కొత్త శిథిలాలను గుర్తించినట్లు యునెస్కో తాజాగా వెల్లడించింది. వీటిలో రెండు శిథిలాలు వేల ఏళ్లనాటివి. అయితే, ఇలాంటివి సముద్రంలో ఎన్ని ఉండొచ్చు?

ఎలియాజ్ స్టాడియాటిస్ ఎప్పటిలానే నీలి రంగు నీటిలో ‘స్పాంజ్’గా పిలిచే నాచు మొక్కల కోసం వెతుకుతున్నారు. కాపర్ డైవింగ్ సూట్ వేసుకుని, ఆక్సిజన్ సాయంతో ఆయన నెమ్మదిగా సముద్రం అడుగుకు చేరుకున్నారు. చిమ్మ చీకటి నడుమ ఆయనకు ఊహించని దృశ్యాలు కనిపించాయి. చుట్టుపక్కల మానవ శరీర భాగాల్లా కనిపిస్తున్న కొన్ని అవశేషాలను ఆయన గుర్తించారు. వెంటనే అక్కడ తనకు పాడైన కొన్ని మృతదేహాలు కనిపించాయని కెప్టెన్‌కు ఆయన వివరించారు.

ఈ ఘటన 1900లో జరిగింది. స్టాడియాటిస్ అనుకోకుండానే యాంటికిథెరా నౌక శిథిలాలను గుర్తించారు. ఇది ఒక రోమన్ రవాణా నౌక. రెండు వేల ఏళ్లకు ముందు ఇది మునిగిపోయింది. అయితే, స్టాడియాటిస్ భావించినట్లుగా ఇక్కడున్నవి శవాలు కాదు, ఖళాఖండాలు. పాలరాతి శిల్పాలు, కాంస్య విగ్రహాలు ఇక్కడున్నాయి. వేల ఏళ్లపాటు వీటిపై నాచు, మొక్కలు పెరగడంతో మానవ శరీర భాగాలుగా ఆయన భ్రమపడ్డారు.

నేటికి దాదాపు వందేళ్లకుపైనే గడిచాయి. ఏజియన్ సముద్ర తీరంలోని ఓ గ్రీకు ద్వీపంలో కనిపిస్తున్న యాంటికిథెరా అవశేషాలు ఇప్పటికీ విశేషంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అయితే, ఇలాంటి చాలా నౌకల అవశేషాలు సముద్రం అడుగున ఉన్నాయని మీకు తెలుసా?

తూర్పు, పశ్చిమ మధ్యధరా సముద్రాలను కలిపే పగడపు దిబ్బలు ‘‘స్కెర్కీ బ్యాంక్‌’’లో యునెస్కో తాజా యాత్రను తీసుకోండి. ఈ ప్రాంతాన్ని వేల ఏళ్ల నుంచి నౌకలు ఉపయోగిస్తున్నాయి. ఇక్కడి సముద్ర అడుగు భాగంపై మల్టీబీమ్ సోనార్, అండర్‌వాటర్ రోబోలతో ఎనిమిది దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. దీంతో క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం, క్రీస్తుశకం 2వ శతాబ్దాలతోపాటు 19వ లేదా 20వ శతాబ్దాలకు చెందిన నౌకల అవశేషాలు వెలుగులోకి వచ్చాయి.

సముద్రం అడుగున ఇలాంటి ఎన్నో నౌకల అవశేషాలు ఉండొచ్చని యునెస్కో అంచనా వేస్తోంది.

చరిత్రను పరిశీలిస్తే..

నెదర్లాండ్స్‌లో ఓ మోటార్‌వేను నిర్మిస్తున్నప్పుడు.. పది వేల ఏళ్లకు ముందు ఉపయోగించిన ఒక చెక్క పడవ అవశేషాలు బయటపడ్డాయి. అయితే, భారీ సముద్రాలు, నదులకు అవతల మనుషులు జీవించిన అవశేషాలు అంతకు చాలా ఏళ్ల ముందే కనిపించాయి.

దాదాపు 50 వేల ఏళ్ల క్రితం ఆగ్నేయాసియాకు చెందిన కొందరు వేటగాళ్లు కొన్ని వందల మైళ్ల పొడవున కనిపించే ద్వీపాలను దాటి వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. వీరు ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌లోని ముంగో సరస్సు సమీపంలో జీవించినట్లు ఆధారాలు కనిపించాయి.

ఎక్కడైతే సముద్రాలను దాటినట్లు ఆధారాలు కనిపించాయో, అదే ప్రాంతాల్లో పురాతన నౌకలు, పడవల శిథిలాలు కూడా బయటపడుతున్నాయి. నేడు సముద్రాల్లో వేల ఏళ్లనాటి వాణిజ్యం, యుద్ధాలు, అన్వేషణకు సంబంధించిన చాలా శిథిలాలు కనిపిస్తున్నాయి.

