You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రంప్ 'శాంతి బోర్డు'లోకి పాకిస్తాన్, భారత్ ఏం చేయనుంది?
- రచయిత, రౌనక్ భైరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గాజా కోసం 'బోర్డ్ ఆఫ్ పీస్’ ని ఏర్పాటు చేశారు. గాజాలో సమగ్ర శాంతి నెలకొల్పడంలో భాగంగా పాలన, పునర్నిర్మాణం, పెట్టుబడులను పర్యవేక్షించడానికి ఈ బోర్డును రూపొందించారు.
భారత్, పాకిస్తాన్, జోర్డాన్, హంగేరీ, తుర్కియే, ఈజిప్ట్, అర్జెంటీనా సహా అనేక దేశాల నాయకులను ఈ బోర్డులో చేరాలని ఆహ్వానించారు.
గాజా పునర్నిర్మాణం, శాశ్వత కాల్పుల విరమణ కోసం 'శాంతి బోర్డు'లో పాకిస్తాన్ చేరుతుందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ధ్రువీకరించారు. బోర్డులో చేరడానికి గురువారం స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు తుర్కియే ప్రకటించింది.
"గాజాకు శాశ్వత శాంతి తీసుకురావడానికి బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. స్థిరత్వం, శ్రేయస్సు సాధించడానికి ఈ బోర్డు సమర్థవంతమైన పాలనకు మద్దతు ఇస్తుంది" అని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్ పోస్టులో తెలిపారు.
భారతదేశాన్ని పీస్ బోర్డులో చేరమని ఆహ్వానించినప్పటికీ, భారత్ ఇంకా ఆహ్వానాన్ని అంగీకరించలేదు లేదా తిరస్కరించలేదు. అయితే, భారత్ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
శాంతి బోర్డుతో సమస్యలు ఏమిటి?
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం "గాజా గురించి బోర్డ్ ఆఫ్ పీస్ ముసాయిదా చార్టర్ కనీసం ప్రస్తావించలేదు.వేగవంతమైన, ప్రభావవంతమైన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ సంస్థ అవసరాన్ని చార్టర్ చెబుతోంది.
'శాశ్వత శాంతి' సాధనకు బోర్డు పనిచేస్తుందని చార్టర్ పేర్కొంది. సంఘర్షణ కొనసాగుతున్న ప్రాంతాలలోనే కాకుండా 'సంఘర్షణ ముప్పు' ఉన్న ప్రాంతాలలో కూడా ఇది చురుకుగా ఉంటుందని తెలిపింది. అయితే, 'సంఘర్షణ ముప్పు' అంటే ఏమిటో చార్టర్ నిర్వచించలేదు.
ఈ బోర్డు డోనల్డ్ ట్రంప్ అధ్యక్షతన పనిచేయనుంది. ఆయన అమెరికా అధ్యక్షుడిగా కొనసాగినా లేకున్నా దానితో సంబంధం లేకుండా ఆయన చైర్మన్‌గా ఉంటారు. ట్రంప్ రాజీనామా చేస్తే లేదా కార్యనిర్వాహక బోర్డు సభ్యులందరూ ఆయనను అనర్హులుగా ప్రకటిస్తేనే చైర్మన్‌ను తొలగించవచ్చు. అయితే, కార్యనిర్వాహక బోర్డులో ట్రంప్ ఎంపిక చేసిన వ్యక్తులే ఎక్కువగా ఉండబోతున్నారు.
ఈ "శాంతి బోర్డు"లో అమెరికా సభ్యత్వాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకించింది. బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ప్రారంభ చర్చలలో తనను చేర్చలేదని పేర్కొంది. ఇజ్రాయెల్ అధికారులతో చర్చించకుండా బోర్డు నిర్ణయం తీసుకున్నారు. కానీ తరువాత ఈ బోర్డులో చేరే ఆహ్వానాన్ని ఇజ్రాయెల్ తరువాత అంగీకరించింది.
