చలపతి రావు ఇక లేరు... మూడు తరాల కథానాయకులతో నటించిన వైవిధ్య నటుడు

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రముఖ తెలుగు నటుడు తమ్మారెడ్డి చలపతి రావు మరణించారు. ఈరోజు ఉదయం గుండెపోటుతో ఆయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు.

సుమారు 1200 కి పైగా సినిమాల్లో, మూడు తరాలకు చెందిన కథా నాయకులతో కలిసి నటించిన చలపతిరావు, కొద్ది కాలంగా చిత్రాల సంఖ్య తగ్గిస్తూ వచ్చారు.

ఎక్కువగా నెగిటివ్ క్యారక్టర్లతో పరిచయం అయిన చలపతి రావు అన్ని రకాల పాత్రల్లోనూ నటించి వైవిధ్యం చాటారు.

తండ్రి, బాబాయి, మామయ్య, విలన్, సైడ్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని రకాల పాత్రల్లోనూ నటించారు. 

కృష్ణా జిల్లా పామర్రు దగ్గర బల్లిపర్రుకు చెందిన చలపతిరావు1966లో సినిమాల్లోకి వచ్చారు.

‘గూఢచారి 116’ ఆయన మొదటి సినిమా. 2021లో నాగార్జునతో కలసి నటించిన బంగార్రాజు ఆయన చివరి సినిమా. 

బంగార్రాజు సినిమాలో చలపాయ్ అంటూ నాగర్జున చేత పిలిపించుకున్నా, బాలకృష్ణ చేత సత్తిరెడ్డీ అంటూ పిలిపించుకున్నా.. ఆది సినిమా యన్టీఆర్ కేర్ టేకర్‌గా నటించినా… సై సినిమాలో నితిన్ తండ్రిగా జీవించినా.. అల్లరి నరేశ్ తో కలసి కామెడీ చేసినా.. పాత్ర ఏదైనా ఒదిగిపోవడం చలపతి రావు ప్రత్యేకత. 

సాక్షి, సంపూర్ణ రామాయణం, యమగోల, దానవీరశూర కర్ణ, వేటగాడు, కొండవీటి సింహం, ఖైదీ, బొబ్బిలి బ్రహ్మన్న, అల్లుడా మజాకా, సిసింద్రీ, ఆపరేషన్ ధుర్యోధన, కిక్, బెండ్ అప్పారావు ఆర్ఎంపీ, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ వంటి సినిమాలెన్నిటిలోనో నటించారు. 

చలపతిరావు నిర్మాతగా కూడా 7 సినిమాలు తీశారు. బాలకృష్ణ హీరోగా చేసిన కలియుగ కృష్ణుడు వాటిలో ముఖ్యమైనది, ఎక్కువ సినిమాలు ఆయన ఇతరులతో కలసి భాగస్వామ్యంలో నిర్మించారు. 

జీ5 ఓటీటీలో ప్రసారమైన చదరంగం వెబ్ సిరీస్ లో కూడా చలపతిరావు నటించారు. 

ఆయన కొడుకు రవి బాబు కూడా నిర్మాత, దర్శకుడు, నటుడిగా సినిమా రంగంలో ఉన్నారు. 

యన్టీఆర్‌కీ, బాలకృష్ణకీ, యన్టీఆర్ కుటుంబానికి వీరాభిమానిగా ఉండేవారు చలపతిరావు. 

వృద్ధాప్యంతో కొంతకాలంగా సినిమాలు తగ్గించిన చలపతి రావు 78 ఏళ్ల వయసులో సొంతింట్లో గుండెపోటుతో కన్నుమూశారు. 

రెండు రోజుల క్రితం కైకాల సత్యనారాయణ చనిపోయారు. ఆయనను తలుచుకుంటూ చలపతిరావు ఒక ట్వీట్ చేశారు.

నివాళులు

చలపతి రావు మృతి బాధాకరం: పవన్ కల్యాణ్

ప్రముఖ నటులు చలపతి రావు కన్నుమూయడం బాధాకరమని జనసేన అధ్యక్షుడు, అగ్ర నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు చలపతిరావుకు ఆయన నివాళులు అర్పించారు.

‘‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనా శైలిని చూపించారు చలపతిరావు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారు. చలపతిరావు కుమారుడు నటుడు, దర్శకుడు రవిబాబుకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేయడం దురదృష్టకరం’’ అని పవన్ నివాళులు అర్పించారు.

అంతకుముందు తెలుగు దేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా చలపతి రావు మృతికి సంతాపం తెలియజేశారు.

‘‘చలపతి రావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది. రెండు రోజుల వ్యవధిలో టాలీవుడ్ ఇద్దరు గొప్ప నటులను కోల్పోయింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)