You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేటీఆర్: 'మోదీజీ మీరు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే ఏమన్నారో ఓసారి గుర్తు చేసుకోండి'
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ట్విటర్ వేదికగా అన్నారు.
పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు రాష్ట్రాల మీద భారాన్ని మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
‘అప్పుడు అలా... ఇప్పుడు ఇలా..
ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పెట్రోలు ధరలపై నాటి యూపీఏ సర్కారును విమర్శిస్తూ చేసిన ట్వీట్లను కేటీఆర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
'పెట్రోలు ధరల భారీ పెంపు అనేది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ ప్రధాన వైఫల్యం. దీంతో గుజరాత్ మీద వందల కోట్ల భారం పడుతోంది' అంటూ 2012 మే 23న నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఆ తరువాత ప్రధాని అయ్యాక 2014 అక్టోబరు 4న నరేంద్ర మోదీ మరొక ట్వీట్ చేశారు.
'మా ప్రభుత్వం వచ్చాక పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. మన దేశానికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు మేం కట్టుబడి ఉన్నాం' అని ఆ ట్వీట్‌లో మోదీ రాశారు.
నరేంద్ర మోదీ చేసిన పాత ట్వీట్లను పోస్ట్ చేసిన కేటీఆర్, పెట్రోల ధరల పెంపు అనేది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు.
పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం వల్ల రాష్ట్రాల మీద చాలా భారం పడుతోందని తెలిపారు. పేదలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
'డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు డబుల్ చేయడం... కార్పొరేట్ సంస్థల సంపదను డబుల్ చేయడం’ అంటూ @KeerthiRachana అనే ట్విటర్ హ్యాండిల్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
‘మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’
ఇక పెట్రోలు, డీజిల్ ధరల పెంపును దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధరల పెంపును వ్యతిరేకిస్తూ విజయ్ చౌక్ వద్ద నిరసన చేపట్టారు.
పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్రం వేల కోట్ల రూపాయలు సంపాదిస్తోందని ఆయన విమర్శించారు.
'గత 10 రోజుల్లో 9సార్లు పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచింది. పెరిగిన ధరలతో మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పోరాడుతుంది. పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడాన్ని వెంటనే ఆపాలి' అని రాహుల్ గాంధీ అన్నారు.
ధరల పెరుగుదలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నియంత్రించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతవరకు తాము దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతామని తెలిపారు.
పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదో రోజూ పెరిగాయి. లీటరుకు రూపాయికి చొప్పున ధరలు పెంచారు.
ఉత్తర్‌ప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇటీవలే వచ్చాయి. ఆ తరువాత నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
అయితే యుక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయని, అందువల్ల పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచాల్సి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెబుతున్నారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు.
ఇవి కూడా చూడండి:
- కుమ్రం భీము: ఈ ఆదివాసీల దేవుడ్ని నిజాం పోలీసులు నేరుగా ఎదుర్కోలేక వెనక నుంచి వెళ్లి చంపారు
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ జగన్ మద్యం అమ్మకాలపై ఎప్పుడేమన్నారు?
- నాణ్యమైన కాఫీ కోసం ఎంతైనా ఖర్చు పెడతామంటున్న భారతీయులు..
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)