You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అవతార్ 2 రివ్యూ: ‘మన’ అనుకున్నది ఎవరైనా లాక్కుంటే ఏం చేస్తామో అదే అవతార్.. జేమ్స్ కామెరూన్ సృష్టించిన మరో విజువల్ వండర్
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ఓ కథను కళ్లకు ఎంత ఇంపుగా చెప్పారన్నదానిపైనే... సినిమాల జయాపజయాలు ప్రధానంగా ఆధారపడి ఉంటాయి.
అవతార్ లాంటి సినిమాల్లో కథతోపాటు విజువల్స్ కీలకం. విజువల్స్ దర్శకుడి ఊహా శక్తిపైనే ఆధారపడి ఉంటాయి. దర్శకుడు ఎంత అందమైన ప్రపంచాన్ని సృష్టించగలిగితే.. ప్రేక్షకులకు ఆ దృశ్యం అంతగా గుర్తుండిపోతుంది.
దృశ్యకావ్యం అనే మాటకు అసలు సిసలు నిర్వచనంలా నిలబడుతుంది `అవతార్`.
జేమ్స్ కామెరూన్ ఈ సినిమా కోసం మరో లోకాన్నే సృష్టించాడు. అంత వరకూ ఎప్పుడూ, ఎక్కడా చూడని విజువల్స్ `అవతార్`లో దర్శనమిచ్చాయి.
దానితో పాటు మానవీయ కోణం, ఎమోషనల్ టచ్.. ఇవన్నీ `అవతార్`ని ఆకాశంలో కూర్చోబెట్టాయి.
అప్పటి వరకూ ప్రపంచ చలన చిత్ర పరిశ్రమలో చూడని అద్భుతాల్ని ఆవిష్కరింపచేసింది అవతార్. వసూళ్లూ అలానే వరదలై పారాయి.
ప్రపంచ సినిమా చరిత్ర రాస్తే.. అందులో `అవతార్` ఓ అధ్యాయాన్ని ఆక్రమిస్తుంది. `అవతార్ 2` కోసం ప్రపంచమంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటానికి కారణం అదే. `అవతార్` చేసిన మ్యాజిక్కే. ఈ సీక్వెల్ కోసం జేమ్స్ కామెరూన్ పన్నెండేళ్ల సమయం తీసుకొన్నాడంటే.. దీనిపై ఎంత రీసెర్చ్ చేశాడో అర్థం చేసుకోవొచ్చు.
మరి ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన `అవతార్ 2 - ద వే ఆఫ్ వాటర్` ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను ఎంత వరకూ అందుకొంది?
అవతార్‌లో ఏం జరిగింది?
అవతార్ 2 కథ గురించి చెప్పుకొనే ముందు.. ఒక్కసారి `అవతార్` తొలి భాగం ఇతివృత్తాన్ని అవలోకం చేసుకోవడం సముచితంగా ఉంటుంది.
భూప్రపంచం, ఇక్కడి వనరులు త్వరలోనే అంతమైపోతుందని గ్రహించిన మానవాళి దృష్టి పండోరా అనే గ్రహంపై పడుతుంది.
అక్కడ నావీ అనే తెగ జీవిస్తుంటుంది. అందమైన ప్రకృతి, అత్యంత విలువైన సంపద.. `పండోరా` సొంతం. వాటిపై కన్నేసిన మనుష జాతి.. ఆ గ్రహంపైకి జేక్ (సామ్ వర్తింగ్ టన్)ని పంపుతుంది. నావీ జాతిని, అక్కడి ప్రపంచాన్నీ చూసి పండోరా ప్రేమలో పడిపోతాడు జేక్.
అంతే కాదు.. నావీ తెగకు చెందిన నాతిరి (జో)ని పెళ్లి చేసుకొని.. ఆ గ్రహాన్ని ఆక్రమించడానికి వచ్చిన మైల్స్ క్వారిచ్ (స్టిఫెన్ లాంగ్) బృందాన్ని తరిమి కొడతాడు. దాంతో క్వారిచ్.. జేక్స్‌పైనా, పండోరా వాసులపైనా పగబడతాడు.
