Andhra Pradesh: ఉడుత ఎక్కితే హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడతాయా? ఐదుగురు సజీవ దహనం వెనుక అసలు కారణాలేంటి?

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడటంతో ప్రమాదానికి గురై ఐదుగురు మరణించారు.

ఒక ఉడుత కరెంటు పోల్ ఎక్కిందని, దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి హైటెన్షన్ తీగలు తెగిపడ్డాయని అధికారులు చెబుతున్నారు.

నిజంగా కరెంటు తీగలను జంతువులు, పక్షులుగానీ ఛిద్రం చేస్తాయా? ఏదయినా కారణంతో కరెంటు వైర్ తెగిపడితే విద్యుత్ సరఫరా నిలిచిపోయేందుకు అవకాశం ఉండగా సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద జూన్ 30 నాటి ఘటన ఎందుకు జరిగింది? కరెంటు సరఫరా ట్రిప్ చేయాల్సిన బ్రేకర్ల పరిస్థితి ఏమయ్యింది? వంటి విషయాలను బీబీసీ పరిశీలించింది.

తప్పు ఉడుతదేనా?

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఎండీ హెచ్ హరినాథరావు ఓ వీడియో ప్రకటన చేశారు. ప్రమాదంపై దర్యాప్తు సాగుతోందని ఆయన తెలిపారు.

"ఓ ఉడుత కరెంటు పోల్ ఎక్కి వైర్‌ను, క్రాస్ జామ్‌ను షార్ట్ చేయడం వల్ల అటుగా వెళ్తున్న ఆటోపై వైర్ పడింది. అప్పుడు మంటలు చెలరేగి ఆటోలో ఉన్న వారు చనిపోయారు. అనంతపురం ఎస్‌ఈని అక్కడికి పంపించాం. టెక్నికల్ కమిటీ నివేదిక కోసం ఆదేశించాం"అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

మరణించిన వారికి నష్టపరిహారం అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. విజిలెన్స్ కమిటీ కూడా దర్యాప్తు చేస్తుందన్నారు.

ఆ తర్వాత ఘటనా స్థలంలో పోలీస్ అధికారులు, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా ఇదే ప్రకటనను పునరావృతం చేశారు.

"ఆటో మీద మంచం ఉండడం వల్లనే అంత ప్రమాదం జరిగింది. ఉడత రావడం, వైర్ పడడం, ఆటో మీద మంచం ఉండడం ఇవన్నీ కలిపి ప్రమాదానికి కారణమయ్యాయి"అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రభుత్వ వర్గాలు, అధికార పార్టీ నేతలు కూడా నెపం ఉడత మీదకు నెట్టివేసిన తీరుని విపక్షాలు తప్పుబట్టాయి. నాసిరకం తీగలు, నిర్వహణ లోపం వల్ల ప్రమాదం జరిగిందంటూ బాధితుల కోసం ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలు ఆరోపించారు.

సబ్ స్టేషన్ నిర్వహణలో వైఫల్యమే కారణమా?

ఆటోలో ప్రయాణిస్తున్న 13 మందిలో ఐదుగురు చనిపోగా, ఆరుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు. అయితే, ఉడుత వల్ల హైటెన్షన్ కరెంటు తీగలు తెగిపడ్డ సందర్భాలు అరుదు అంటూ విద్యుత్ శాఖలో ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్ అయిన టీవీరావు అభిప్రాయపడ్డారు.

"ఉడుత వల్ల హైటెన్షన్ కేబుళ్లు తెగిపడ్డ సందర్భాలు చూడలేదు. కానీ వైర్లను తీగలుగా విడదీసి సరిచేసే సమయంలో పాములు, ఉడుతలు వంటి వాటి కారణంగా ప్రమాదాలు జరిగాయి. అలాంటప్పుడు వాటిని రిపేర్ చేస్తున్న సిబ్బందికి ముప్పు ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలను నియంత్రించే బ్రేకర్లు ఇటీవల అందుబాటులోకి వచ్చేశాయి. కాబట్టి ప్రమాదాలు చాలా వరకూ నివారించాం. అక్కడ జరిగిన ప్రమాదం సబ్ స్టేషన్ నిర్వహణలో వైఫల్యమే తప్ప కరెంటు స్తంభం మీద కనిపించే ఉడుత అనడం విడ్డూరంగా ఉంది. సమస్యను గుర్తించడం అవసరం"అని ఆయన బీబీసీతో అన్నారు.