వెండితో నిండిన సముద్రపు దొంగల పడవలు, ‘‘సిల్కు రోడ్డు’’ మార్గంలో రవాణా నౌకలు, రాకుమారులతోపాటు అదృశ్యమైన విలాసవంతమైన నౌకలు, పురాతన చేపలవేట పడవలు, నౌకా విధ్వంసక నౌకలు, జలాంతర్గాములు, టైటానిక్ లాంటి భారీ ప్రయాణీకుల నౌకలు.. ఇలా చాలా సముద్రం అడుగున ఉన్నాయి.

ఆ కాలపు విశేషాలతో నిండిన ఈ నౌకల శిథిలాలు పురావస్తు శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి. వీటిలో కొన్ని వస్తువులు మ్యూజియంలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఇలానే యాంటికిథెరాలో బయటపడిన ఓ గడియారం విశేషంగా ఆకట్టుకుంటోంది. దీన్ని తొలినాటి కంప్యూటర్‌గా కొందరు నిపుణులు భావిస్తున్నారు.

మొత్తానికి ఇలాంటి ఎన్ని శిథిలాలు ఇంకా సముద్రం అడుగున దాగున్నాయి?

మునిగిపోయిన నౌకల అవశేషాలపై చాలా డేటాబేస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, మొత్తం ఎన్ని నౌకలు సముద్రంలో దాగున్నాయనే అంశంపై అంచనాలు ఒక్కోచోట ఒక్కోలా కనిపిస్తున్నాయి.

ఆన్‌లైన్ సర్వీస్ రెక్ సైట్‌లో అయితే, వీటి సంఖ్యను 2,08,600గా పేర్కొన్నారు. వీటిలో 1,79,110 నౌకలు ఎక్కడ మునిగాయో ఆ ప్రాంతాన్ని పరిశోధకులు గుర్తించారని వివరించారు. అయితే, గ్లోబల్ మారిటైమ్ రెక్స్ డేటాబేస్ (జీఎండబ్ల్యూడీ) అంచనాల ప్రకారం, మొత్తం మునిగిన నౌకలు, పడవల సంఖ్య 2,50,000కుపైనే ఉంటుంది. వీటిలో కొన్ని నౌకలు ఇప్పటికీ కనిపించలేదని పేర్కొన్నారు.

ఒక్క రెండో ప్రపంచ యుద్ధంలోనే 15,000 నౌకలు మునిగిపోయినట్లు అంచనాలు ఉన్నాయి. పసిఫిక్ నుంచి అట్లాంటిక్ వరకూ కనిపిస్తున్న ఈ యుద్ధ నౌకలు, ట్యాంకర్లలోని చమురు, రసాయనాలు, భారీ లోహాలు పరిసరాల్లోని జలాల్లో కలుస్తున్నాయి.

వాస్తవానికి రికార్డుల్లో నమోదైన మునిగిపోయిన నౌకల వివరాలు వాస్తవంలో మునిగిన నౌకలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండొచ్చు. యునెస్కో అంచనాల ప్రకారం 30 లక్షలకుపైగా ఇలాంటి శిథిలాలు ప్రపంచ సముద్రాల్లో దాగున్నాయి.

అయితే, ఈ అంతుచిక్కని అవశేషాలు అన్నీచోట్ల ఒకేలా లేవు. కొన్ని ప్రమాదకర మార్గాలు ఇలాంటి శిథిలాలకు హాట్‌స్పాట్‌లుగా ఉండొచ్చు.

వీటిలో స్కెర్కీ బ్యాంక్‌తోపాటు మధ్యధరా దీవుల సమూహమైన ‘‘ఫౌర్నీ’’ కూడా ఉంటుంది.

ఫౌర్నీలో ఇప్పటివరకు 58 నౌకల అవశేషాలు బయటపడ్డాయి. 2015లో కేవలం 22 రోజుల్లోనే ఇక్కడ 23 నౌకల అవశేషాలు బయటపడ్డాయి. వాస్తవానికి ఫౌర్నీ దీవుల సమూహం ప్రమాదకరమైనదేమీ కాదు. అయితే, ఈ ప్రాంతాన్ని ఎక్కువగా పడవలను నిలిపేందుకు ఉపయోగించేవారు. ఇక్కడకు భారీగా నౌకలు రావడంతో ఇక్కడి సముద్రంలో కనిపించే శిథిలాలు కూడా భారీగానే ఉంటున్నాయి.

వీటిని చూస్తే ఏం తెలుస్తుంది?

ఒకప్పుడు ప్రజలు ఎలా జీవించారో తెలుసుకునేందుకు ఈ శిథిలాలు ఉపయోగపడతాయి. అంతేకాదు, భవిష్యత్తులో జరగబోయే పడవల ప్రమాదాల గురించి వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్కోసారి వీటిలో అపారమైన సంపదా ఉండొచ్చు. కొన్నిసార్లు ఇవి సమస్యలకూ దారితీయొచ్చు.

1708 జూన్ 8 సాయంత్రం 7 గంటలకు కొలంబియాలోని కరీబియా తీరంలో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. దాదాపు రెండేళ్లకు ముందు స్పెయిన్ నుంచి బయల్దేరిన ‘‘శాన్ జోస్’’ నౌకలో ఈ పేలుడు సంభవించింది. చక్కెర, మసాలా దినుసులు, విలువైన లోహాలతో అమెరికాకు ఈ నౌక బయల్దేరింది.

వెండి, పచ్చలు, బంగారం లాంటి విలువైన సంపదతో వస్తున్న ఈ నౌక ఒక బ్రిటిష్ నౌకతో పోరాడాల్సి వచ్చింది. గంటలపాటు పోరాటం తర్వాత శాన్‌ జోస్‌లోని ‘‘గన్ పౌడర్’’ నిల్వలపై దాడి జరిగింది. దీంతో దాదాపు 600 మంది సిబ్బందితో వెంటనే ఇది మునిగిపోయింది.

300 ఏళ్ల తర్వాత, 2015లో దీని అవశేషాలను కొలంబియా నౌకా దళం గుర్తించింది. దీనిలో ఫిరంగులు, సిరామిక్స్, నాణేల అవశేషాలు కనిపించాయి. దీనిలో వస్తువుల విలువ 17 బిలియన్ డాలర్లు (రూ.1,40,152 కోట్లు). అయితే, ఇది ఎవరికి చెందుతుందనే విషయంపై వివాదం చెలరేగింది. నేడు ఈ ప్రాంతాన్ని పరిరక్షించే కంటే, దీని సంపదను కొల్లగొట్టే ముప్పే ఎక్కువని ఆందోళన వ్యక్తమైంది.

స్వర్ణ యుగం..

ఇలాంటి వివాదాలు ఇకపై సర్వసాధారణం కాబోతున్నాయి.

గతంలో లోతు తక్కువగా ఉండే ప్రాంతాల్లో కొన్నిసార్లు అనుకోకుండా, మరికొన్ని సార్లు అన్వేషణలో భాగంగా చాలా నౌకల శిథిలాలు బయటపడ్డాయి. అయితే, నేడు అధునాతన సబ్‌మెర్సిబుల్స్, కొత్త కెమెరాలు, సోనార్ టెక్నాలజీలతో వీటిని గుర్తించడం తేలిక అవుతోంది.

నేడు సముద్రం అట్టడుగున నేల ఎలా ఉంటుందో కూడా చూపించే టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి.

2019లో ఫిలిప్పీన్స్ ట్రెంచ్‌లోని ఆరు కి.మీ. లోతులో విధ్వంస నౌక యూఎస్ఎస్ జాన్స్‌టన్ విశ్రాంతి తీసుకుంటున్న చోటును కూడా పరిశోధకులు గుర్తించారు.

ఈ ఏడాది టైటానిక్ డిజిటల్ 3డీ ట్విన్‌ను కూడా రూపొందించారు. అట్లాంటిక్‌లోని సముద్రం అడుగున ఈ నౌక శిథిలాలపై సర్వే ఆధారంగా దీన్ని తయారుచేశారు.

ఈ టెక్నాలజీల సాయంతో సముద్ర అంతర్భాగంలోని నౌకల అవశేషాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సోనార్, జీపీఎస్ ట్రాకింగ్ టెక్నాలజీలు చేపల వేటలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లే.. నౌకల అవశేషాలను కూడా కనిపెట్టగలవు.

అయితే, నేటికీ సముద్ర గర్భంలో చాలా నౌకల శిథిలాలు దాగున్నాయి. ఉదాహరణకు తరచూ టైటానిక్‌తో పోల్చే వరాతాను తీసుకోండి.

డర్బన్ నుంచి కేప్‌టౌన్‌కు 1909 జులై 26న 211 మందితో బయల్దేరిన ఈ నౌక గల్లంతైంది. అసలు దీనికి ఏమైందో, ఇది ఎక్కడ మునిగిపోయిందో ఇప్పటికీ తెలియకుండా పోయింది. దీన్ని వెతుక్కుంటూ తొమ్మిది పరిశోధకుల బృందాలు వెళ్లాయి. కానీ, ఫలితం కనిపించలేదు.

తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఒకటి మాత్రం నిజం.. త్వరలోనే దాని అవశేషాలు కూడా బయటపడొచ్చు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)