‘యూరప్ సరైన దిశలో వెళ్లడం లేదు.. గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఒక్కటే కాపాడగలదు’: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ట్రంప్

షెడ్యూల్ కంటే కొన్ని గంటలు ఆలస్యంగా దావోస్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో యూరప్ దేశాలపై విమర్శలు గుప్పించారు.

‘యూరప్ సరైన దిశలో ముందుకు వెళ్లడం లేదు. నేటి యూరప్‌ను నేను గుర్తించలేకపోతున్నా. నాకు యూరప్ అంటే ఇష్టం, అది బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా, కానీ అది సరైన మార్గంలో లేదు’ అని ట్రంప్ అన్నారు.

"నేను ఎవరినీ అవమానించాలనుకోవడం లేదు" అని చెప్పిన ట్రంప్.. ‘మన కళ్లముందే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు నాశనం అవుతున్నాయి, కానీ నాయకులు దీనిపై ఏమీ చేయడం లేదు’ అని ట్రంప్ అన్నారు.

"నా ప్రణాళికల వల్ల మాంద్యం, తీవ్రమైన ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని నిపుణులు అన్నారు.. కానీ వారు చెప్పింది తప్పు అని నిరూపించాం" అని ఆయన అన్నారు.

గత రెండు శతాబ్దాలుగా అమెరికా అధ్యక్షులు గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

గ్రీన్‌లాండ్‌లో డెన్మార్క్‌కు సంబంధించిన పేరు గానీ, గుర్తు గానీ కనిపించదని, అలాగే డెన్మార్క్ గ్రీన్‌లాండ్‌పై చాలా తక్కువ ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు.

‘ఆ భూభాగాన్ని అమెరికా మాత్రమే రక్షించగలదు’ అని ఆయన అన్నారు.

"ఈ ప్రసంగంలో గ్రీన్‌లాండ్ విషయాన్ని ప్రస్తావించకుండా ఉండాలని నేను అనుకున్నాను. కానీ అలా చేస్తే నాపై ప్రతికూల వ్యాఖ్యలు వచ్చేవి" అని ఆయన అన్నారు.

గ్రీన్‌లాండ్, డెన్మార్క్ ప్రజలను తాను గౌరవిస్తానని ట్రంప్ అన్నారు.

ట్రంప్ కొత్త వాదన

గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఎందుకు స్వాధీనం చేసుకోవాలి అనే అంశంపై డొనల్డ్ ట్రంప్ దావోస్‌లో ముందు తన వాదనను వినిపించారని బీబీసీ ప్రతినిధి ఆంథోనీ జర్చర్ చెప్పారు.

జాతీయ భద్రత సమస్యలు, గ్రీన్‌లాండ్‌కు ఉన్న భౌగోళిక స్థానం వంటి ఆయన వాదనలు గురించి ఇప్పటికే తెలుసని.. అయితే, ఈసారి.. డెన్మార్క్‌పై జర్మనీ దాడి చేసిన తర్వాత గ్రీన్‌లాండ్ రక్షణలో అమెరికా కీలక పాత్ర పోషించిందని, అందువల్ల ఆ ద్వీపంపై అమెరికాకు నియంత్రణ ఉండేదని, హక్కు కూడా ఏర్పడుతుందన్నది ట్రంప్ కొత్త వాదన అని ఆయన అన్నారు.

"గ్రీన్‌లాండ్ ఒకప్పుడు మా వద్దే ఉంది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మేం దీన్ని డెన్మార్క్‌కు తిరిగి ఇచ్చేశాం" అని ట్రంప్ తన ప్రసంగంలో అన్నారు. అమెరికా " గ్రీన్‌లాండ్‌ను తన వద్దే ఉంచుకోవాల్సింది" అని ట్రంప్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)