You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా?
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘బెంగళూరులో ఉంటున్న తెలుగు కుటుంబానికి చెందిన స్వాతి(పేరు మార్చాం) స్పెయిన్ లో ఎంబీబీఎస్ చదవాలనుకున్నారు.
దిల్లీలోని యాక్సిస్ కన్సల్టెన్సీని సంప్రదించారు.
దాదాపు ఆరు నెలల తర్వాత స్పెయిన్ లోని యూనివర్సిటీలో అడ్మిషన్ లెటర్ ఇచ్చారు.
అడ్మిషన్ లెటర్ విషయమై స్వాతి తండ్రి యూనివర్సిటీకి మెయిల్ పెట్టారు.
అడ్మిషన్ లెటర్‌తో తమకు సంబంధం లేదని యూనివర్సిటీ రిప్లై ఇచ్చింది. దానిపై ఉన్న డీన్ సంతకం సైతం ఫోర్జరీ అని చెప్పింది.
అనుమానంతో అడ్మిషన్ లెటర్ చూడగా ఫోటోషాప్‌లో చేసినట్లుగా ఉందని తెలిసింది.
అప్పటికే స్వాతి తండ్రి యూనివర్సిటీ అడ్మిషన్ ఫీజు, కన్సల్టెన్సీ ఖర్చులు, వీసా తదితరాలకు కలిపి నాలుగు లక్షలు కట్టారు.
దీనిపై స్వాతి తండ్రి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని నిలదీశారు.
ఈ విషయంలో తాము మోసపోయామని ఏమీ తెలియనట్లు కన్సల్టెన్సీ నిర్వాహకులు బుకాయించారు.
‘‘కన్సల్టెన్సీ నిర్వాహకులను సంప్రదించి నిలదీశాం. కానీ డబ్బులు వెనక్కి ఇవ్వలేదు.
మేం డబ్బులు కట్టిన అకౌంట్ కూడా యూనివర్సిటీ అకౌంట్ కాదని తేలింది.
అటు ఆర్థికంగా నష్టపోయాం. మా అమ్మాయి ఏడాది నష్టపోయింది’’ అని స్వాతి తండ్రి బీబీసీకి చెప్పారు.
‘‘దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సువర్ణ(పేరు మార్చాం) యూకేలో మాస్టర్స్ చేయాలనుకుంది.
కొత్తపేటలోని కన్సల్టెన్సీని సంప్రదించింది. యూకే పంపించేందుకు అన్ని ఖర్చులు కలిపి రూ.1.50లక్షలు చెల్లించాలని నిర్వాహకులు చెప్పారు.
తర్వాత లండన్ లోని యూనివర్సిటీ పేరుతో అడ్మిషన్ లెటర్ పంపించారు.
అయితే, అడ్మిషన్ లెటర్ తో ఆమె లండన్ వెళ్లింది. కన్సల్టెన్సీతో తమకు ఉన్న అగ్రిమెంట్ ముగిసిందని యూనివర్సిటీ చెప్పింది.
అయినప్పటికీ కన్సల్టెన్సీ నిర్వాహకులు లెటర్లు జారీ చేస్తున్నారని యూనివర్సిటీ నిర్వాహకులు చెప్పారు.
అప్పటికే లండన్ వచ్చినందున తమకు అడ్మిషన్ ఫీజులు మళ్లీ చెల్లిస్తే సీటు ఇస్తామని యూనివర్సిటీ ఆఫర్ ఇచ్చింది.
చేసేది లేక మళ్లీ ఫీజులు కట్టి సువర్ణ అక్కడ అడ్మిషన్ తీసుకుంది.
ఆమె తల్లిదండ్రులు కన్సల్టెన్సీని సంప్రదించగా.. చివరికి లక్షా 20 వేలు తిరిగి ఇచ్చారు.
విదేశాలకు విద్యార్థులను పంపించే విషయంలో కొన్ని కన్సల్టెన్సీలు చేస్తున్న మోసాలకు ఈ రెండు ఉదాహరణలు మాత్రమే.
2022లో విదేశాలకు 7.5 లక్షల మంది
కేంద్ర విద్యా శాఖ గణాంకాల ప్రకారం 2022 సంవత్సరంలో ఉన్నత చదువుల కోసం భారత్ నుంచి 7.50 లక్షల మంది విదేశాలకు వెళ్లారు.
