140 ఏళ్ల కిందట అదృశ్యమైన బ్రిటిష్ నౌక.. ఇంగ్లిష్ చానల్ సముద్రంలో దొరికింది

ఇంగ్లిష్ చానల్‌లోని చానల్ ఐలండ్స్ సమీపంలో కొన్నేళ్ల కిందట కనుగొన్న నౌక శిథిలాలను 140 ఏళ్ల కిందట అదృశ్యమైన ఎస్ఎస్ విరాగో నౌకవిగా గుర్తించారు.

ఈ నౌక బ్రిటన్‌లోని రేవు నగరం హల్ నుంచి నాటి రష్యా సామ్రాజ్యంలోని ఒడెస్సా ఓడరేవుకు బయలుదేరిన నౌక ఇంగ్లిష్ చానల్ దాటి బయటకు రాలేదు.

చానల్ దీవుల్లోని గుర్నెసీకి రెండు మైళ్ల దూరంలో మునిగిపోయింది.

మునిగిపోయిన నౌక శిథిలాల్లో 1,000 టన్నుల లోహపు వస్తువలను డైవర్లు కనుగొన్నారు. వాటిలో స్టీమ్ ఇంజన్లు, చక్రాలు, ఇతర యంత్ర సామగ్రి ఉన్నాయి.

ఆల్డెర్నీ వద్ద అలల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సముద్రగర్భంలోని ఈ శిథిలాలను చేరుకోవటం కష్టమైంది. అయితే ఈ వేసవిలో డైవర్లు దీనిని గుర్తించారు.

''నేను 55 ఏళ్లుగా కమర్షియల్ డైవింగ్ చేస్తున్నాను. కానీ ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే కనుగొనగలిగే విషయం'' అని డైవ్ సూపర్‌వైజర్ రిచర్డ్ కీన్ చెప్పారు.

''ఈ నౌక శిథిలాలు నీటిలో 45 మీటర్ల లోతున ఉన్నాయి. బ్రిటన్‌లో అత్యంత బలమైన అలలు ఉండే ప్రాంతం ఇదే కావచ్చు'' అని ఆయన తెలిపారు.

''అలల తీవ్రత కొంచెం తక్కువగా ఉండే (నీప్ టైడ్) సమయంలో డైవర్లు సముద్రంలోకి డైవ్ చేసినపుడు.. వారికి గరిష్టంగా 20 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. పైగా ఈ ప్రాంతం డైవ్ చేయటానికి అంతగా అనువైన ప్రాంతం కాదు'' అని వివరించారు.

'లాయిడ్స్ రిజిస్టర్ ఆఫ్ షిప్స్‌'లో.. విరాగో నౌక ఇంకా అదృశ్యమైన నౌకల జాబితాలోనే ఉంది. ఈ నౌకను 1871లో హల్‌లో నిర్మించినట్లు ఆ రిజిస్టర్ చెప్తోంది.

విల్సన్ లైన్ సంస్థకు చెందిన ఈ నౌక 282 అడుగుల పొడవు, 34 అడుగల వెడల్పు, 19 అడుగుల లోతు, 1,809 టన్నుల బరువు ఉంది.

ప్రపంచంలో ఆవిరి నౌకలు అత్యధిక సంఖ్యలో కలిగిన ప్రైవేటు సంస్థ విల్సన్ లైన్.

ఈ నౌక 1882లో మునిగిపోయిన విషాదం గురించి కీన్ ఇలా వివరించారు: ''ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. నౌకలో 26 మంది సిబ్బంది ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత ఒక మృతదేహం చెర్‌బర్గ్ ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఆ తర్వాత డీపి దగ్గర రెండు, ఆల్డెర్నీ సమీపంలో రెండు చొప్పున నాలుగు లైఫ్‌బోట్లు కనిపించాయి'' అని కీన్ తెలిపారు.

''ఆ నౌక మునిగిపోయిన రోజు లేదా రాత్రి అక్కడ మంచు ఉందని మనకు తెలుసు. అప్పుడు నౌక వాస్తవంగా ఎంత వేగంతో ప్రయాణిస్తోందో, ఏ దిశలో వెళుతోందో, ఏ సమయంలో ఆల్డెర్నీని లేదా, ఆల్డెర్నీ తీరంలో ఒక రీఫ్‌ను ఢీకొట్టిందో ఇంకా లెక్కించాల్సి ఉంది'' అని పేర్కొన్నారు.

''19వ శతాబ్దంలో ఓడలు మునిగిపోవటాన్ని.. నేడు కార్ల ప్రమాదం వార్తల్లాగే పరిగణించేవారు'' అని యూనివర్సిటీ ఆఫ్ హల్‌లో పనిచేస్తున్న డాక్టర్ రాబ్ రాబిన్సన్ చెప్పారు.

''నౌకా రంగంలో ప్రమాదాలు, విధ్వంసాలు చాలా ఎక్కువగా ఉండేవి. సముద్ర ప్రయాణం, నౌకా నిర్మాణం వంటి వాటిలో ఇప్పుడు ఉన్నంత ఆధునిక సాంకేతికత అప్పుడు లేదు. కాబట్టి ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతుండేవి'' అని ఆయన వవరించారు.

ఇటువంటి పొగ నౌకలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బలోపేతం చకేయటంలో తమ వంతు పాత్ర పోషించాయని చెప్పారు. బ్రిటన్ నుంచి సుదూర తూర్పు ప్రాంతంతో వ్యాపారం చేయటానికి విరాగో నౌకను గణనీయంగా ఉపయోగించారు.

''సూయిజ్ కెనాల్‌ లేకముందు బ్రిటన్ నుంచి ఇండియాకు ప్రయాణించాలంటే సముద్ర మార్గంలో దక్షిణాఫ్రికాను చుట్టి రావలసి వచ్చేది. సూయిజ్ కెనాల్‌ తెరిచిన తర్వాత ఇండియాకు నేరుగా సముద్ర ప్రయాణాలు చేసే వీలు లభించింది'' అని ఆయన పేర్కొన్నారు.

అలల సాంకేతికత కోసం 2009లో సముద్ర గర్భాన్ని సర్వే చేస్తున్న సమయంలో ఈ నౌక శిథిలాలను కనుగొన్నారు. అయితే అది ఏ నౌకనో అప్పుడు గుర్తించలేదు.

చానల్ ఐలండ్ జలాల్లో పలు నౌకా శిథిలాలను రిచర్డ్ కీన్ కనుగొన్నారు. అందులో ఆస్టెరిక్స్ అని పిలిచే ఒక గాలో-రోమన్ నౌక కూడా ఉంది. విరాగో నౌకా శిథిలాలను తాను ఇంకా డైవ్ చేసి చూడలేదని.. అయితే మిగతా డైవర్లు చిత్రీకరించిన వీడియోల్లో దృశ్యాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని ఆయన చెప్పారు.

''ఈ నౌక దగ్గరికి డైవ్ చేయటం కోసం నిరీక్షిస్తున్నాను. ఆ ప్రాంతంలో ఇలాంటి నౌకా శిథిలం ఒకటి ఉంటుందని, 140 ఏళ్ల పాటు ఎవరి కంటా పడకుండా అలాగే ఉంటుందని నేను నమ్మేవాడిని కాదు'' అని పేర్కొన్నారు.

మొత్తం నౌకా శిథిలాలను ఇంకా పరిశీలించాల్సి ఉందన్నారు.

''కనుగొనాల్సిన శిథిల నౌకలు ఎప్పుడూ ఇంకా చాలా ఉంటూనే ఉంటాయి'' అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)