ట్రంప్ ‘గ్రీన్‌లాండ్ ఆక్రమణ’ ప్రయత్నాలు అమెరికాకు, యూరప్ దేశాలకు మధ్య దూరాన్ని పెంచుతోందా?

గ్రీన్‌‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఎనిమిది మిత్రదేశాలపై కొత్త సుంకాలు విధిస్తానని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని యూరోపియన్ నాయకులు ఖండించారు.

బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ‘ఈ నిర్ణయం సరికాదు’ అని వ్యాఖ్యానించగా, ‘ఇది ఆమోదయోగ్యం కాదు’ అని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ అన్నారు.

ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్‌లపై 10 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది 25 శాతానికి పెరిగే అవకాశం ఉందని, ఒప్పందం కుదిరే వరకు కొనసాగుతుందని ఆయన అన్నారు.

డెన్మార్క్‌లోని సెమీ-అటానమస్ ప్రాంతమైన గ్రీన్‌లాండ్, అమెరికా భద్రతకు చాలా ముఖ్యమైందని, దానికోసం బలప్రయోగం చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ట్రంప్ గత కొన్నాళ్లుగా అంటున్నారు.

మరోవైపు అమెరికా ప్రతిపాదిత ఆక్రమణను నిరసిస్తూ శనివారం గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌లలో వేలమంది వీధుల్లోకి వచ్చారు.

గ్రీన్‌లాండ్ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ ఖనిజ వనరులు సమృద్ధిగా ఉంటాయి. ఉత్తర అమెరికా, ఆర్కిటిక్ మధ్య ప్రాంతం కావడంతో, క్షిపణి దాడులు జరిగితే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఈ ప్రాంతంలోని నౌకల పర్యవేక్షణలో ఇది కీలకంగా మారింది.

ఆ భూభాగాన్ని నయానో, భయానో అమెరికా స్వాధీనం చేసుకుని తీరుతుందని ట్రంప్ గతంలో అన్నారు.

అయితే, ఆర్కిటిక్ ప్రాంత భద్రత నేటోలో ఉమ్మడి బాధ్యతగా ఉండాలని చెబుతూ యూరోపియన్ దేశాలు డెన్మార్క్‌కు మద్దతుగా నిలిచాయి.

ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్ దేశాలు నిఘా కార్యకలాపాల కోసం పరిమిత సంఖ్యలో సైనికులను గ్రీన్‌లాండ్‌కు పంపాయి.

ట్రంప్ ప్రకటన

శనివారం తన ట్రూత్‌ సోషల్‌లో కొత్త సుంకాలను ప్రకటించిన ట్రంప్.. ఈ దేశాలు చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నాయని, మన గ్రహపు భద్రత, రక్షణ, మనుగడ ప్రమాదంలో ఉందని అన్నారు.

వచ్చే నెలనుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ప్రతిపాదించిన 10 శాతం సుంకం జూన్‌లో 25 శాతానికి పెరుగుతుందని, గ్రీన్‌లాండ్‌ను పూర్తిగా కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందం కుదిరే వరకు ఇది అమలులో ఉంటుందని ఆయన అన్నారు.

దీనిపై స్టార్మర్ స్పందిస్తూ.. "నేటో మిత్రదేశాల సమష్టి భద్రతా ప్రయత్నాల కోసం వాటిపై సుంకాలు విధించడం పూర్తిగా తప్పు. మేం ఈ సమస్యను నేరుగా అమెరికా ప్రభుత్వంతో చర్చిస్తాం" అని అన్నారు.

"ఈ సందర్భంలో సుంకాల బెదిరింపులు ఆమోదయోగ్యం కాదు, మేం దేనికీ భయపడం" అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు.

"మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తే ఒప్పుకోం" అని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ అన్నారు.

"ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు, నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్‌తో కలిసి స్వీడన్ ఒక సంయుక్త ప్రతిస్పందన కోసం చర్చలు జరుపుతోంది" అని ఆయన అన్నారు.

"యూరోపియన్ యూనియన్ అంతర్జాతీయ చట్టాన్ని రక్షించడానికి కట్టుబడి ఉంటుంది. అది కచ్చితంగా యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల నుంచి మొదలవుతుంది" అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అన్నారు.

ఈ బెదిరింపు అకస్మాత్తుగా ముందుకొచ్చిందని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్ముసేన్ అన్నారు.

నేటో మిత్రదేశాలలో ఉద్రిక్తతలు

"ఉత్తర ప్రాంతంలో చేయవలసిన పనుల కోసం డెన్మార్క్ వద్ద అవసరమైన వనరులు లేదా సామర్థ్యం లేదు" అని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ అన్నారు.

అమెరికా పరిరక్షణ కింద గ్రీన్‌లాండ్‌ వాసుల జీవితాలు "సురక్షితంగా, బలంగా, మరింత సంపన్నంగా ఉంటాయ"ని ఆయన ఫాక్స్ న్యూస్‌తో అన్నారు.

వ్యతిరేకత ఉన్నప్పటికీ, గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవడానికి ఇటీవల మళ్లీ మొదలుపెట్టిన ప్రయత్నాలలో ఆయన ప్రకటన ఒక ప్రధాన అడుగుగా కనిపిస్తోంది.

శుక్రవారం వైట్ హౌస్‌లో విలేఖరులతో మాట్లాడుతూ సుంకాల గురించి పరోక్షంగా చెప్పిన ట్రంప్, ఆ వెంటనే హడావుడిగా టారిఫ్ ప్రకటన చేయడం వెనక కారణమేంటన్నది అంతుపట్టలేదు.

ఇటీవలి వారాల్లో, సైనిక బలప్రయోగం సహా అనేక ఆప్షన్లు ఉన్నాయని ఆయన పదే పదే చెప్పారు. అయితే గ్రీన్‌లాండ్‌ భవిష్యత్తు గురించి చర్చించడానికి అమెరికా, డానిష్ అధికారులు ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది.

అయితే, ఈ ప్రకటన వల్ల అమెరికా తీసుకోబోయే తీవ్రమైన నిర్ణయాలు ఏవైనాఉంటే, వాటిని అడ్డుకోవడానికి డెన్మార్క్‌కు, దాని యూరోపియన్ మిత్రదేశాలకు అవకాశాన్ని కల్పించినట్లయింది.

గ్రీన్‌లాండ్‌, డెన్మార్క్‌లలో ర్యాలీలు

85 శాతం మంది గ్రీన్‌లాండ్‌ వాసులు ఈ ప్రాంతాన్ని అమెరికాలో కలపడానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రజాభిప్రాయ సేకరణలు చెబుతున్నాయి.

శనివారం సుంకాలు ప్రకటించకముందే ట్రంప్ విలీన ప్రణాళికలకు వ్యతిరేకంగా డెన్మార్క్ నగరాల్లో, గ్రీన్‌లాండ్‌ రాజధాని నూక్‌లో నిరసనలు జరిగాయి.

డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో "హ్యాండ్స్ ఆఫ్ గ్రీన్‌లాండ్‌", "గ్రీన్‌లాండ్‌ ఫర్ గ్రీన్‌‌లాండర్స్" అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసనకారులు ప్రదర్శన చేశారు.

"మేం డానిష్ రాచరికం పట్ల గౌరవాన్ని, గ్రీన్‌లాండ్‌ స్వయం నిర్ణయాధికార హక్కును డిమాండ్ చేస్తున్నాం" అని గ్రీన్‌లాండ్‌ సంస్థల అంబ్రెల్లా గ్రూప్ అయిన ఇన్యూట్ అధిపతి కెమిల్లా సైజింగ్ అన్నారు.

నూక్‌లో, గ్రీన్‌లాండ్‌ ప్రధాన మంత్రి జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ "గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి లేదు", "మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటాం" అని రాసి ఉన్న బోర్డులను చేతపట్టుకుని అమెరికా కాన్సులేట్ వైపు ర్యాలీ చేశారు.

అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు కోపెన్‌హాగన్ సందర్శించినప్పుడు ఈ ర్యాలీలు జరిగాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)