నిపుణులు ఏమంటున్నారు?
ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, జిందాల్ సెంటర్ ఫర్ ఇజ్రాయెల్ స్టడీస్ డైరెక్టర్ ఖిన్వరాజ్ జంగిడ్ మాట్లాడుతూ "బోర్డ్ ఆఫ్ పీస్ తుర్కియే, ఖతార్ వంటి దేశాలుండటంతో ఈ బోర్డు ఏర్పాటుపై ఇజ్రాయెల్ ఏకీభవించలేదు. కానీ అమెరికా ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించే స్థితిలో లేదు.అయితే బోర్డులో ఎవరి అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వాలనే విషయంపై తరువాత డిమాండ్ చేసే అవకాశం ఉంది" అన్నారు.
"డోనల్డ్ ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్' వివరాలు, గాజా పునర్నిర్మాణం ప్రణాళిక సహా చాలావరకు అస్పష్టంగా ఉన్నాయి" అని జామియా మిలియా ఇస్లామియాలోని సెంటర్ ఫర్ వెస్ట్ ఏషియన్ స్టడీస్‌లో ప్రొఫెసర్ సుజాత ఐశ్వర్య అంటున్నారు.
"పాలస్తీనా కోసం దాని ప్రతినిధులు లేకుండా ఈ బోర్డును ఏర్పాటు చేయడం వింతగా ఉంది. ఇది వలసవాద ఆలోచన వంటిది, ఇక్కడ ఒక బయటి దేశం వచ్చి పునర్నిర్మాణం చేస్తుంది" అన్నారు.
ట్రంప్ నాయకత్వంలో ఏర్పడుతున్న "బోర్డ్ ఆఫ్ పీస్" యూరోపియన్ దౌత్యవేత్తలలో ఆందోళన కలిగిస్తోంది. ఈ బోర్డు గాజాను దాటి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే, అది ఐక్యరాజ్యసమితిని బలహీనపరుస్తుందని భయపడుతున్నారు.
"ఇది ఐక్యరాజ్యసమితి ప్రాథమిక నియమాలను విస్మరించే 'ట్రంప్ యునైటెడ్ నేషన్స్' లాంటిది" అని ఒక దౌత్యవేత్త రాయిటర్స్‌తో అన్నారు.
ఈ ప్రణాళిక ముందుకు సాగితే ఐక్యరాజ్యసమితిని బలహీనపరుస్తుందని మరో ముగ్గురు పాశ్చాత్య దౌత్యవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఇజ్రాయెల్‌కు చెందిన ఒక మూలం ప్రకారం, "శాంతి బోర్డు గాజాకే పరిమితం కాకుండా, ట్రంప్ తాను పరిష్కరించినట్లు చెప్పుకునే అన్ని వివాదాలను పర్యవేక్షించడానికి దాని బాధ్యతను విస్తరించాలని కోరుకుంటున్నారు".
"సభ్య దేశాలు వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి తనకు కేటాయించిన పనిని కొనసాగిస్తుంది" అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి అన్నారు.
ఐక్యరాజ్యసమితి మాత్రమే ప్రతి దేశాన్ని, అది చిన్నదైనా, పెద్దదైనా ఏకతాటిపైకి తీసుకురాగలదని, దానిని అనుమానంతో చూస్తే 'చీకటి కాలం' వస్తుందని ఐక్యరాజ్యసమితి సీనియర్ అధికారి ఒకరు అన్నారు.
ప్రతిపక్షాలు ఎలా స్పందించాయి?
