‘రేసు గుర్రం మద్దాలి శివారెడ్డి’ మీద సోషల్ మీడియాలో విమర్శలెందుకు

‘నాకు నలుగురు పిల్లలు. కాంగ్రెస్ పార్టీ ముందే జనాభా నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఉంటే నేను నలుగుర్ని కనేవాడిని కాదు.’

ఈ మాటలు అన్నది ఒక బీజేపీ ఎంపీ. పేరు రవి కిషన్. ఇలా చెబితే అర్థం కాకపోవచ్చు... కానీ అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ సినిమాలో విలన్ ‘మద్దాలి శివారెడ్డి’ అంటే చాలా మంది గుర్తుపడతారు.

ఈ 53ఏళ్ల నటుడు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో చాలా మంది విమర్శిస్తున్నారు. ‘మీరు పిల్లలను కని అందుకు కాంగ్రెస్‌ను తప్పు పట్టడం ఏంటని’ ప్రశ్నిస్తున్నారు.

ఏం జరిగింది?

ఇండియా టుడే చానల్ శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ పాల్గొన్నారు. ఆయన పార్లమెంటులో ‘జనభా నియంత్రణ’ మీద ప్రైవేటు బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా యాంకర్ ఇలా అడిగారు.

‘మీరు జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెడుతున్నారు. కానీ మీకు నలుగురు పిల్లలు ఉన్నారు. మనోజ్ తివారీ మూడో సారి తండ్రి అవుతున్నారు. దీని మీద సోషల్ మీడియాలో తరచూ విమర్శలు వస్తున్నాయి కదా?’ అని యాంకర్ ప్రశ్నించారు.

‘నాకు నలుగురు పిల్లలున్నారు. కానీ కాంగ్రెస్ జనాభా నియంత్రణ బిల్లును తీసుకొచ్చి ఉంటే నేను అంతమందిని కనకుండా ఉండేవాడిని’ అని రవి కిషన్ అన్నారు.

‘నా భార్య పొడుగ్గా సన్నగా ఉండేది. ఒక్కో ప్రసవం తరువాత ఆమె శరీరం కృశించిపోతూ వచ్చింది. స్ట్రగుల్స్, షూటింగ్స్... ఆ పని ఈ పని... వీటి మధ్య ఏమీ అర్థం కాలేదు. అలా మూడో బిడ్డ... నాలుగో బిడ్డ కూడా పుట్టేశారు.

ఆ తరువాత జీవితంలో కాస్త స్థిరత్వం వచ్చింది. అవగాహన పెరిగింది. డబ్బులు వచ్చాయి. సంపద పెరిగింది. ఇప్పుడు నా భార్యను చూస్తే చాలా బాధ కలుగుతోంది’ అని ఆయన చెప్పారు.

రవి కిషన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ విమర్శించారు.

‘పిల్లలు పుడుతూ పోయారు. కానీ మీకు తెలియలా?.. సరే కాంగ్రెస్ దయవల్ల మీరు ముగ్గురు అమ్మాయిలకు ఒక అబ్బాయికి తండ్రి అయ్యారు’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

అలాగే రవి కిషన్ ‘బాడీ షేమింగ్’ చేశారంటూ ఆరోపించారు.

‘పిల్లలకు జన్మను ఇవ్వడం ద్వారా ఒళ్లు కృశించుకు పోయింది... అని మీరు అన్నారు. అలా అనడం భార్య మీద ప్రేమ కాదు అది బాడీ షేమింగ్’ అని సుప్రియా శ్రీనేత్ ట్వీట్ చేశారు.

‘అవగాహన లేకుండా నలుగురు పిల్లలను కన్న రవి కిషన్, అందుకు కాంగ్రెస్‌ను తప్పు పడుతున్నారు. పిచ్చితనంలో ఇది మరొక లెవల్’ అంటూ రోహిణి సింగ్ అనే జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.

‘తన భార్యను చూసి రవి కిషన్ బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన భార్య సన్నగా ఉండేది. నలుగురు పిల్లలను కన్న తరువాత ఇప్పుడు ఆమె ఒళ్లు కృశించి పోయింది’ అంటూ సమాజ్ వాదీ పార్టీకి చెందిన జూహీ సింగ్ విమర్శించారు.

పార్లమెంటులో ప్రైవేటు బిల్లు

బీజేపీ ఎంపీ రవి కిషన్ శుక్రవారం పార్లమెంటులో జనాభా నియంత్రణ మీద ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వల్ల దేశానికి ఎన్నో లాభాలు ఉన్నాయని ఆయన అన్నారు.

‘దేశంలో జనాభా నియంత్రణలో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారతాయి. ఇందుకే జనాభా నియంత్రణ మీద ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాను.

రానున్న తరాలకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది. వారికి మంచి విద్య అందుతుంది. అన్ని వర్గాల వారికి మెరుగైన జీవితం లభిస్తుంది’ అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో రవి కిషన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి: