You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1,000 కోట్ల డాలర్ల విలువైన టెలిస్కోప్ తీసిన అద్భుతమైన ఫొటోలు ఇవి...
- రచయిత, జొనాథన్ అమోస్
- హోదా, బీబీసీ సైన్స్ కరెస్పాండెంట్
ప్రపంచానికి అది 10 బిలియన్ డాలర్ల బహుమతి. విశ్వంలో మన స్థానాన్ని చూపించే యంత్రం అది. దాని పేరే ‘జేమ్స్ వెబ్ టెలిస్కోప్’.
సరిగ్గా ఏడాది క్రితం, క్రిస్మస్ రోజునే జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను ఆవిష్కరించారు. ఈ యంత్రం ప్లాన్, డిజైన్, నిర్మాణానికి 30 ఏళ్లు పట్టింది.
ప్రఖ్యాత ‘హబుల్ స్పేస్ టెలిస్కోప్’కు వారసుడిగా వచ్చిన ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంచనాలకు తగ్గట్లుగా పనిచేస్తుందా? అని చాలామంది ఆశ్చర్యపోయారు.
ఈ టెలిస్కోప్‌లోని ఎపిక్ 6.5మీ. ప్రైమరీ మిర్రర్ తెరచుకొని దాని పని మొదలుపెట్టేవరకు, అందులోని ఇతర వ్యవస్థలు సమన్వయం చేసుకునేవరకు అందరూ 6 నెలలు ఎదురు చూడాల్సి వచ్చింది.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపిన తొలి కలర్ చిత్రాలను విడుదల చేయడం కోసం అమెరికా, యూరప్, కెనడా అంతరిక్ష ఏజెన్సీలు జులై నెలలో ఒక పార్టీని నిర్వహించాయి.
ఈ కథనంలో మీరు చూస్తోన్న చిత్రాలన్నీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసి పంపించినవే.
జేమ్స్ వెబ్ అనేది ఒక ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్. మనం మన కళ్లతో చూడలేని కాంతి తరంగధైర్యాలతో ఆకాశాన్ని ఈ టెలిస్కోప్ చూస్తుంది.
కాస్మోస్‌లోని ప్రాంతాలను అన్వేషించడానికి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ టెలిస్కోప్‌లోని విభిన్న కెమెరాలను ఉపయోగిస్తారు.
కాస్మోస్ మొత్తాన్ని చూడటానికి మీరు కాంతి వేగంతో సమానంగా ప్రయాణించినా మీకు చాలా సంవత్సరాల సమయం పడుతుంది.
కరీనా నెబ్యులా
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఈ దృశ్యాన్ని కాస్మిక్ క్లిఫ్స్ అని పిలుస్తారు.
ఇది కరీనా అని పిలిచే భారీ ధూళి, వాయువుతో కూడిన ఒక డొల్ల అంచు. నక్షత్రాలను తయారు చేసే నెబ్యులా లోపల ఇది ఉంటుంది.
తీవ్రమైన అతినీల లోహిత కిరణాలు, వేడి గాలుల ద్వారా ఈ డొల్ల ఏర్పడింది. అప్పుడప్పుడే తయారైన నక్షత్రాలను ఆ చిత్రంలో చూడొచ్చు.
ఈ ఫొటోలోని దృశ్యం ఒక చివరి నుంచి మరో చివరకు దూరం దాదాపు 15 కాంతి సంవత్సరాలు ఉంటుంది. ఒక కాంతి సంవత్సరం అంటే దాదాపు 9.46 ట్రిలియన్ కిలో మీటర్లు.
కార్ట్‌వీల్ గెలాక్సీ
ఈ చిత్రంలో కుడివైపు పెద్దగా ఉన్న గెలాక్సీని 1940లలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఫ్రిట్జ్ వికీ కనుగొన్నారు.
మరో గెలాక్సీని ఇది ఢీకొట్టడం వల్ల దీనికి ఈ క్లిష్టమైన కార్ట్‌వీల్ రూపం వచ్చింది.
ఈ గెలాక్సీ వ్యాసార్థం దాదాపు 1, 45,000 కాంతి సంవత్సరాలు.
నెఫ్ట్యూన్ గ్రహం
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కేవలం విశ్వం అంతరాల్లోకే కాకుండా, మన సౌర వ్యవస్థలోని వస్తువులను కూడా పరిశీలిస్తుంది.
పై చిత్రంలో దగదగ మెరిసిపోతూ కనిపిస్తున్నది నెఫ్ట్యూన్ గ్రహం.
దాని వలయాలతో సహా ఇక్కడ నెఫ్ట్యూన్ గ్రహాన్ని చూడొచ్చు.
