‘‘విదేశాల్లో ఉద్యోగమంటారు... కానీ తరువాత శరీరాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది’’

    • రచయిత, సైదు బా
    • హోదా, బీబీసీ ఆఫ్రికా ఐ, మకేని

తన కొడుకు నుంచి వచ్చిన చివరి వాయిస్ మెస్సేజ్ తరువాత ఫోడే మూసాకు ఒక్కసారిగా గుండె బద్దలైనట్లు అనిపించింది.

ఆ మెస్సేజ్ కేవలం 76 సెకన్లు మాత్రమే ఉంది. యువకుడి గొంతులో బాధ స్పష్టంగా కొట్టుచ్చినట్లు కనిపిస్తోంది. తండ్రి సాయం కోసం అర్ధిస్తూ ఏడుస్తున్నాడు.

''వినడానికి చాలా కష్టంగా ఉంది. తన గొంతు వింటుంటే, బాధగా అనిపించింది'' అని బీబీసీ ఆఫ్రికా ఐకు మూసా చెప్పారు.

విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఫిబ్రవరి 2024లో సెంట్రల్ గినియాలోని ఫరానా ప్రాంతంలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి మూసా 22 ఏళ్ల కుమారుడిని, 18 ఏళ్ల కుమార్తె సహా మరో ఐదుగురిని రిక్రూట్‌మెంట్ ఏజెంట్లు నియమించుకున్నారు. కానీ, వారికెలాంటి ఉద్యోగాలు ఇప్పించలేదు. రిక్రూట్ చేసుకున్న వారిని సరిహద్దు దాటించి, పశ్చిమ ఆఫ్రికా దేశం సియెరా లియోన్‌లోకి తీసుకెళ్లి అక్కడ బందీగా ఉంచారు.

రిక్రూటర్లుగా చలామణి అయిన వారు మానవ అక్రమ రవాణాదారులు.

''నా గుండె బద్దలైంది. ఏడుపు ఆపుకోలేకపోతున్నా. నా కళ్లలోకి చూస్తే, ఆ బాధ మీకు స్పష్టంగా కనిపిస్తుంది'' అని మూసా అన్నారు.

ఈ కేసు విచారణకు దిగిన గినియాలోనిఇంటర్‌పోల్, తమకు సాయపడాలని సియెరా లియోన్‌లోని తమ యూనిట్‌ను కోరింది.

గతేడాది ఆగస్టులో తమ పిల్లల్ని వెతికేందుకు సెంట్రల్ సియెరా లియోన్‌లోని మకేని ప్రాంతానికి వెళ్లారు మూసా కూడా వెళ్లారు.

అమెరికా, కెనడాలో ఉద్యోగాల పేరుతో

పశ్చిమ ఆఫ్రికాలోని వేలాది మంది ప్రజలు క్యూనెట్ (QNET) అని పిలిచే మానవ అక్రమ రవాణా కుంభకోణంలో చిక్కుకుపోతున్నారు.

హాంకాంగ్‌లో ఏర్పాటైన క్యూనెట్ (క్యూఎన్ఈటీ) అనేది చట్టబద్ధంగా కార్యకలాపాలు సాగించే వెల్‌నెస్, లైఫ్‌స్టైల్ కంపెనీ.

దీనిలో రిజిస్టర్ అయిన ప్రజలు తమకు కావాల్సిన ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. కానీ ఈ కంపెనీ వ్యాపార విధానంపై పై కొంచెం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పశ్చిమాఫ్రికాలో అక్రమ కార్యకలాపాలు సాగించేందుకు నేర ముఠాలు ఈ కంపెనీ పేరునే ముందు పెడుతున్నాయి

అమెరికా, కెనడా, దుబయ్‌, యూరప్‌ లాంటి ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాల పేరుతో ఈ మానవ అక్రమ రవాణాదారులు ప్రజలను బుట్టలో వేసుకుంటున్నారు.

అక్కడ ఉద్యోగం రావడానికి ముందే అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల కింద పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని అడుగుతారు. ఈ డబ్బు ముట్టిన వెంటనే వారిని సరిహద్దు దేశాలకు తరలిస్తున్నారు.

''ఈ స్కీమ్‌లోకి ఇతరులను కూడా చేర్పిస్తేనే విదేశాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తాం'' అంటూ బెదిరిస్తున్నారు.

ఈ నేరస్తుల నుంచి బయటపడేందుకు కుటుంబ సభ్యులను, స్నేహితులను ఈ స్కీమ్‌లో చేర్పించినా వీరికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు.

‘స్కామ్‌లకు’ వ్యతిరేకంగా క్యూనెట్ బోర్డులు

తమ కంపెనీ పేరును నేరముఠాలు వాడుకోవడంపై క్యూనెట్‌ కూడా రంగంలోకి దిగింది. బిల్‌బోర్డులు, మీడియా ప్రకటనల ద్వారా మానవ అక్రమ రవాణాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

''క్యూనెట్ అగైనెస్ట్ స్కామ్స్'' పేరుతో బిల్‌బోర్డులు కనిపిస్తున్నాయి. మానవ అక్రమ రవాణాతో తమ కంపెనీకి సంబంధం ఉన్నట్లు వస్తోన్న ఆరోపణలను ఈ కంపెనీ కొట్టేసింది.

మూసా, ఆయన బంధువుల కుటుంబం ఇప్పటికే మానవ అక్రమ రవాణాదారులకు 25 వేల డాలర్లు (సుమారు రూ.22,91,450) చెల్లించింది.

ఇందులో, స్కీమ్‌లో చేరేందుకు కట్టిన ఫీజులతో పాటు, తమ పిల్లలను తిరిగి ఇంటికి తీసుకురావడానికి అదనంగా చెల్లించిన డబ్బులూ ఉన్నాయి.

చివరి ఆశగా తానే స్వయంగా సియెరా లియోన్‌కు పయనమయ్యారు మూసా.

వందలాది బాధితులను కాపాడిన పోలీసులు

ఈ కేసు తమ యూనిట్‌కు అత్యంత ప్రాధాన్యమని సియెరా లియోన్ పోలీసు విభాగంలోని ఇంటర్‌పోల్‌కు చెందిన యాంటీ-ట్రాఫికింగ్ యూనిట్ ఇన్వెస్టిగేషన్స్ హెడ్ మహమూద్ కాంటే చెప్పారు.

‘‘మానవ అక్రమ రవాణాదారులు అక్రమ సరిహద్దు ప్రాంతాల నుంచి సులభంగా దేశాలను దాటేస్తుంటారు’’ అని బీబీసీకి చెూప్పారు.

మకేని ప్రాంతంలో పెద్ద సంఖ్యలో యువకులను బందీగా చేశారనే సమాచారం కాంటేకు అందింది.

ఆ ప్రాంతంలోని ఒక ఇంటిపై పోలీసులు దాడులు చేసినప్పుడు, తమ పిల్లల ఆచూకీ లభిస్తుందనే ఆశతో మూసా కూడా పోలీసులతో కలిసి పనిచేశారు. వారు దాడి చేసిన ఇంట్లో నేలపై బ్యాగులు, బట్టలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రతి గదిలో 10 నుంచి 15 మంది కింద పడుకుని ఉన్నారు.

ఆ ఇంటి లోపలున్న అందరినీ ఇంటర్‌పోల్ టీమ్ ఒక‌చోటకు చేర్చింది. వారిలో కొందరు వయసు కేవలం 14 సంవత్సరాలే.

''వీరిలో ఒక్కరు మాత్రమే సియెరాలియోన్‌కు చెందినవారు. మిగిలిన వారందరూ గినియా ప్రజలే'' అని కాంటే తెలిపారు.

వారిలో మూసా పిల్లలు లేరు. అయితే, ఒక యువకుడు మాత్రం అంతకుముందు వారం మూసా పిల్లలు ఇక్కడే ఉన్నట్లు చెప్పాడు.

గత ఏడాది కాలంగా మూసాకు పిల్లల ఆచూకీ గురించి తెలిసిన తొలి సమాచారం అదే. వీరందరినీ పరీక్షల కోసం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వారిలో 19 మందిని గినియాలోని వారి ఇళ్లకు పంపించారు.

గత ఏడాది కాలంగా ఇలాంటి దాడులను 20కి పైగా నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

మానవ అక్రమ రవాణా నుంచి వందలాది మంది బాధితులను కాపాడినట్లు చెప్పారు.

‘శరీరాన్ని అమ్ముకుని, మగవారితో పడుకోవాలి’

సియెరా లియోన్‌కు చెందిన 23 ఏళ్ల అమినటా (గోప్యతా కారణాల రీత్యా ఆమె పేరును మార్చాం) లాంటి కొందరిని స్వదేశంలోనే అక్రమంగా రవాణా చేశారు. 2024 ఏడాది మధ్యలో క్యూనెట్‌ ప్రతినిధులుగా చెప్పుకున్న వారు, తన ఫ్రెండ్ ద్వారా ఎలా పరిచయం అయ్యారో మకేని హుసమ్ హిల్స్‌ ప్రాంతంలో ఉన్న అమినటా బీబీసీకి వివరించారు.

ఇంటర్వ్యూలో తాను సక్సెస్ అయ్యాయని, ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లడానికి ముందు ఒక కోర్సు నేర్చుకోవాల్సి ఉందని వారు చెప్పినట్లు తెలిపారు.

ఈ స్కీమ్‌లో చేరేందుకు తాను 1000 డాలర్లు ( ప్రస్తుత భారత కరెన్సీలో సుమారు రూ.91,617) చెల్లించాల్సి వచ్చిందన్నారు.

''వారు మొదట మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మీకు కావాల్సిన ఆహార పదార్థాలు పెడతారు. కాలం గడుస్తున్న కొద్దీ, అవన్నీ ఆపేస్తారు'' అని ఆమె బీబీసీకి చెప్పారు.

ఆ తర్వాత మీరు మరింత దూరం వెళ్లాల్సి వస్తుందని ఆమె అన్నారు.

''మీ శరీరాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. మగవారితో పడుకోవాలి. అప్పుడైతేనే డబ్బులు వస్తాయి. అప్పుడు మిమ్మల్ని మీరు పోషించుకోగలరు'' అని చెప్పారు.

ఒకవేళ అక్కడినుంచి వెళ్లానుకుంటే, ఇతరులను స్కీమ్‌లోకి చేర్చాలని ఆమెతో వారు అన్నట్లు అమినటా తెలిపారు.

దీనికోసం మానవ అక్రమ రవాణాదారులు తనకి ఇంటర్నేషనల్ నెంబర్ ఇచ్చారు. స్కీమ్‌లోకి చేర్పించేందుకు ఎవరినైనా అమినటా సంప్రదిస్తే ఆమె నిజంగా విదేశాల నుంచే ఫోన్ చేస్తోందని నమ్మించడానికే ఈ నెంబర్ ఇచ్చారు.

''ఆ తర్వాత వారు మిమ్మల్ని ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తారు. మీరు విదేశాల్లోనే ఉన్నట్లు మీకు డ్రస్ వేస్తారు. పాస్‌పోర్టు ఇస్తారు. నకిలీ ట్రావెల్ పేపర్లు ఉంటాయి'' అని వివరించారు.

''ఆ తర్వాత మీ ఫోటో తీస్తారు. ఆ ఫోటోను మీరు స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపుకోవచ్చు'' అన్నారు.

అమెరికాలో ఉద్యోగం వస్తుందనే ఆశతో అమినటా ఎలాగో ఒక ఆరుగురు స్నేహితులను, బంధువులను ఈ స్కీమ్‌లో చేరేలా ఒప్పించారు. కానీ, ఆమెకు మాత్రం ఉద్యోగం రాలేదు.

''నాకు చాలా దారుణంగా అనిపించింది. ఎందుకంటే, నావల్ల వారు డబ్బులను పోగొట్టుకున్నారు. ఎంతో కష్టపడ్డారు'' అని తెలిపారు.

సియెరా లియోన్ రాజధాని ఫ్రీటౌన్ శివార్లలోని ఓ ప్రాంతంలో ఆమెను ఏడాది పాటు బందీగా ఉంచారు.

అమినటా ఇతరులను నియమించుకోవడంలో ఫెయిల్ అవుతున్నప్పుడు, ఆమెతో ఇక ఉపయోగం లేదని మానవ అక్రమ రవాణాదారులు భావించారు.

ఆమె పారిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు తనని ఎవరూ ఆపలేదు.

తనకు ఇదంతా జరిగిన తర్వాత ఇంటికి రావడం, ముఖ్యంగా అందరూ తాను విదేశాల్లో ఉన్నట్లు భావించినప్పుడు దాన్ని భరించడం కష్టమైంది.

''తిరిగి ఇంటికి వెళ్లాలంటే నాకు భయం వేసింది'' అని అమినటా తెలిపారు.

''నేను విదేశాలకు వెళ్లినట్లు నా స్నేహితులకు చెప్పాను. నా కుటుంబానికి అదే చెప్పాను. అక్కడికి వెళ్లేందుకు వారు నాకిచ్చిన డబ్బు గురించి నాకు పదేపదే ఆలోచన వచ్చింది'' అని అన్నారు.

ఇలాంటి లేబర్ స్కామ్‌లలో ఇరుక్కుపోయే బాధితుల సంఖ్యపై ఎలాంటి గణాంకాలు లేవు. కానీ ఈ విదేశీ ఉద్యోగ స్కీమ్‌లు నిజమని నమ్మే వారిని నేర ముఠాలు మోసం చేస్తున్నాయని పశ్చిమ ఆఫ్రికాలోని మీడియాలో వరుసగా కథనాలు వస్తూనే ఉన్నాయి.

మకేనిలో మూడు రోజులుగా జరిగిన డజన్ల కొద్దీ దాడుల్లో పోలీసులతో పాటు బీబీసీ కూడా పాలుపంచుకుంది.

గినియా, బుర్కినా ఫాసో, ఐవోరీ కోస్ట్, మలి వంటి దేశాల నుంచి ఈ ప్రాంతం గుండా అక్రమ రవాణాకు గురైన వందల మంది యువకులను బీబీసీ కలిసింది.

మొత్తం 12 మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం.. సియెరా లియోన్ యాంటీ-ట్రాఫికింగ్ యాక్ట్‌ను ఆమోదించినప్పటి నుంచి అంటే 2022 జులై నుంచి 2025 ఏప్రిల్ వరకు కేవలం నాలుగు అక్రమ రవాణా కేసులకు మాత్రమే శిక్షలు విధిస్తూ తీర్పులు చెప్పారు.

మూసా తన పిల్లల్ని కనుక్కోలేదు. సెప్టెంబర్ చివరిలో తమ పిల్లలు లేకుండా తిరిగి గినియాకు రావడం తప్ప మరో దారి లేకుండా పోయింది.

మూసా పిల్లలను అక్రమ రవాణాదారులు చాలా కాలం తర్వాత విడుదల చేసినట్లు ఇంటర్‌పోల్‌కు చెందిన కాంటే బీబీసీకి చెప్పారు.

మూసా కూతురు తిరిగి గినియాకు వచ్చారని బీబీసీ ధ్రువీకరించింది. కానీ, ఆమె ఇంకా తన గ్రామానికి చేరుకోలేదు. బీబీసీతో మాట్లాడేందుకు తిరస్కరించారు. ఆమె తండ్రిని కూడా సంప్రదించలేదు. ఎందుకంటే, ఈ స్కామ్‌లో ఇరుక్కుపోయిన చాలామంది ఇతర బాధితుల మాదిరినే తాను కూడా భరించలేని బాధను అనుభవిస్తున్నారు.

మూసా కొడుకు ఎక్కడున్నాడో ఇంకా ఆచూకీ తెలియదు.

తన తండ్రికి ఇది చాలా బాధాకర విషయం.

''ఇదంతా జరిగిన తర్వాత, ఇదంతా ఎప్పుడు ముగుస్తుందా, నా పిల్లల్ని ఎప్పుడు చూస్తానా? అనిపిస్తోంది'' అని మూసా ఆవేదన వ్యక్తం చేశారు.

''వారు తిరిగి గ్రామానికి రావడం మాకెంతో ఇష్టం. వారు నాతో ఉంటే చాలు'' అన్నారు.

అదనపు సమచారం: పాల్ మైలెస్, క్రిస్ వాల్టర్, ఒలివియా అక్లాండ్, తమాసిన్ ఫోర్డ్‌

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)