You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పుడు వస్తాయి?
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట అతి ఎక్కువసార్లు వచ్చిన హామీ ఇది. విపక్షాలు ప్రభుత్వాలపై జోకులు వేసే స్థాయికి తీసుకెళ్లిన హామీ ఇది.
కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేళ్లయింది.. మరి తెలంగాణ పేదలకు ఇళ్లెప్పుడొస్తాయి? 18 వేల కోట్ల ఖర్చుతో 2 లక్షల 72 వేల ఇళ్లు నిర్మించాలనే తెలంగాణ ప్రయత్నం ఫలిస్తుందా?
అసలేంటీ దీని ప్రత్యేకత
పేదలకు ఇళ్ల నిర్మాణ పథకం ఐదు దశాబ్దాలుగా భారతదేశంలో కొనసాగుతోంది. ఒకప్పుడు ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మట్టితో అలికి, ఆకులతో కప్పు వేసిన ఇళ్లను ఇవ్వడం గొప్పగా చెప్పుకున్న రోజుల నుంచి.. ఒక గదిని సిమెంట్‌తో కట్టిన ఇళ్ళ దశ దాటి, ఇందిరమ్మ ఇళ్లు, వాంబే కాలనీలు, సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణానికి డబ్బులు.. ఇలా లక్షలాది ఇళ్లను ప్రభుత్వాలు కట్టించాయి. అయినా ఇప్పటికీ ఇళ్లులేని పేదలు లక్షల్లోనే ఉన్నారు.
తెలంగాణ ఏర్పడ్డ తరువాత, పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమంపై తరచుగా పలు ప్రకటనలు చేసిన కేసీఆర్, అంతమకుముందు వరకూ ఇచ్చిన ఇళ్ల పట్ల తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. చుట్టం వస్తే బయట పడుకోవాలంటూ ఎద్దేవా చేశారు. వాటికి పరిష్కారంగా తాము డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తాం అన్నారు.
గవర్నమెంటు ఇచ్చే ఇళ్లంటే ఒక గదితో ఉండేలా కాకుండా, రెండ్ బెడ్ రూమ్‌లు, రెండు బాత్రూమ్లు ఉండేలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. దానికి డిగ్నిటీ హౌసింగ్ అనే పేరు పెట్టి 2015లో అక్టోబరులో ప్రారంభించారు. డబుల్ బెడ్ రూమ్ గురించి కేసీఆర్ ఎంతగా మాట్లాడారంటే, ప్రతిపక్షాలు ఈ అంశంపై జోకులు వేసే స్థాయికి వెళ్లింది. కానీ డబుల్ బెడ్ రూమ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు.
ఎలా ఉంటాయీ ఇళ్లు?
సాధారణంగా ప్రభుత్వాలు ఇచ్చే ఇళ్లు 260 చదరపు అడుగుల్లో ఉంటాయి. కానీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం 560 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉంటుంది.
ఇండిపెండెంట్ ఇళ్లకు అయితే ప్లాట్ 125 చదరపు గజాలు ఉంటుంది. ఒకవేళ అపార్టమెంటు తరహా అయితే, ఒక ఫ్లాట్‌కు 36 చదరపు గజల వాటా వచ్చేలా ఉంటుంది. మొత్తంగా భారతదేశంలో ఇంత పెద్ద ఇళ్లను పేదలకు నిర్మిస్తోన్న రాష్ట్రం తెలంగాణ ఒకటే.
ఒక్కో ఇంటికీ గ్రామీణ ప్రాంతాల్లో 6 లక్షల 29 వేలు, పట్టణ ప్రాంతాల్లో 6 లక్షల ఐదు వేలు, జీహెచ్ఎంసీలో 7 లక్షల 75 వేలు, 8 లక్షల 65 వేలు.. ఇలా ఖర్చు చేస్తోంంది ప్రభుత్వం. ఇళ్ల కేటాయింపులో కూడా రిజర్వేషన్ పద్ధతి పాటిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి.
చాలా ఆలస్యం
ఆర్భాటంగా ప్రకటించారు కానీ ముందు నుంచీ చాలా ఆలస్యం అవుతూనే వచ్చింది ఈ పథకం. అనేక సందర్భాల్లో ఇళ్ల నిర్మాణం సగంలో ఆగిపోయాయి. తెలంగాణలో చాలా పట్టణాల శివార్లలో, జిల్లా కేంద్రాల శివార్లలో సగం పూర్తయిన, 80 శాతం పూర్తయిన భారీ కాలనీలు కనిపిస్తూ ఉండేవి.
అనేక సందర్భాల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో, పనులు ఆలస్యం అయ్యేవి. కొన్ని చోట్ల అసలు ఇళ్లు కట్టడానికి కాంట్రాక్టర్లే ముందుకు రాని పరిస్థితి. కొన్ని చోట్ల రేట్లు సరిపోక మధ్యలో పని వదిలేసిన కాంట్రాక్టర్లూ ఉన్నారు.
భూసేకరణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. కేంద్ర నిధుల విషయంలో వివాదం, హడ్కోతో అప్పుల గొడవ వంటి పరిపాలనా సంబంధ అంశాలు, పనులు మొదలయ్యాక, ఉమ్మడి మౌలిక వసతులకు కేటాయించిన డబ్బు సరిపోకపోవడం.. ఇలాంటి ఎన్నో అంశాలు ఈ పథకాన్ని వెనక్కు లాగాయి.
ఈ పథకాన్ని ముందుగా కేసీఆర్ సొంత నిజయోజకవర్గం గజ్వేలులో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలుపెట్టారు. ఎర్రవల్లిలో మోడల్ కాలనీ కట్టారు. 2016 మార్చి 5న ప్రారంభించారు. అక్కడ తప్ప మిగిలిన చోట్ల అంత వేగంగా ఎక్కడా పూర్తి కాలేదు.
