You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యాపిల్ - విజన్ ప్రో: కొత్తగా విడుదలైన ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్ ఎలా పని చేస్తుంది?
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను యాపిల్ విడుదల చేసింది. దీనిపేరు విజన్ ప్రో.
దీని విడుదలతో దాదాపు 10 సంవత్సరాల తర్వాత యాపిల్ నుంచి ఒక కొత్త హార్డ్‌వేర్ లాంచ్ చేసినట్లయింది.
ఈ హెడ్‌సెట్ వాస్తవిక ప్రపంచాన్ని, వర్చువల్ వరల్డ్‌ను చక్కగా మిళితం చేస్తుందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు.
దీంతోపాటే, తన ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ వెర్షన్‌ను, మ్యాక్‌బుక్ ఎయిర్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌లను కూడా ప్రకటించింది.
రెండు గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఈ విజన్ ప్రో హెడ్‌సెట్ ధర సుమారు రూ. 2,88,793. అమెరికాలో దీన్ని 2024 ఆరంభంలో విడుదల చేయబోతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ల కంటే దీని ధర చాలా ఎక్కువ. గత వారం మెటా సంస్థ క్వెస్ట్ అనే వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ను ప్రకటించింది. దీని ధర సుమారు రూ. 37,058
అయితే, సిలికాన్ వ్యాలీలో ప్రస్తుతం చర్చనీయాంశమైన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి యాపిల్ ఎక్కువ వివరాలు ప్రకటించలేదు.
కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్‌లో జరిగిన డెవలపర్ల సదస్సులో విజన్ ప్రో ను ప్రకటించింది యాపిల్. అయితే, ఈ సందర్భంగా కంపెనీ షేర్ ధర స్వల్పంగా పడిపోయింది.
ఈవెంట్‌కు హాజరైన మీడియా సంస్థల్లో బీబీసీ కూడా ఉంది. కానీ, ఈ కొత్త పరికరాన్ని బీబీసీ పరిశీలించి చూడలేదు.
మిగిలిన వాటికన్నా భిన్నం
విజన్ ప్రో హెడ్‌సెట్ మార్కెట్లో ఉన్న ఇతర హెడ్‌సెట్ లకు కాస్త భిన్నంగా ఉంటుంది. మామూలు వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ల మాదిరిగా కాకుండా, స్కీయింగ్ సమయంలో ధరించే గాగుల్స్ మాదిరి కనిపిస్తుంది.
ఈ హెడ్‌సెట్ గురించి వివరించే సమయంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ అనే మాటను ఉపయోగించింది యాపిల్.
ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో వర్చువల్ వస్తువులను ఉంచే టెక్నాలజీ. అంటే దీని స్క్రీన్ నుంచి చూస్తుంటే కొంత వాస్తవ ప్రపంచం, కొంత వర్చువల్ ప్రపంచం రెండూ కలిసి కనిపిస్తాయి.
కస్టమర్లు వర్చువల్ వరల్డ్ లో సినిమాలు చూడవచ్చు, యాప్‌లను ఉపయోగించవచ్చు, పేపర్లు రాసుకోవచ్చు.
ఇప్పటివరకు ఇటువంటి టెక్నాలజీకి భారీ మార్కెట్ ఉందనే దాఖలాలు లేవు.
అయితే, సామాన్య ప్రజలకు నచ్చుతుందని చెప్పలేమని మాక్‌రూమర్స్ సీనియర్ ఎడిటర్ హార్ట్‌లీ చార్ల్‌టన్ అన్నారు.
"దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తరహాలో ఫస్ట్ జనరేషన్ గాడ్జెట్ కాబట్టి మామూలు కస్టమర్లను పెద్దగా ఆకర్షించకపోవచ్చు. బ్యాటరీ ప్యాక్ విడిగా ఉండటంలాంటి లోపాలు కూడా ఉన్నాయి.’’ అని ఆయన అన్నారు.
‘‘మీరు నిజమైన ప్రపంచంలో చేసినట్లుగానే ఇందులో డిజిటల్ కంటెంట్ ను చూడొచ్చు, వినొచ్చు, ఇంటరాక్ట్ కావొచ్చు’’ అని కుక్ వివరించారు.
‘‘మీ చేతులు, కాళ్లు, వాయిస్‌ను వాడి దీనిని కంట్రోల్ చేయవచ్చు. సెలక్షన్ కోసం రెండు వేళ్లతో నొక్కడం, స్క్రోల్ చేయడానికి ఫ్లిక్ చేయడం లాంటివన్నీ చేయవచ్చు’’ అని ఆయన చెప్పారు.
మెటా, లెనెవో సంస్థలు తాము ఇప్పటికే తయారు చేసిన వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లకు కొత్త అప్‌డేట్స్ ప్రకటించడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే యాపిల్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
మెటా కూడా మిక్స్‌డ్ రియాల్టీలో భారీగా పెట్టుబడి పెట్టింది. అయితే, ఈ రంగం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది.
ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం, ఈ తరహా హెడ్‌సెట్‌ల మార్కెట్ గత సంవత్సరం గ్లోబల్ సేల్స్‌లో 54% పడిపోయింది.
2015లో యాపిల్ ఆఖరిసారిగా ఒక హార్డ్‌వేర్‌ను విడుదల చేసింది. అదే యాపిల్ వాచ్.
ప్రస్తుతం యాపిల్ ప్రకటించిన కొత్త హెడ్‌సెట్ టేకాఫ్ కావడానికి కొంత సమయం పడుతుందని ఫారెస్టర్ రీసర్చ్‌కు చెందిన థామస్ హాన్సన్ బీబీసీతో అన్నారు.
"మెటావర్స్ వంటి వాటి కారణంగా మొత్తం ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ రంగంలో కాస్త ఓవర్ హైప్ కనిపించింది. అందుకే దీనికి కొంచెం సమయం పడుతుందని అనుకుంటున్నాను’’ అని థామస్ హాన్సన్ అభిప్రాయపడ్డారు.
"భవిష్యత్తులో మొబైల్ ఫోన్ కోసం జనం దాదాపు రూ. లక్షన్నర చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని 10-15 సంవత్సరాల కింద మీకు చెబితే మీరు నమ్మగలిగేవారా’’ అని హాన్సన్ అన్నారు.
ఐవోఎస్ 17
విజన్ ప్రో అనౌన్స్‌మెంట్‌తోపాటు, యాపిల్ తన ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ iOS17 ను కూడా ఆవిష్కరించింది.
అప్‌డేట్‌లో "కాంటాక్ట్ పోస్టర్‌లు" ఉన్నాయి. మీరు ఒక వ్యక్తికి కాల్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఫోన్‌లో మీ ఫొటో లేదా బొమ్మ కనిపిస్తుంది. అలాగే లైవ్ వాయిస్‌మెయిల్ పంపినప్పుడు, ఆన్సర్ మొబైల్ లో వాయిస్ మెసేజ్‌తోపాటు దాని ట్రాన్స్‌స్క్రిప్షన్ కూడా కనిపిస్తుంది.
ఈ ట్రాన్స్‌స్క్రిప్షన్ యాపిల్ మెసెజ్ ద్వారా పంపిన ఆడియో మెసేజ్‌లకు కూడా వర్తిస్తుంది.
ఇక యాపిల్ చెక్-ఇన్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది మీరు ఇంటికి చేరుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ ఫ్రెండ్‌కు లేదా కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది.
మీ ప్రయాణం బాగా ఆలస్యమైతే, మీరు ఇంకా సురక్షితంగా ఇంటికి చేరుకోలేదన్న విషయాన్ని ఇతరులకు కూడా తెలియజేసే ఆప్షన్ ఇందులో ఉంది.
కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 2023 సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
(అదనపు రిపోర్టింగ్: షియోనా మెక్‌కలమ్ )
ఇవి కూడా చదవండి:
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)