అధికారులు, నాయకులు కూడా ఉడుత కారణమని చెప్పిన తీరు చాలా ఆశ్చర్యంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

బ్రేకర్లు ఏమయ్యాయి? ఎందుకు పనిచేయలేదు?

సహజంగా కరెంటు స్తంభాలపై తొండలు, ఉడుతలు ఎక్కడం, తీగల మీద కాకులు, పిచుకలు వంటి పక్షులు కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే కరెంటు సరఫరా నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు.

కరెంటు సరఫరా ట్రిప్ కావడం, ఆ తర్వాత వాటిని సరిచేయడం సహజంగా జరిగే ప్రక్రియ. దాని ప్రకారం చిల్లకొండయ్యపల్లి ప్రమాదంలో ఉడుత కారణంగా తీగ తెగిపోతే కరెంటు సరఫరా నిలిచిపోవాల్సి ఉంది. దాని కోసం ఏర్పాటు చేసిన బ్రేకర్లు పనిచేయాల్సి ఉంది.

బ్రేకర్లు తగిన సంఖ్యలో లేకపోవడం, విద్యుత్ సరఫరా ట్రిప్ కాకపోవడమే అసలు కారణమంటూ ఓ కార్పోరేట్ కంపెనీలో విద్యుత్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎన్ రామ్మోహన్ అభిప్రాయపడుతున్నారు.

''ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే 11 కేవీ సబ్ స్టేషన్‌లో బ్రేకర్లు పనిచేస్తాయి. అక్కడ సమస్య వస్తే 33 కేవీ సబ్ స్టేషన్‌లో బ్రేకర్లు పనిచేయాలి. రెండింట్లో ఎక్కడో ఓ చోట అవి పనిచేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. బ్రేకర్లు ఎందుకు పనిచేయలేదన్నది తేల్చాలి. ఇటీవల బ్రేకర్లు అవసరం మేరకు వాడడం లేదు. మూడు లైన్లకు వేర్వేరుగా బ్రేకర్లు ఉండాల్సిన చోట అందుకు విరుద్ధంగా సాగుతోంది. కొన్ని చోట్ల అసలు బ్రేకర్లు వాడుతున్నారో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అలాంటి సందేహాలు మరింతగా పెరుగుతున్నాయి"అని ఆయన బీబీసీతో అన్నారు.

ఇంట్లో చిన్న సమస్య వచ్చినా పవర్ ట్రిప్ అయ్యేందుకు అనుగుణంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న దశలో రోడ్డు మీద హైటెన్షన్ తీగలకు సమస్య వస్తే ప్రమాద నియంత్రణకు తగిన భద్రతా చర్యలు అవసరం లేదా అంటూ రామ్మోహన్ ప్రశ్నించారు.

నాణ్యతా లోపాలు..

విద్యుత్ సరఫరాలో వినియోగిస్తున్న పరికరాల నాణ్యత మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా హైటెన్షన్ తీగలకు బదులుగా లోటెన్షన్స్ తీగలు వేయడం, ఇన్సులేటర్లు, కండక్టర్లు వంటి వాటి ప్రమాణాలను తగిన రీతిలో పరీక్షించడం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

''రాష్ట్రంలో చాలా చోట్ల ట్రాన్స్ కో వాడుతున్న పరికరాల మీద పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. అయినా డిస్కమ్‌లలో వాటి మీద దృష్టి పెట్టలేదు. ప్రైవేటు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, అధికారులను కూడా ఖాతరు చేయడం లేదు. క్వాలిటీ గురించి విజిలెన్స్ కూడా కరవయింది. చాలామంది సిబ్బంది కూడా సతమతమవుతున్నారు. కొన్ని సార్లు కండక్టర్లు మరీ నాసిరకంగా ఉండడంతో వెనక్కి పంపించేసిన సందర్భాలున్నాయి. ఇప్పటికైనా విద్యుత్ వైర్లు, కండక్టర్లు, ఇన్సులేటర్ల నాణ్యత మీద ప్రత్యేక దృష్టి సారించాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి''అని విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు ఎల్ రాఘవరావు కోరుతున్నారు.

సిబ్బంది కొరత, పని ఒత్తిడి వంటి సమస్యలను తామంతా ఎదుర్కొంటున్నట్టు 1104 సంఘం నాయకుడిగా ఉన్న రాఘవరావు బీబీసీతో అన్నారు. నిబంధనల ప్రకారం కనీసం వెయ్యి లోపు కనెక్షన్లకు ఒక లైన్ మేన్ ఉండాలని, కానీ ప్రస్తుతం ఐదు వేల కనెక్షన్లకు ఒక్కరు చొప్పున అందుబాటులో ఉంటున్నారని అన్నారు.

ఛార్జీల పెంపుదలపైనే ఉన్న శ్రద్ధ నిర్వహణ మీద లేదు - పవన్ కల్యాణ్

రెండు నెలల క్రితం ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. బైక్‌పై వెళుతుండగా కరెంటు తీగ తెగపడి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఇలాంటి ప్రమాదాలపై విచారణ జరపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

"రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఆసక్తి ఉంటుంది. కానీ విద్యుత్ లైన్ల నిర్వహణ మీద శ్రద్ధ కనిపించడం లేదు. ఇంత పెద్ద ప్రమాదానికి కారణాలపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఉడుత పేరుతో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని చూడడం తగదు. బాధితు కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలి. ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి మూలం. నిపుణులతో విచారణ చేయాలి. రాష్ట్రమంతా విద్యుత్ సరఫరాలో ఉన్న లోపాలు సరిచేయాలి"అని ఆయన డిమాండ్ చేశారు.

రిపోర్ట్ ఆధారంగా చర్యలు

విద్యుత్ తీగ తెగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర నారాయణ అన్నారు. ప్రమాదం పట్ల ప్రతిపక్షాల విమర్శలకు అర్థం లేదన్నారు.

"ప్రమాదం జరిగిన వెంటనే విదేశాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. బాధితులకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి వైద్యం అందుతోంది. ప్రమాదానికి కారణాలేమిటన్నది దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమికంగా ఉడత మూలంగానే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఉడత కూడా కరెంటు స్తంభం మీద అందరికీ కనిపించింది. విజిలెన్స్ బృందాలు, ఎస్‌ఈ ఆధ్వర్యంలోని టీమ్ కూడా రిపోర్ట్ ఇస్తుంది. దాని ఆధారంగా తదుపరి చర్యలుంటాయి"అని ఆయన బీబీసీకి వివరించారు.

విద్యుత్ సరఫరాలో ఎక్కడయినా లోపాలు ఉంటే సరిచేసి, ప్రజలకు భరోసా కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఆయన తెలిపారు.

ఏపీ ఎస్పీడీసీఎల్ స్పందన..

ట్రాన్స్ కో నిర్వహణ, డిస్కమ్ చేపట్టిన కార్యక్రమాలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ పరిశీలిస్తున్నామని ఏపీ ఎస్పీడీసీఎల్ సీజీఎం రషీద్ తెలిపారు. తాడిమర్రి మండలంలో ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. విచారణకు నియమించిన అధికారుల బృందం పలు వివరాలు సేకరించింది. బాధిత కుటుంబాలు, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రషీద్ "ఈ ప్రాంతంలో జరిగిన విద్యుత్ శాఖ పనులపై దర్యాప్తు చేస్తున్నాం. అన్ని కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నాం. నాణ్యతను గమనిస్తున్నాం. తుది నివేదికలో వాటి తీరుపై మా బృందం గమనించిన అంశాలను ప్రస్తావిస్తాం. బాధితులకు న్యాయం చేస్తామని" తెలిపారు.

ఉడుతకు పోస్ట్ మార్టమ్

ప్రమాదానికి కారణమని చెబుతున్న ఉడుత చనిపోయిందని, దానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించామని అధికారులు తెలిపారు. తాడిమర్రి మండల పశువైద్యశాఖాధికారుల ఆధ్వర్యంలో ఈ పోస్ట్ మార్టమ్ జరిగింది. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్టు పోలీస్ సీఐ మన్సూరుద్దీన్ బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)