ఉదాహరణకు యాదాద్రి జిల్లాలో 3,464 ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదన. వాటిలో 1,603 ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. వాటిలో 829 ఇళ్లు పూర్తయ్యాయి. 574 నిర్మాణంలో ఉణ్నాయి.
మరోవైపు మెదక్ జిల్లా రామాయంపేటలో 600 ఇళ్లు పూర్తయినా ఎవరికీ ఇవ్వలేదు. దీంతో అవన్నీ నిరుపయోగంగా పడి ఉన్నాయి.
రాజకీయాలతో కేటాయింపుల్లో ఆలస్యం
నిజానికి కొన్ని చోట్ల ఇళ్లు పూర్తయినా కేటాయింపులు ఆలస్యం అయ్యాయి. చాలా చోట్ల కాలనీలోని ఇళ్ల సంఖ్య కంటే, లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉంది. అందరికీ సరిపడా ఇళ్లు పూర్తయ్యే వరకూ కేటాయింపులు ఆపించారు రాజకీయ నాయకులు.
‘‘అందరు అర్జీదారులకూ ఒకేసారి ఇవ్వాలని నాయకులు ఒత్తిడి ఉంది. లేదంటే తమకు సమస్య అని వారు భయపడ్డారు. పూర్తయిన ఇళ్లను పూర్తయినట్టుగా పంపిణీ చేయడానికి నాయకులు ఒప్పుకోకపోవడం కూడా ఆలస్యానికి ఒక కారణం’’ అంటూ బీబీసీకి వివరించారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక తహశీల్దార్.
జగిత్యాల జిల్లా నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇళ్ల నిర్మాణం చాలా ఆలస్యం అయింది. 4 వేల 162 ఇళ్లు కట్టాలనుకుంటే చాలా కాలం వరకూ పైన 162 ఇళ్లు పూర్తయ్యాయి. కానీ, 4 వేల ఇళ్లూ పూర్తి కాలేదు. ఎట్టకేలకు పూర్తి చేసిన తరువాత, పంపిణీ ఆలస్యం అయింది. దీంతో 2021 సెప్టెంబరులో కొందరు లబ్ధిదారులు ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇళ్లలో చేరారు.
కట్టిన వెంటనే లోపాలు
ఒకవైపు ఈ పథకంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే చాలా చోట్ల డోర్లు ఊడడం, స్లాబులు దెబ్బతినడం వంటివి జరిగాయి. ఇక కొత్త ఇంట్లో దిగిన తరువాత ఏడాదిలోపే ఎన్నో రిపేర్లు, పెచ్చులూడటాలు జరిగిన ఉదంతాలకు లెక్కేలేదు.
ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ఇలాంటి ఫిర్యాదులు చాలా వచ్చాయి. గత వర్షాలకు కొన్ని ఇళ్లలో నీళ్లు లీక్ అయిన సమస్యలూ వచ్చాయి. మరికొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయి, పంపిణీ జరగని ఇళ్లల్లో లోపాలు బయటపడ్డాయి.
‘‘మేం ఇంట్లోకి దిగిన మూడు నాలుగు నెలలకే కొన్ని పెచ్చులు ఊడాయి. వాటిని మేమే తాత్కాలికంగా రిపేర్లు చేసుకున్నాం. డోర్లు కూడా బలహీనంగా ఉన్నాయి’’ అని బీబీసీతో చెప్పారు మెదక్ జిల్లాకు చెందిన శ్రీనివాస్.
ఎన్ని లోపాలు ఉన్నా వీటికి క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఇంకెప్పుడు?
ఇప్పటివరకూ తెలంగాణ వ్యాప్తంగా 19 వేల 328 కోట్లను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేటాయించారు. ఆ పథకంలో భాగంగా 2 లక్షల 91 వేల 57 ఇళ్లను నిర్మిస్తున్నారు. తెలంగాణ గృహ నిర్మాణ శాఖ లెక్కల ప్రకారం, ఇందులో 2 లక్షల 28 వేల 529 ఇళ్ళ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది ప్రభుత్వం.
1 లక్షా 29 వేల 528 ఇల్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇంకా 58 వేల 350 ఇళ్లు నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. మరో 40 వేల 651 ఇళ్లు వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఇక చాలా ఇళ్లు నిర్మాణం పూర్తయినా, ఆ కాలనీల్లోని ఇతర కామన్ పనులు పూర్తి కాలేదు.
ఈ ఆలస్యంపై గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించారు. వచ్చే జనవరిలోనే ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లను పేదలకు అందజేస్తాం అని ఆయన చెప్పారు.
‘‘ఇళ్ల కోసం ఇప్పటికే 11 వేల 614 కోట్లను ఖర్చు చేశాం. చాలా చోట్ల లబ్ధి దారుల ఎంపిక పూర్తయింది. మరి కొన్ని చోట్ల ఎంపిక జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక ప్రక్రియను జనవరి 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఆ వెంటనే పంపిణీ ఉంటుంది’’అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భార్యను కీలు బొమ్మగా మార్చేసే ఈ గ్యాస్‌లైటింగ్ ఏమిటి, దీన్ని మొదట్లోనే గుర్తించడం ఎలా?
- ఎలాన్ మస్క్: ట్విటర్ ఆఫీస్‌ను ‘హోటల్’గా మార్చిన కొత్త బాస్
- ఆంధ్రప్రదేశ్: జయహో బీసీ సభను అధికార పార్టీ ఎందుకు నిర్వహించింది, బీసీ కార్పోరేషన్లతో జరిగిన మేలు ఎంత ?
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)