You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టీఆర్ఎస్, బీజేపీ: ఎవరు కొంటున్నారో, ఎవరు అమ్ముడుపోతున్నారో - తెలంగాణ ఫిరాయింపుల్లో మునుగోడు చాప్టర్
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
మునుగోడు ఉపఎన్నిక అంటే ఫిరాయింపులు, ముక్క, చుక్కల మూడు ముక్కలాట. ఏ పేపరు తిరిగేసినా, నియోజవర్గంలో ఏ నలుగురు కలసి మాట్లాడుకున్నా ఈ మూడుముక్కలాట గురించే.
ఈ మూడింటిలో ఫిరాయింపులకు మాత్రం అన్నింటి కంటే ప్రత్యేకత ఉంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫిరాయింపు అనే మాట తెలంగాణ రాజకీయాలకు పర్యాయపదంగా మారింది.
రాజకీయ ఫిరాయింపులు దేశంలో, అందునా తెలుగు రాష్ట్రాలలో కొత్తేమీ కాదు. సందర్భాన్ని బట్టి ప్రభుత్వాన్ని కూల్చడానికో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకో ఫిరాయింపులు జరిగిన ఉదంతాలున్నాయి.
టంగుటూరి ప్రకాశం పంతులే ఆద్యుడు
1953లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు ఫిరాయింపుతోనే జరిగిందని ఫిరాయింపుల మీద అధ్యయనం చేసిన ప్రొఫెసర్ పరస్ దీవాన్ అభిప్రాయపడ్డారు. 1953లో కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్ పార్టీ టంగుటూరి ప్రకాశాన్ని ఆహ్వానించింది.
ఆయన ప్రజాసోషలిస్టు పార్టీ (పీఎస్‌పీ) లో ఉండేవారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ దీవాన్ 1979లోనే రాశారు.
1948-67 మధ్య కాలమంతా ఫిరాయింపుల కాలమే. ఆ రోజుల్లో ప్రజాసోషలిస్టు పార్టీ చాలా చోట్ల కాంగ్రెస్‌కు పోటీగానో, మిత్రపక్షంగానో ఉంటూ వచ్చింది.
ప్రకాశంలాగే పీఎస్‌పీ నుంచి కాంగ్రెస్‌లోకి దూకిన మరొక ప్రముఖుడు కేరళ ముఖ్యమంత్రి థానూ పిళ్లై. ఆ రోజులలో కూడా ఫిరాయింపులు లేని రాష్ట్రంలేదు.
1957-67 మధ్య కాంగ్రెస్ నుంచి 97 మంది బయటకు ఫిరాయిస్తే, 419 మంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు.
ఒక్క 1967-68 సంవత్సరంలోనే 175 మంది కాంగ్రెస్ నుంచి బయటకు దూకితే, 139 మంది కాంగ్రెస్ లోకి ఫిరాయించారు.
ఇదే దశాబ్దం మొత్తంగా తీసుకుంటే 93 మంది పీఎస్‌పీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయిస్తే, 11 మంది ఈ పార్టీలో మారారని ప్రొఫెసర్ దీవాన్ రాశారు.
ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేసేందుకు..
అయితే, ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు ఫిరాయింపులను ఒక నిరంతర వ్యూహంగా మార్చుకోవడం అనేది తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్) వినూత్న ప్రయోగమన్న విమర్శ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తూ ఉంటుంది.
2014 ఎన్నికల్లో మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటినుంచి తిరుగులేని శక్తి గా మారేందుకు టీఆర్ఎస్ నిరంతరం వాడుతూ వస్తున్న ఆయుధం ఇది.
2020 దాకా ఫిరాయింపులనేవి కేవలం ప్రముఖంగా టీఆర్ఎస్‌లోకి మాత్రమే జరిగేవి. అపుడు కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్నట్లు ఎవరికీ అనిపించలేదు. అందువల్ల ఫిరాయింపుదారుల ఏకైక గమ్యస్థానం టీఆర్ఎస్ మాత్రమే.
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాక పరిస్థితి మారింది. జీహెచ్‌ఎంసీ , హుజూరాబాద్ ఎన్నికల తర్వాత బీజేపీ మరింత స్పష్టంగా కనిపించడం జరిగింది.
దీనితో పార్టీలు మారాలనుకునే వారికి బీజేపీ మరొక గమ్యం అయింది. ఈ విషయంలో కాంగ్రెస్ వెనకబడింది.
ఇలా 2014లో మొదలయిన ఫిరాయింపులు మునుగోడు ఉప ఎన్నికల నాటికి వికార రూపం తీసుకున్నాయి. పంచాయతీ వార్డ్ మెంబర్ నుంచి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల దాకా ఫిరాయింపు వార్తలకెక్కని నాయకుల పేర్లు తక్కువ.
పొద్దున ఒక పార్టీలోకి దూకి సాయంకాలానికి మరొక పార్టీలో తేలినవారూ ఉన్నారు. ఇక పార్టీ మారబోతున్నారని ఊహాగానాలకెక్కిన పేర్లకు లెక్కే లేదు.
పార్టీ అధినేత, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు తప్ప ఫిరాయింపుల అనుమానం ముద్ర పడని నేత తెలంగాణలో లేరనే చెప్పాలి. ఎవరైనా, ఎపుడైనాపార్టీ మారవచ్చు అనేది జనాభిప్రాయం. ఒక ఉప ఎన్నిక చుట్టూ ఇంత భారీగా ఫిరాయింపులు జరగడమే వింత.
మునుగోడు నియోజకవర్గంలో మొదట పిరాయింపులు గుంభనంగా గ్రామ మండలస్థాయిలో జరుగుతూ ఉండేవి. కార్లు, రూ. లక్షలు కానుగా ఇచ్చి సర్పంచులను, ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేస్తున్నారనే వార్త మీడియాలో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వచ్చింది.
భువనగిరి మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ మీద రుసరుసలాడుతూ బీజేపీ ఫిరాయించడంతో ఇది పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది.
బూర నర్సయ్య గౌడ్ దెబ్బతో
నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ నుంచి మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే, టీఆర్ఎస్.. గతంలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ఈ సారి ఎంపిక చేసింది. దీంతో నర్సయ్య గౌడ్ కు ఆగ్రహం వచ్చింది. పార్టీలో బీసీలకు గౌరవం లేదని తాను అవమానాలు పడుతూ వస్తున్నానని ఒక లేఖ రాస్తూ టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు.
మునుగోడులో గౌడ్ కుల ఓటర్లు 17 శాతం దాకా ఉన్నట్లు చెబుతారు. ఈ నేపథ్యంలో బాగా పేరున్న గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, బీసీ మేధావి అయిన నర్సయ్య గౌడ్ వెళ్లిపోవడం గౌడ్ ఓట్ల మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
అందువల్ల టీఆర్ఎస్ వెంటనే రంగంలోకి దిగి కనిపించిన గౌడ్ నేతలందరికి గాలం వేయడం మొదలుపెట్టింది. జర్నలిస్టుగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన పల్లె రవి గౌడ్‌ని, ఆయన భార్యను కాంగ్రెస్ నుంచి మొదట టీఆర్ఎస్‌లోకి లాగేసుకున్నారు.
పల్లె రవి భార్య చండూరులో మండల పరిషత్ సభ్యురాలు. రవి గతంలో టీఆర్ఎస్‌లోనే ఉండి తర్వాత, బీసీలకు న్యాయం జరగడంలేదని నిస్పృహ వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ లోకి వచ్చారు.
ఆయన మళ్లీ టీఆర్ఎస్‌లోకి లాక్కోవడం బూరనర్సయ్య గౌడ్ వెళ్లిపోయిన లోటు పూరించలేదు.
