You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
కోవిడ్ వల్ల విధించిన లాక్‍డౌన్లలో జనం బ్యాంకులకు వెళ్లలేక పోయారు. డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ ఎక్కువ కావడంతో ఆన్‍లైన్ బ్యాంకింగ్ బాగా ఊపందుకుంది. దాంతోపాటే ఆన్‍లైన్ బ్యాంకింగ్ మోసాలు కూడా విపరీతంగా పెరిగాయి.
ఈ మోసాల బారిన పడకుండా ఉండటానికి ఆర్బీఐ ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు, బిల్‌బోర్డ్స్ ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేసింది.
ఆన్‍లైన్ బ్యాంకింగ్ విషయంలో జరిగే కొన్ని ఫ్రాడ్స్, వాటి బారిన పడకుండా తీసుకోదగ్గ జాగ్రత్తలేమిటో చూద్దాం.
ఫిషింగ్ (Phishing)
"మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ చెక్ చేసుకోవడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి."
"రూ.25000లకి మీ లోన్ అప్లికేషన్ అప్రూవ్ అయ్యింది. వెంటనే కింది లింక్ క్లిక్ చేస్తే మీకు వడ్డీ రేట్ తక్కువ పడుతుంది."
ఇలాంటి ఈమెయిల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజుల్లో వస్తుంటాయి. బాగా ప్రాచుర్యంలో బ్యాంక్ పేర్లు, లోగోలు, బ్రాండ్ రంగులతో కంటెంట్ ఉంటుంది. కానీ బ్యాంక్ నుంచి వచ్చిన సందేశాలు కావవి.
నిజమైన వెబ్‍సైట్లను పోలినట్లు కొత్త వెబ్‍సైట్లను సృష్టిస్తారు సైబర్ నేరస్థులు. త్వరగా కనిపెట్టలేని చిన్న చిన్న మార్పులతో ఆ వెబ్‍సైట్లు ఉంటాయి కాబట్టి వెంటనే పోల్చుకోవడం కష్టం. పై విధమైన మెసేజీలు పంపించి, వాటిని క్లిక్ చేయగానే ఈ దొంగ వెబ్‍సైట్లను చేరుకునేట్టు చేసి, అక్కడ బ్యాంకింగ్ వివరాలు ఎంటర్ చేయగానే వాటిని నమోదు చేసుకుంటాయి.
ఆపైన వాటిని ఉపయోగించి మనకు ధన నష్టం కలిగిస్తారు క్రిమినల్స్.
"మీరు వెంటనే ఈ నంబర్‍కు కాల్ చేయకపోతే ఇవాళ మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది"- అంటూ కొన్నిసార్లు ఫేక్ ఈమెయిల్ సందేశాలు వస్తాయి. ఆ ఫోన్ నంబర్ అసలు బ్యాంక్‌ది కాక స్కామర్లది అయ్యుంటుంది.
వాళ్లకు కాల్ చేయగానే, మనల్ని కంగారు పెట్టేస్తూ క్రెడిట్ కార్డ్ నెంబర్, సీవీవీ, ఎక్స్‌పైరీ డేట్ వంటి వివరాలు మనచేత చెప్పించేస్తారు. ఆ వివరాలు వాళ్లకు దక్కాక ఇక వాటితో వాళ్లు ఏమైనా చేయచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
వచ్చిన ఈమెయిల్స్/మెసేజుల్లో కంటెంట్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు, లింకులని క్లిక్ చేసుకునే ముందు వాటిని కొంచెం పరిశీలించాలి. ఇలాంటి ఫేక్ మేసేజులు చాలా వరకూ స్పెల్లింగ్ మిస్టేక్స్ తో, గ్రామర్ తప్పిన ఇంగ్లీషులో ఉంటాయని గమనించాలి.
వచ్చిన మెసేజ్ నిజమని ఏ మాత్రం అనుమానమున్నా, అక్కడున్న లింక్ నొక్కకుండా, నేరుగా అసలైన వెబ్‍సైట్‍కే వెళ్ళి కావాల్సిన సమాచారాన్ని సరిచూసుకోవచ్చు.
దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకులు కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఇస్తారు. లాగిన్ అయ్యేటప్పుడు ప్రత్యేకమైన బొమ్మలను గుర్తింపుగా చూపడం ఒకటి. మీ లాగిన్ ఐడి ఇవ్వగానే ఆ ప్రత్యేక బొమ్మ కనిపించకపోతే మీరు అసలైన వెబ్‍సైటులో లేనట్టే. అలానే అదనంగా కొన్ని సెక్యురిటీ ప్రశ్నలు జవాబులు ఉంటాయి. ఇలాంటివన్నీ వాడుకోవడంలో ఎలాంటి అలక్ష్యం తగదు.
విషింగ్ (Vishing)
కొన్నిసార్లు పెద్దపెద్ద వెబ్‍సైట్లు బ్రీచ్ అయ్యాయని వార్తలు వస్తుంటాయి. బ్రీచ్‍ల్లో ముఖ్యంగా వారి కస్టమర్ డేటా స్కామర్ల హస్తగతం అవుతుంది. కొన్నిసార్లు మనం ఆన్‍లైన్‍లో షేర్ చేసే సమాచారాన్ని కూడా వారు సేకరించచ్చు. ఇలా పర్సనల్ డేటా వారి దగ్గర ఉన్నప్పుడు, "మేము ఫలనా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీరు వారి క్రెడిట్ కార్డ్ వాడుతున్నారని మా రికార్డ్స్ చెప్తున్నాయి…" అంటూ కస్టమర్ పేరు, పుట్టిన తేదీ చెప్పి నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తుంటారు. మనం కానీ నమ్ముతున్నామని వారికి అనిపిస్తే వెంటనే కంగారు పెట్టేస్తూ మన నుంచి బ్యాంకింగ్ వివరాలు తీసుకుంటారు.
"ఎవరో మీ క్రెడిట్ కార్డ్ వాడేసి లక్ష రూపాయలు ఖర్చు చేశారని మాకు సమాచారం అందింది. అందుకే కాల్ చేస్తున్నాం" - ఇలాంటి పన్నాగాలతో కూడా వాడుతుంటారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
అపరిచిత నెంబర్ల నుంచే కాల్స్ అటెండ్ చేసేటప్పుడు సావధానంగా ఉండాలి. అవతలి వైపునుంచి భయపెట్టడానికి, కంగారు పెట్టడానికి చూస్తుంటే అదే మొదటి రెడ్ ఫ్లాగ్.
మీ డబ్బులు పోయాయి/మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేస్తాం- ఇలాంటివి చెప్పినప్పుడు, అలా జరిగి ఉండొచ్చన్న అనుమానం ఉంటే, ఆ కాల్ డిస్‍కనెక్ట్ చేసి, మీ బ్యాంక్ డాక్యుమెంట్స్ లో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్‍కి ఫోన్ లేదా దగ్గరున్న బ్రాంచ్‌కి వెళ్ళి కనుక్కోవడం ఉత్తమం.
ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్‍వర్డ్, ఓటీపీ, సీవీవీ, కార్డ్ నెంబర్లు లాంటి వివరాలు పంచుకోకూడదు.
ఆన్‍లైన్ సేల్స్ ఫ్రాడ్
ఈ రకం ఫ్రాడ్‍ని ఎక్కువగా చిరువ్యాపారస్తులు ఎదుర్కొంటుంటారు.
"మీ ప్రోడక్ట్స్ నచ్చాయి. ఫలానావి షిప్ చేయండి. మీ అకౌంట్‍లోకి ముందు ఒక ఐదు రూపాయలు వేస్తాను. ఆ డబ్బులు పడ్డాయంటే అప్పుడు మొత్తం అమౌంట్ వేస్తాను"- ఇలా చెప్పి, ముందా ఐదు రూపాయలు వేస్తారు. దానికి స్క్రీన్ షాట్ కూడా పంపిస్తారు.
కానీ ఆ తర్వాత మొత్తం అమౌంట్ వేయకుండా మొదటి స్క్రీన్ షాట్‍నే ఫోటోషాప్ చేసి పంపిస్తారు. క్యూఆర్ కోడ్లు పంపించి వాటిని స్కాన్ చేసి, ఓటీపీ ఎంటర్ చేస్తే డబ్బులు పడతాయంటారు. నిజానికి అలా చేస్తే డబ్బు రావడం బదులు పోతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కేవలం స్క్రీన్ షాట్లని నమ్మకుండా అకౌంట్‍లో డబ్బు పడినందుకు ఉండే ఇతర ఆధారాలు - అమౌంట్ క్రెడిట్ నోటిఫికేషన్ మెసేజీలు, ట్రాన్సాక్షన్ హిస్టరీ, బాలెన్స్ చెక్ చేసుకోవడం లాంటివి చేశాకే అమౌంట్ పడిందని నిర్ధరించుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలాంటి సున్నితమైన వివరాలను ఇతరులతో పంచుకోకూడదు.
