You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Devendra Fadnavis: రెండుసార్లు సీఎం.. ఇప్పుడు డిప్యూటీ సీఎం.. దేవేంద్ర ఫడణవీస్ స్థాయిని బీజేపీ అధిష్ఠానం తగ్గించిందా?
- రచయిత, నీలేశ్ ధోత్రే
- హోదా, బీబీసీ మరాఠీ
మహారాష్ట్రలో రాజకీయ తుపాన్ తీరం చేరింది. గత రెండు వారాలుగా అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలామంది ఊహించినట్లుగానే సాగినా తుది అంకంలో మాత్రం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ శిందే కానీ.. శిందే వర్గంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కానీ సీఎం అవుతారని రాజకీయ పండితులు భావించారు.
అనుకున్నట్లుగానే ఏక్‌నాథ్ శిందేను ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించిన ఫడణవీస్ తాను కొత్త ప్రభుత్వంలో చేరడం లేదని ప్రకటించారు.
అయితే, ఆ తరువాత కొద్దిసేపటికే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్రంలోని బీజేపీ అధిష్ఠానం ఫడణవీస్‌ను ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టాలని సూచించడం, ఆయన శిరసావహించడం జరిగిపోయాయి. సాయంత్రం 7.30 గంటలకు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేసేశారు.
రెండుసార్లు సీఎంగా ఉన్న నాయకుడిని బీజేపీ డిప్యూటీ సీఎం పదవిలో ఎందుకు కూర్చోబెట్టింది? ఫడణవీస్ కూడా అందుకు ఎలా అంగీకరించారన్నవి ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలలో వినిపిస్తున్న ప్రశ్నలు.
ఫడణవీస్ ఏమంటున్నారు?
మరాఠా రాజకీయాల్లోని ఈ మలుపుపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు ఫడణవీస్. దీనిపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.
నిబద్ధత గల కార్యకర్తగా తాను పార్టీ ఆదేశాలను పాటించానని ఫడణవీస్ చెప్పారు.
''పార్టీ కంటే నేను ఉన్నతుడిని కాను. పార్టీ నాకు ఉన్నత స్థానాలిచ్చింది. నిజాయితీ గల కార్యకర్తగా పార్టీ ఆదేశాలను నేను తూచా తప్పకుండా పాటిస్తాను'' అని ఆయన ట్వీట్ చేశారు.
అయితే, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి మూడు గంటల ముందు చేసిన ప్రకటనలో మాత్రం తాను ఏక్‌నాథ్ ప్రభుత్వంలో చేరడం లేదని అన్నారు.
కానీ, కేంద్రంలోని బీజేపీ అధిష్ఠానం మాత్రం ఫడణవీస్ ప్రకటనకు విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది.
ఏక్‌నాథ్ ప్రభుత్వంలో తాను ఏ పదవీ చేపట్టడం లేదని ఫడణవీస్ చెప్పిన కొద్దిసేపటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలోని కొత్త ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉండాలని పార్టీ నిర్ణయించిందని.. ఆ మేరకు దేవేంద్ర ఫడణవీస్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరామని నడ్డా ట్వీట్ చేశారు.
అనంతరం... కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా కూడా నడ్డాను ఉటంకిస్తూ ఇదే విషయం చెప్పారు.
జేపీ నడ్డా సూచన మేరకు దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి చేపట్టాలని నిర్ణయించుకున్నారని.. పార్టీ పట్ల ఆయనకు ఉన్న విధేయతకు ఇది నిదర్శనమని షా అన్నారు.
కాగా... ఈ పరిణామాలన్నిటిపై 'న్యూస్-18' ముంబయి బ్యూరో చీఫ్ వినయ్ దేశ్‌పాండే 'బీబీసీ'తో మాట్లాడారు.
''బీజేపీ వంటి పార్టీలు ఇలా పనిచేయకూడదు. బీజేపీలో నిర్ణయాలన్నీ నాలుగ్గోడల మధ్య జరుగుతాయి. ఆ తరువాత నేతలు బయటకు వచ్చి ప్రకటిస్తారు'' అన్నారాయన.
