You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా... ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో పని చేస్తాయా?
- రచయిత, జీఎస్ రామ్మోహన్
- హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు
నెలరోజులకు పైగా దేశంలోని అన్ని ప్రధాన పత్రికలు కేసీఆర్ చిత్రాలతో కూడిన అడ్వర్టయిజ్‌మెంట్లతో హోరెత్తుతున్నాయి. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో జాతీయ స్థాయి పొలిటికల్ ఆంబిషన్‌ను ప్రకటించుకున్నారు.
దిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలో మరణించిన వారి కుటుంబాలకు, చైనా సరిహద్దులో గల్వాన్ ఘర్షణలో మరణించిన జవాన్ల కుటుంబాలకు భారీ సాయం ఇచ్చి ఉన్నారు. దిల్లీ నడిబొడ్డున భారీ ధర్నాలు జరిపి అధికార బిజెపికి సవాళ్లు విసిరి ఉన్నారు. జాతీయ పార్టీ గురించి అదిగో ఇదిగో అని ఫీలర్లు పంపి చర్చ జరిపారు గానీ తగిన స్పందన రాలేదనుకున్నారో ఏమో ప్రస్తుతానికి దాన్ని కోల్డ్ స్టోరేజిలో ఉంచారు.
ఇపుడిక బీజేపీ వంతు. జూలై 2, 3 తేదీలలో జరిగే జాతీయ కార్యవర్గం కోసం మొత్తం బీజేపీ టాప్ బ్రాస్ అంతా హైదరాబాద్లో మకాం వేసి ఉన్నారు. మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, 19 మంది ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్లో ఉండబోతున్నారు.
''మనమిది మాట్లాడుతున్న సమయానికే జవదేకర్, సాధ్వి ప్రజ్ఞా, రాజ్యవర్థన్ రాథోడ్ లాంటి దేశవ్యాప్తంగా జనం గుర్తించగలిగిన నాయకులు తెలంగాణలో రాజకీయ వ్యూహాల్లో మునిగితేలుతూ ఉన్నారు. 119 మంది నాయకులు మొత్తం 119 నియోజకవర్గాల్లోని దళితుల ఇళ్లలో బస చేస్తూ బూత్‌ల వారీ రివ్యూ చేస్తున్నారు'' అని ఆర్ఎస్ఎస్ తో సుదీర్ఘ అనుబంధమున్న విశ్లేషకులు రాకా సుధాకరరావు బీబీసీ తెలుగుకు చెప్పారు.
ఉత్తరాదిలో బీజేపీ సాచ్యురేషన్‌కు చేరింది. ఇక దక్షిణాది వంతు. అందులో ప్రస్తుతం ఆపరేషన్ తెలంగాణ మీద ఫోకస్ ఉంది అని ఆయన వివరించారు. ‘సాలు దొర సెలవు దొర’ అంటూ బీజేపీ ఇప్పటికే కౌంట్ డౌన్ ఆరంభంచి ఉంది. మరోవైపు ‘సాలు మోదీ, సంపకు మోదీ’ అని టీఆర్ఎస్ వైపునుంచి ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ స్థాయి పోస్టర్ల వార్ ఇంతకుమముందెన్నడూ చూడనిది.
నాలుగేళ్లలో అనుకోని మార్పు...
2018 వరకూ రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను సవాల్ చేసే శక్తిగా బీజేపీ ఎదుగుతుందని అంటే బహుశా బీజేపీ నేతలే నమ్మేవాళ్లు కాకపోవచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో గెలిచింది. అది కూడా హైదరాబాద్‌లోని గోషామహల్లో రాజాసింగ్. 103 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. కానీ 2019 లోక్ సభ ఎన్నికలు వాళ్లకు తొలిసారి నమ్మకాన్ని కలిగించాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి వెడితే మోదీ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడుతుందని భావించే కేసీఆర్ తెలివిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ పార్లమెంట్ ఎన్నికలకొచ్చేసరికి ఆయన భయాలు నిజయమ్యాయి.
బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గట్టిగా దృష్టిపెడితే ఇక్కడ అవకాశముందనే నమ్మకం పార్టీకి కలిగించిన ఎన్నికలవి.