శాంతి బోర్డుపై భారత్‌లోని వామపక్షాలైన సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్, ఆర్‌ఎస్‌పీ, ఏఐఎఫ్‌బీ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
"'బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరాలనే అమెరికా ప్రతిపాదనను అంగీకరించవద్దని భారత ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాం. 'గాజా శాంతి ప్రణాళిక'ను అమలు చేయడానికి ఈ బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోర్డులో భారత్ పాల్గొనడం పాలస్తీనా హక్కులను గౌరవించదు, కాబట్టి ఇది పాలస్తీనా సమస్యకు పెద్ద ద్రోహం అవుతుంది. ఈ బోర్డును అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. ఇది ఐక్యరాజ్యసమితిని మించి, అమెరికా పూర్తి నియంత్రణ ఉండే కొత్త అంతర్జాతీయ నిర్మాణాన్ని సృష్టించే ప్రయత్నం. ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ సంస్థలను బలహీనపరచడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాలి" అని తెలిపాయి.
కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఐఏఎన్ఎస్ వార్తాసంస్థతో మాట్లాడుతూ, "బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరాలా వద్దా అనేది భారత ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. దేశంలో కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి ఈ ఆహ్వానాన్ని బహిరంగంగా పంచుకున్నారు. కాబట్టి, ముందుగా భారత ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావాలి, ఆపై మాత్రమే ఇతరులు దానిపై వ్యాఖ్యానించడం సముచితం" అన్నారు.
"ఈ బోర్డు గాజా పునర్నిర్మాణం కోసం కాదు, పాలస్తీనా భూమిని నాశనం చేసి లాభం పొందేందుకు ఏర్పాటుచేస్తున్నారు. పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ ఆక్రమణను ముగించడంపై శాంతి ప్రణాళికలో స్పష్టంగా ఏమీ లేదు" అంటూ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ ఎంపీ ఎంఏ బేబీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
"ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ తిరస్కరించాలి. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమాన్ని ఖండించాలి. భారత్ తన దీర్ఘకాల సంప్రదాయానికి అనుగుణంగా, ఆక్రమణదారులు, వలసవాదులను వ్యతిరేకించాలి. పాలస్తీనా ప్రజలతో సంఘీభావం ప్రకటించాలి" అని తెలిపారు.
శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది తన ఇన్‌స్టాగ్రాం పోస్టులో "గాజా శాంతి బోర్డుకు పాకిస్తాన్‌ను కూడా ఆహ్వానించారు. తన సొంత దేశంలో, దాని పొరుగున లేదా ప్రపంచంలో ఎప్పుడూ శాంతిని ప్రోత్సహించని దేశాన్ని చేర్చడం హాస్యాస్పదం. ఈ ఆహ్వానానికి భారత్ 'ధన్యవాదాలు' చెప్పి, ఆపై 'వద్దు' అని చెబుతుందని ఆశిస్తున్నాం" అని రాశారు.
'శాంతి బోర్డు'లో చేరాలా?
'ఇది గాజా, అరబ్ దేశాల సమస్య' అని భారత్ దానిలో జోక్యం చేసుకోకూడదని మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ అంటున్నారు.
"ఈ వార్త నిజమైతే, సమాధానం 'వద్దు ధన్యవాదాలు' అని చెప్పాలి. ఐక్యరాజ్యసమితి ఆమోదం లేకుండా ఏకపక్షంగా సృష్టించిన సెటప్‌లో భారత్ పాల్గొనకూడదు. దీనిలో అనేక సంక్లిష్టతలు దాగి ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీల వాణిజ్య ప్రయోజనాలున్నాయి. దీన్ని అరబ్ దేశాలు నిర్వహించనివ్వండి" అని ఎక్స్ పోస్టులో తెలిపారు సిబల్.
"ఇది భారతదేశానికి సవాలుతో కూడిన పరిస్థితి" అని జేఎన్‌యూలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ప్రొఫెసర్ రాజన్ కుమార్ అభిప్రాయపడ్డారు.
"బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతిపాదనను అంగీకరించడంలో, తిరస్కరించడంలో భారత్ కొన్ని రిస్క్‌లు తీసుకోవలసి రావచ్చు. భారతదేశం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే, డోనల్డ్ ట్రంప్‌కు కోపం రావచ్చు. ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసే అవకాశాన్ని కూడా భారత్ కోల్పోవచ్చు" అన్నారు.
"బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరాలనే ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తే, ట్రంప్ వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు రావచ్చు. ఈ బోర్డులో ట్రంప్‌కు ఎక్కువ అధికారం ఉంది, ఆయనకు మద్దతుగల వ్యక్తులు ఎక్కువగా దానిలో ఉన్నారు. డోనల్డ్ ట్రంప్ ప్రజాస్వామ్యబద్ధంగా బోర్డును నడిపే అవకాశం లేదు. తన సొంత ప్రజల అభిప్రాయాల కంటే ఇతర దేశాల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు" అన్నారు రాజన్ కుమార్.
"శాంతి బోర్డులో సభ్యుల నియామకంపై ట్రంప్ ఇజ్రాయెల్‌తో చర్చించకపోవడం పట్ల ఆ దేశం అసంతృప్తిగా ఉంది. కానీ, తరువాత అంగీకరించింది. భారత్ ఈ బోర్డులో భాగమైతే, అమెరికాతో సంబంధాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా, భారత్ తన చొరవను వ్యతిరేకించలేదని డోనల్డ్ ట్రంప్‌కు సానుకూల సందేశాన్ని కూడా పంపుతుంది" అని మిడిల్ ఈస్ట్ వ్యవహారాల నిపుణుడు, ఐసీడబ్ల్యూఏలో సీనియర్ ఫెలో డాక్టర్ ఫజ్జూర్ రెహమాన్ అన్నారు.
ప్రొఫెసర్ సుజాత ఐశ్వర్య మాట్లాడుతూ, "భారత్ ఇందులో చేరితే, అది అమెరికాతో ముందుగానే మూడు విషయాలను స్పష్టం చేసుకోవాలి. మొదటిది, తాత్కాలిక పాలన గాజాలో ఎంతకాలం ఉంటుంది. రెండవది, చట్టబద్ధమైన పాలస్తీనా పాలన కోసం ఏ చర్యలు తీసుకుంటారు. మూడవది, మానవతా భద్రత, పునర్నిర్మాణ సమయంలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఒప్పందాలను ఎవరు పొందుతారు, అవి పారదర్శకంగా ఉండాలి" అన్నారు.
భారత విదేశాంగ విధానం ఇజ్రాయెల్, పాలస్తీనా పట్ల 'టు స్టేట్ సొల్యూషన్'లో ఒకటి. దీని ప్రకారం, పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు వేర్వేరు దేశాలుగా ఉంటాయి. రెండు వేర్వేరు సంస్కృతులు, మతాల ప్రజలు శాంతియుతంగా కలిసి జీవించడానికి వీలు కల్పిస్తాయి. అయితే, శాంతి బోర్డులో చేరడం భారత తన సంప్రదాయ విదేశాంగ విధానం నుంచి బయటికి వచ్చినట్లు సూచిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దీనిపై మిడిల్ ఈస్ట్ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ ఫజ్జూర్ రెహమాన్ స్పందిస్తూ, "ప్రస్తుతం, డోనల్డ్ ట్రంప్ గాజా పునర్నిర్మాణం గురించి మాట్లాడారు. వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఆక్రమిస్తుందని చెప్పలేదు. దీనిని పరిశీలిస్తే, శాంతి బోర్డు 'టు స్టేట్ సొల్యూషన్'కు వ్యతిరేకం కాదు. గాజాకు అనుకూలంగా ఉన్న తుర్కియే వంటి దేశాలు కూడా ఈ బోర్డులో భాగం కావచ్చు" అన్నారు.
"భారతదేశం ట్రంప్ ప్రతిపాదనను అంగీకరించకూడదు కానీ, తిరస్కరణను దౌత్యపరంగా వ్యక్తపరచాలి. మన చర్యను నిర్ణయించే ముందు ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి" అని భారత మాజీ దౌత్యవేత్త కె.పి. ఫాబియన్ ఏఎన్ఐతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)