పోషకాలతో కూడిన వంట చేయడమెలాగో ఏఐ పర్ఫెక్ట్‌గా చెబుతుందా?

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్ బిర్యానీ. ఇది ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాదు. దేశ, విదేశాల్లోనూ దీన్ని తయారు చేస్తారు. అన్నిచోట్లా హైదరాబాద్ బిర్యానీ మసాలా దినుసులు ఒకేలా ఉన్నా రుచిలో తేడా ఉంటుంది.

ఇలా ఎందుకు జరుగుతుంది?

ఒక్క బిర్యానీయే కాదు, భారతీయ వంటకాల్లోని పోషక విలువలను గుర్తించి, తదనుగణంగా రోబోటిక్ కుకింగ్ పద్దతులు రూపొందిస్తే సమతుల పోషకాహారం అందించడానికి వీలుంటుందనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) బృందం పరిశోధనలు చేసింది.

ఇందుకోసం కంప్యూటర్ విజన్ టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకున్నారు.

డిసెంబరులో జరిగిన ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ విజన్, గాఫిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ సదస్సులో వీరు తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.

బిర్యానీపై పరిశోధనలో ఏం తేలింది?

''భారతీయ వంటకాల్లో ప్రధానమైనది థాలీ. అందులో అనేక రకాల వెరైటీలు ప్లేటులో కనిపిస్తుంటాయి. వాటిని విశ్లేషించడం ఒకేసారి వీలవ్వకపోవచ్చు. అందుకే ముందుగా బిర్యానీని ఎంచుకున్నాం'' అని ట్రిపుల్ ఐటీలోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ సీవీ జవహర్ చెప్పారు.

ఇందుకోసం యూట్యూబ్‌లో బిర్యానీ తయారీపై వచ్చిన 120 వీడియోలను విశ్లేషించామని చెప్పారు రీసెర్చర్ ఫర్జానా. సీవీ జవహర్ నేతృత్వంలో ఫర్జానా, యశ్ అరోరా, ఆదిత్య అరుణ్ ఈ పరిశోధనలో పాల్గొన్నారు.

''అంబుర్, బాంబే, దిండిగల్, దొన్నె, హైదరాబాదీ, కశ్మీరీ, కోల్‌కతా, అవధీ, మలబార్, మొఘలాయి, సింధీ రకాల బిర్యానీ తయారీకి సంబంధించిన వీడియోలు విశ్లేషించాం. పేరు, వాటిలో వాడుతున్న మసాలా దినుసులు ఒకే రకంగా ఉన్నప్పటికీ, బిర్యానీ తయారీ విధానంలో తేడాలు గుర్తించాం’’ అన్నారు ప్రొఫెసర్ సీవీ జవహర్.

''ఉదాహరణకు హైదరాబాద్ బిర్యానీ, అవధి బిర్యానీ మధ్య మసాలా వినియోగంలో తేడా గుర్తించాం. మసాలాలు ఎప్పుడు వేస్తారు.. ఏ పాత్రల్లో వండుతారు.. ఎంతసేపు వండుతారు.. ఈ అంశాలతోనే రుచి మారుతోంది'' అని చెప్పారు.

ఇలాంటి విషయాలు యూట్యూబ్‌లో ఉండే వీడియోల్లో కొన్నిసార్లు అందుబాటులో ఉండవని చెప్పారు ఫర్జానా.

''వంట వీడియోల విశ్లేషణలో భాగంగా వంట చేసే క్రమం, మసాలాల వాడకం, పాత్రల వినియోగం వంటి అంశాలను అధ్యయనం చేశాం'' అని ఫర్జానా చెప్పారు.

పోషక విలువల అంచనా

భారతీయ వంటకాలపై పరిశోధన చేసి అందులో ఉండే పోషకాలను అంటే మాంసకృత్తులు, కొవ్వు, పిండి పదార్థాలను అంచనా వేస్తే దానికి తగినట్టు వంట చేసే పద్ధతులను సులభతరం చేయవచ్చనేది పరిశోధకులు చెబుతున్న మాట.

గతంలో పుస్తకాల్లో చదువుతూ వంటలు చేయడం కనిపించేది. ఇప్పుడు చాలావరకు యూట్యూబ్‌లో వంటల వీడియోలు చూస్తూ వంట చేస్తున్నారు.

''యూట్యూబ్ వీడియో చూస్తూనే అవసరమైన పదార్థాలు, మసాలాలు కలుపుతుంటారు. ఇందుకు వీడియో కాసేపు పాజ్ చేసి మళ్లీ మొదలు పెడుతుంటారు'' అని ప్రొఫెసర్ జవహర్ అన్నారు.

తమ పరిశోధన ద్వారా భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వంటను రియల్‌టైమ్‌లో గమనిస్తూ రోబోటిక్ పద్ధతుల్లో చేసే విధానం తేవాలనుకుంటున్నామని చెప్పారు.

