దేశానికి ప్రధానమంత్రిలా కాకుండా తన షావుకారు మిత్రుల కోసం సేల్స్‌మ్యాన్‌లా నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన జలవిహార్‌లో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..మోదీ పాలనలో అంతా తిరోగమనమే అని, ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు.
మోదీ ప్రధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నా.. విదేశాలనుంచి బొగ్గు కొనాలని రాష్ట్రాలకు కేంద్రం హుకుం జారీచేస్తోందని అన్నారు.
మోదీ తీరుతో శ్రీలంకలో ప్రజలు నిరసనలు తెలిపారని గుర్తుచేశారు. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు వహిస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, సామాన్యుడు బతుకలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ అవినీతిరహిత భారత్ అని పెద్దపెద్ద మాటలు చెప్పారని, ఎంత నల్లధనం వెనక్కి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మోదీపాలనలో అవినీతిపరులు పెరిగిపోయారన్నారు. నల్లధనం నియంత్రణ కాదు.. రెట్టింపైంది.. ఇదేనా వికాసం? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ వ్యవస్థలను ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గురించి మాట్లాడుతూ... ‘‘యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వం గల వారు. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించి వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలందించారు. ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవం ఉంది. భారత రాజకీయాల్లో యశ్వంత్‌సిన్హాది కీలకపాత్ర’’ అని అన్నారు.
అనంతరం యశ్వంత్ సిన్హా మాట్లాడారు. దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరమని అన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేరని వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎస్ పార్టీ తనకు సంపూర్ణ మద్దతిస్తున్నందుకుగాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఎంఐఎం కూడా యశ్వంత్‌కు మద్దతు ప్రకటించింది.
తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ఆయన బెంగళూరు బయల్దేరి వెళతారు.
అయితే, యశ్వంత్ సిన్హాకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతిచ్చినప్పటికీ, హైదరాబాదులో మాత్రం కాంగ్రెస్ నాయకులు యశ్వంత్‌ను కలవడం లేదు. టీఆర్ఎస్ ఆహ్వానం మేరకు యశ్వంత్ ఇక్కడకు రావడమే అందుకు కారణం.
యశ్వంత్ నామినేషన్ పత్రాలపై స్వయంగా రేవంత్ రెడ్డి సంతకం చేశారు. అయినప్పటికీ, ఆయన్ను హైదరాబాదులో కలవకూడదని ఆ పార్టీ నిర్ణయించుకుంది.
అయితే ఈ విషయంలో కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆయన్ను కలవాల్సిందని కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి మీడియా ముందు అభిప్రాయపడ్డారు.