You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
ఈ చిత్రాలు చూస్తే మీకు పొద్దుతిరుగుడు పువ్వు చుట్టూ తిరుగుతున్న తేనెటీగ మాదిరిగా కనిపించొచ్చు. కానీ ఇవి అతి దగ్గర నుంచి తీసిన సూర్యుడి ఫోటోలు.
అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్(ఎన్ఎస్ఎఫ్)కి చెందిన డేనియల్, ఇనోయె సోలార్ టెలిస్కోప్ ద్వారా ఈ ఫోటోలు తీశారు.
హవాయ్‌లోని మాయు ద్వీపం నుంచి ఈ ఫోటోలు తీశారు. ప్రపంచంలోనే సూర్యుడిని అతి దగ్గరగా చూసేందుకు వీలున్న ప్రదేశం మాయు.
సూర్యుడి అయస్కాంత శక్తి, సౌర తుపానులను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఈ చిత్రాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
హైరెజల్యూషన్ కలిగిన విజిబుల్ బ్రాడ్‌బ్యాండ్ కెమెరా ద్వారా తీసిన ఎనిమిది చిత్రాలను ఎన్ఎస్ఎఫ్ విడుదల చేసింది.
సూర్యుడి ఉపరితలంపై సన్ స్పాట్స్‌తో పాటు ప్రశాంతంగా కనిపించే స్పాట్స్‌ను ఈ ఫొటోలు చూపుతాయి.
‘సన్ స్పాట్’ అంటే ఏంటి?
సూర్యుడిపై కనిపించే నల్లటి ప్రదేశాలే సన్‌స్పాట్స్. వాటి పరిమాణం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అవి భూమి పరిమాణంలో, లేదంటే అంతకంటే ఎక్కువ పరిమాణంలో కూడా ఏర్పడతాయి.
ఈ స్పాట్స్ సూర్యుడి ఉపరితలంపై ఉన్న ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఉష్టోగ్రతలు తక్కువగా ఉండడంతో ఇవి చూడడానికి ముదురురంగులో కనిపిస్తాయి. అయస్కాంత క్షేత్రాల వల్ల ఏర్పడే ఈ ప్రాంతాలనే ఫొటోస్ఫియర్ అని కూడా పిలుస్తారు.
ఈ సన్ స్పాట్స్ సమూహాలే సౌర మంటలకు కారణం. వాటిలో జరిగే ఆకస్మిక విస్పోటనాల వల్ల సౌర తుపానులు ఏర్పడతాయి.
సౌర తుపానుల ప్రభావం సూర్యుని బయటి పొర అయిన హీలియో స్ఫియర్‌పై కూడా ఉంటుంది. అది భూమిపై పలు రకాలుగా ప్రభావం చూపుతుంది.
సూర్యుడి అయస్కాంత శక్తిని, సౌర తుపానులను నిపుణులు మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ చిత్రాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
సౌర తుపానుల వల్ల ప్రమాదమేంటి?
భయంకరమైన సౌర తుపాను భూమిపై రేడియో, ఉపగ్రహ ప్రసారాలను ధ్వంసం చేయగలదని, భారీ ఆర్థిక నష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థపై మనం ఆధారపడి ఉండడమే ఆ తీవ్రతకు కారణం.
కమ్యూనికేషన్ వ్యవస్థపై ఆధారపడిన మౌలిక సదుపాయాలు, రవాణా, ఆర్థిక, భద్రత రంగాలు కాకుండానే భారీ నష్టం కలిగే అవకాశం ఉంది. మొత్తం గందరగోళం తలెత్తే అవకాశాలున్నాయి.
అందుకే శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలాన్ని నిత్యం తీక్షణంగా పరిశీలిస్తుంటారు. ఇలాంటి అపూర్వమైన చిత్రాలు వారి పరిశోధనలో ఉపయోగపడతాయి.
కొత్తగా తయారు చేసిన ఈ ఇనోయె టెలిస్కోప్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే దశలో ఉంది.
సూర్యుడిని అతి దగ్గరగా పర్యవేక్షించేందుకు సోలార్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న పరికరాలు సేకరించిన డేటాలో, ఈ చిత్రాలు ఒక భాగం మాత్రమే.
సౌరవ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన, అద్భుతమైన పనోరమాలు సహా సూర్యుడికి సంబంధించిన విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఇనోయె సోలార్ టెలిస్కోప్ నుంచి ఉత్తమ ఫలితాలను ఆశిస్తున్నట్లు ఫౌండేషన్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
- ఎల్ నినో- లా నినా: హఠాత్తుగా భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు...కారణం ఇవేనా
- దిల్లీ మైనర్ బాలిక హత్య: ప్రేమించినంత మాత్రాన చంపే హక్కు వస్తుందా? అబ్బాయిలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?
- వరంగల్ - లింగ నిర్ధరణ పరీక్షల స్కామ్: సెక్స్ డిటెర్మినేషన్ టెస్ట్ అంటే ఏంటి , కడుపులో బిడ్డకు దీన్ని ఎందుకు నిర్వహించకూడదు?
- తెలంగాణ: ఈ పదం ఎక్కడ పుట్టింది, మియన్మార్ జోల పాటలో ఎందుకు వినిపిస్తుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)