వేరొక దేశానికి వెళ్లి చదువుకుంటే నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు. పైగా తక్కువ ఖర్చులోనే చదువు పూర్తవుతుంది. ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా రకరకాల కారణాలతో విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది.
ఇదే సమయంలో విదేశీ యూనివర్సిటీలు, కాలేజీల్లో సీట్లు పొందేందుకు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలను ఆశ్రయించి మోసపోతున్నారు.
విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందాలు ఉన్నాయని బురిడీ కొట్టించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నిలువునా ముంచుతున్నారు.
నకిలీ అడ్మిషన్ లెటర్లు చేతిలో పెడుతున్నారు. దీన్ని నమ్మి లక్షల రూపాయలు చెల్లించి విద్యార్థులు నష్టపోతున్నారు.
విదేశీ యూనివర్సిటీలతో కాంట్రాక్టులు
విదేశీ యూనివర్సిటీ లేదా కాలేజీల్లో సీట్లు తీసుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు.
దీనిపై జేఎన్టీయూ నానో సైన్స్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు బీబీసీతో మాట్లాడారు. ఆయన యూఎస్ లో పోస్ట్ డాక్టోరల్ పరిశోధన చేసి వచ్చారు.
‘‘కన్సల్టెన్సీలను సంప్రదించమని నేను సలహా ఇవ్వను. నేరుగా దరఖాస్తు చేసుకుంటే మంచిది.
సాధారణంగా అక్కడి యూనివర్సిటీల దరఖాస్తులు కాస్త భిన్నంగా ఉంటాయి.
విద్యార్థి ప్రాథమిక వివరాలు అడగడంతోపాటు ఎందుకు కోర్సు చేయాలనుకుంటున్నావు. ఇక్కడే ఎందుకు చేరాలనుకుంటున్నావు. ఇలా ప్రశ్నలు ఉంటాయి.
ప్రొఫెసర్ల నుంచి రికమండేషన్ లెటర్లు ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకులే అనుకుని విద్యార్థులు కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నారు’’ అని వెంకటేశ్వరరావు చెప్పారు.
కన్సల్టెన్సీలతో ఒప్పందాలు ఉన్నాయా?
యూనివర్సిటీతో కన్సల్టెన్సీకి కాంట్రాక్టు లేదా కోఆపరేషన్ అగ్రిమెంట్ ఉందా? అన్న కోణంలో తనిఖీ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా పెద్ద యూనివర్సిటీలకు పంపించేప్పుడు నేరుగా అడ్మిషన్ లెటర్లు కన్సల్టెన్సీలు జారీ చేయవు.
కేవలం విద్యార్థుల డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయడానికే పరిమితం అవుతాయని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన జోష్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వాహకులు వేణుగోపాల్ రెడ్డి.
ఈ విషయంపై ఆయన బీబీసీతో మాట్లాడారు..
‘‘సాధారణంగా ఓవర్సీస్ కన్సల్టెన్సీలకు ప్రత్యేకంగా పోర్టల్ ఉంటుంది. అందులో ఆ యూనివర్సిటీ ఉంటే విద్యార్థుల డాక్యుమెంట్లు అప్ లోడ్ చేస్తాం. అక్కడి నుంచే అడ్మిషన్ లెటర్ వస్తుంది. ఈ విషయంలో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రమేయం ఉండదు’’ అని చెప్పారు.
అప్లికేషన్ ప్రాసెస్ కోసమే ఎక్కువగా కన్సల్టెన్సీలు ఉంటాయి.
స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, రికమండేషన్ లెటర్.. ఇలా అప్లికేషన్ స్థాయిలో వివిధ దశలపై విద్యార్థులకు అవగాహన ఉండదు.
ఇలాంటి దశలో విద్యార్థులు కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తుంటారని యుక్రెయిన్ లో ఎంబీబీఎస్ చేసి వచ్చిన విద్యార్థి షాహీన్ బీబీసీతో చెప్పారు.
కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు తీసుకుని..
విదేశీ యూనివర్సిటీలతో భారత్‌లో ఉన్న కన్సల్టెన్సీలు కాంట్రాక్టులు తీసుకుంటున్నాయి.