తర్వాత హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో గట్టిపోటీ నివ్వడం వారి విశ్వాసాన్ని పెంచింది. తర్వత జరిగిన రెండు ఉపఎన్నికలు మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. గోషా మహల్ లాగే ఇందులోనూ క్యాండిడేట్స్ వ్యక్తిగత బలాల్లాంటి కారణాలున్నప్పటికీ పార్టీ ఆ విజయాలను బలంగా క్యాష్ చేసుకోగలిగింది. క్యాడర్ బలంగా లేని దశలో ఇమేజ్ ప్లే ముఖ్యమవుతుంది. గెలిచే స్తతా ఉన్న పార్టీ అనే ఇమేజ్ ను పంపించడానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి.
కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో బలహీనంగా ఉండడం, తెలంగాణ కాంగ్రెస్‌లో అందరినీ కలుపుకునిపోయే ఇమేజ్ కగిలిన నాయకత్వం లేకపోవడం బీజేపీకి వరంగా మారింది. టీఆర్ఎస్ మీద అసంతృప్తి ఉన్న వారందిరనీ పోలరైజ్ చేసే పనిలో బీజేపీ ఉంది. అధికారికంగా చూస్తే కాంగ్రెస్ ఇప్పటికీ అసెంబ్లీలోప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీకి ఊరూరా క్యాడర్ ఉంది. కానీ నేనే అసలైన ప్రత్యర్థిని అనే ఇమేజ్‌ను అంతటా పంపించడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది.
తెలంగాణలో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం ఇప్పటికే స్పష్టంగా ఉంది. అది బీసీలను కేంద్రకంగా చేసుకుని అదనంగా దళితులను, రెడ్లను సమీకరించే పనిలో ఉంది. పార్టీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ మున్నూరు కాపు. మరో మున్నూరుకాపు నాయకుడు లక్ష్మణ్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తోంది బీజేపీ. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. సిగ్నల్స్ క్లియర్.
విగ్రహ రాజకీయం
రెండు మూడేళ్లుగా తెలంగాణలో ఎక్కడ చూసినా శివాజీ విగ్రహాల ఏర్పాటు ఉధృతంగా సాగుతోంది. ఇంపోర్టెడ్ ఫ్రమ్ మహారాష్ర్ట. ఇది పూర్తిగా కొత్త పరిణామం. అంతకుముందునుంచి వివేకానంద విగ్రహాల ఏర్పాటు ఉద్యమంలాగా సాగుతున్నది.
తెలంగాణ గడ్డమీద గ్రామీణ ప్రాంతం నుంచి ఇమేజ్ బిల్డప్ అనే ప్రక్రియ సాగుతూ వస్తున్నది. బలమైన జాతీయోద్యమ వారసత్వం, ఆ ఇమేజ్ కలిగిన నాయకులు అంతగా లేని బీజేపీ హిందూ రాజుల నుంచి, యోగుల నుంచి ఐకాన్స్‌ను వెతుక్కుని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నది.
జాతీయ స్థాయిలో నెహ్రూ, గాంధీ, పటేల్, అంబేద్కర్ ఇమేజ్‌లతో రకరకాల సంక్లిష్ట ప్రయగాలు చేస్తున్న బీజేపీ కొద్ది రోజుల్లో ఇండియా గేట్ కింద సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించబోతున్నది. ఇదొక డైరక్షన్. అందులో భాగంగా అవసరమైతే పక్క రాష్ట్రాలనుంచి ఇమేజులను ఇంపోర్ట్ చేసుకోగలదు. స్థానికంగా అక్కడున్న కొందరు ఐకాన్స్ ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేయగలదు. నాలుగో తేదీ ఆంధ్రలో అల్లూరి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించబోతున్నారు. టీఆర్ఎస్ కూడా కాకతీయ పాలకుల్లో మంచిని వెతికి వెలికితీసే పనిలో పడిందని కొందరు పాత్రికేయులు చెపుతున్నారు.
మూడు అంశాలు, మూడు వ్యూహాలు
2024 లోక్ సభ ఎన్నికలకు పార్టీని సమాయత్త పర్చడం, వ్యూహాలు ఎత్తుగడలు రూపొందించడం బీజేపీ జాతీయ కార్యకవర్గం ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా దక్షిణాదిపై ప్రధాన ఫోకస్ ఉండబోతోంది. తెలంగాణ ప్రధాన లక్ష్యంగా ఉండబతోంది.
దేశవ్యాప్తంగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపర్చడం, లీడర్‌కు-క్యాడర్‌కు మధ్య మరింత బలమైన టూ-వే సిస్టమ్ నెలకొల్పడం, సోషల్ డైవర్సిటీని విస్తరించడం అనే మూడు ప్రధాన అంశాలపై జాతీయ కార్యవర్గం ఫోకస్ పెట్టబోతోందని సుధాకర్ రావు చెప్పుకొచ్చారు.
''పాతకాలపు బ్రాహ్మణ్-బనియా ఇమేజిని వదుల్చుకుని కొత్త సామాజిక సమీకరణల్లో మోదీ, షా ద్వయం ఇప్పటికే చాలా వరకు విజయం సాధించింది. అలాగే యువ నాయకత్వం ప్రాధాన్యం పెరుగుతోంది. రాజ్‌నాథ్ సింగ్ లాంటి వారికి ఇవే ఆఖరి జాతీయ కార్యవర్గ సమావేశాలు కావొచ్చు'' అని ఆయన అభిప్రాయపడ్డారు. పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు 50ల్లో ఉన్నవాళ్లేనని రాజకీయ పరిభాషలో వారిని యువతరంగానే భావించాల్సి ఉంటుందని వివరించారు. నాయకత్వపు సగటు వయసు తగ్గించడం అనేదాని మీద బీజేపీ దృష్టి పెట్టిందనేది సారాంశంగా ఉంది.
హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమం మూడు ప్రధాన అంశాలుగా ఎన్నికల వ్యూహరచన ఉంటుందని సుధాకరరావు చెప్పుకొచ్చారు.
సంక్షేమం-అభివృద్ధి వర్సెస్ కుటుంబ పాలన-అవినీతి
తెలంగాణ కుటుంబ పాలన కింద అణగారిపోతోందని, దీనికి విముక్తి కలిగించాలని ప్రజలు నిర్ణయానికొచ్చేశారని ప్రధాని ఇప్పటికే మొన్నటి పర్యటనలో ఎన్నికల శంఖారావం పూరించి ఉన్నారు. ‘‘మీ నాయకుడు మూఢనమ్మకాలను పాటించే వ్యక్తి. నేను సైన్సును నమ్మే వ్యక్తిని’’ అని కూడా ఎద్దేవా చేశారు. ఇపుడు మూడో తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభపై చాలా ఆసక్తి ఉంది. కుటుంబపాలన, అవినీతి ఆరోపణలు ప్రధాన అస్త్రాలుగా ఉండబోతున్నాయి.
‘సాలుదొర, సెలవు దొర’ అనే స్లోగన్ మాత్రమే కాదు. బీజేపీ రాష్ర్ట నాయకత్వం దొర అనే పదాన్ని పనిగట్టుకుని అదే పనిగా వాడుతున్నది. కేవలం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్నిఇరిటేట్ చేయడమే కాదు. ప్రజలకు దూరంగా పాలకుడినినిలబెట్టే వ్యూహం కూడా ఇందులో ఉంది. అది రెండక్షరాల మాటే కానీ తెలంగాణ రాజకీయ సామాజిక వాతావరణంలో ఫ్యూడల్ వారసత్వాన్ని, వర్గ కుల ఆధిపత్య స్వభావాన్ని ప్రతిబింబించే పదం. విపరీతమైన మూఢ నమ్మకాలుండి సెక్రటేరియెట్‌కు రాకుండా ఫామ్ హౌస్‌లో ఎక్కువ సేపు గడిపే నాయకుడు కాబట్టి, మంచికైనా, చెడుకైనా తనమాటే వేదంలా.. ఒకరకంగా రాజుమాదిరి పరిపాలించే నాయకుడు కాబట్టే ఆ ఫ్యూడల్ మాటను ప్రత్యర్థులు పదే పదే వాడుతుంటారని చెబుతుంటారు. పైగా ఆయన కులం కూడా వారికి ఉపయోగపడుతుంది. అందుకే వాళ్లా మాటను వదిలిపెట్టరు. విగ్రహాల ద్వారా పంపించే సింబాలిజం, టీఆర్ఎస్-ఎంఐఎం దొస్తీ, బోధన్ లాంటి ఘటనలు, ఇవన్నీ కమలనాథులు పదే పదే వాడే అస్త్రాలు.