నర్సయ్య ఇమేజ్, పల్లె రవి గౌడ్ ప్రొఫైల్ మ్యాచ్ కావు. అందువల్ల దాదాపు సమ ఉజ్జీలయిన గౌడ్ నేతలు కావాలి. దీంతో టీఆర్ఎస్ గౌడ్ కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యేల మీద కన్నేసింది.
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్‌ను టీఆర్ఎస్ తీసుకుంది. బిక్షమయ్య గౌడ్ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా, తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు.
బీజేపీ బలపడుతూ ఉన్న సూచనలు కనిపించగానే ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఇపుడు మళ్లీ టీఆర్ఎస్‌లోకి వచ్చారు.
ఇలాగే ఇపుడు టీఆర్ఎస్ కు తిరిగొచ్చిన మరొక గౌడ్ నాయకుడు కె.స్వామిగౌడ్. ఉద్యోగ సంఘాల నాయకుడయిన స్వామిగౌడ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాకా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయ్యారు. ఆపైన కౌన్సిల్ చైర్మన్ అయ్యారు. తర్వాత బీసీలకు టీఆర్ఎస్ లో గౌరవం లేదని ఆరోపిస్తూ ఆయనకూడా పార్టీ వదిలేసి బీజేపీలో చేరారు.
మునుగోడు ప్రచారం మధ్యలో మళ్లీ టీఆర్ఎస్‌లోకి వచ్చారు. ఈ ముగ్గురు కాకుండా టీఆర్ఎస్‌లో చేరిన మరొక బీసీ బీజేపీ నాయకుడు ప్రొఫెసర్ శ్రవణ్ దాసోజు (విశ్వబ్రాహ్మణ). ఆయన బీజేపీ మజిలీ మూణ్నెల్ల ముచ్చటే అయ్యింది.
నిజానికి దాసోజు కూడా గతంలో టీఆర్ఎస్‌తో రాజకీయ ప్రయాణం చేశారు. అక్కడ ఆయనకు ప్రమోషన్ లేకపోవడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడా భవిష్యత్తు కనిపించకపోవడంతో ఆయన మొన్న ఆగస్టులో బీజేపీలో చేరారు. అక్కడి నుంచి మళ్లీ టీఆర్ఎస్ గూటికే చేరుకున్నారు.
టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన నేతలంతా చెప్పినదేంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలను పట్టించుకోవడంలేదని, బీసీలకు టీఆర్ఎస్‌లో గౌరవంలేదని, వారిని అవమానిస్తున్నారని. ఇపుడు మళ్లీ టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు పాడుతున్న పాట కూడా అదే : "బీసీలకు అన్యాయం, బీసీ నేతలకు అవమానం."
బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్‌లోకి ఫిరాయిస్తారని, టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ బీజేపీలోకి వస్తారని మీడియాలో ఒక రోజంతా వినిపించింది. తాము పార్టీ మారడం లేదని తర్వాత ఈ నేతలు ప్రకటన చేయాల్సి వచ్చింది. అంతెందుకు, ఈటెల రాజేందర్ కూడా బీజేపీ వదిలేస్తారని వదంతి. ఈ సందట్లో కొంతమంది నేతలు కాంగ్రెస్‌లో చేరినా అదేమంత సంచలనం సృష్టించడం లేదు. కాంగ్రెస్ ప్రచార యుద్ధంలో వెనకబడిందనే చెప్పక తప్పదు.
ఈ ఫిరాయింపుల గురించి ప్రస్తావించినపుడు సంస్థాన్ నారాయణపూర్‌కు చెందిన ఒక టీచర్ ఇలా వ్యాఖ్యానించారు: "ఇపుడు పార్టీల అధ్యక్షులు, కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్లంతా పార్టీ మారరన్న గ్యారంటీ లేదు. ఇపుడు టీఆర్ఎస్‌లో ఉన్నా, కాంగ్రెస్‌లో ఉన్నా, బీజేపీలో ఉన్నా...రేపు ఎక్కడుంటారో వాళ్లు కూడా చెప్పలేరు" అన్నారు.
