దుఘ్‌ముష్: హమాస్‌‌తో ఘర్షణపడే ఈ గాజా ఫ్యామిలీ ఎవరు? తాజాగా వీరి మధ్య కాల్పులలో 27 మంది చనిపోవడానికి కారణమేంటి?

    • రచయిత, రష్దీ అబులాఫ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గాజా నగరంలోని దుఘ్‌ముష్ కుటుంబానికి చెందిన సాయుధులకు, హమాస్ సభ్యులకు మధ్య జరిగిన ఘర్షణలో 27 మంది చనిపోయారు.

గాజాలో ఇజ్రాయెల్‌ బలగాల ఉపసంహరణ తరువాత జరిగిన అత్యంత హింసాత్మక ఘటనల్లో ఇదొకటి.

నగరంలోని జోర్డానియన్ ఆస్పత్రి సమీపంలో.. ఈ దుఘ్‌ముష్ ఫైటర్లకు, మాస్క్ ధరించిన హమాస్ సభ్యులకు మధ్య కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

దుఘ్‌ముష్ కుటుంబీకులను నిర్బంధించడానికి తమ భద్రతా సిబ్బంది చుట్టుముట్టగా.. ఘర్షణలు చోటు చేసుకున్నాయని హమాస్ అధ్వర్యంలోని అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

"ఓ సాయుధ మిలిషీయా చేసిన దాడిలో మా సభ్యులు 8 మంది చనిపోయారు’ అని హమాస్ అంతర్గతత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

శనివారం ఈ ఘర్షణలు మొదలైనప్పటి నుంచి 19 మంది దుఘ్‌ముష్ కుటుంబ సాయుధులు, ఎనిమిది మంది హమాస్ ఫైటర్లు మృతి చెందారని వైద్య వర్గాలు తెలిపాయి.

దక్షిణ గాజాలోని టెల్ అల్-హవా ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సాయుధ దుఘ్‌ముష్ సభ్యులు ఉన్న ఓ రెసిడెన్షియల్ బ్లాక్‌ను 300 మందికిపైగా హమాస్ ఫైటర్లు ముట్టడించినప్పుడు ఈ ఘటన జరిగినట్లు వారు చెప్పారు.

ఈ కాల్పుల ఘటనతో తాము భయాందోళనకు లోనైట్లు స్థానికులు చెప్పారు.

ఈ ఘర్షణల కారణంగా పదుల సంఖ్యలో కుటుంబాలు తమ ఇళ్లను వీడి అక్కడి నుంచి పారిపోయాయి.

"ఈ సారి ఇజ్రాయెల్ దాడుల కారణంగా పారిపోలేదు.. తమ సొంత ప్రజల వల్ల వారు పారిపోయారు" అని స్థానికుడొకరు చెప్పారు.

ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు

గాజాలో అత్యంత ప్రముఖమైన కుటుంబాలలో దుఘ్‌ముష్ ఒకటి. వీరికి హమాస్‌కు మధ్య చాలాకాలంగా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి.

ఈ కుటుంబానికి చెందిన సాయుధులు హమాస్‌తో గతంలోనూ పలుమార్లు ఘర్షణపడ్డారు.

శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు తమ బలగాలు కృషి చేస్తున్నాయని హమాస్ ఆధ్వర్యంలో నడిచే అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.

"పరిధి దాటి ఎవరైనా సాయుధ కార్యక్రమాలు చేపడితే కఠినంగా బదులిస్తాం" అని హెచ్చరించింది.

ఘర్షణలకు ఎవరు బాధ్యులనే విషయంలో రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.

దుఘ్‌ముష్ సాయుధులు తమ(హమాస్) ఇద్దరు ఫైటర్లను చంపడమే గాక, మరో అయిదుగురిని గాయపరించారని అంతకుముందు హమాస్ తెలిపింది. వారికి వ్యతిరేకంగా ఆపరేషన్ ను మొదలుపెట్టనున్నట్లు చెప్పింది.

అయితే.. తాము ఉన్న భవనంపై దాడికి హమాస్ బలగాలు వచ్చాయని దుఘ్‌ముష్ కుటుంబానికి చెందిన వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి.

ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో అల్- సబ్రా పరిసర ప్రాంతంలోని తమ ఇళ్లు ధ్వంసమవడంతో.. ఆ కుటుంబం ఒకప్పుడు జోర్డానియన్ ఆస్పత్రిగా ఉన్న ఓ భవనంలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతోంది.

తమ బలగాల కోసం కొత్త స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకుగాను దుఘ్‌ముష్ కుటుంబాన్ని ఆ భవనం నుంచి తరలించేందుకు హమాస్ సభ్యులు యత్నిస్తున్నారని సదరు వర్గాలు చెప్పాయి.

ఇజ్రాయెల్ బలగాలు ఇటీవల వైదొలిగిన గాజాలోని పలు ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకునేందుకు 7,000 మంది సభ్యులను హమాస్ తిరిగి పిలిచినట్లు స్థానిన వర్గాలు తెలిపాయి.

పలు జిల్లాల్లో హమాస్ తమ యూనిట్లను ఇప్పటికే మోహరించిందని… కొంతమందిని పౌర దుస్తుల్లో మరికొంతమంది గాజా పోలీసులకు చెందిన బ్లూ యూనిఫామ్స్‌లో ఉంచినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే.. వీధుల్లో ఫైటర్లను మోహరించారన్న వాదనలను హమాస్ మీడియా కార్యాలయం తిరస్కరించింది

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)