పోర్చుగల్: సముద్ర గర్భంలో బయటపడ్డ 400 ఏళ్లనాటి ఓడ శకలాలు

పోర్చుగల్ తీరాన అట్లాంటిక్ సముద్రంలో 400 ఏళ్ల క్రితం మునిగిపోయిన ఓడ శకలాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఓడ భారత్ నుంచి పోర్చుగల్ వెళ్తుండగా ప్రమాదానికి గురై ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

పోర్చుగల్ రాజధాని లిస్బోవకు పశ్చిమాన సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని కెష్కాయిస్ పట్టణం సమీపంలో ఈ శకలాలు దొరికాయి.

ఈ శకలాల చుట్టూ మసాలా దినుసులు, పింగాణీ వస్తువులు, అప్పట్లో పోర్చుగల్ సైన్యం వాడిన ఫిరంగులు, ఆర్మీ కోట్లు ఉన్నాయి.

1575 నుంచి 1625 మధ్య కాలంలో ఈ ఓడ భారత్ నుంచి వస్తుండగా ప్రమాదానికి గురై ఉంటుందని పురావస్తు నిపుణుల బృందం భావిస్తోంది. ఆసియా దేశాలు, పోర్చుగల్ మధ్య సుగంధ ద్రవ్యాల వ్యాపారం అప్పట్లో జోరుగా సాగేది.

ఇది ఈ దశాబ్దకాలంలో విజయవంతమైన కీలక అన్వేషణగా పురావస్తు విభాగం నిపుణులు అభివర్ణిస్తున్నారు.

నీటిలో 40 అడుగుల లోతున ఇసుకలో ఈ శకలాలు కూరుకుపోయి ఉన్నాయని ఈ అన్వేషణ ప్రాజెక్టు డైరెక్టర్ జార్జ్ ఫ్రెయిరె రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. 400 ఏళ్లు అవుతున్నా ఆ శకలాలు చాలా భద్రంగా ఉన్నాయన్నారు. పోర్చుగల్ చరిత్రలో ఇదొక కీలకమైన ఆవిష్కరణ అని ఆయన అభిప్రాయపడ్డారు.

16, 17 శతాబ్దాల నాటి చైనీస్ పింగాణీ పాత్రతో పాటు, కంచుతో చేసిన కళాఖండాలు, గవ్వలు, ఆప్పట్లో వినియోగించిన కరెన్సీ కూడా ఈ ఓడ వద్ద బయటపడ్డాయి.

అట్లాంటిక్ సముద్రంలో టేగస్ నది కలిసే చోట (సంగమం వద్ద) తవ్వుతుండగా సెప్టెంబర్ ఆరంభంలో ఈ ఓడ బయటపడిందని అధికారులు తెలిపారు. ఈ సంగమం ఓడలకు అత్యంత ప్రమాదకరమైందని పోర్చుగల్ సాంస్కృతిక శాఖ మంత్రి లూయిస్ మెండెస్ చెప్పారు.

ఈ ఓడ కోసం పోర్చుగీసు ప్రభుత్వం, నోవా యూనివర్సిటీల సహకారంతో పురావస్తు శాస్త్రవేత్తలు చేపట్టిన పదేళ్ల అన్వేషణ ప్రాజెక్టులో భాగంగా దీన్ని గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)