You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆనాటి కారు యాక్సిడెంట్‌లో ఓ క్రికెటర్ చనిపోయాడు, ప్రాణాలతో బయటపడ్డవారు ప్రపంచ ప్రఖ్యాత ఆల్‌రౌండర్స్ అయ్యారు
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత క్రికెటర్ రిషభ్ పంత్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రిషభ్ పంత్‌కు ప్రాణాపాయం తప్పడం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, మొత్తం భారత క్రికెట్‌కు, అభిమానులకు ఊరటనిచ్చే విషయం.
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన పంత్ ఎడమ కనుబొమ్మకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు డాక్టర్లు చెప్పారు. ఆయన చికిత్సకు సహకరిస్తున్నట్టు తెలిపారు.
ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు శుక్రవారం తెల్లవారుజామున గంటకు 150 కి.మీ వేగంతో తన కారును నడుపుకుంటూ వెళ్లిన పంత్‌కు కాస్త నిదరగా అనిపించడంతో క్షణకాలంలో ఈ ప్రమాదం జరిగింది.
అయితే, అదృష్టవశాత్తు సకాలంలో సాయం అందడంతో ఆయన ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదం వల్ల, పంత్ ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే 4 టెస్ట్ సిరీస్‌కు దూరం అవుతాడని తెలుస్తోంది.
అయితే, ఇలాంటి ఒక ప్రమాదం క్రికెటర్ జీవితాన్ని ఏ విధంగా మార్చుతుందో అర్థం చేసుకోవాలంటే.. 63 ఏళ్ల క్రితం జరిగిన ఒక కారు ప్రమాదం గురించి మీరు తెలుసుకోవాలి.
రాడ్‌క్లిఫ్ నుంచి లండన్‌కి రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో స్టాఫోర్డ్‌షైర్ వద్ద 1959 సెప్టెంబర్ 6న ఈ ప్రమాదం జరిగింది.
ఆ సమయంలో ఈ కారులో ముగ్గురు అంతర్జాతీయ క్రికెటర్లున్నారు.
వారిలో ఒకరు చనిపోగా.. మరో వ్యక్తి అంతర్జాతీయ క్రికెట్‌లో తిరిగి ఆడే అవకాశాన్నే కోల్పోయాడు.
మూడో వ్యక్తి ఆ ఇబ్బందులన్నింటిన్ని ఎదుర్కొని, ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ ఆల్-రౌండర్‌గా నిలిచాడు.
ఈ ప్రమాదం జరిగిన కారులో ముగ్గురు వెస్టిండీస్ క్రికెటర్లున్నారు. ముందుగా అనుకున్న ప్రకారమైతే, ఆ కారులో నలుగురు ప్రయాణించాల్సి ఉంది. కానీ, నాలుగో వ్యక్తి సరైన సమయానికి అందుకోకపోవడంతో.. ముగ్గురు మాత్రమే లండన్‌కి బయలుదేరారు.
ఆ ముగ్గురు క్రికెటర్లలో కోలీ స్మిత్, టామ్ డ్యూడ్నీ, మరో క్రికెటర్ కారు నడిపే వ్యక్తి. అతనే ఈ ప్రమాదం తర్వాత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్-రౌండర్‌గా పేరు పొందాడు.
ఈ ప్రమాదానికి ముందు కోలీ స్మిత్ వెస్టిండీస్ తరఫున 26 టెస్ట్ మ్యాచులను ఆడాడు. ఈ 26 మ్యాచులలో, 1331 పరుగులు తీశాడు. స్పిన్ బౌలర్‌గా 48 వికెట్లు తీశాడు.
ఈ గణాంకాలే చెబుతున్నాయి.. అతనెంతో అద్భుతమైన క్రికెటరో.
బలమైన ఆస్ట్రేలియా జట్టుపై ఆటలోకి దిగడంతోనే సెంచరీ చేశాడు.
ఇంగ్లాండ్ సీమర్లకు అనుకూలించే పిచ్‌పై కూడా రెండు సార్లు సెంచరీలు చేసి తన సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్‌లో 161, 168 పరుగులు చేశాడు.
దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో స్పిన్ బౌలర్లు ఖంగుతినేలా తన కెరీర్‌లో నాలుగో సెంచరీని చేశారు.
ఆ సమయం నుంచి వెస్టిండీస్ క్రికెట్‌లో అతడిని ఒక ధీటైన ఆటగాడిగా భావించే వారు.
గ్యారీ సోబర్స్ రాసుకున్న ఆటోబయోగ్రఫీలో కోలీ స్మిత్ గురించి ప్రస్తావించాడు. ‘‘ఈయన అద్భుతమైన ఆఫ్-స్పినర్. అత్యుత్తమ ఆల్-రౌండర్‌గా అవతరించేందుకు అతనికి సత్తా ఉంది. అంతేకాక, ప్రపంచంలోనే ఉత్తమ ఆల్-రౌండర్‌గా కూడా అతనే’’ అని పేర్కొన్నాడు.
ఈ కారులో ప్రమాదానికి గురైన మరో క్రికెటర్ టామ్ డ్యూడ్నీ. టామ్ కుడి చేతి ఫాస్ట్ బౌలర్. వెస్టిండీస్ కోసం ఆడిన 9 టెస్టులలో 21 వికెట్లు తీశాడు.
కారు బయలు దేరడానికి ముందు సరైన సమయానికి అందుకోలేని నాలుగో క్రికెటర్ రాయ్ గిల్‌క్రిస్ట్. ఇతను కూడా కుడి చేతి ఫాస్ట్ బౌలర్. వెస్టిండీస్ తరఫున ఆడేవాడు.
13 టెస్టులలో 57 విక్కెట్లను తీశాడు.
ఇంతకీ ఆ మూడో క్రికెటర్ ఎవరనే ఆసక్తి మీలో ఈపాటికి పెరిగిపోయే ఉంటుంది. అతనే గ్యారీ సోబర్స్.
అవును, గ్యారీ సోబర్స్ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్-రౌండర్లలో ఒకరు.
ప్రమాదం జరిగేంత వరకు వెస్టిండీస్ క్రికెట్ మైదానంలో గ్యారీ సోబర్స్ అద్భుతాలు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 365 పరుగులతో అతని బెస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలుపుకున్నాడు.
27 టెస్ట్ మ్యాచులలో, ఆరు సెంచరీలతో 2 వేలకు పైగా పరుగులు చేశాడు.
లండన్ వస్తుండగా ప్రమాదం...
గ్యారీ సోబర్స్ ఈ ప్రమాదం గురించి తన ఆటోబయోగ్రఫీలో వివరించారు.
‘‘ఛారిటీ మ్యాచ్ కోసం మేము తర్వాత రోజు లండన్‌కి వెళ్లాల్సి ఉంది. మేము నలుగురం వెళ్లాలి. రాయ్ గిల్‌క్రిస్ట్ కోసం మేము గంటకి పైగా వేచిచూశాం. రాయ్ రాకపోయే సరికి మేము ముగ్గురమే లండన్‌కి వెళ్దామని నిర్ణయించుకున్నాం. కొద్దిసేపు వేచిచూద్దామని నేను కోరాను. కానీ, ఎవరికి తెలుసు. మా అదృష్టం మరో రకంగా ఉంటుందని. గతాన్ని మళ్లీ మనం వెనక్కి తీసుకురాలేం. మీరు తీసుకురాగలరా?’’ అని గ్యారీ సోబర్స్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు.
గ్యారీ సోబర్స్ తన ఆటోబయోగ్రఫీలో ఈ ప్రమాదం గురించి రాసుకున్న పేజీలను తిరగేేస్తే ఆ నాటి ఘటన కళ్ళకు కడుతుంది.
రాడ్‌క్లిఫ్ నుంచి లండన్‌కు నాలుగు గంటల సమయం పడుతుంది.
తొలుత ఈ కారును కోలీ స్మిత్ డ్రైవ్ చేశాడు. కొంత దూరం ప్రయాణించాక డ్రైవింగ్‌కు టామ్‌కి ఇచ్చాడు. గ్యారీ సోబర్స్ వంతు వచ్చినప్పుడు, టామ్ ముందు సీట్లో కూర్చుంటే, కోలీ నిద్రపోయేందుకు వెనుక సీట్లోకి వెళ్లాడు.
ఈ ప్రమాద సమయంలో జరిగిన ప్రతి సంఘటనను గ్యారీ సోబర్స్ ఆటోబయోగ్రఫీలో వివరంగా రాసుకున్నారు.
