You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్రాహ్మణులకు 95 ఏళ్లుగా ఉన్న ప్రత్యేక శ్మశానం.. ఇప్పుడు అందరి కోసం ఎలా తెరుచుకుంది?
- రచయిత, సందీప్ సాహు
- హోదా, బీబీసీ కోసం
ఒడిశాలోని కేంద్రపడలో బ్రాహ్మణులకు మాత్రమే ఓ శ్మశానాన్ని నిర్వహించడం వివాదాస్పదమైంది. దీంతో నగర పాలక సంస్థ అధికారులు రంగంలోకి దిగి శ్మశానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు.
1928లో ఈ శ్మశానాన్ని కేవలం బ్రాహ్మణుల కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది చట్టవిరుద్ధం కావడంతో దీనిని అందరు ఉపయోగించుకునేలా చేశారు.
మతం, కులం ఆధారంగా వివక్ష చూపడం రాజ్యంగంలోని 14,19, 21 ఆర్టికల్స్‌ను ఉల్లంఘించడమేనని న్యాయ కోవిదులు చెబుతున్నారు.
ఇంత సుదీర్ఘకాలం ఈ శ్మశానం కేవలం ఒక వర్గానికే ఎలా పరిమితమైందా అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. 154 సంవత్సరాల పురాతన పురపాలక సంఘం పర్యవేక్షణ ఉన్నా ఇది ఇలాగే కొనసాగడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
శ్మశాన ప్రవేశద్వారం వద్ద ‘బ్రాహ్మణ శ్మశాన వాటిక’ అని రాసి ఉన్న బోర్డును ఇప్పుడు ‘‘స్వర్గద్వారం’’ గా మార్చారు.
ఈ మార్పు తర్వాత ఇక్కడ అన్నివర్ణాల వారు తమ వారి అంతిమసంస్కారాలు నిర్వహించుకోవచ్చని పురపాలక సంఘం ప్రకటించింది.
హడావుడిగా పేరును మార్చినా ఇప్పటికీ అక్కడ ‘బ్రాహ్మిణ్’ అనే పేరు మసకగా కనిపిస్తూనే ఉంది.
ఈ శ్మశానంలో గడ్డి బాగా పెరిగిపోయింది. గడిచిన కొన్నివారాలుగా ఇక్కడ ఎవరూ అంతిమ సంస్కారాలు నిర్వహించినట్టు కనిపించలేదు.
కేంద్రపడ పురపాకల కమిషనర్ ప్రఫుల్ల కుమార్ బిశ్వాల్ బీబీసీతో మాట్లాడుతూ ఇప్పుడు ఇక్కడ అన్ని కులాల వారు కర్మకాండలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. అయితే బీబీసీ సొంతంగా చేసిన పరిశీలనలో ఇది నిర్ధరణ కాలేదు. రెండేళ్ళ కిందట ఇక్కడ ఓ జవాను అంత్యక్రియలు నిర్వహించడానికి ఆర్మీ అధికారులు వచ్చారు. కానీ ఈ శ్మశానం చిన్నగా ఉందని, ఈ కార్యక్రమాన్ని వేరే చోటుకు మార్చారు.
ఎలా వెలుగులోకి వచ్చింది?
కేంద్రపడలోని హాజారీబాగ్‌లో బ్రాహ్మణుల కోసం మాత్రమే నిర్మితమైన ఈ శ్మశానం గురించి ఎవరూ గతంలో వేలెత్తిచూపేవారు కాదు.
ఒడిశా దళిత కమ్యూనిటీ కేంద్రపడ విభాగ అధ్యక్షుడు నాగేంద్ర జెనా ఇలా ఒక కులానికే పరిమితమయ్యే శ్మశానం రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం లేవనెత్తడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ శ్మశానాన్ని అందరి కోసం అందుబాటులోకి తీసుకురావాలంటూ జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన ఓ దరఖాస్తు కూడా అందించారు. దీనిపై ‘ద టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ఓ వార్తా కథనం ప్రచురితమైంది.
ఇతర కులాల వారు కూడా ఈ శ్మశానాన్ని వినియోగిస్తున్నారనే ప్రకటనలను జెనా ఖండించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ- ‘‘ఇక్కడ కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అని రాసి ఉన్నప్పుడు ఇతర కులాల వారు ఎలా రాగలుగుతారు? ఇప్పటికే వారు భయంతో బతుకుతున్నారు’’ అని చెప్పారు.
ఎప్పటి నుంచో ఈ శ్మశానం బ్రాహ్మణులకే పరిమితమైనప్పటికీ ఇప్పుడే అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తున్నారనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, గతంలో ఇక్కడ బ్రాహ్మణ శ్మశాన వాటిక అనే బోర్డు లేదన్నారు. కానీ నగరంలోని చాలా మంది ప్రజలు చాలా కాలంగా అక్కడ ఆ బోర్డు ఉందని తెలిపారు.
నిధులు విడుదల చేసిన మున్సిపాల్టీ
‘‘చాలా కాలం నుంచి ఇక్కడ బ్రాహ్మణులకు మాత్రమే ఈ శ్మశానం పరిమితమై ఉండేది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్థానిక ఎమ్మెల్యే మున్సిపాల్టీ ద్వారా దీనికి ఆమోదం తెలపడం, ఈ శ్మశానం ప్రహరీ నిర్మాణానికి లక్షన్నర రూపాయలు కేటాయించడం’’ అని స్థానిక జర్నలిస్ట్ ఆశీష్ సేనాపతి తెలిపారు.
చాలా కాలం కిందట ఓ బ్రాహ్మణుడు ఈ స్థలాన్ని దానంగా ఇచ్చారని బ్రాహ్మణ వర్గ పెద్దలు చెబుతున్నారు. దాత కోరిక మేరకు ఈ స్థలాన్ని బ్రాహ్మణుల అంత్యక్రియలకు వాడుతున్నామని తెలిపారు.
దీనిపై కేంద్రపడలోని సీనియర్ న్యాయవాది వినోద్ విహారి నాయక్ మాట్లాడుతూ- ‘‘ఈ స్థలం ఎవరిదనే విషయం ప్రశ్నే కాదు. ఎందుకంటే ఒకసారి ఇది పురపాలకసంఘం చేతికి వచ్చాక దానిపైన ఏ కులానికైనా, సంఘానికైనా హక్కులు ఉండవు’’ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన తమిళనాడులో దళితులకు ప్రత్యేక శ్మశానం ఏర్పాటుపై మద్రాసు హైకోర్టు 2019 ఆగస్టు 26న అక్కడి ప్రభుత్వాన్ని మందలించిన విషయాన్ని గుర్తు చేశారు.
శ్మశానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై బ్రాహ్మణ వర్గం నుంచి ఎలాంటి ప్రతిఘటనా ఎదురుకాలేదని కేంద్రపడ పురపాలక సంఘం ఈవో ప్రఫుల్ కుమార్ బిశ్వాల్ చెప్పారు. భవిష్యత్తులో అన్నికులాల వారు, తరగతుల వారు ఈ స్థలాన్ని ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఉపయోగించుకుంటారనే విశ్వాసం తనకుందన్నారు.
కేంద్రపడ కళాశాల విశ్రాంత అధ్యక్షుడు, బ్రాహ్మణుడు అయిన రాజేంద్ర ప్రసాద్ త్రిపాఠి- బ్రాహ్మణులు ఎవరూ ఈ చర్యను వ్యతిరేకించరనే నమ్మకం తనకుందని చెప్పారు.
బ్రాహ్మణుల కోసం నిర్మితమైన శ్మశానం తలుపులు ఇప్పుడు అన్ని కులాలవారికి, వర్గాలవారికి తెరుచుకున్నాయి. జిల్లాలోని చాలా గ్రామీణ ప్రాంతాలలో బ్రాహ్మణులకు ప్రత్యేకమైన శ్మశానాలు ఉన్నాయి.
కేంద్రపడ చరిత్ర రాసిన పరిశోధకుడు, రచయిత నిరంజన్ మెక్పా మాట్లాడుతూ- తన స్వగ్రామం బ్రాహ్మణుల ఏలుబడిలో ఉండేదని, అక్కడ వారికి ప్రత్యేక శ్మశానం ఉండేదని చెప్పారు. అలాగే పరిసరాల్లో డిపూర్, గరై, గోపీనాథ్‌పూర్ బ్రాహ్మణుల పరిపాలనలో ఉండేవి. ఈ ప్రాంతాల్లో బ్రాహ్మణులకు ప్రత్యేక శ్మశానాలు ఉండేవి.
ఇవి కూడా చదవండి :
- మహాలక్ష్మి పథకం: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి..
- గౌతమ్ సింఘానియా: భార్యను వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ రేమండ్ బాస్ తన ఆస్తిలో 75 శాతాన్ని కోల్పోతారా?
- 'విశాఖపట్నం వచ్చేస్తున్నా' అని సీఎం జగన్ ఎన్నిసార్లు చెప్పారు... ఎందుకు రావడం లేదు?
- మోనాలిసా నవ్వు వెనుక దాగిన రహస్యం ఏంటో తెలుసా?
- చింపాంజీలకు మనిషి వీర్యం ఎక్కించి హైబ్రిడ్ మానవులను సృష్టించే దారుణ ప్రయోగం.... దీన్ని ఎవరు, ఎలా చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)