వీరు వేరొక ఏజెన్సీలకు సబ్ కాంట్రాక్టులు ఇస్తుంటారు. వీరికి నేరుగా అనుసంధానం ఉండదు. 90శాతం సబ్ ఏజెన్సీలే ఉంటాయని కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ కాంట్రాక్టు సాధారణంగా ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి జారీ చేస్తుంటారు. దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. లేకపోతే యూనివర్సిటీ అడ్మిషన్ పొందే వీలుండదు. మెడికల్ విద్య విషయానికి వస్తే ఐదేళ్ల కాలానికి కాంట్రాక్టులు ఉంటాయని హైదరాబాద్ లోని అపెక్స్ కన్సల్టెన్సీ నిర్వాహకులు హెచ్ ఎం ప్రసాద్ బీబీసీతో అన్నారు.
కాంట్రాక్టుల గడువు ముగిసినా, లేదా కాంట్రాక్టులు లేకున్నా ఉన్నట్లుగా నమ్మబలికి విద్యార్థులను విదేశాలకు పంపిస్తామని మోసాలు చేస్తుంటారు.
ఇవీ తనిఖీ చేసుకోవాలి..
విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు కన్సల్టెన్సీలను ఆశ్రయించే ముందు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలని చెబుతున్నారు హైదరాబాద్ కు చెందిన అపెక్స్ కన్సల్టెన్సీ నిర్వాహకులు హెచ్ ఎం ప్రసాద్.
ఆ సూచనలు ఈ విధంగా ఉన్నాయి.
- ‘‘కన్సల్టెన్సీ నిజమైన సేవలు అందిస్తుంటే రిఫరెన్స్ బుక్స్ నిర్వహిస్తుంటాయి.
- అప్పుడు వారి సాయంతో విదేశాలకు పంపించిన 50 నుంచి 100 మంది విద్యార్థుల రిఫరెన్స్ నంబర్లు, అడ్రసులు అడగాలి.
- అందులో మనకు ఇష్టమైన నంబర్లుకు ఫోన్ చేసి కన్సల్టెన్సీ నిజాయితీని తెలుసుకోవచ్చు.
- విదేశాల్లో పరిస్థితిని తెలుసుకునే వీలుంటుంది.
- ఒకవేళ మోసం చేయాలనుకునేవారు రిఫరెన్స్ ఇవ్వరు లేదా కేవలం నలుగురైదురు రిఫరెన్సులే ఇస్తారు.
- అలా ఇస్తే అనుమానించాలి. ఎందుకంటే కేవలం నలుగురి రిఫరెన్సులే అంటే వారి ఆఫీసులోని వారివే కావొచ్చు.
- చిన్న యూనివర్సిటీలకు వారం రోజులు లేదా గరిష్ఠంగా నెల రోజుల్లోపు అడ్మిషన్ పూర్తవుతుంది.
- అలా కాకుండా ఎక్కువ కాలం జాప్యం చేస్తుంటే అనుమానించాలి’’ అని చెబుతున్నారు హెచ్ఎం ప్రసాద్.
- యూనివర్సిటీ నుంచి తీసుకున్న కాంట్రాక్టు అడిగి పరిశీలించుకోవాలి.
- కన్సల్టెన్సీకి కాంట్రాక్టు ఉందా..? కో ఆపరేషన్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా.. చూసుకోవాలి.
- అడ్మిషన్ పూర్తి కాకుండా పూర్తి ఫీజు చెల్లించమని పదే పదే అడుగుతున్నారంటే అనుమానించాల్సిందే.
- విదేశీ యూనివర్సిటీలు, కాలేజీలకు సంబంధించి పూర్తి వివరాలు అందించేలా కన్సల్టెన్సీ ఉందా లేదా చూసుకోవాలి. కొందరు యూనివర్సిటీ వివరాలు కూడా చెప్పలేరు.
- కన్సల్టెన్సీలకు డబ్బులు చెల్లిస్తే కచ్చితంగా విద్యార్థి పేరుతో రసీదులు తీసుకోవాలి.
- అడ్మిషన్ లెటర్లు ఇచ్చిన వెంటనే సంబంధిత యూనివర్సిటీకి మెయిల్ చేసి నిజమా.. కాదా తనిఖీ చేసుకోవాలి. ప్రస్తుతం విదేశీ యూనివర్సిటీలు దాదాపుగా మెయిల్స్ కు స్పందిస్తుంటాయి.
కన్సల్టెన్సీలకు అనుమతులుంటాయా?
ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ తెరవాలంటే ఎవరి నుంచి అనుమతి తీసుకోవాలి..? ఈ ప్రశ్నకు ఎక్కడా సమాధానం లభించడం లేదు.
ఎందుకంటే ప్రత్యేకంగా అనుమతులు తీసుకునే అవసరం లేదని కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
ట్రేడ్ లైసెన్సు తీసుకుని నిర్వహిస్తున్నారు.
కొన్నిసార్లు అది కూడా ఉండదు.
‘‘ఇది లైజనింగ్ జాబ్ కావడంతో ప్రత్యేకంగా పర్మిషన్లు ఉండవు. ఏ ప్రభుత్వ విభాగం కిందకు రావు.
దీనివల్ల ఎవరైనా కన్సల్టెన్సీ తెరిచే అవకాశం ఉంది. అందుకే ఎవరైనా కన్సల్టెన్సీలు ప్రారంభిస్తుంటారు.’’ అని చెప్పారు హెచ్ఎం ప్రసాద్.
ఇటీవల కెనడాలోని 700 మంది భారతీయ విద్యార్థుల విషయంలో వివాదం నడుస్తోంది.
పంజాబ్ నుంచి కెనడాకు 700 మంది నకిలీ పత్రాలతో వెళ్లారన్న అభియోగాలతో విద్యార్థులను వెనక్కి పంపించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే లండన్ లో కేరళకు చెందిన విద్యార్థులను కేర్ హోమ్స్ లో నియమించుకుని వెట్టి చాకిరి చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కేరళ ప్రభుత్వం ఈ మార్చిలో స్పందించింది.
రాష్ర్టంలో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలకు లైసెన్సులు, నిర్దేశిత ఫీజలు నిర్ణయించేలా చట్టం చేయాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.
ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీల విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది.
కమిటీ నివేదిక ఆధారంగా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలకు లైసెన్సులు జారీ చేయనున్నట్లు మార్చిలో కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్. బిందు ప్రకటించారు.
ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలకు లైసెన్సుల జారీ విషయం ఒక్క కేరళలోనే పరిశీలనలో ఉంది.
విదేశాలకు వెళ్లే విద్యార్థులు 68శాతం పెరుగుదల
గతేడాది 7,50,365 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లారు.
ఇది 2021 సంవత్సరంతో పోల్చితే ఏకంగా 68శాతం ఎక్కువగా ఉందని హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది.
ఈ మేరకు గత ఫిబ్రవరిలో ఎంపీలు రాజీవ్ రంజన్ సింగ్, సంతోష్ కుమార్, దినేష్ చంద్ర యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పిన లెక్కల ప్రకారం ఏటా విదేశాలకు వెళుతున్న విద్యార్థుల సంఖ్య ఈ కింది విధంగా ఉంది..
సంవత్సరం విద్యార్థుల సంఖ్య
2017 4,54,009
2018 5,17,998
2019 5,86,337
2020 2,59,655
2021 4,44,553
2022 7,50,365
నాలుగు దేశాలకు అధికం
భారత్ నుంచి నాలుగు దేశాలకు అధికంగా విద్యార్థులు వెళుతున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ లెక్కలు చెబుతున్నాయని ఎకనమిక్ టైమ్స్ మార్చిలో ఓ కథనం ప్రచురించింది.
దీని ప్రకారం భారత్ నుంచి అధికంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు ఎక్కువగా విద్యార్థులు వెళుతున్నారు.
వీరిలో డిగ్రీ, మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సులు చేసే విద్యార్థులున్నారు.
అలాగే ఎంబీబీఎస్ చేసేందుకు చైనా, ఉజ్బెకిస్థాన్, ఫిలీప్పీన్స్, రష్యా, ఐర్లాండ్ కిర్గిస్థాన్, కజకిస్థాన్ వంటి దేశాలను ఎంచుకుంటున్నారు.
ఏటా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున మోసాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి:
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఫ్రాన్స్: తప్పుడు ప్రకటనలతో ఫాలోయర్లను నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లు, ఎలా అడ్డుకట్ట వేశారంటే....
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)