ఎండ్యూరెన్స్: అంటార్కిటిక్‌లో 100 ఏళ్ల కిందట మునిగిపోయిన ఓడ దొరికింది, అందులో ఏముంది?

    • రచయిత, జొనాథన్ ఆమోస్
    • హోదా, సైన్స్ కరెస్పాండెంట్

అంటార్కిటిక్ అన్వేషకుడు సర్ ఎర్నెస్ట్ షాకల్టన్‌కు చెందిన ఈ నౌక పేరు ఎండ్యూరెన్స్. 1915 నవంబరులో సముద్రపు మంచును ధీకొన్న ఈ నౌక అంటార్కిటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు అందులో ప్రయాణిస్తున్న షాకల్టన్, ఆయన సిబ్బంది అతి కష్టం మీద నౌక నుంచి బయటపడి ఈదుకుంటూ, చిన్నబోట్లలో ప్రయాణిస్తూ తప్పించుకున్నారు.

వెడెల్ సీ గర్భంలో దాగివున్న ఈ శిథిల నౌక ఇప్పుడు వెలుగు చూసింది. నౌక వందేళ్లకు పైగా నీటిలో మూడు కిలోమీటర్ల లోతున మునిగివున్నా కూడా ఈ నౌక రూపురేఖలు.. అది మునిగిపోయిన రోజు ఎలా ఉన్నాయో ఇపుడూ అలాగే ఉన్నట్లు వీడియో దృశ్యాలు చూపుతున్నాయి.

నౌక నిర్మాణానికి ఉపయోగించిన కలపదుంగలు కొంచెం కదలబారినా కలసికట్టుగానే ఉన్నాయి. ఓడ వెనుక భాగం మీద దాని పేరు 'ఎండ్యూరెన్స్' సుస్పష్టంగా కనిపిస్తోంది.

''ఇప్పటివరకూ నేను చూసిన నౌకా శిథిలాల్లో ఇది చాలా చక్కగా ఉందనటంలో అతిశయోక్తి లేదు'' అని చెప్పారు ఈ నౌక శిథిలాల అన్వేషణలో పాలుపంచుకున్న మెరైన్ ఆర్కియాలజిస్ట్ మెన్సున్ బౌండ్. ఆయన 50 ఏళ్ల కెరీర్‌లో.. ఎండ్యూరెన్స్‌ను కనుగొనాలన్న తన కలను సాకారం చేసుకున్నారు.

నౌక ''నిటారుగా ఉంది. సముద్రతలం మీద సగర్వంగా నిలుచుంది. ముక్కలు కాకుండా చక్కగా ఉంది. అద్భుతంగా సంరిక్షించినట్లుగా ఉంది'' అని ఆయన బీబీసీ న్యూస్‌తో చెప్పారు.

ఈ నౌకను కనుగొనే ప్రాజెక్టును ఫాక్లాండ్స్ మారీటైమ్ హెరిటేజ్ ట్రస్ట్ చేపట్టింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఐస్‌బ్రేకర్ నౌక అగుల్హాస్ 2తో పాటు.. రిమోట్‌గా ఆపరేట్ చేయగలిగే సబ్‌మెర్సిబుల్స్‌ను ఉపయోగించింది.

సీనియర్ ధృవభౌగోళిక శాస్త్రవేత్త డాక్టర్ జాన్ షీర్స్ ఈ మిషన్‌కు నేతృత్వం వహించారు. కెమెరాలు ఈ నౌక పేరును చూపిన క్షణంలో తాము ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయామని ఆయన తెలిపారు.

''ఈ నౌకను కనుగొనటం ఒక అద్భుత విజయం'' అన్నారాయన. ''ప్రపంచంలో అత్యంత కష్టమైన శిథిల నౌక అన్వేషణను మేం విజయవంతంగా పూర్తిచేశాం. ఇది అసాధ్యమని చాలా మంది అన్న పనిని.. నిరంతరం స్థానం మారే సముద్రపు మంచుతో, విరుచుకుపడే మంచు తుఫాన్లతో, మైనస్ 18 డిగ్రీలకు పడిపోయే ఉష్ణోగ్రతలతో పోరాడుతూ మేం సాధించాం'' అని ఆయన సంతోషంగా చెప్పారు.

ఈ నౌకను ఎక్కడ కనుగొన్నారు?

వెడెల్ సముద్ర గర్భంలో 3,008 మీటర్ల లోతులో ఎండ్యూరెన్స్ నౌకను గుర్తించారు.

సబ్‌మెర్సిబుల్స్ రెండు వారాల పాటు ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. చివరికి శనివారం నాడు (మార్చి 5వ తేదీ) ఈ నౌక శిథిలాలను కనుగొన్నాయి. ఆ రోజుకు.. షాకల్టన్ అంత్యక్రియలు జరిగి సరిగ్గా 100 సంవత్సరాలు కావటం విశేషం. ఆ రోజు నుంచీ ఈ నౌకను, దాని స్థితిగతులను, దాని చుట్టూ ఉన్న శిథిలాలను కూలంకషంగా పరిశీలిస్తూ ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్నారు.

ఇంటర్నేషనల్ అంటార్కిటిక్ ట్రీటీ ప్రకారం.. ఈ శిథిల నౌక ఒక స్మారక చిహ్నం. దానిని ఏ రకంగానూ కదిలించకూడదు. కాబట్టి నౌక శిథిలాల నుంచి ఎలాంటి భౌతిక వస్తువులనూ బయటకు తీసుకురాలేదు.

సబ్‌మెర్సిబుల్స్ ఏం చూపిస్తున్నాయి?

షాకల్టన్ ఫిల్మ్‌మేకర్ ఫ్రాంక్ హర్లీ చివరిసారి 1915లో ఈ నౌక ఫొటోలు తీశారు. అప్పుడు ఎలా కనిపించిందో.. శతాబ్దానికి పైగా సముద్రగర్భంలో శిథిలంగా ఉన్న ఈ నౌక ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తోంది. తెరచాపలు దిగిపోయాయి. ఓడస్తంభపు మోకులు (తాళ్లు) చిక్కుపడి ఉన్నాయి. కానీ ఓడ పైభాగం చాలా వరకూ చెక్కుచెదరలేదు. ఓడ ముందు భాగంలో కొంత దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. నౌక మునిగిపోయినపుడు ఈ ముందు భాగం సముద్రగర్భాన్ని ఢీకొట్టినట్లు అనిపిస్తోంది. లంగర్లు అలాగే ఉన్నాయి. నౌకలో కొన్ని బూట్లు, వంట సామాన్లను కూడా సబ్‌మెర్సిబుల్స్ వీడియో తీశాయి.

''నౌక వెనుక భాగంలో దాని పేరు - E N D U R A N C E - (ఎండ్యూరెన్స్) చెక్కుచెదరకుండా ఉండటం కూడా చూడొచ్చు. దాని కింద పోలారిస్ నక్షత్రం కూడా ఉంది. ఈ ఓడకు తొలుత పెట్టిన పేరు అదే'' అని మెన్సున్ బౌండ్ చెప్పారు.

ఈ శిథిలనౌకలో ఏ జీవులు నివసిస్తున్నాయి?

వందేళ్లుగా నీటిలోనే మునిగివున్న ఈ నౌక శిథిలాలను చేసుకుని సముద్ర జీవులు పుష్కలంగా జీవిస్తున్నాయి. కానీ నౌకను కొరుక్కుతినే తరహా జీవులేవీ అందులో లేవు.

''ఈ నౌకలోని కలప పెద్దగా శిథిలమైనట్లు కనిపించదు. అంటే.. మన సముద్రాల్లో కనిపించే చెక్కను కొరుక్కుతినే జీవులు.. అడవులేవీ లేని ఈ అంటార్కిటిక్ ప్రాంతంలో లేవని భావించవచ్చు. అదేమీ ఆశ్చర్యకరం కాదు'' అన్నారు ఎసెక్స్ యూనివర్సిటీకి చెందిన డీప్-సీ పోలార్ బయాలజిస్ట్ డాక్టర్ మిషెల్ టేలర్.

''ఓ భూత నౌకలా కనిపిస్తున్న ఎండ్యూరెన్స్‌లో.. అనేక రకాల సముద్రగర్భ జీవులు కనిపిస్తునాయి. స్టాక్డ్ సీ స్క్విర్ట్స్, అనీమోన్స్, విభిన్న రకాల స్పాంజెస్, బ్రిటిల్‌స్టార్స్, క్రినాయిడ్స్.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వెడెల్ సముద్రంలోని చల్లటి సముద్రగర్భ జలాల నుంచే ఆహారం తీసుకుంటాయి'' అని ఆమె వివరించారు.

ఈ నౌక ఎందుకంత విలువైనది?

రెండు కారణాలున్నాయి. మొదటిది.. అంటార్కిటిక్ ఆవలికి షాకల్టన్ చేపట్టిన సాహసయాత్ర. అంటార్కిటికా భూభాగాన్ని మొట్టమొదటిసారిగా దాటటానికి ఈ నౌక బయలుదేరింది. కానీ సముద్రపు మంచులో చిక్కుకుపోయి, స్తంభించపోవటంతో ఆ సాహసయాత్ర ఆగిపోయంది. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడటమే సాహసంగా మారింది. షాకల్టన్ ఎలాగో తన సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లగలిగారు. ఈ ఆంగ్లో-ఐరిష్ నావికుడు స్వయంగా ఒక చిన్న లైఫ్‌బోట్‌లో భీకరమైన సముద్రాన్ని దాటి వెళ్లి సాయం తీసుకొచ్చారు.

మరో కారణం.. ఈ నౌకను కనిపెట్టటంలో ఉన్న చాలెంజ్. వెడెల్ సీ దాదాపు శాశ్వతంగా మందపాటి సముద్ర మంచు పొరతో కప్పేసి ఉంటుంది. ఇదే మంచుపొర ఎండ్యూరెన్స్ ప్రధాన భాగాన్ని బీటలువార్చింది. గాలింపు చేపట్టే సంగతి తర్వాత.. ఈ నౌక మునిగిపోయిందని భావించే ప్రాంతానికి చేరుకోవటమే చాలా కష్టం. కానీ ఇక్కడే ఎఫ్ఎంహెచ్‌టీ ప్రాజెక్ట్ విజయం సాధించింది. 1970ల నుంచి మొదలైన శాటిలైట్ యుగం అంతటిలో అంటార్కిటికా సముద్రపు మంచు అతి తక్కువ విస్తీర్ణంలో నమోదైంది గత నెలలోనే. పరిస్థితులు అనూహ్యంగా అనుకూలించాయి.

ఈ నౌక శిథిలాల సర్వేను ముగించిన అగుల్హాస్ నౌక.. మంగళవారం నాడు ఈ ప్రదేశం నుంచి తిరిగి తన స్వస్థలం కేప్ టౌన్‌కు బయలుదేరింది. షాకల్టన్‌ను సమాధి చేసిన సౌత్ జార్జియాలో బ్రిటిష్ ఓవర్‌సీస్ టెరిటరీని సందర్శించాలని ప్రణాళిక.

''బాస్'కి మేం నివాళులర్పిస్తాం'' అని చెప్పారు డాక్టర్ షీర్స్. ఎండ్యూరెన్స్ సిబ్బంది తమ నాయకుడిని అలా పిలుచుకునేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)