‘‘మేం స్టాన్‌ఫోర్డ్‌షైర్ ఏ34 నెంబర్ వద్దకు వచ్చినప్పుడు తెల్లవారుజామున 4.45 అయింది. ఈ రోడ్డులో ముందు కాస్త వంపులున్నాయి. ముందు రెండు లైట్ల వెలుతురు కళ్లలో పడింది. ఆ సమయంలో నా వద్ద ఎలాంటి అవకాశం లేదు. కానీ, ఏదో ఒకటి చేయాలి. సమయం కూడా లేదు. నా కళ్ల ముందు అంతా చీకటిగా మారిపోయింది. నాకు గుర్తున్న వరకు కారు క్రాష్ అయింది. ముందుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టానని నాకు తెలిసింది. కొన్ని క్షణాల పాటు నేను స్పృహ కోల్పోయాను. ’’ అని గ్యారీ సోబర్స్ తన ఆటోబయోగ్రఫీలో తెలిపాడు.
‘‘స్పృహలోకి వచ్చిన తర్వాత కొన్ని మాత్రమే నాకు గుర్తు ఉన్నాయి. టామ్ పెద్దగా ఏడుస్తున్న దృశ్యాలను నేను చూశాను. అతనికి పెద్ద గాయమై ఉంటుందని అనిపించింది. నేలపై కోలీ పడి ఉన్నాడు. కంగారుగా వెళ్లి, ఎలా ఉన్నావు? అని అడిగాను. అతను బాగానే ఉన్నట్టు చెప్పాడు. వెళ్లి టామ్‌ని చూడమన్నాడు. టామ్ దగ్గరికి వెళ్లి, బయటికి తీశాను. అంబులెన్స్ వచ్చేంత వరకు అతన్ని ఓదార్చుతూనే ఉన్నాను. నా మణికట్టు విరిగింది. నా కళ్లు, చేతులకి గాయాలయ్యాయి. ’’ అని గ్యారీ సోబర్స్ ఆ ప్రమాదం గురించి తన ఆటోబయోగ్రఫీలో పేర్కొన్నాడు.
ఈ ముగ్గురు క్రికెటర్లను ఆస్పత్రుల్లో వివిధ రూమ్‌లలో ఉంచారు. సోబర్స్ లేవగానే, తొలుత కోలీ గురించే అడిగాడు.
1957 ఇంగ్లాండ్ టూర్ నుంచి సోబర్స్, కోలి రూమ్మేట్స్‌గా ఉండేవారు.
కోలీ స్మిత్ గురించి సోబర్స్ ఏం రాశాడంటే.. ‘‘1957 పాకిస్తాన్ పర్యటనలో నేను అతని సూచనల వల్ల ఎంతో లాభపడ్డాను. కోలీ మాటలు నా మనస్సుని తేలికపర్చేవి. అతను చాలా ఆధ్యాత్మికమైన వ్యక్తి. ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారించేవాడు. చర్చిలో ప్రార్థనలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడేవాడు. మేము అతన్ని టీమ్‌లో బోధకుడిగా పిలిచే వాళ్లం’’ అని చెప్పాడు.
కోలీ గురించి డాక్టర్లను అడిగినప్పుడు, అతను స్పృహలో లేడని, వెన్నెముక దెబ్బతిందని చెప్పారు. ఇది విన్న తర్వాత సోబర్స్ అసలు నమ్మలేకపోయాడు. మూడు రోజుల పాటు కోలీ స్మిత్‌ను కాపాడేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. కానీ, సెప్టెంబర్ 9న, కేవలం 26 ఏళ్ల వయసులోనే కోలీ స్మిత్‌కు ప్రపంచమంతా కన్నీటి వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది.
ఆ తర్వాత, డ్రైవింగ్‌ను సరిగ్గా చేయని కారణంగా సోబర్స్‌కు 10 పౌండ్ల జరిమానా విధించారు. ఆ ప్రమాదం సోబర్స్‌ని తీవ్ర మనస్థాపంలోకి నెట్టేసింది.
ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో వెస్టిండీస్ తరఫున వీరు ఆడాల్సి ఉంది. కానీ, కోలీ స్మిత్ మరణంతో, సోబర్స్ మానసిక పరిస్థితి క్షీణించింది. ఆ తర్వాత వెస్టిండీస్ మ్యాచులకు తిరిగి వెళ్లలేదు.
కోలీ మరణం తర్వాత, సోబర్స్ మద్యానికి బానిసయ్యాడు.
‘‘మేము ఇద్దరం కలిసి ఆడినప్పుడు, నేను ఎక్కువగా డ్రింక్ చేయలేదు. అతను లేనప్పటి నుంచి నేను ఎక్కువగా తాగాను. రాత్రంతా తాగినా, అది నా ఆటపై ప్రభావం చూపకపోవడం నా అదృష్టం. రాత్రంతా తాగుతూనే ఉండే వాడిని.’’ అని సోబర్స్ తన ఆటోబయోగ్రఫీలో రాశాడు.
సోబర్స్ ఈ పరిస్థితిలో కూరుకుపోయిన సమయంలో, ఇంగ్లాండ్‌లోని కొందరు వెస్టిండీస్ క్రికెటర్లు ఆయనను మళ్లీ ట్రాక్‌లో పెట్టేందుకు ప్రయత్నించారు.
కొద్ది కాలం తర్వాత, తాను మద్యానికి బానిస కావడం టీమ్‌కు పెద్ద దెబ్బగా భావించాడు. ఈ సంఘటలన్నింటిన్ని సోబర్స్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు.
‘‘సోబర్స్ కోసం నేను ఆడటం లేదు. కానీ, కోలీ బాధ్యత, నా బాధ్యత అంతా నా భుజాలపైనే ఉంది. నా జీవితమంతా మారిపోయింది. బాధ్యతలన్నింటిన్ని నా భుజాలపై పెట్టుకున్నాను. ’’ అని తెలిపాడు.
ఈ ప్రమాదం జరిగిన మూడు నెలల తర్వాత, సోబర్స్ వెస్టిండీస్ వెళ్లాడు.
ఇంగ్లాండ్ మీద తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. సోబర్స్ ఈ మ్యాచ్ గురించి కూడా తన ఆటోబయోగ్రఫీలో రాశాడు.
‘‘క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత, ఇద్దరు వ్యక్తుల కోసం నేను ఆడాలి. దీని కోసం నేను చాలా కష్టపడాలని గుర్తించాను. ప్రతి పరుగులో నేను కోలీని గుర్తు చేసుకుంటాను. ఫ్రెడ్ ట్రూమ్యాన్ నన్ను క్లీన్ బౌల్డ్ చేసే సమయానికి నేను 226 పరుగులు చేశాను.
కొన్ని వారాల తర్వాత కోలీ సొంత మైదానంలో 147 పరుగులు చేశాను. కోలీ ఎప్పటికీ నా వెన్నంటే ఉన్నాడు’’ అని సోబర్స్ రాసుకున్నారు.
తన పరుగుల సగటును పెంచుకున్న తర్వాత.. సుదీర్ఘకాలం పాటు సోబర్స్ క్రికెట్ ఆడాడు. 93 టెస్ట్ మ్యాచులలో 8 వేలకు పైగా పరుగులు చేశాడు. ఈ ప్రమాదం తర్వాత టెస్ట్ క్రికెట్‌లో 200కి పైగా టెస్ట్ వికెట్లు తీశాడు. మొత్తంగా తన పేరుపై 235 వికెట్లు తీశాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్-రౌండర్లలో ఒకరిగా ఈయన నిలిచాడు.
87 ఏళ్ల సోబర్స్ ప్రస్తుతం అన్ని క్రికెట్ ఈవెంట్లకు వెళ్తుంటాడు. ప్రస్తుతం టామ్ డ్యూాడ్ని వయసు 89 ఏళ్లు.
కోలీ స్మిత్ చనిపోయిన తర్వాత అతని మృతదేహం జమైకా చేరుకున్నప్పుడు, అతని అంత్యక్రియల కోసం 60 వేల మంది హాజరయ్యారు. వీరి అభిమానం చూస్తేనే చెప్పొచ్చు. కోలీ ఆటతీరుపై ఎంత విశ్వాసం ఉందో.
జమైకా జర్నలిస్టు కెన్ చాప్లిన్ కూడా ‘‘హ్యాపీ వారియర్’’ పేరుతో కోలీ స్మిత్‌పై బుక్ రాశారు.
కోలీ స్మిత్ ఇల్లు ఉన్న వీధికి ఆయన జ్ఞాపకార్థంగా కోలీ స్మిత్ రోడ్డుగా పెట్టారు.
ఇవి కూడా చదవండి:
- కాపు రిజర్వేషన్లు: కేంద్రం ప్రకటనలో మతలబు ఏమిటి? బీజేపీ వ్యూహం ఏమిటి?
- మోదీ ప్రధాని అవుతారని హీరాబెన్ 2002లోనే చెప్పారా?
- 2022లో మరిచిపోలేని 5 అత్యంత దారుణ హత్యలు ఇవే...
- అమెరికా మహిళల క్రికెట్ జట్టులో సగం మంది తెలుగు అమ్మాయిలే...
- ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు ఇరుకు సందులు, రోడ్లపైనే సభలు ఎందుకు పెడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)