ఇప్పుడు పార్ట్ 2 (ద వే ఆఫ్ వాటర్)లోకి వద్దాం. జేక్‌పై పగ సాధించడానికి క్వారిచ్ మళ్లీ పండోరాపై దాడి చేస్తాడు.
మరో గత్యంతరం లేక జేక్, అతని భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి మెట్కయినా అనే ప్రాంతానికి వలస పోతాడు.
సముద్రంతో ముడిపడిన ప్రాంతం అది. అక్కడి ప్రజలు, వారి తీరుతెన్నులు, అలవాట్లు వేరుగా ఉంటాయి.
మరి ముగ్గురు పిల్లలతో వలసపోయిన జేక్ అక్కడి పరిస్థితులకు ఎలా అలవాటు పడ్డాడు? క్వారిచ్ దాడి నుంచి తన కుటుంబాన్నీ, తను నమ్ముకొని వచ్చిన మెట్కయినా ప్రాంతాన్నీ ఎలా కాపాడుకొన్నాడు? అనేది మిగిలిన కథ.
మరో విజువల్ ఫీస్ట్
`అవతార్` ఒక విజువల్ వండర్. వెండి తెరపై ఆ సుందర దృశ్యాల్ని చూసి ప్రేక్షకులు తన్మయత్వానికి లోనైపోయారు. అక్కడ లాజిక్కులు పని చేయలేదు.
కేవలం కామెరూన్ మాజిక్ మాత్రమే కళ్ల ముందు కనిపించింది. `అవతార్ 2`ని కూడా ఆ విజువల్స్ కోసమే చూడ్డానికి సిద్ధ పడ్డారు ప్రేక్షకులు.
అలా.. విజువల్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచదు `అవతార్ 2`.
తొలి భాగంలో పండోరాలోని అందమైన అడవిని చూపించిన జేమ్స్.. రెండో భాగంలో సముద్రం నేపథ్యం ఎంచుకోవడం తెలివైన పని. ఎందుకంటే.. అడవిని `అవతార్`లో చూపించినంత అందంగా, అద్భుతంగా, వినూత్నంగా ఎవరూ చూపించలేరు.
అవతార్ 2లో కూడా అదే అడవిని చూపిస్తే బోర్ కొట్టేస్తుంది. అందుకే తన కథా నేపథ్యాన్ని మార్చుకొన్నాడు.
సినిమా మొదలైన 40 నిమిషాల వరకూ `వే ఆఫ్ వాటర్` అనే చాప్టర్ లోకి వెళ్లలేదు. అందుకు బాగానే సమయాన్ని తీసుకొన్నాడు దర్శకుడు. ఆ నలభై నిమిషాలూ పండోరాలోని అందమైన అటవీ నేపథ్యమే కనిపిస్తుంది.
అవతార్ 1ని చూడని వాళ్లకు పండోరాలోని ఆ అందమైన ప్రకృతిని కూడా చూపించాలని జేమ్స్ భావించి ఉంటాడు. అందుకే.. `వే ఆఫ్ వాటర్`లోకి వెళ్లడానికి అంతగా తొందరపడలేదు.
45 నిమిషాల తరవాత.. కథ మెట్కయినా ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది. అక్కడి నుంచి కామెరూన్ మాయాజాలం మొదలైపోతుంది.
నీటిలో ఓ అందమైన, అద్భుతమైన ప్రపంచాన్ని ఆవిష్కరించాడు కామెరూన్.
నిజంగా సముద్ర గర్భం ఇంత గొప్పగా ఉంటుందా? అనిపించేలా ఆ దృశ్యాల్ని మలిచాడు. ఏడు రంగుల ఇంధ్రధన్సు ఆకాశంలోనే కాదు.. సముద్రంలోనూ ఉంటుందని తన విజువల్స్ తో చూపించాడు కామెరూన్.
సముద్రంలో ఇంత వరకూ మనం చూసిన చేపలు, తిమింగలాలు, ఆల్చిప్పలు.. వీటికి ఓ కొత్త రూపు ఇచ్చాడు కామెరూన్. ఆయా దృశ్యాలన్నీ ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.. సముద్రంలో దిగి ఈత కొట్టాలన్న కోరికని థియేటర్లోనే కల్గిస్తాడు జేమ్స్ కెమరూన్.
నిజానికి కథ పరంగా `అవతార్ 2`లో కొత్త సంగతులేం ఉండవు. అదే విలన్.. అదే హీరో. కాకపోతే నేపథ్యం మారుతుంది.
మన తెలుగు సినిమాల్లో ఉండే సంఘర్షణ.. `అవతార్ 2`లోనూ కనిపిస్తుంది. హీరో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి మరో ప్రాంతానికి వెళ్లిపోతాడు.
విలన్ అక్కడికి కూడా వస్తాడు. దాంతో హీరో యుద్ధం చేసి, తన కుటుంబాన్ని రక్షించుకొంటాడు. పైపై నుంచి చూస్తే.. అవతార్ 2 పాయింట్ ఇదే.
అవతార్ 1లోనూ కథ ఇలానే ఉంటుంది. కానీ అంతర్లీనంగా... ఓ బలమైన పాయింట్ ఉంది. మన భూమి, మన దేశం, మన ప్రాంతం, మన ఊరు.. ఇవన్నీ `మన` అనుకొన్న ఫీలింగ్స్. వాటిని ఎవరు లాక్కోవాలని చూసినా తిరుగుబాటు తప్పదు.
ఆ తిరుగుబాటులో న్యాయం ఉంటే.. ప్రకృతి కూడా మనవైపే ఉంటుంది.
అవతార్ 1లో అదే జరిగింది. అడవి, అక్కడి జంతువులు, పశు పక్షాదులూ.. అన్నీ ఆ పోరాటంలో పాల్గొంటాయి.
`అవతార్ 2`లో కూడా అంతే. సముద్రమే.. శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది.
హ్యూమన్ ఎమోషన్‌ని కామెరూన్ ఎప్పుడూ వదల్లేదు.
ఈసారీ అంతే. ఓ తండ్రికి బిడ్డలపై ఉండే ప్రేమ.. ఓ తల్లికి పిల్లలపై ఉండే మమకారం.. `అవతార్ 2`లోనూ చూపించాడు కామెరూన్.
సముద్రం అంటే అన్నీ ఇచ్చేది. కావాలనుకొంటే అన్నీ తీసుకొనేది కూడా.
మన పుట్టుక సముద్రంతోనే, మన చావు కూడా సముద్రంతోనే.. అనే ఫిలాసఫీ చెప్పాడు ఈ కథలో.
తొలి భాగంతో పోలిస్తే.. ఎమోషన్ పాళ్లు కొంత తగ్గినట్టు కనిపిస్తాయి.
అందమైన పండోరాని శత్రువులు నాశనం చేస్తున్నప్పుడు ప్రేక్షకులకు కూడా `అయ్యో..` అనిపిస్తుంది.
అయితే.. మెట్కయినా ప్రాంతం మంటల్లో తగలబడిపోతున్నప్పుడు ఆ ఫీలింగ్ రాదు.
నిడివి పరంగా చూస్తే అత్యంత సుదీర్ఘంగా సాగే సినిమాల్లో ఇదొకటి. ద్వితీయార్థం సాగదీతగా అనిపిస్తుంది. డీటైలింగ్ వల్ల చూసిన సన్నివేశమే మళ్లీ చూస్తున్నట్టు అనిపిస్తుంది.
అయితే పతాక సన్నివేశాల్లో జేమ్స్ మరోసారి విజృంభించాడు. వార్ ఎపిసోడ్‌ని ఉత్కంఠభరితంగా, విజువల్ ఫీస్ట్‌గా తీర్చిదిద్దాడు. క్లైమాక్స్‌తో టికెట్ రేటు గిట్టుబాటు అయిపోయే ఫీలింగ్ తీసుకొచ్చాడు.