అవతల ఊరూరా కేడర్ ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నపుడు క్యాడర్ ఇంకా అంతగా స్థిరపడని బీజేపీ ప్రధానంగా ఇమేజరీని, సింబాలిజాన్ని ఆశ్రయిస్తోంది. ఒకరకంగా సైకలాజికల్ వార్ ఫేర్ తెలంగాణ గడ్డమీద జరుగుతున్నది.
సులభం కాదు...
బీజేపీ చాటుకుంటున్న సంక్షేమ పథకాలను మించిన పథకాలు దక్షిణాదిన అమల్లో ఉన్నాయి.
వాస్తవానికి బీజేపీ కేంద్రంలో ఆరంభించిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌కు మూలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో వైఎస్ఆర్ ఆరంభించి ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న ఆరోగ్య శ్రీ..
కేంద్రం ఆరంభించిన కిసాన్ సమ్మాన్ నిధికి మూలం కేసీఆర్ తెలంగాణలో ఆరంభించిన రైతు బంధు.
కేంద్రం కంటే తెలుగు రాష్టాలు అందజేస్తున్న ప్రయోజనాలు కూడా పెద్దవి. అలాగే, ఉత్తరాదిన ఇటీవల ఎక్కువ చర్చల్లో ఉన్న పథకాలు.. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు, అందులోనూ ఆడపిల్లలకు ఇచ్చే ప్రోత్సాహకాలు లాంటివన్నీ దక్షిణాదిలో రాష్ట్రాల్లో ఏదో రూపంలో ఎప్పటినుంచో ఉన్నవే. విద్యుత్ సబ్సిడీలు సరేసరి.
వీటిని మించి తెలంగాణలో కులాల వారీగా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. తెలంగాణలో గతంలో జరిపిన ఇంటింటి సమగ్ర సర్వేలో మైన్యూట్ లెవల్లో సేకరించిన సామాజిక ఆర్థిక సాంస్కృతిక డేటా ప్రభుత్వం దగ్గర ఉన్నది. దాని ఆధారందా టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తూ ఉన్నది. వ్యక్తిగత వ్యవహార శైలిలో కేసీఆర్ ఫ్యూడల్ కావచ్చేమో కానీ స్ట్రాటజీల్లో ఆయన సైంటిఫిక్ మెథడ్‌నే ఆశ్రయిస్తారు.
అలాగే టీఆర్ఎస్ ఇటీవల ప్రకటించిన దళిత బంధు మీద చాలా ఆశలు పెట్టుకుని ఉంది. పథకం అమలు ఆచరణ సాధ్యమా కాదా అనే విషయమై విమర్శలుండొచ్చు. అది వేరే విషయం.
''ఇన్ని పథకాలు ఏదో రూపంలో అమలవుతున్న చోట టీఆర్ఎస్‌ను ఓడించడం బీజేపీకి అంత సులభం కాదు. ఇప్పటికీ టీఆర్ఎస్ బలమైన పునాది మీద ఉంది. బీజేపీ ఇటీవల సాధించిన విజయాల వెనుక ఆయా క్యాండిడేట్ల వ్యక్తిగత ఇమేజ్, కేసీఆర్ స్వయంకృతాపరాధం ఉన్నాయి. వాటి ఆధారంగా బీజేపీ బలం మీద అంచనాకు రావడం ప్రాక్టికల్ కాదు'' అన్నారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ కుమార్. టీఆర్ఎస్ రాజకీయాలను దగ్గరగా చూస్తున్న పాత్రికేయుడాయన.