''వంటలో మసాలాలు ఎంత అవసరం అవుతాయి.. ఉప్పు ఎంత పడుతుంది.. వంటకం ఉండికిందా.. లేదా.. ఏఐ సాయంతో ఇలా అన్ని విషయాలు విశ్లేషించే మోడల్ తయారు చేయాలనేది మా లక్ష్యం'' అని చెప్పారాయన.

పోషక విలువలు కూడా రియల్ టైమ్ లో లెక్కించే దిశగా ఏఐ మోడల్ రూపొందిస్తున్నట్లు వివరించారు.

''భారతీయ భోజనం ట్రాకింగ్ అంత సులువు కాదు''

ప్రస్తుతం ఫుడ్ ట్రాకింగ్ యాప్స్ చాలా వరకు విదేశీవంటలను దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. పిజ్జా, బర్గర్‌వంటి వాటిని ఈ యాప్‌లు సులువుగా గుర్తించి అందులో పోషకాలు, ఏయే పదార్థాలు వాడారో కనిపెట్టి చెప్పగలవని పరిశోధకులు చెబుతున్నారు.

అయితే, ఒక ప్లేటులోని భారతీయ భోజనాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదని అంటున్నారు.

"రోజువారీ భోజనంలో ఉండే సాంబారు, పప్పు.. రెండూ ఒకేలా కనిపించవచ్చు. ఒకరోజు పసుపు రంగులో ఉండే పప్పు, మరొక రోజు పాలకూర వేసిన కారణంగా పచ్చగా కనిపించవచ్చు. దానివల్ల పప్పు, కూర అని ఫుడ్ ట్రాకింగ్ యాప్ గుర్తించలేకపోవచ్చు" అని యశ్ అరోరా చెబుతారు.

ఈ ఇబ్బందులు నివారించేందుకు జీరో షాట్ విధానం రూపొందించామని చెప్పారాయన.

జీరో షాట్ విధానం అంటే…

ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం అందిస్తుంటారు. వాటిల్లో పోషక విలువలు గుర్తించాలంటే రోజూ అందించే మెనూను విశ్లేషించాలి.

సాధారణంగా ఆసుపత్రుల్లో సర్జరీలు జరిగిన తర్వాత రోగులకు ఆహారం సమపాళ్లలో అందించాల్సి ఉంటుంది. ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, కార్బొహైడ్రేట్లు.. ఇలా అన్నింటిని సమతూకంలో అందించాలి.

ఒక ప్లేటు భోజనంలో ఏయే పదార్థాలు ఉంచారో విశ్లేషించి.. అందులో పోషక విలువలు ఎంత ఉన్నాయో తెలుసుకుని ఇవ్వడం అంత సులభం కాదని పరిశోధకులు చెబుతున్నారు.

''మేం అభివృద్ధి చేసిన జీరో షాట్ విధానంలో ఏఐ టూల్స్ ను మళ్లీ మళ్లీ ట్రెయిన్ చేయనక్కర్లేదు'' అని చెప్పారు సీవీ జవహర్.

జీరో షాట్ విధానంలో ముందుగా ఆహారంలోని వంటకాలు లేదా పదార్థాలు గుర్తిస్తారు. కానీ వాటి పేరేమిటో ముందే చెప్పరు. ఆ తర్వాత ప్రోటోటైప్ మ్యాచింగ్ విధానంతో ఆహారాన్ని గుర్తిస్తారు.

అలా ఏఐ టూల్స్ వాటంతట అవే ఆహారాన్నిగుర్తించి విశ్లేషించి డేటా తయారు చేసుకుంటాయి.

తర్వాత ఎప్పుడైనా ఆహారం గుర్తించగానే అందులో ఉండే పోషక పదార్థాలు ఏఐ సాయంతో జీరోషాట్ విధానంలో సులువుగా తెలిసిపోతాయని ప్రొఫెసర్ సీవీ జవహర్ విశ్లేషించారు.

''జీరోషాట్ విధానంలో భాగంగా ప్రస్తుతం మేం తయారు చేసిన మోడల్ ఓవర్‌హెడ్ కెమెరాతో పనిచేస్తోంది. భవిష్యత్తులో మొబైల్ యాప్‌ తీసుకురావాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

అదే సమయంలో అన్నం, కూరలు కలిసిపోయినప్పుడు నీటి శాతం, పోషక విలువల పరిమాణం వంటి అంశాలపై లోతైన విశ్లేషణ జరుగుతోంది. ఇవ్వన్నీ పూర్తయిన తరువాత త్వరలోనే యాప్ తీసుకువచ్చే పనిలో ఉన్నాం'' అని వివరించారు.

భవిష్యత్తులో భారత్‌లోని ఆహార పదార్థాలన్నింటినీ మ్యాపింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పారాయన.

''మా పరిశోధన వంటకాలకే పరిమితం కాదు. శిక్షణ వీడియోలు, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి వంటి రంగాల్లోనూ ఉపయోగపడుతుంది'' అని ప్రొఫెసర్ జవహర్ వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)