You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిమాలయాలకు ‘మంచు కరువు’- శీతాకాలంలోనూ బోసిగా కనిపిస్తున్న శిఖరాలు..కారణం ఏమిటంటే?
- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
- హోదా, పర్యావరణ ప్రతినిధి
శీతాకాలంలో దట్టమైన మంచుతో కనిపించాల్సిన హిమాలయాలు రాళ్లు తేలి బోసిగా దర్శనమిస్తున్నాయి. చలికాలంలో మంచుకురవడం గణనీయంగా తగ్గిపోవడమే దీనికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
1980 నుంచి 2020 మధ్య కురిసిన సగటు హిమపాతంతో పోలిస్తే గత అయిదేళ్లుగా అక్కడ చాలా తక్కువ మంచు కురుస్తోందని చెబుతున్నారు.
భూతాపం కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో కురిసిన కొద్దిపాటి మంచు కూడా వేగంగా కరిగిపోతోందని, తక్కువ ఎత్తులోని అనేక ప్రాంతాలు తక్కువ మంచు, ఎక్కువ వర్షపాతాన్ని చూస్తున్నాయని వివిధ దేశాల వాతావరణ మార్పుల మండలి (ఐపీసీసీ), ఇతర శాస్త్రీయ నివేదికలు చెబుతున్నాయి.
హిమాలయాల్లోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు 'మంచు కరవు' పరిస్థితులు నెలకొన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భూతాపం నేపథ్యంలో హిమానీ నదాలు వేగంగా కరుగుతున్నాయి. ఇది భారత్‌లోని హిమాలయ రాష్ట్రాలు సహా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు పెద్ద సమస్యగా మారింది.
దీనికి తోడు చలికాలంలో కురవాల్సిన మంచు కూడా తగ్గడంతో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారుతున్నాయని నిపుణులు బీబీసీకి తెలిపారు.
హిమాలయాలను సిమెంట్‌లా బలంగా ఉంచే మంచు
హిమపాతం తగ్గడం అనేది హిమాలయాల స్వరూపాన్ని మార్చడమే కాకుండా, ఈ ప్రాంతంలోని లక్షల మంది ప్రజల జీవితాలను, అనేక పర్యావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
శీతాకాలంలో పేరుకుపోయిన మంచు వేసవిలో కరగడం ద్వారా ఇక్కడి నదులకు నీరు వస్తుంది. ఈ నీరు ఇక్కడి నదులు, వాగులకు ప్రధాన వనరుగా ఉంటూ తాగు, సాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తిలో కీలకంగా నిలుస్తోంది.
లోతట్టు ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం, పర్వతాలపై తక్కువ హిమపాతంతో నీటి సరఫరాపై ప్రభావం పడటమే కాకుండా, పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడి కార్చిచ్చులకు దారి తీసే ముప్పు కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
హిమానీనదాలు అంతరించిపోవడం, హిమపాతం తగ్గడం వల్ల హిమాలయాలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఎందుకంటే వాటిని సిమెంట్‌లా బలంగా పట్టి ఉంచే మంచు,ఐసును అవి కోల్పోతాయి.
రాళ్లు పడటం, కొండ చరియలు విరిగిపడడం, హిమానీ నదాలు ఉప్పొంగడం, అలాగే నీటి ప్రవాహంలో శిథిలాలు కొట్టకురావడం వంటి విపత్తులు ఇప్పటికే సర్వసాధారణంగా మారిపోయాయని వారు హెచ్చరిస్తున్నారు.
హిమపాతం తగ్గుదల ఎంత తీవ్రమైనది?
ఎల్‌పీఏలో భారీ మార్పులు
భారత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం, డిసెంబర్ నెలలో దాదాపు ఉత్తర భారతంలో ఎక్కడా వర్షం కానీ, మంచు గానీ కురవలేదు.
జనవరి నుంచి మార్చి మధ్యలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా వాయువ్య భారత్‌లోని చాలా ప్రాంతాలు, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ వంటి ప్రాంతాల్లో దీర్ఘకాల సగటు (లాంగ్ పీరియడ్ యావరేజ్ -ఎల్‌పీఏ) కంటే 86 శాతం తక్కువగా మంచు, వర్షపాతం కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని వాతావరణ విభాగం అంటోంది.
ఎల్‌పీఏ అంటే ఒక ప్రాంతంలో 30 నుంచి 50 ఏళ్ల కాలంలో కురిసిన వర్షపాతం లేదా మంచు సగటు. దీని ఆధారంగా ఇప్పుడు ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు సాధారణమా, తీవ్రమా, అనావృష్టిగా ఉన్నాయా అనే విషయాలను అంచనా వేస్తారు.
వాతావరణ శాఖ ప్రకారం, 1971 నుంచి 2020 మధ్య ఉత్తర భారతంలో దీర్ఘకాల సగటు వర్షపాతం 184.3 మిల్లీమీటర్లు.
బలమైన సాక్ష్యాలు..
మంచు, వర్షం ఇలా భారీగా తగ్గిపోవడం అనేది ఏదో ఈ ఏడాదే జరిగిన విషయంగా భావించకూడదని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.
"హిమాలయాల్లో శీతాకాలంలో మంచు కురవడం తగ్గుతోందనడానికి మా దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయి" అని యూకేలో యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లోని ట్రాపికల్ మెటీరియాలజీలో ప్రిన్సిపల్ రీసెర్చ్ ఫెలో కీరన్ హంట్ చెప్పారు.
హంట్ సహ రచయితగా వ్యవహరించిన ఓ అధ్యయనం 2025లో ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో 1980 నుంచి 2021 మధ్య నాలుగు విభిన్న డేటాసెట్లను పరిశీలించారు. ఇవన్నీ కూడా పశ్చిమ, మధ్య హిమాలయాల్లో మంచు, వర్షపాతం తగ్గిందని చూపిస్తున్నాయి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జమ్మూకు చెందిన అధ్యయన కర్త హేమంత్ సింగ్, ఈఆర్ఏ-5 (యురోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ అండ్ రీఅనాలసిస్) డేటాసెట్లను విశ్లేషించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, గత 40 ఏళ్ల సగటుతో పోలిస్తే, గత అయిదేళ్లలో వాయువ్య హిమాలయాల్లో హిమపాతం 25 శాతం తగ్గింది.
మధ్య హిమాలయాలు ఉన్న నేపాల్‌లోనూ శీతాకాలంలో హిమపాతం భారీగా తగ్గిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
"నేపాల్‌లో అక్టోబర్ నుంచి అసలు వర్షం పడలేదు. ఇక చలికాలంలో మిగిలిన ఈ రోజుల్లో కూడా పొడి వాతావరణమే ఉండేలా కనిపిస్తోంది. గత అయిదేళ్లుగా అక్కడ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది" అని కాఠ్‌మాండూలోని త్రిభువన్ యూనివర్సిటీలో మెటరాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ బినోద్ పొఖారెల్ తెలిపారు.
కొన్నిసార్లు భారీగా కురిసిన మంచు
అయితే, ఇటీవలి సంవత్సరాల్లో అక్కడ చలికాలం సమయంలో విపరీతంగా మంచు కురిసిన సందర్భాలు కూడా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇవి అప్పుడప్పుడు జరిగే అతి తీవ్ర వాతావరణ సంఘటనలే తప్ప, గతంలో లాగా చలికాలం అంతటా సమానంగా కురిసే మంచు మాత్రం కాదు అని వారు భావిస్తున్నారు.
పర్వతాలపై ఎంత మంచు పేరుకుపోయింది? అది కరిగిపోకుండా భూమిపై ఎంతకాలం నిలిచిఉంది? అనే అంశాలను కొలవడం ద్వారా కూడా హిమపాతంలో తగ్గుదలను శాస్త్రవేత్తలు కొలుస్తున్నారు. ఈ పద్ధతిని స్నో పర్సిస్టెన్స్ అని పిలుస్తారు.
2024-2025 శీతాకాలంలో మంచు నిలిచి ఉండే కాలం, సాధారణం కంటే 24 శాతం తక్కువగా నమోదైందని ఐసీఐఎండీ నివేదిక పేర్కొంది. గత 23 ఏళ్లలో ఇదే తక్కువ స్థాయి అని వెల్లడించింది.
హిందూ కుష్ హిమాలయ (హెచ్‌కేహెచ్) ప్రాంతంలో 2020 నుంచి 2025 మధ్య అయిదు శీతాకాలాల్లో నాలుగుసార్లు సాధారణం కంటే తక్కువ స్నో పర్సిస్టెన్స్ నమోదైందని ఆ నివేదిక చెబుతోంది.
"దీన్ని బట్టి హిందూకుష్ హిమాలయ ప్రాంతంలోని ఒక గణనీయ భాగంలో హిమపాతం తగ్గిందని, అలాగే శీతాకాలంలో మంచు కురవడం స్థిరంగా తగ్గుతోందని అర్థం చేసుకోవచ్చు'' అని ఐసీఐఎండీలో రిమోట్ సెన్సింగ్ అండ్ జియోఇన్‌ఫర్మేషన్ విభాగంలో సీనియర్ అసోసియేట్ అయిన శ్రవణ్ శ్రేష్ట చెప్పారు.
'మంచు కరవు' పెరుగుతోందా?
హిమాలయాల్లో 'మంచు కరవు' పరిస్థితులు ప్రస్తుతం పెరుగుతున్నాయని, ముఖ్యంగా 3,000 మీటర్ల నుంచి 6,000 మీటర్ల ఎత్తులో మంచు చాలా తక్కువగా ఉన్నట్లు హేమంత్ సింగ్ చేసిన అధ్యయనంలో తెలిపారు.
'ఈ ప్రాంతంలోని 12 ప్రధాన రివర్ బేసిన్లకు వచ్చే నీటిలో సగటున నాలుగో వంతు వాటా మంచు కరగడం వల్లే అందుతుంది. కాబట్టి పర్వతాలపై మంచు తక్కువ కాలం ఉండటం వల్ల, ఆ నదులపై ఆధారపడే దాదాపు 200 కోట్ల మంది ప్రజలకు నీటి కష్టాలు ఎదురవుతాయి' అని ఐసీఐఎండీ నివేదిక హెచ్చరిస్తోంది.
హిమాలయాల్లో గ్లేసియర్స్ కరగడం వల్ల భవిష్యత్‌లో నీటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మంచు తక్కువగా కురవడం వల్ల తక్షణమే నీటి సరఫరా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.
వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ బలహీన పడుతున్నాయా?
వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ బలహీనం కావడమే ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, నేపాల్‌లో వర్షాలు, మంచు తగ్గడానికి ప్రధాన కారణమని చాలామంది వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మధ్యధరా సముద్రం నుంచి చల్లని గాలిని మోసుకొచ్చే అల్పపీడన వ్యవస్థలే వెస్టర్లీ డిస్టర్బెన్సెస్.
గతంలో ఈ వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ కారణంగానే శీతాకాలంలో భారీగా హిమపాతం, వర్షాలు నమోదయ్యాయని వారు అంటున్నారు.
అయితే వీటిపై జరిగిన అధ్యయన ఫలితాలు విభిన్నంగా ఉన్నాయి. కొన్ని నివేదికలు వెస్టర్లీ డిస్టర్బెన్సెస్‌లో మార్పులు వచ్చాయని చెబుతుంటే, మరికొన్ని మాత్రం పెద్దగా మార్పులేమీ లేవని అంటున్నాయి.
‘‘శీతాకాలంలో కురిసే మంచు, వర్షాలకు ఈ వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ ప్రధాన కారణమని మనకు తెలుసు. అంటే మంచు తగ్గడానికి వీటికి కచ్చితంగా సంబంధం ఉంటుంది'' అని కీరన్ హంట్ వివరించారు.
ఉత్తర భారతంలో ఈ శీతాకాలంలో ఇప్పటివరకు వచ్చిన వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ అతి బలహీనమైనవని భారత వాతావరణ శాఖ తెలిపింది. అందుకే వీటివల్ల చాలా తక్కువ మంచు, వర్షం నమోదైందని చెప్పింది.
శీతాకాలంలో అవపాతం (మంచు, వర్షం కురవడం) ఎందుకు తగ్గుతోందనే అసలు కారణాన్ని శాస్త్రవేత్తలు త్వరలోనే కనుక్కుంటారేమో. కానీ, హిమాలయ ప్రాంతం ఇప్పుడు రెట్టింపు కష్టాలను ఎదుర్కొంటోందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
ఒకవైపు హిమానీ నదాలు, మంచుఫలకాలు వేగంగా కరిగిపోతుంటే, మరోవైపు కొత్తగా కురవాల్సిన మంచు కూడా తగ్గిపోతోంది. ఈ రెండు పరిణామాల కారణంగా భవిష్యత్‌లో తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)