అవతార్ 3కి లీడ్.. క్లైమాక్స్‌లో ఉంటుందనుకొన్నవాళ్లకు కొంత నిరాశ ఎదురవుతుంది. సీక్వెల్ గురించి ఎలాంటి హింట్ ఇవ్వకుండానే కథని ముగించాడు దర్శకుడు.
ఔరా.. అనేలా..!
అవతార్ చూసొచ్చాక జేక్, నాతిరి పాత్రలు గుర్తిండిపోతాయి. అవతార్ 2లోనూ అంతే. కాకపోతే.. వీరిద్దరితో పాటు మరిన్ని పాత్రలు కళ్ల ముందు కదులుతాయి.
తొలి భాగంతో పోలిస్తే.. ప్రతినాయకుడు క్వారిచ్‌లో క్రూరత్వం పాళ్లు తగ్గినట్టు అనిపిస్తుంది. మెట్కయినా ప్రాంతంలోని తెగ, అక్కడి నాయకుడు, ఇతర పాత్రల్ని పెద్దగా వాడుకోలేదేమో అనిపిస్తుంది.
నటీనటుల్ని పక్కన పెడితే.. `అవతార్ 2` అనేది ఓ విజువల్ ఫీస్ట్. ప్రతీ చోటా ఔరా అనేలా సన్నివేశాల్ని డిజైన్ చేశాడు జేమ్స్. కొన్ని సన్నివేశాల్లో కామెరూన్ చూపించిన డిటైలింగ్‌కి ఆశ్చర్యపడాల్సిందే. పతాక సన్నివేశాల్లో తన ఊహాశక్తి అనన్య సామాన్యంగా అనిపిస్తుంది. సౌండ్ డిజైనింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
మోషన్ క్యాప్చర్, మూవీంగ్ క్యాప్షన్ అనే టెక్నాలజీని వాడుకొని ఈ సినిమా తీశారు. మూవింగ్ క్యాప్షన్ కోసం కొత్త తరహా కెమెరాల్ని కనిపెట్టారు.
సముద్ర గర్భంలో తెరకెక్కించిన సన్నివేశాలు అంత సహజంగా వచ్చాయంటే కారణం.. మూవింగ్ క్యాప్షన్ టెక్నాలజీనే. సముద్రంలో ప్రేక్షకుడు కూడా ఉన్నాడా? అనే ఫీలింగ్ తీసుకొచ్చిన సీన్లవి. ఓ సినిమా కోసం కొత్త తరహా టెక్నాలజీనే పుట్టించారంటే.. ఆ సినిమాపై దర్శకుడు ఎంత ప్యాషన్ తో పనిచేశాడో అర్ధం అవుతుంది.
3డీ, 4డీ టెక్నాలజీతో తీసిన సినిమా ఇది. వీలైనంత వరకూ ఈ సినిమాని త్రీడీలోనే చూడడం ఉత్తమం. అప్పుడే విజువల్స్ మరింత అద్భుతంగా కళ్లకు కనిపిస్తాయి.
అవతార్‌లో కామెరూన్ ఎక్కడికో వెళ్లిపోయాడు. సినిమాకీ, సృజనాత్మకతకీ గొప్ప నిదర్శనం ఇచ్చాడు.
అవతార్ 2తో మరోసారి గొప్ప విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించాడు. వెండి తెరపై చూడాల్సిన గొప్ప చిత్రాల్లో.. అవతార్ 2 కూడా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
ఇవి కూడా చదవండి:
- గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?
- అక్కడ చికెన్ కంటే ఎలుక మాంసం ధర ఎక్కువ... దీని రుచి ఎలా ఉంటుంది?
- హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి
- రిషి రాజ్పోపట్: 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు.. భారతీయ విద్యార్థి పరిష్కారం
- ప్రపంచ కుబేరుని కథ: ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టిన బెర్నార్ ఆర్నో ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)