హిందుత్వకు మరో రూపమైన భక్తి విషయంలో కేసీఆర్ ఒక అడుగు ముందుంటారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాతో తిరుమల వేంకటేశ్వర ఆలయానికి, బెజవాడ దుర్గ ఆలయానికి కానుకలు సమర్పించినా కూడా రాష్ర్టంలో పెద్దగా విమర్శలు ఎదుర్కోని నాయకుడాయన. అలాగే వేయి కోట్ల ప్రజాధనంతో ఇటీవలే యాదాద్రి ఆలయాన్ని నిర్మించారు. ఒకరకంగా అది తెలంగాణ తిరుమలగా మారుతోంది.
వీటన్నింటిని మించి జాతీయ వాదం విషయంలో ముందుగానే అమర జవాన్ల కుటుంబాలకు, పంజాబ్ రైతు కుటుంబాలకు భారీ సాయం చేసి ఉన్నారు. వ్యూహాలు ఎత్తుగడల విషయంలో సీజన్డ్ పొలిటీషియన్ కేసీఆర్. దానికి తోడు డేటా బేస్డ్, బూత్ బేస్డ్ స్ట్రాటజీల్లో, ఇమేజ్ మేకోవర్లో, అప్రోచ్‌లో దిట్ట అయిన ప్రశాంత్ కిశోర్ ఇపుడాయన పక్కన ఉన్నారు.
ముందస్తు ఎన్నికలు
పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జరిపితే మోదీ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశముందని 2018లో సరిగా అంచనా వేసినట్టే ఈ సారి మరింత ముందస్తుకు వెళ్లే అవకాశముందని ఏబీఎన్ బ్యూరో చీఫ్ నవీన్ కుమార్ అభిప్రాయం. ‘‘ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరిగే అవకాశముంది. పార్లమెంట్ ఎన్నికలను కూడా ముందుకు జరపొచ్చేమోఅని టీఆర్ఎస్‌లో అనుమానాలున్నాయి’’ అని నవీన్ కుమార్ చెబుతున్నారు.
ఈ లెక్కలన్నీ వేసుకుని కేసీఆర్ మరోసారి మరింత ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. ఆంధ్రలో వైసీపీ ఇప్పటికీ బీజేపీ తోపాటే నడుతుస్తున్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీలో వస్తున్న మార్పును చూశాక ఎందుకైనా మంచిదని అక్కడ కూడా ముందస్తుపై చర్చలు సాగుతున్నాయని మరికొందరు పాత్రికేయులు చెబుతున్నారు. తెలుగు నేల పూర్తిగా రాజకీయ ఎన్నికల లెక్కలతో మునిగిపోయి ఉంది. ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
దాదాపు 99 శాతం నాన్ వెజిటేరియన్లయిన తెలంగాణలో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సందర్భంగా పూర్తి శాకాహార భోజనం వడ్డించబోతున్నారు. అది కూడా పూర్తి అథెంటిక్ తెలంగాణ భోజనం అని చెబుతూ.
తెలంగాణలో వస్తున్న మార్పులను ఇక్కడి ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారో ఏమో. ప్రస్తుతానికైతే ‘ఇక సాలు’ అనే మాట అటూ ఇటూ కూడా బలంగా వినిపిస్తోంది. అటు ప్రధాని ఇటు సీఎం ఇద్దరూ రెండో టర్మ్‌లో ఉన్నారు కదా! మరి జనం తెలంగాణ గడ్డమీద ఎటు నిలబడి ఎటువైపు తిరిగి ‘ఇక సాలు’ అంటారనేది చూడాలి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఉడుత ఎక్కితే హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడతాయా? ఐదుగురు సజీవ దహనం వెనుక అసలు కారణాలేంటి?
- ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లు ఎందుకు మార్చారు? హైదరాబాద్ నిజాంకు ఈ పేర్లతో సంబంధం ఏమిటి?
- డేటా సేకరణలో భారత్ చరిత్ర ఏంటి... ఇప్పుడు గణాంకాల వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందా?
- క్రిప్టో కరెన్సీ పేరుతో రూ. 31,000 కోట్లు మోసం చేసిన అమెరికాస్ మోస్ట్ వాంటెడ్ మహిళ
- ఉన్నత చదువులకు ప్రపంచంలోని టాప్-10 'స్టూడెంట్స్ ఫ్రెండ్లీ' నగరాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)