వెరిఫై కాని మొబైల్ యాప్స్
మొబైల్ వాడకం పెరిగాక, డేటా ప్లాన్లు చవక అయ్యాక మొబైల్ బ్యాంకింగ్ ఎక్కువైపోయింది. అయితే, ఫేక్ మొబైల్ యాప్స్ గొడవ కూడా అంతే పెరిగింది.
సాధారణంగా యాప్ స్టోర్లు యాప్‌ల ఒరిజినాలిటీ, సెక్యూరిటీ చెక్ చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అయినాగానీ, వెరిఫై కాని యాప్స్ ఆ స్టోరుల్లో ఉండచ్చు. లేదా, ఫిషింగ్ మెసేజ్‍ల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసేలా చూస్తుంటారు. ఈ రెండు విధానాల వల్ల నకిలీ యాప్స్ మొబైల్ లోకి దిగుమతి అయ్యి మన బ్యాంక్ డీటైల్స్ దొంగలించవచ్చు.
అలానే, కొన్ని బ్యాంకింగ్‌వి కాని నకిలీ యాప్స్ దిగుమతి చేసుకోవడం వల్ల మనం ఏయే యాప్స్ లో ఏయే సమాచారాన్ని టైప్ చేస్తున్నామో పసిగట్టి, వాటి ఉపయోగించి ధన నష్టం కలిగించచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మొబైల్ యాప్స్ ఇన్‍స్టాల్ చేసే ముందు రేటింగ్స్, డౌన్‌లోడ్‌ల సంఖ్య చూసుకోవాలి. అలానే, రివ్యూలు కూడా. వీటివల్ల నకిలీ యాప్స్, అసలు యాప్స్ మధ్య తేడా గమనించవచ్చు. పేరున్న ఏ బ్యాంకింగ్ సంస్థ యాప్‍కి అయినా లక్షల సంఖ్యలో వినియోగదారులు ఉంటారు. కాబట్టి డౌన్‌లోడ్లు, రివ్యూలు ఎక్కువగా ఉండే అవకాశమే ఎక్కువ.
లింకుల ద్వారా, అటాచ్‍మెంట్ల ద్వారా వచ్చిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోకూడదు. ఎప్పుడన్నా సరే, ఆండ్రాయిడ్ ఫోన్ అయితే గూగుల్ యాప్‌స్టోర్ నుంచి, ఐఫోన్లు అయితే ఆపిల్ స్టోర్ నుంచే దిగుమతి చేసుకోవాలి.
ఇన్‍స్టాల్ చేసుకున్న యాప్స్ ని ఎప్పటికప్పుడు అప్‍డేట్ చేసుకుంటూ ఉండాలి. పాత వర్షన్ ఆప్స్‌లో ఉన్న సెక్యూరిటీ లొసుగులను వాడుకుంటూ స్కామర్లు కొంత ట్రిక్కులు చేస్తుంటారు. అందుకని అప్‍డేట్ల విషయంలో అలక్ష్యం కూడదు.
స్క్రీన్ షేరింగ్/ రిమోట్ ఆక్సెస్ యాప్స్
పెద్దవారు, టెక్నాలజీ సంగతులు అంతగా తెలీనివారికి ఏవన్నా ఫోన్ వాడకంలో అనుమానాలు, సమస్యలు ఉంటే, స్క్రీన్ షేర్ చేయమని, లేదా మొబైల్/లాప్‍టాప్ కి యాక్సెస్ ఇచ్చే సాఫ్ట్‌వేర్ ఇన్‍స్టాల్ చేయమని అడుగుతుంటారు క్రిమినల్స్. నమ్మి ఇచ్చాక, డివైస్‌లో ఉన్న వివరాలను సేకరించి హాని కలిగిస్తుంటారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- డివైస్‌ని మొత్తంగా వేరేవాళ్లకి ఇచ్చి వదిలేయడం కానీ, ఇలాంటి రిమోట్ యాక్సెస్ యాప్స్ గానీ ఇవ్వకూడదు. ఏదన్నా మేజర్ రిపేర్ వచ్చి ఇవ్వాల్సి వచ్చినప్పుడు బ్యాంకింగ్ యాప్స్ అన్-ఇన్‍స్టాల్ చేసి, బ్రౌజరులో పాస్‍వర్డ్ అన్నీ క్లీన్ చేసిన తర్వాతే ఇవ్వాలి. అప్పుడు సున్నిత వివరాలు బయటవారికి అందకుండా ఉంటాయి.
సిమ్ స్వాప్/ క్లోనింగ్
బ్యాంక్ అకౌంట్ వాడే మొబైల్ నెంబరుకే డూప్లికేట్ సిమ్ తయారుచేసి దాన్ని వాడుతుంటారు స్కామర్లు. నెంబర్ అదే కాబట్టి ఓటీపీలు అవీ వాళ్లకి కూడా అందుతాయి. మామూలుగా, ఇలాంటి సిమ్ తీసుకోడానికి కావాల్సిన పర్సనల్ సమాచారమంతా ముందుగా కలెక్ట్ చేస్తారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పేరు, ఆధార్ / పాస్‍పోర్ట్ లాంటి వివరాలు, ఇంటి అడ్రస్, ఇవేవీ ఎప్పుడూ అపరిచితులకు ఫోనుల్లో అందించకూడదు. వెరిఫికేషన్ కాల్స్ లో కూడా మనల్ని ఒకటి చెప్పమని, ఇంకోటి వాళ్లు చెప్పి కన్‍ఫర్మ్ చేయమంటారు. అన్ని విషయాలు మనల్నే అడుగుతుంటే అనుమానించాల్సిందే.
నెలా నెలా బ్యాంక్ వారు పంపే బాలెన్స్ షీట్ కోసం ఎదురుచూడకుండా, ఎప్పటికప్పుడు బ్యాంక్ బాలెన్స్, ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం చేయని ట్రాన్సాక్షన్‍కి ఓటీపీలు అవీ వస్తుంటే వెంటనే బ్యాంక్ వారికి సమాచారాన్ని అందించాలి.
సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్
ఈ మధ్యకాలంలో ఫేస్‍బుక్ లాంటి మాధ్యమాల్లో ఈ ఫేక్ ప్రొఫైల్స్ బెడద ఎక్కువైపోయింది. ఒక వ్యక్తి అకౌంటులోని ఫొటోలు, పేరు తదితర వివరాలతో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, కొంతమంది స్నేహితులని జత చేసి, ఆపైన "ఫలానా ఇబ్బందిలో ఉన్నాను, అర్జెంటుగా డబ్బులు వేయండి" అని మెసేజ్‌లు పంపిస్తున్నారు.
తమ స్నేహితులే ఇబ్బందుల్లో ఉన్నారనుకుని డబ్బులు వేసినవారికి నష్టం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఎప్పుడూ అడగనివారు డబ్బులు అడిగారంటే అనుమానించాల్సిన విషయమే. ఒకవేళ నిజంగానే అవసరంలో ఉన్నారనిపిస్తే, ఫేస్‍బుక్ కాకుండా మరే ఇతర మాధ్యమం (ఈమెయిల్, ఫోన్) ద్వారా వారి సంప్రదించి, వివరాలు నిర్ధరించుకుని అప్పుడే డబ్బులు ఇవ్వవచ్చు.
ఇలాంటి ఫేక్ అకౌంట్లలో స్నేహితుల సంఖ్య, మ్యూచువల్ ఫ్రెండ్స్ సంఖ్య, ఫొటోలు, పోస్టులు లాంటివన్నీ పరిశీలిస్తే అవి కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్లని తెలిసిపోతాయి. డబ్బులు వేసే ముందు ఇవ్వన్నీ గమనించుకోవాలి.
ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త పన్నాగాలతో, కొత్త ట్రిక్కులతో మోసం చేయడానికి చూస్తుంటారు. అందుకని ఆన్‍లైన్ బ్యాంకింగ్ ఇచ్చే సౌలభ్యాన్ని వాడుకుంటూనే, తగిన జాగ్రత్తలూ తీసుకోవాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆ కాల్ కట్ చేసి, నేరుగా బ్యాంక్‌నే సంప్రదించాలి.
పొరపాటున వాళ్ల వలలో పడితే, వెనువెంటనే అటు బ్యాంక్‌కి, ఇటు సైబర్ సెల్‍కి జరిగిన సంగతి వీలైనన్ని వివరాలతో సహా చెప్పాలి. జాప్యం చేయకుండా చెప్పడం వల్ల వాళ్లు కూడా తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. చాలాసార్లు పోయిన డబ్బుని రికవర్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- నూరేళ్ళు జీవించేందుకు ఫార్ములా ఉందా?
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)