You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: అమిత్ షా బూట్లు బండి సంజయ్ తెచ్చిచ్చిన వీడియోపై ప్రత్యర్థులు ఏమన్నారు? బండి సంజయ్ ఏమని బదులిచ్చారు...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బూట్లను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెచ్చి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆగస్టు 21న తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఈ ఘటన జరిగింది.
ఈ వీడియో తెలంగాణలో రాజకీయంగా వాగ్వాదాలకు, విమర్శలు ప్రతి విమర్శలకు దారి తీసింది.
అమిత్ షా పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహరించిన తీరును కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
మహంకాళి ఆలయంలోకి వెళ్లిన అమిత్ షా, బయటకు వస్తుండగా, బండి సంజయ్ పరుగుపరుగున వెళ్లి బూట్లను తీసుకొచ్చి అమిత్ షా ముందు పెట్టారు.
దీనిపై స్పందిస్తూ ''దిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను రాష్ట్రం గమనిస్తోంది'' అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇటు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. అమిత్ షా బూట్లను బండి సంజయ్ పట్టుకోవడంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తీవ్ర విమర్శలు చేశారు.
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని సంజయ్ తన దిల్లీ బాసుల ముందు తాకట్టు పెట్టారని ఠాగూర్ విమర్శించారు.
ఈ విమర్శలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పందించారు. పెద్ద వాళ్లకు చిన్నవాళ్లు చెప్పులు అందించడం గులాంగిరీ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడమనే భారతీయతను పాటించడం తమకు అలవాటని ఆయన అన్నారు.
"పాదరక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తాం.. మీలా అవసరం తీరాక పాదాలు పట్టి లాగేసే అలవాటు మాకు లేదు. మేం గులాములం కాదు - మీలా మజ్లిస్‌కు సలాం కొట్టే రజాకార్ల వారసులం అసలే కాదు'' అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.
అధికారం కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారని, ఆ వ్యవహారాలు బయటపడకుండా ప్రజలను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని సంజయ్ విమర్శించారు.
రామ- భరతుల వారసత్వాన్ని తాము తలకెత్తుకున్నామని సంజయ్ అన్నారు. తండ్రిని బంధించి,అన్నను చంపి అధికారం పొందిన ఔరంగజేబు వారసుల పక్కన తిరిగే మీకు, మా సంస్కృతి ఏం అర్థమవుతుందని బండి సంజయ్ తన ట్వీట్‌లో విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
- ఆఫ్రికా చీతాలను తెచ్చి భారత్‌లో సింహాల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారా
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)