నీళ్లలో పడిపోయిన ఫోన్ కోసం డ్యామ్‌ ఖాళీ చేయించిన అధికారి

నీళ్లలో పడిపోయిన తన ఫోన్‌ కోసం ఏకంగా డ్యామ్‌నే ఖాళీ చేయించిన ఓ ప్రభుత్వ అధికారి విధుల నుంచి సస్పెండ్ అయ్యారు.

రాజేశ్ విశ్వాస్ అనే అధికారి సెల్ఫీ తీసుకుంటుండగా ఫోన్ నీళ్లలో పడిపోయింది. దానిని బయటకు తీసేందుకు రిజర్వాయర్‌లోని నీటిని తోడేశారు. అందుకు మూడు రోజుల సమయం పట్టింది.

ఫోన్ దొరికే సమయానికి అందులోకి నీళ్లు చేరి ఉన్నాయి.

ఆ ఫోన్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉందని, అందుకే దానిని వెలికితీయాల్సి వచ్చిందని విశ్వాస్ చెబుతున్నారు. అయితే, ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరిగింది. విశ్వాస్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు.

సుమారు లక్ష రూపాయల విలువైన ఆయన శాంసంగ్ ఫోన్ ఖేర్కట్టా డ్యామ్‌‌లో పడిపోయింది.

స్థానిక ఈతగాళ్లు ఫోన్‌ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో సొంత డబ్బులతో డీజిల్ ఇంజిన్ తెప్పించి నీటిని తోడేశామని విశ్వాస్ ఒక వీడియోలో చెప్పినట్టు మీడియాలో కథనాలొచ్చాయి.

డ్యామ్ నుంచి కాలువకు నీటిని విడుదల చేసేందుకు ఒక అధికారి నుంచి మౌఖికంగా అనుమతి తీసుకున్నట్లు విశ్వాస్ చెప్పారు. ''కాల్వకు ఎక్కువ నీరు విడుదల కావడం రైతులకు కూడా ఉపయోగమే'' అని ఆయన అన్నారు.

డీజిల్ ఇంజిన్‌తో దాదాపు 20 లక్షల లీటర్ల నీటిని తోడేసి ఉంటారని, ఆ నీళ్లు సుమారు ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పంట పొలాలకు సరిపోతాయని చెబుతున్నారు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో జలవనరుల శాఖ అధికారి ఒకరు అక్కడికి వచ్చారు. దీంతో నీటిని తోడడం ఆపేశారు.

''విచారణ పూర్తయ్యే వరకు విశ్వాస్‌ను సస్పెండ్ చేశారు. నీరు చాలా ముఖ్యమైన వనరు. వాటిని ఇలా వృథా చేయకూడదు'' అని కాంకేర్ జిల్లా అధికారి ప్రియాంక శుక్లా అన్నట్లు ఒక వార్తాసంస్థ తెలిపింది.

అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలను విశ్వాస్ కొట్టిపడేస్తున్నారు. డ్యామ్ ఓవర్‌ఫ్లో సెక్షన్ నుంచి ఆ నీటిని తోడినట్లు ఆయన చెబుతున్నారు. అవి ఉపయోగపడేవి కావని ఆయన అంటున్నారు.

అయితే, ఆయన చేసిన పనిపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి.

''మండే వేసవిలో నీళ్లు లేక ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతుంటే, ఆ అధికారి 41 లక్షల నీటిని వృథా చేశారు. వాటితో 1,500 ఎకరాలు సాగు చేయొచ్చు'' అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఒకరు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి: