You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు.. అర్హతలు ఇవీ..
వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించిందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి.
అగ్ర కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు సోమవారం దిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపిందని పీటీఐ, ఏఎన్ఐ వార్తాసంస్థలు వెల్లడించాయి.
లోక్‌సభ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగాల్సి ఉండగా మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
అర్హతలు ఇవీ..
* కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్న జనరల్ కేటగిరీలోని అభ్యర్థులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.
* ఐదెకరాలకు మించి పొలం ఉండకూడదు.
* 1,000 చదరపు గజాల వైశాల్యం కంటే చిన్న ఇంట్లో ఉన్నవారికి వర్తిస్తుంది.
* నివాస స్థలం ఉన్నట్లయితే దాని విస్తీర్ణం 200 గజాలకు మించరాదు.
అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్‌సింగ్ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. ‘సబ్ కా సాత్ - సబ్ కా వికాస్’ అనే నినాదాన్ని ఇది బలపరుస్తోందని పేర్కొన్నారు.
ఈ రిజర్వేషన్ అమలు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ సవరణ చేయాల్సి ఉంటుంది.
అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. మొత్తం రిజర్వేషన్ల మీద ఉన్న 50 శాతం పరిమితిని మించిపోతుంది కనుక రాజ్యాంగ సవరణ అవసరమని.. ఈ సవరణ బిల్లును మంగళవారమే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందని చెప్తున్నారు.
అయితే.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించితే అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని.. కాబట్టి పార్లమెంటులో దీనికి తక్షణ ఆమోదం లభించే అవకాశాలు తక్కువని పరిశీలకులు అంటున్నారు.
నిజానికి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 8తో అంటే మంగళవారం నాడే ముగియాల్సి ఉంది. ఈ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్తున్నారు.
‘‘అగ్రకులాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఓ గిమ్మిక్కు మాత్రమే. దీనితో చాలా న్యాయపరమైన సంక్లిష్టలు ముడిపడి ఉన్నాయి. పార్లమెంటు ఉభయసభల్లో దీనిని ఆమోదించటానికి సమయం లేదు. ప్రభుత్వ (గిమ్మిక్కు) పూర్తిగా బట్టబయలైంది’’ అని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించటానికి దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఒక ట్వీట్‌లో మద్దతు తెలిపారు.
దీనిని అమలు చేయటం కోసం రాజ్యంగ సవరణ చేయటానికి కేంద్రం పార్లమెంటు సమావేశాలను తక్షణమే పొడిగించాలన్నారు. అలా చేయకపోతే ఇది కేవలం ఎన్నికల గిమ్మిక్కేనని వ్యాఖ్యానించారు.
- జగన్పై దాడి కేసు: కోడికత్తితో దాడి జరిగితే NIA ఎలా దర్యాప్తు చేస్తుంది? ఏపీ ప్రభుత్వ సహాయ నిరాకరణ కరెక్టేనా?
- AUS vs IND: 72 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టు
- కాపులకు 5 శాతం రిజర్వేషన్లు: ఏపీ కేబినెట్ నిర్ణయం
- మహారాష్ర్టలో మరాఠాలకు రిజర్వేషన్లు: బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
- BBC EXCLUSIVE: రిజర్వేషన్లపై అఖిలేశ్ నయా ఫార్ములా
- రాజ్యాంగం చెబుతున్నా IIMలు రిజర్వేషన్లు పాటించవా?
- రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా?
- ఎస్సీ ఎస్టీల పదోన్నతుల్లో రిజర్వేషన్: సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
- తెలంగాణలో రిజర్వేషన్ల చిచ్చు : గోండులు వర్సెస్ లంబాడాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)