ముక్క, చుక్క, నోటు నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించేందుకు పార్టీలాడుతన్న నాటకమే ఈ ఫిరాయింపు అని చుండూరుకు చెందిన ఒక బేకరీ యాజమాని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఫిరాయింపుల మీద డాక్టరేట్
ఫిరాయింపులతో తెలంగాణకు జాతీయ స్థాయిలో అపకీర్తి వచ్చింది. 2014 -2018 మధ్య తెలంగాణ రాష్ట్ర సమితి అనుసరించిన ఫిరాయింపు వ్యూహం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ వంటి పార్టీలు పూర్తిగా అసెంబ్లీ నుంచి మాయమయ్యాయి.
కాంగ్రెస్ ఈ దెబ్బతో మంచాన పడింది. కమ్యూనిస్టులను కూడా ఫిరాయింపు కత్తి వదల్లేదు. అందుకే తెలంగాణ ఫిరాయింపులు దేశమంతా చర్చకొచ్చాయి. ఇది ఎంత దాకా వెళ్లిందంటే, స్వామి రామానంద తీర్థ మరాట్వాడా విశ్వవిద్యాలయంలో ఒకరు పీహెచ్‌డీ చేసేటంతటి సబ్జక్టు అయిపోయింది ఈ వ్యవహారం.
తెలంగాణలో ఎందుకింతగా ఫిరాయింపులు జరుగుతున్నాయి, వాటి వెనక ఉన్న రాజకీయమేమిటి, పోరాడి తెచ్చుకున్న ఒక రాష్ట్రంలో రాజకీయ సంస్కృతి ఎందుకు దిగజారిందనే దాని మీద అక్కడి రాజనీతి శాస్త్ర విభాగానికి చెందిన కమల్ కిశోర్ పవార్ పీహెచ్‌డీ చేశారు.
ఆయన పరిశోధన పత్రం 'Politics of Defections: A Case Study of Telangana'కు 2019లో డాక్టరేట్ ప్రదానం చేశారు. దీని బట్టి తెలంగాణ ఫిరాయింపులు ఏ మేరకు దేశంలో చర్చనీయమయ్యాయో అర్థమవుతుంది.
తెలంగాణలో ఫిరాయింపులు ఎందుకు ఊపందుకున్నాయి?
1969నుంచి 2014లో దాకా పోరాడి, అనేక మంది బలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో ఒక నూతనోద్యాయం మొదలుకావాలి. రాజకీయాలలో కూడా కొత్త సంస్కృతి మొదలవ్వాలి. కానీ, అలా జరిగినట్లు కనిపించదు.
2014లో ఎన్నికల్లో అసెంబ్లీలో ఉన్న 119స్థానాలలో రెండో దశ ఉద్యమానికినాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితికి (తెరాస) 63 సీట్లు వచ్చాయి. మంచి ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటయింది. ప్రభుత్వానికివచ్చిన ముప్పే మీ లేదు. అయితే, అనుకోని భూకంపం రాజకీయాలలో వచ్చింది.
కాంగ్రెస్, తెలుగుదేశం, బీఎస్పీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, సీపీఐ సభ్యులు ఒక్కరొక్కరే తమ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరడం మొదలయింది.
అది కూడా వినూత్నమయిన తరహాలో. లెజిస్లేచర్ పార్టీ చీలిపోవడం, తమ వర్గానికి గుర్తింపు నివ్వాలని స్పీకర్ ని కోరడం, తర్వాత తమ వర్గాన్ని తెలంగాణ శాసనసభా పక్షంలో విలీనం చేయడం. ఈ వ్యూహంతో మొదట తెలంగాణ అసెంబ్లీనుంచి తెలుగుదేశం మాయమయింది.
తెలుగుదేశం ఫిరాయింపులలో చోద్యం ఎర్రబెల్లి దయాకర్ రావు ఫిరాయింపు. తమ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన వారి మీద ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని ఒక దశలో ఫిర్యాదు చేసిన దయాకర్ రావు ఏకంగా తానే ఫిరాయించడం విశేషం.
తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్, బీఎస్పీలు మాయమయ్యాయి. ఇలా ఫిరాయింపులతో అనేక మంది శాసన సభ్యులు చేరడం వల్ల 2018లో ముందస్తు ఎన్నికలకు పోయేనాటికి టీఆర్ఎస్ బలగం 63 నుంచి 90 కి చేరింది.
2018లో అఖండ విజయం సాధించాకా టీఆర్ఎస్ ఫిరాయింపుల విధానం కూడా కొనసాగుతూనే వచ్చింది. ఎమ్మెల్యేలే కాకుండా మాజీలు కూడా టీఆర్ఎస్ గూటికి చేరుకోవడం మొదలయింది.
ఫిరాయింపులు ఎందుకు మొదలయ్యాయి?
ఒక వీరోచిత ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడంతో, ఆ పార్టీ చాలా కాలం స్థిరంగా పరిపాలిస్తుందని, మిగతా పార్టీలకు భవిష్యత్తుండదనే అభద్రతా భావం కలగడమే 2014లో పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరగడానికి కారణమని ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర మాజీ ఆచార్యులు ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.
"ఏదైనా ఒక రాజకీయ పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని, సుదీర్ఘకాలిక ప్రభుత్వాన్ని అందిస్తున్న భరోసా ఇచ్చినపుడు అది ఇతర పార్టీలలోని నాయకులను సమ్మోహనపరుస్తుంది. అంతేకాదు, బలమైన అధికార పార్టీలో చేరడం వల్ల రాజకీయ, సాంఘిక, అర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ కారణాల వల్లే టీఆర్ఎస్ పార్టీ అందరికీ ఆకర్షణీయంగా, బలంగా, వాంఛనీయమైన పార్టీగా కనిపించింది. అప్పటి ఫిరాయింపులకు కారణం ఇదే" అని ప్రొఫెసర్ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.
టీఆర్ఎస్‌కు ఈ ఆకర్షణ 2020లో దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలుపొందేదాకా కొనసాగింది.
ఈ ఎన్నికతో బీజేపీ ఒక శక్తి కాబోతున్నదనే అనుమానం వచ్చింది. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్ల్ రెండో స్థానంలో నిలవడం, ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించటంతో బీజేపీ రాష్ట్రంలోకి వచ్చేసిందనే నమ్మకం బలపడింది.
నిజానికి దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిగా గెలిచిన రఘునందన్ రావు కూడా ఈటెల లాగానే టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారే. ఈ రెండు ఎన్నికల తర్వత కాంగ్రెస్ తో పాటు, ఇతర పార్టీలలో ఉన్నవారికి ఒక ప్రత్యామ్నాయం కనిపించింది.
ఇలాగే టీఆర్‌ఎస్ లో ఉంటూ బయటికి రాలేకపోతున్న వారికి కూడా బీజేపీ ప్రత్యామ్నాయమవుతూ వచ్చింది. ఇలాంటపుడే న్యాయవాది రచనా రెడ్డి చేరిక బీజేపీకి కొత్త ఆకర్షణ తెచ్చింది.
కేసీఆర్‌కు బద్ధ వ్యతిరేకిగా మారిన టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వరెడ్డి బీజేపీలో చేరడం మరొక కీలక పరిణామం.
వీటితో తెలంగాణలో బీజేపీ వచ్చేస్తున్నదన్న ధీమా బాగా ప్రబలింది.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంవత్సరాల సస్పెన్స్ కు తెరతీస్తు బీజేపీలో చేరడం, అసెంబ్లీకి రాజీనామా చేసి మునుగోడు ఎన్నిక తీసుకురావడం ఈ వరసలో వచ్చిన పరిణామమే.