మరాఠీ దినపత్రిక 'లోక్‌మత్' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీమంత్ మానె మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని దేవేంద్ర ఫడణవీస్‌కు చెప్పడమంటే అది ఆయన స్థాయిని దిగజార్చడమే అన్నారు.
''ఫడణవీస్ రెక్కలు కత్తిరించే ప్రయత్నం ఇది. ముఖ్యమంత్రి పదవి రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు చెప్పి ఫడణవీస్ తన ఇమేజ్ మరింత పెంచుకున్నారు. కానీ, కేంద్ర నాయకత్వం ఇలా చేసింది'' అన్నారు శ్రీమంత్.
మరో సీనియర్ జర్నలిస్ట్ దీపక్ భటూసే 'బీబీసీ మరాఠీ'తో ఈ వ్యవహారంపై మాట్లాడుతూ బీజేపీ కేంద్ర నాయకత్వానికి, దేవేంద్ర ఫడణవీస్‌కు మధ్య సమన్వయం లోపించిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందని అభిప్రాయపడ్డారు.
దేశ ప్రజలకు కూడా ఇలాగే అనిపిస్తుండొచ్చన్నారు.
తాను కొత్త ప్రభుత్వంలో చేరబోవడం లేదని మీడియాకు ఫడణవీస్ అప్పటికే చెప్పగా ఆ తరువాత జేపీ నడ్డా అందుకు విరుద్ధమైన ప్రకటన చేశారని.. ఇదంతా సమన్వయ లోపం ఉందనడానికి నిదర్శనమని అన్నారు.
ఏక్‌నాథ్‌ను సీఎం చేయాలన్న నిర్ణయానికి బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఆమోదం పడినప్పుడే బీజేపీ ఏం చేయాలి? ఫడణవీస్ ఏం చేయాలనేది నిర్ణయించుకోవాల్సిందని.. కేంద్ర నాయకత్వ ఆలోచనలను ఫోన్‌లొ ఫడణవీస్‌కు చెప్పి ఉంటే ఈ గందరగోళం ఉండేది కాదని అన్నారు.
రెండు సార్లు ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి
దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్రకు రెండుసార్లు ముఖ్య మంత్రిగా పనిచేశారు. 2014 అక్టోబరు 31న తొలిసారి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 2019 నవంబరు 12 వరకు అయిదేళ్ల పూర్తి కాలం ఆ కుర్చీలో ఉన్నారు.
మహారాష్ట్రలో తొలి బీజేపీ ముఖ్యమంత్రి ఆయనే.
ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 106 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సొంత మెజారిటీ లేనప్పటికీ దేవేంద్ర ఫడణవీస్‌ను సీఎం చేసింది. దీంతో 2019 నవంబరు 23న ఫడణవీస్ రెండో సారి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ... సొంత మెజారిటీ లేకపోవడం, ఎన్‌సీపీ, శివసేనలతో పొత్తులు విఫలం కావడంతో నాలుగు రోజులకే ఆయన పదవి కోల్పోయారు.
44 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఫడణవీస్ రాజకీయంగా పరిణతి సాధించారని నాగపుర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ 'శ్రీపాద్ అపరాజిత్' బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉదయ్‌పుర్, కరౌలి, జోధ్‌పుర్, అల్వార్.. ఈ రాజస్థాన్ నగరాల్లో ఏం జరుగుతోంది?
- ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వాలు జీవోలను ఎందుకు బయటకు రానివ్వడం లేదు, జగన్మోహన్ రెడ్డి సర్కారు మరింత రహస్యంగా వ్యవహరిస్తోందా?
- ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య పెరగడానికి అసలు కారణాలేంటి?
- ఈ నల్లరేగడి నేల వ్యవసాయానికి పనికిరాదా.. కర్నూలు జిల్లా రైతులపై ఇక్రిశాట్ అథ్యయనంలో ఏం తేలింది?
- విశాఖ సమీపంలో గోల్కొండ నవాబుల గ్రామం 'షేర్ మహమ్మద్ పురం'... బొబ్బిలి సంస్థానానికీ ఈ ఊరికీ ఏమిటి సంబంధం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)