You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నా కోరికకు, నా వైకల్యానికీ ఏ సంబంధమూ లేదు
నాకు కళ్లున్నాయి కానీ నేను చూడలేను, అయితేనేం? అభిమానం, ఆప్యాయత , ప్రేమ ఇవన్నీ అందరికి అవసరమే కదా !
నాకు కూడా ఇవన్నీ కావాలి. ఇవన్నీ అందరికీ ఎంత అవసరమో నాకు కూడా అవసరమే. నా కోరికకు, నా వైకల్యానికీ ఏ సంబంధమూ లేదు. కానీ నాకు కలిగిన అనుభూతి మీ అనుభూతికన్నా భిన్నంగా ఉంటుంది.
నిజానికి నేను కూడా మీలా ఓ సాధారణ అమ్మాయినే. చిన్నప్పుడు నాకంతా కనిపించేది. నేను ఓ చిన్న పట్నంలో స్కూల్లో చదివేదాన్ని.
చిన్నప్పుడు నాకు కూడా స్నేహితులుండేవారు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నాకంటి చూపు మందగించింది. క్రమంగా ఒక సంవత్సరంలోనే పూర్తిగా కంటి చూపు కోల్పోయాను.
అప్పుడే నన్ను దిల్లీలో ఉన్న అంధుల పాఠశాలలో చేర్పించారు. అప్పుడు నేను నా స్నేహితులకు దూరంగా ఉన్నాను.
ఆ తర్వాత నన్ను కాలేజీలో చేర్పించారు. ఒక యువతికి ఎలాంటి ఆశలుంటాయో వాటన్నిటితో కాలేజ్‌లో అడుగుపెట్టాను.
నాకూ అందంగా అలంకరించుకోవడం, ఆకర్షణీయంగా ఉండటం ఇష్టమే. అందరికీ ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. ఒకమ్మాయిగా నాకు కూడా ఈ కోరిక ఉండేది.
కానీ, నేను అబ్బాయిలకు దూరంగా ఉండాలని అనుకున్నాను. దీనికి నా అంధత్వంతో ఏ సంబంధమూ లేదు.
పురుషుల మధ్యలో ఉంటే నా ఆత్మవిస్వాశాన్ని కోల్పోతున్నాను.
క్లాసుకు, క్యాంటీన్‌కు, లైబ్రరీ దాకా వెళ్లాలంటే ఎవరినైనా సహాయం అడగడానికి మనసొప్పేది కాదు. కానీ నాకది తప్పదు.
చేయి పట్టుకోవడమే చాలా ప్రత్యేకం. కానీ నా జీవితంలో అది చాలా సాధారణంగా మారిపోయింది.
కానీ కోరికైతే నా మదిలో ఉండేది.
ఆ తర్వాత నా జీవితంలో ఒకబ్బాయి వచ్చాడు. ఇంకో రకంగా చెప్పాలంటే.. నేను అతని జీవితంలో అడుగుపెట్టాను.
అతను నాలా అంధుడు కాదు, కానీ అతడి కంటి చూపు కూడా తక్కువే. ఆ అబ్బాయికి పాక్షిక దృష్టిలోపం ఉంది.
కానీ అతడు నన్ను చూడగలడు.
అతడు యూనివర్సిటీలో నాకన్నా సీనియర్. అలా కొందరి ద్వారా మామధ్య పరిచయం ఏర్పడింది.
తొలిచూపులోనే నేను అతనికి నచ్చానని అన్నాడు.
నాకు దాని గురించి అంతగా తెలియదు. మొదట్లో మా మధ్య స్నేహమే ఉండేది.
అతడు నన్ను బాగా చూసుకునేవాడు.
కొన్నిసార్లు కాఫీ తాగుదామని, పుస్తకాలు కొందామని, కొన్నిసార్లు తోడుగా రమ్మని అనేవాడు.
ఆ తర్వాత ఎటువంటి కారణం లేకుండానే మేమిద్దరం కలుసుకునే వాళ్ళం. ఒకరినొకరు కలుసుకోవడమే మా పనయ్యింది.
నేను మెట్రోలో వెళితే స్టేషన్ బయట నాకోసం అతడు ఎదురుచూసేవాడు.
అక్కడి నుంచి ఇద్దరం కలిసి యూనివర్సిటీకి వెళ్ళేవాళ్ళం.
యూనివర్సిటీలో ఉండే ఆ చెట్లు, అక్కడుండే అందమైన వాతావరణం మాలాంటి ఎన్నోజంటలకు ఏకాంతంగా సమయం గడిపే వేదికగా మారింది.
స్నేహం నుండి ప్రేమ దాకా ఈ ప్రయాణంలో, అతనిపై నమ్మకం కలగడానికి నాకు పూర్తిగా ఒక సంవత్సరం పట్టింది.
అయినా మేము కలుసుకున్నప్పుడు నాకు ఒక రకమైన భయం వెంటాడేది.
ఎవరో నన్ను చూస్తున్నారనిపించేది. నా కుటుంబంలో నుంచి ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారనిపించేది.
అతడు నా గురించి ఎంత పట్టించుకున్నా నాకు మాత్రం ఎవరో చూస్తున్నారనిపించేది.
ఎవరో మమ్మల్ని నిలదీస్తారేమోనని అనిపించేది. అయినా మేము కలుస్తుండేవాళ్ళం. ఒకవైపు భయం ఉన్నా నాకు అతనిపై ఎంతో ప్రేమ ఉండేది.
చివరికి నా మిత్రుడికి హాస్టల్ దొరికింది. అక్కడ కలుస్తున్నప్పడు భయం ఉండేది కాదు. అక్కడ అతడితో కలుస్తున్నప్పుడు చాలా సురక్షితంగా అనిపించేది.
కానీ ఇలా ఎప్పటికీ ఒకేలా ఉండేందుకు ఇది పిట్ట కథ కాదు. జీవితమంటేనే ఎన్నో కథలతో ముడిపడి ఉంటుంది.
కొన్ని రోజుల తర్వాత అతడు మరో అమ్మాయితో నాతో ఉన్నట్లే చనువుగా ఉంటున్నాడని తెలిసింది.
నేను అతన్ని దీని గురించి అడిగితే అది అబద్ధమని అన్నాడు. నిజమేంటో తెలుసుకోవడం నాకు కష్టంగా మారింది.
నేను ఇతర అమ్మాయిల్లా అతడిని చూడలేను. అతడి హాస్టల్‌కి వెళ్లి కూడా అతడిని చూడలేను.
ఆ తర్వాత అతడు చేసిన చాటింగ్ గురించి తెలిసింది. అతడు దాన్ని డిలీట్ చేయడం మర్చిపోయాడు.
నా కంప్యూటర్ లో ఉన్న " స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్ " ద్వారా నేను దాన్ని చదివాను.
నమ్మకద్రోహం ఎవరూ భరించలేరు. కానీ అతడు నా వైకల్యాన్నే లోపంగా తీసుకొని ఇలా నన్ను మోసం చేశాడు.
అతడు నా బలహీనతను ఆయుధంగా వాడుకున్నాడు.
నా గుండె పగిలి ఆత్మస్ధైర్యం దెబ్బతింది.
నేను దిల్లీ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టును. జాతీయస్థాయిలో నేను క్రీడాకారిణిని, నా హాస్టల్‌లో నేను ప్రెసిడెంటును.
"అంధత్వం ఉండి కూడా నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే, మామూలుగా ఉంటే ఇంకా ఉన్నతస్థాయికి వెళ్లేదానివి. అయినా ఇప్పుడు నీ ప్రియుడు మోసం చేస్తే కొంపలు మునుగుతాయా?" అని ప్రశ్నించారు.
అవును, కొంపలు మునుగుతాయి. ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో అక్కడ ప్రేమ పుడుతుంది.
అది చాలా ప్రత్యేకం. అది లేకుండా నేను ఉండలేను. ప్రేమ లేకుండా నేను నేనుగా ఉండలేను.
అప్పుడే మరో అబ్బాయి నా జీవితంలోకొచ్చాడు.
అతడు నాలా కాదు. అతనికి ఎటువంటి వైకల్యమూ లేదు. కానీ, నేనంటే ఇష్టమని అంటాడు.
అయితే, నా గురించి అంతగా పట్టించుకోడు.
నేను ఆశించిన స్థాయిలో నన్ను ప్రేమించడు.
నా చేయి పట్టుకొని బయటికి తీసుకువెళతాడు. కానీ, ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసిపోతాడు.
అప్పుడు నేను ఏ మూలనో ఉండిపోతాను. అనవసరమైన వస్తువులా నా పరిస్థితి ఉంది.
అతడు నాకన్నా వయసులో పెద్ద. తెలివైనవాడే. చదువులో కూడా ముందే.
కానీ మా మధ్య "సానుభూతుందో" "ప్రేముందో" అర్థం కావడంలేదు.
ఇప్పుడు మరోసారి నా జీవితంలో నేను వైకల్యంతో ఉన్నాననే భావన కలుగుతోంది.
నాకు అంధత్వం ఉందనే నా జీవితంలో ప్రేమను చూడలేకపోతున్నాననే భావన నాకిప్పుడు కలుగుతోంది.
కానీ నేను ఈ బంధాన్ని తెంచుకోవాలని అనుకోవడంలేదు. ఎందుకంటే నా కళ్ళలో చూపు లేకున్నా నా మనస్సులో అందరిలాగే ప్రేమ మాత్రం ఉంది.
(బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్యతో సంభాషణ ఆధారంగా ఓ అంధురాలి నిజమైన ప్రేమ కథ)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)