సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా, భారత్ సంబంధాలు దెబ్బతింటున్నాయా?

    • రచయిత, నదీన్ యూసిఫ్
    • హోదా, బీబీపీ న్యూస్, టొరంటో

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో పోయిన నెల్లో ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ హత్య జరిగిన తర్వాత సిక్కు వేర్పాటువాదులు, భారత ప్రభుత్వం మధ్య ఉద్రిక్తత పెరిగిన దృశ్యాలు చాలా దేశాల్లో కనిపించాయి.

సర్రేలోని గురుద్వారా పార్కింగ్ స్పేస్‌లో ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు నిజ్జర్‌పై కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆయన ట్రక్కులో కూర్చుని ఉన్నారు.

నిజ్జర్‌ను ఎవరు హత్య చేశారో ఇప్పటివరకు తెలియనప్పటికీ, కెనడా సహా చాలా దేశాల్లో ఈ హత్యపై ఖలిస్తానీ మద్దతుదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

నిజ్జర్ హత్యకు వ్యతిరేకంగా టొరంటో, కెనడా, లండన్, మెల్‌బోర్న్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో ఖలిస్తానీ మద్దతుదారులు నిరసనలు తెలుపుతున్నారు.

నిరసనకారులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వమే నిజ్జర్‌ను హత్య చేయించి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.

45 ఏళ్ల నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్తానీ వివాదం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

భారత్‌లో సిక్కుల జనాభా 2 శాతం. తమకు ప్రత్యేక దేశం ‘ఖలిస్తాన్’ కావాలని సిక్కు వేర్పాటువాదులు డిమాండ్ చేస్తున్నారు.

టార్గెట్ చేసి చంపేశారా?

ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్ 1980లలో ఊపందుకుంది. అది హింసాత్మక దాడులు, అనేక మంది మరణాలకు దారితీసింది. అయితే, ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఆ ఉద్యమం దాదాపు ముగింపు దశకు చేరుకుంది.

కొన్నేళ్లుగా కెనడా, ఇంగ్లండ్, అమెరికా వంటి దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు ప్రత్యేక ఖలిస్తాన్ కోసం డిమాండ్ చేస్తున్నారు. అది ఇటీవల కాలంలో ఊపందుకుంది.

ఖలిస్తాన్ ఉద్యమాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పంజాబ్‌ సహా దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హింస, వేర్పాటువాదాన్ని ఖండిస్తున్నాయి.

బ్రిటిష్ కొలంబియాలో నివసిస్తున్న నిజ్జర్, ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్‌‌ ప్రధాన మద్దతుదారుల్లో ఒకరు. ఖలిస్తాన్ కోసం డిమాండ్ చేయడం వల్లే నిజ్జర్‌కు బెదిరింపులు వచ్చాయని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

అయితే ఆయన తీవ్రవాద, వేర్పాటువాద గ్రూపు‌కు నాయకత్వం వహిస్తున్నారని భారత్ చెబుతోంది. భారత్ చేస్తున్న ఈ ఆరోపణలు నిరాధారమని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

నిజ్జర్ హత్యకు కారణాలు ఇంకా తెలియలేదని కెనడా పోలీసులు చెప్పారు. ఈ హత్య కేసుతో సంబంధముందని అనుమానిస్తూ అరెస్టులు కూడా జరగలేదు. కానీ ఇదొక 'టార్గెటెడ్ కిల్లింగ్' అని వారు చెబుతున్నారు.

నిజ్జర్ హత్యకు వ్యతిరేకంగా టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ బయట జులై 8న వందల మంది నిరసనకు దిగారు.

అదే సమయంలో భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపే బృందం జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ నిరసనకారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది.

ఖలిస్తానీ మద్దతుదారులు, భారత ప్రభుత్వ మద్దతుదారులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కొద్దిగంటల పాటు నినాదాలు చేశారు.

బ్యారికేడ్ దాటి దూసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఒక ఖలిస్తానీ మద్దతుదారుడిని పోలీసులు అరెస్టు చేశారు.

భారత్ అసంతృప్తి

ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులు ప్రదర్శించిన పోస్టర్లపై ''కిల్ ఇండియా'' అని రాసి ఉంది. వాటిలో భారత్ దౌత్యవేత్తలను ''కిల్లర్స్'' (హంతకులు)గా పేర్కొన్నారు.

పోస్టర్లు, వాటిపై రాసిన బెదిరింపులపై అసంతృప్తికి గురైన భారత ప్రభుత్వం కెనడా రాయబారికి సమన్లు పంపి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ఇటీవల కొన్ని దశాబ్దాలుగా ఖలిస్తాన్ ఉద్యమం అంతగా లేదని ప్రపంచ సిక్కు సంస్థ అధికార ప్రతినిధి బల్‌ప్రీత్ సింగ్ చెప్పారు. మరీ ముఖ్యంగా 1980లలో జరిగిన హింస గురించి తెలియని యువతలో అలాంటి ధోరణి ఉందన్నారు.

ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారు?

ఖలిస్తాన్ ఉద్యమాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో, ప్రత్యేక దేశం డిమాండ్‌ను విడిచిపెట్టారనే అభిప్రాయం పంజాబ్‌ ప్రజల్లో ఏర్పడిందని బ్రిటిష్ కొలంబియాకు చెందిన జర్నలిస్ట్ గురుప్రీత్ సింగ్ అన్నారు. ఆయన నిజ్జర్‌ను గతంలో ఇంటర్వ్యూ చేశారు.