ఈ గ్రహం చుట్టూ చిన్నగా తెల్లగా కనిపిస్తోన్న చుక్కలన్నీ చందమామలు.
అక్కడ పక్కనే పెద్ద తారలా కనిపిస్తోన్న దాని పేరు ట్రిటాన్.
అది నెఫ్యూట్‌కు చెందిన అతిపెద్ద ఉపగ్రహం.
ఒరియాన్ నెబ్యులా
ఆకాశంలో బాగా తెలిసిన ప్రాంతాల్లో ఒరియాన్ ఒకటి. ఇది ఒక నక్షత్రాలు ఏర్పడే ప్రాంతం లేదా నెబ్యులా. ఇది భూమి నుంచి 1,350 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
ఇక్కడ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాన్ని ‘ఒరియాన్ బార్’ అని పిలుస్తారు. ఒరియాన్ బార్ అంటే దట్టమైన వాయువు, ధూళితో కూడిన గోడ అని అర్థం.
డైమోర్పోస్
ఈ ఏడాది విశ్వానికి సంబంధించి వెలువడిన పెద్ద కథనాలలో ‘డైమోర్పోస్’ అనే కథనం ఒకటి. ‘డైమోర్పోస్’ పేరుతో నాసా ఒక అంతరిక్ష నౌకను, గ్రహశకలంలోకి పంపింది.
ఆ నౌకను పంపించడం ద్వారా 160 మీ. వెడల్పు ఉన్న ఆ గ్రహశకలం దారిని మళ్లించగలమా? లేదా? అని పరీక్షించేందుకు ‘డైమోర్పోస్’ పేరుతో ఈ ప్రయోగం చేసింది.
గ్రహశకలాల నుంచి భూమిని కాపాడే వ్యూహంలో భాగంగా నాసా డైమోర్పోస్ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగం సందర్భంగా వెలువడిన 1000 టన్నుల శిథిలాల చిత్రాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన కెమెరాలో నిక్షిప్తం చేసింది.
డబ్ల్యూఆర్-140
ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తికరమైన వెబ్ చిత్రాలలో ఇదొకటి. ఇక్కడ డబ్ల్యూఆర్ అంటే ‘వోల్ఫ్-రాయెట్’ అని అర్థం. ఇదొక రకమైన నక్షత్రం. జీవిత కాలం ముగింపుకు వచ్చిన నక్షత్రాలలో ఇది పెద్దది.
వోల్ఫ్ రాయెట్ నక్షత్రాలు అంతరిక్షంలోకి భారీ వాయు అలలను పంపిస్తాయి.
పై చిత్రంలో కనీకనిపించకుండా ఉన్న నక్షత్రం, ఈ గాలులను కుదించి ధూళిని ఏర్పరుస్తుంది. అక్కడ కనిపిస్తోన్న ధూళి మేఘాలు 10 ట్రిలియన్ కి.మీపైగా విస్తరించి ఉన్నాయి. అంటే భూమి నుంచి సూర్యుని మధ్య దూరానికి 70 వేల రెట్లు ఎక్కువ దూరంలో ఆ ధూళి మేఘాలు విస్తరించాయన్నమాట.
ఫాంటమ్ గెలాక్సీ
ఫాంటమ్ గెలాక్సీ ముద్దుపేరు ఎం74. ఈ గెలాక్సీ ఆడంబరమైన సర్పిలాకార వలయాలతో ప్రసిద్ధి చెందింది. ఇది భూమికి 32 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
వెబ్ టెలిస్కోప్ ఈ గెలాక్సీ కచ్చితమైన నిర్మాణాన్ని, వీక్షణను ఫొటోల రూపంలో అందిస్తుంది.
ధూళి, వాయువులోని సూక్ష్మతంతువులను ఎంచుకోవడంలో టెలిస్కోప్‌లోని డిటెక్టర్లు ప్రత్యేకంగా పని చేస్తాయి.
ఇవి కూడా చదవండి:
- చలపతి రావు ఇక లేరు... మూడు తరాల కథానాయకులతో నటించిన వైవిధ్య నటుడు
- అటల్ బిహారీ వాజపేయి: ప్రేమించిన అమ్మాయిని వాజపేయి ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు?
- క్రిస్మస్: భారత్‌లో తొలి క్రిస్మస్ కేక్ ఎక్కడ, ఎలా తయారైంది? ఆ కథ మీకు తెలుసా...
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- కాపు రిజర్వేషన్లు: కేంద్రం ప్రకటనలో మతలబు ఏమిటి? బీజేపీ వ్యూహం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)