మొత్తానికి టీఆర్‌ఎస్ తెలంగాణలో ఒక ప్రత్యామ్నయం ఉందన్న భరోసా రాజకీయ ఆశావహులలో కలిగించడంలో బీజేపీ విజయవంతమైంది.
ఇలాంటపుడు బూర నర్సయ్య గౌడ్ కూడా బీజేపీలో చేరడంతో టీఆర్‌ఎస్ ఆశ్చర్యపోయింది. ఎదురు దాడి చేయకతప్పలేదు. దీని ఫలితమే తాజాగా బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి సాగిన వలసలు.
ఈ క్రమంలోనే రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు.
నిజానికి ఆయన కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయినా, బీసీలకు న్యాయం జరగడం లేదని చెప్పి బీజేపీలో చేరారు. ఇపుడు అదే కారణం చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు.
గత రెండేళ్లలో అనూహ్యంగా బలపడిన భారతీయ జనతా పార్టీ వెనకబడిన వర్గాల నేతల్లో కొత్త ఆశలు చిగురింప చేసిందని కేసీఆర్ తొలి ప్రభుత్వంలో వెనకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గా పనిచేసిన బీసీ మేధావి బి.ఎస్. రాములు అభిప్రాయపడ్డారు.
బీజేపీ ఇప్పుడు బీసీ నేతల గమ్య స్థానమా
"ఈటెల రాజేందర్ చేరిక తర్వాత బీసీ నేతలు బీజేపీలో చేరే పోకడ మొదయింది. ఇతర పార్టీలలో సరైన ప్రోత్సాహం అందుకోలేకపోతున్న బీసీ నేతలందరికి బీజేపీ కొత్త గమ్యస్థానంగా మారింది. ఇపుడు బీజేపీలో కనిపిస్తున్న నేతలు డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటెల రాజేందర్ వంటి వారంతా బీసీ నేతలే. ఇపుడు డా.బూర నర్సయ్య గౌడ్ ని బీజేపీ అక్కున చేర్చుకోవడం ఒక మంచి పరిణామం," అని రాములు వ్యాఖ్యానించారు.
ఒకపుడు ఫిరాయింపులు కేవలం టీఆర్‌ఎస్‌లోకే జరిగేవి. ఇపుడు బీజేపీ కూడా సమ ఉజ్జీ అయింది.
12మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఆ మధ్య పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు.
ఇదెంతవరకు నిజమో తెలియదు గాని, నవంబర్ 6, 2022న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడగానే విపరీతంగా నేతలు ఫిరాయిస్తారని సర్వత్రా పరిశీలకులు భావిస్తున్నారు.
ఏ పార్టీలోకి ఈ ఫిరాయింపులు జరుగుతాయనేది ఒక పెద్ద సస్పెన్స్. ఈలోగానే మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ బయటకు వచ్చింది. అసలు ‘ఎవరు కొంటున్నారో ? ఎవరు అమ్ముడుపోతున్నారో?’
ఇవి కూడా చదవండి:
- రిషి సునక్‌ను అభినందించడం, సోనియా గాంధీని వ్యతిరేకించడం.. బీజేపీ ద్వంద్వ వైఖరి కాదా?
- అశ్లీల చాటింగ్‌ల వెనుక రహస్య సంధానకర్తలు..‘మీతో మాట్లాడేది మోడలా, మూడో మనిషా?’
- పరోటాకు, రోటీకి, వేర్వేరు జీఎస్టీ ఎందుకు, పార్లర్ ఐస్‌క్రీమ్‌కు, హోటల్ ఐస్‌క్రీమ్‌కు తేడా ఏంటి?
- కరెన్సీ నోట్ల మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించడం సాధ్యమేనా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఏమంటున్నారు
- ‘‘నేను గర్భవతిని, వానొస్తే గుడిసెలోకి నీళ్లొస్తాయి. పాములు తేళ్లు కూడా లోపలికి వస్తుంటాయి.''-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)