''కెనడాలో మనం చూస్తున్న సిక్కు ఆందోళనకారులు ఖలిస్తాన్‌కు మద్దతుదారులు'' అని ఆయన అన్నారు.

ఇటీవల హత్యకు గురైన ప్రముఖ సిక్కు నాయకుల్లో మూడోవారు నిజ్జర్.

మరో నాయకుడు అవతార్ సింగ్ ఖండా ఈ ఏడాది జూన్‌లో బ్రిటన్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.

ఆయన్ను ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్‌గా చెబుతుంటారు. ఆయనపై విషప్రయోగం చేసి ఉంటారనే అనుమానాలున్నాయి.

అలాగే, భారత ప్రభుత్వం తీవ్రవాదిగా ప్రకటించిన పరమ్‌జీత్ సింగ్ పంజ్వాడ్‌ను లాహోర్‌లో కాల్చి చంపేశారు.

నిజ్జర్‌‌కు కూడా తరచూ బెదిరింపులు వచ్చేవని ప్రపంచ సిక్కు సంస్థ అధికార ప్రతినిధి బల్‌ప్రీత్ సింగ్ చెప్పారు.

తనను హత్య చేయొచ్చని ఆయన కెనడా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం కూడా ఇచ్చారని ఆయన అన్నారు.

గత సెప్టెంబర్‌లో ఖలిస్తాన్‌‌కు మద్దతుగా సర్రేలో రెఫరెండం నిర్వహించాలని నిజ్జర్ భావించారని సింగ్ చెప్పారు. ఇది గ్లోబల్ రెఫరెండం సిరీస్ కింద జరగాల్సి ఉందన్నారు.

నిరుడు ఒంటారియోలోని బ్రాంప్టన్ నగరంలో ఇలాంటి రెఫరెండం నిర్వహించారు. అక్కడ సుమారు 16 వేల మంది సిక్కులు నివసిస్తున్నారు.

భారత్ ఏమంటోంది?

సుమారు లక్ష మంది గుమిగూడారని, అయితే దాని పర్యవసనం ఎలా ఉంటుందో ఇంకా తెలియదని బల్‌ప్రీత్ సింగ్ అన్నారు. అయితే, భారత్ ప్రభుత్వం మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

''భారత్ దీనిని ఒక తీవ్రవాద ఉద్యమంగా పరిగణిస్తున్నట్లు చెప్పడం షాక్‌కు గురిచేసింది'' అని ఆయన అన్నారు.

రెఫరెండం ప్రస్తావన తర్వాత, కెనడాలో భారత్‌పై ద్వేషపూరిత నేరాలు, వేర్పాటువాద హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయని భారత విదేశీ వ్యవహారాలశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, నిజ్జర్ ఎలాంటి రెఫరెండమూ నిర్వహించలేదు.

ఖలిస్తాన్ ఉద్యమం, నిజ్జర్ మరణంపై భారత్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కెనడాలోని సిక్కు సంస్థల మధ్య శత్రుత్వం వల్లే నిజ్జర్ హత్య జరిగిందని కొందరు భారతీయులు అభిప్రాయపడుతున్నారు.

గత మార్చిలో కెనడాలోని హిందూ దేవాలయాలను ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారని, ఒటావాలోని భారత హైకమిషన్‌పై దాడి చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

అయితే, ఖలిస్తాన్ మద్దతుదారులు, సిక్కులపై వ్యతిరేక భావం కలిగేలా భారత ప్రభుత్వమే తన మీడియా సంస్థల ద్వారా అలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయించిందని సిక్కులు, కెనడాకు చెందిన కొందరు జాతీయ భద్రతా రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలను భారత్ ఖండించింది.

తమ అంతర్గత వ్యవహారాల్లో భారత్ అతిగా జోక్యం చేసుకుంటోందని కెనడా ప్రధానమంత్రి జాతీయ భద్రతా సలహాదారు ఆరోపించారు.

కెనడాలో సిక్కుల వేర్పాటువాదం పెరుగుతుండడం భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని భారత్ చెబుతోంది.

ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం

ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కెనడా, భారత్ మధ్య చాలా ఏళ్లుగా దౌత్య, వాణిజ్యపరంగా మెరుగైన సంబంధాలున్నాయి. ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం దిశగా ముందుకు సాగుతున్నాయి.

అయితే, ఇటీవల జరిగిన పరిణామాలు ఇరుదేశాల వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయో ఇంకా తెలియలేదు.

భారత్ జోక్యంపై కెనడా కఠిన వైఖరి అవలంబిస్తుందని బల్‌ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. వాళ్లు ప్రధానంగా సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు.

అలాగే, ఖలిస్తాన్ మద్దతుదారులు తమ భావాలను బహిరంగంగా వ్యక్తం చేసేందుకు కెనడా సరైన వేదికను అందించాలని ఆయన అన్నారు.

నిజ్జర్ మరణం తర్వాత కూడా సిక్కు సమాజంలో ఎలాంటి భయం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

''ఇక్కడ ఖలిస్తాన్ గురించి మాట్లాడొద్దని మాకు ఎవరూ చెప్పడం లేదు. మా సార్వభౌమాధికారం గురించి మాట్లాడకూడదని మీరు చెబితే, మేము దానికి విరుద్ధంగా వ్యవహరిస్తాం'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి: