You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్: రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఏ అమెరికా అధ్యక్షుడు చేయని పనిని ట్రంప్ చేస్తున్నారా?
- రచయిత, లైజ్ డూసే
- హోదా, చీఫ్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన రెండో పదవీకాలం మొదటి రోజే ప్రపంచానికి గట్టి సంకేతాలు ఇచ్చారు.
రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక వాషింగ్టన్‌లో కిందటేడాది శీతాకాలం చలిలో ‘‘మన దారిలో ఏదీ నిలవలేదు’’ అంటూ తన ప్రమాణస్వీకార ప్రసంగాన్ని ట్రంప్ ముగించినప్పుడు భారీ కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది.
ఈ సంకేతాలను అర్థం చేసుకోవడంలో ప్రపంచం విఫలమైందా?
తన ప్రసంగంలో అమెరికా భూభాగ విస్తరణ, భావాలవ్యాప్తి గురించి చెప్పే 19వ శతాబ్దపు ‘మేనిఫెస్ట్ డెస్టినీ’ సిద్ధాంతాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ సిద్ధాంతాన్ని దైవాజ్ఞగా భావిస్తుంటారు.
ఆ సమయంలో పనామా కాలువపై ఆయన దృష్టి పడింది. ''మేం దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం'' అని ట్రంప్ అన్నారు. ఇప్పుడదే దృఢసంకలాన్ని ట్రంప్ గ్రీన్‌లాండ్‌పైనా చూపుతున్నారు.
''మనం దానిని సొంతం చేసుకోవాలి'' అనేది ఇప్పుడు ఆయన సరికొత్త మంత్రంగా మారింది. ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ ఈ మంత్రం ఓ చేదునిజం.
అమెరికా చరిత్ర అంతటా వివాదస్పదమైన దండయాత్రలు, ఆక్రమణలు, ఇతర దేశాల పాలకులను, ప్రభుత్వాలను కూల్చివేసేందుకు చేపట్టిన రహస్య ఆపరేషన్లు, కుట్రలు ఎన్నో ఉన్నాయి.
కానీ గత శతాబ్ద కాలంలో.. సుదీర్ఘకాలం మిత్రదేశంగా ఉన్న భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటానని కానీ, ఆ ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా పాలిస్తానని కానీ ఏ అమెరికా అధ్యక్షుడు బెదిరించలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచానికి వెన్నుదన్నుగా నిలిచిన రాజకీయ నిబంధనలను అత్యంత దారుణంగా ఉల్లంఘించడం, సుదీర్ఘకాలంగా ఉన్న కూటములను బెదిరించడం మరే ఇతర అమెరికా నేతా చేయలేదు.
కానీ, ఇప్పుడు ఆ పాత నియమాలు యథేచ్చగా ఎటువంటి భయం లేకుండా అతిక్రమణకు గురవుతున్నాయి.
ట్రంప్‌ను ఇప్పుడు అమెరికా లోపల, బయటనున్న తన మద్దతుదారులు ఆ దేశానికి అత్యంత ''ట్రాన్స్‌ఫర్మేటివ్''(వ్యవస్థను సమూలంగా మార్చగలిగే) అధ్యక్షుడిగా వర్ణిస్తున్నారు.
అయితే మిగిలిన ప్రపంచానికి మాత్రం ఇది ఆందోళనకరంగా మారింది. మాస్కో, బీజింగ్ ఈ పరిణామాలను నిశ్శబ్దంగా, నిశితంగా పరిశీలిస్తున్నాయి.
దావోస్ ఆర్థిక వేదికపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తీవ్రమైన హెచ్చరిక చేశారు. ''మనం నిబంధనలు లేని ప్రపంచం వైపు వెళుతున్నాం. ఇక్కడ అంతర్జాతీయ చట్టాలు తుంగలో తొక్కుతున్నారు. కేవలం సామ్రాజ్యవాద కాంక్షలు ఉన్న బలవంతుల మాటే చెల్లుబాటు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది'' అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఆయన ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించలేదు.
ఒకవేళ అత్యంత దారుణమైన కేసులో అమెరికా కమాండర్-ఇన్-చీఫ్ (అమెరికా అధ్యక్షుడు) గ్రీన్‌లాండ్‌ను బలవంతంగా చేజిక్కించుకోవాలని చూస్తే.. 76 ఏళ్ల నేటో మిలటరీ అలియెన్స్ ప్రమాదంలో పడొచ్చని కొన్ని వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇది అత్యంత దారుణమైన వాణిజ్య యుద్ధానికి దారితీయచ్చనే ఆందోళనలూ ఉన్నాయి.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడ్డ బహుళపక్ష వ్యవస్థకు (ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు పలు దేశాలు కూటమిగా ఏర్పడటం) వ్యతిరేకంగా.. ''అమెరికా ఫస్ట్'' అనే ట్రంప్ ఎజెండాకు మద్దతు ఇచ్చేవారూ పెరుగుతున్నారు.
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం ఐక్యరాజ్యసమితి (యూఎన్) చార్టర్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందా? అని బీబీసీ న్యూస్ అవర్‌లో రిపబ్లికన్ కాంగ్రెస్‌మాన్ రాండి ఫైన్‌ను అడగగా.. ''ప్రపంచంలో శాంతిని నెలకొల్పే సంస్థగా ఉండటంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైందని అనుకుంటున్నా. నిజంగా, వారేం అనుకున్నా సరే, దానికి విరుద్ధంగా చేయడమే సరైన పని కావొచ్చు'' అన్నారు.
రాండి ఫైన్ గత వారం కాంగ్రెస్‌లో ''గ్రీన్‌లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్‌హుడ్ యాక్ట్'' అనే బిల్లును ప్రవేశపెట్టారు.
ట్రంప్ మార్గానికి ఏదీ అడ్డు నిలవలేదని అనిపిస్తోన్న ఈ సమయంలో, అమెరికా మిత్రదేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
అంచనాలకు అందని అమెరికా అధ్యక్షుడిని, కమాండర్-ఇన్-చీఫ్‌తో అత్యుత్తమంగా ఎలా వ్యవహరించాలనేదానిపై గత ఏడాది కాలంగా జరిగిన దౌత్య సమావేశాల్లో కొత్తకొత్త పదబంధాలే పుట్టుకొచ్చాయంటే ఎలాంటి సందేహం లేదు.
'' మేం ఆయన్ని సీరియస్‌గా తీసుకోవాలి. కానీ, అక్షరాలా ఆయన మాటలను కాదు'' అని చర్చల ద్వారా ఇవన్నీ పరిష్కారమవుతాయని నొక్కి చెబుతున్న వారంటున్నారు.
అయితే చర్చలు కూడా పనిచేశాయి. కానీ కొంతవరకే. యుక్రెయిన్‌లో రష్యా సాగిస్తోన్న యుద్ధానికి వ్యతిరేకంగా యూరప్‌తో కలిసి ఒక ఉమ్మడి స్పందన కోసం ప్రయత్నించినప్పుడు ఈ చర్చలు ఫలించాయి. కానీ కొంతవరకే.
ట్రంప్ కూడా ప్రతివారం తన నిర్ణయాలు మార్చుకుంటూ.. అటుఇటూ ఊగిసలాడుతున్నారు. ఒక వారం రష్యాకు దగ్గరగా, మరో వారం యుక్రెయిన్ వైపు, మళ్లీ తిరిగి రష్యాకి దగ్గరగా వెళ్లడం చేస్తున్నారు.
‘‘ఆయనొక రియల్ ఎస్టేట్ దిగ్గజం’’ అని కొందరు అంటున్నారు. ఎందుకంటే, న్యూయార్క్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రోజుల్లో ఆయన అనుసరించిన ఒప్పందాల ఎత్తుగడలు.. ట్రంప్ ప్రస్తుతం అనుసరిస్తున్న కఠినవైఖరి, ఎట్టిపరిస్థితుల్లో రాజీపడని రూపంలో కనిపిస్తున్నాయని వారంటున్నారు.
ఇరాన్‌పై సైనిక చర్యలకు దిగుతానని ట్రంప్ పదేపదే చేస్తున్న హెచ్చరికల్లో అదే ధోరణి కనిపిస్తోంది. అయితే, ఆయన ముందున్న మార్గాలలో సైనిక చర్యలు కూడా ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది.
ట్రంప్ ఎత్తుగడలపై పదేపదే ప్రశ్నించినప్పుడు స్పందించిన యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో.. ''ఆయన సంప్రదాయ రాజకీయవేత్త లాగా మాట్లాడటం లేదు'' అన్నారు.
అంతకుముందున్న అధ్యక్షుల నిరాశజనకమైన రికార్డు ఎత్తిపొడుస్తూ.. ''ఆయన ఏదైతే చెబుతారో, అదే చేస్తారు'' అనేది తమ అధ్యక్షునికి ఉన్న అత్యుత్తమ ప్రశంస అని చెప్పారు.
గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ పాల్పడుతున్న బెదిరింపులకు మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రధాన వ్యక్తుల్లో రుబియో ఒకరు. ఈ విస్తృతమైన మంచు ఫలకాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారని, ఆక్రమించుకోవాలనుకోవడం లేదని నొక్కి చెప్పారు.
చైనా, రష్యా నుంచి బెదిరింపులకు ప్రతిచర్యగా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ద్వీపాన్ని కొనుగోలు చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ట్రంప్ పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు.
అయితే, ట్రంప్ బెదిరింపు ఎత్తుగడలను, సమష్టితత్తాన్ని ధిక్కరించడం, తాను నమ్మిందే సరైందని భావించే ఏకపక్ష చర్యలను కొట్టిపారేయలేం.
''ఆయన లావాదేవీలపైన నడిచే వ్యక్తి. మాఫియా తరహా అధికారాన్ని అనుసరిస్తారు'' అని ఎకనామిస్ట్ మేగజీన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జానీ మింటన్ బెడ్డోస్ అన్నారు.
''కూటముల వల్ల కలిగే ప్రయోజనం ఆయనకు కనిపించదు. అమెరికాను విలువలు ఏర్పరిచే ఒక ఆశయంగా చూడరు. అసలు వాటి గురించి ఆయనకు పట్టింపు ఉండదు'' అని తెలిపారు.
''నేటో అంటే రష్యాకు కానీ, చైనాకు కానీ అసలు భయం లేదు. కనీసం ఇసుమంతైనా లేదు'' అని ఈ నెల ప్రారంభంలో న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. ''మేం చాలా భయపడతాం'' అన్నారు.
ఒకవేళ భద్రతే సమస్య అయితే, అమెరికాకు ఇప్పటికే గ్రీన్‌ల్యాండ్ భూభాగంపై అవసరమైనన్ని సైనిక బలగాలు ఉన్నాయి.
1951 ఒప్పందం ప్రకారం అమెరికా అక్కడికి మరిన్ని దళాలను పంపవచ్చు. మరిన్ని సైనిక స్థావరాలను ఏర్పాటు చేయవచ్చు.
కానీ, ''దాన్ని నేను సొంతం చేసుకోవాల్సి ఉంది'' అని ట్రంప్ నిర్మొహమాటంగా చెబుతూ వస్తున్నారు.
''నాకు గెలవడం ఇష్టం'' అని తరచూ స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది కాలంగా ఆయన పాలసీలో తీసుకొచ్చిన మార్పులు విస్మయానికి గురి చేసేలా ఉన్నాయి.
గత ఏడాది మే నెలలో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తన రెండో పదవీకాలంలో చేసిన తొలి విదేశీ పర్యటన సందర్భంగా ఇచ్చిన ప్రసంగానికి అక్కడ లభించిన అనూహ్యమైన స్పందనను మనం చూశాం.
అమెరికా మాజీ పాలకులు తమ హయాంలో సాగించిన విదేశీజోక్యాలపైనా ఆయన విరుచుకుపడ్దారు. ''వారి అభివృద్ధి చేసిన దేశాల కంటే నాశనం చేసినవే ఎక్కువ.. ఆయా సమాజాల సంక్లిష్టతను వారు అర్థం చేసుకోలేదు '' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ లో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు, తెహ్రాన్‌పై సైనిక చర్యలతో తన దౌత్యాన్ని ప్రమాదంలోకి నెట్టవద్దని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును ట్రంప్ హెచ్చరించినట్లు సమాచారం.
వారం ముగిసేసరికి ఉన్నత స్థాయి అణు శాస్త్రవేత్తలను, సెక్యూరిటీ చీఫ్‌లను మట్టుబెట్టడంలో ఇజ్రాయెల్ సాధించిన విజయాన్ని చూసినప్పుడు.. ''ఇది చాలా అద్భుతంగా ఉందని నాకనిపిస్తోంది'' అని ట్రంప్ అన్నారు.
మూడువేల సంవత్సరాలలో తొలిసారి ''మిడిల్ ఈస్ట్‌లోశాంతిని నెలకొల్పాం..'' అంటూ తాను చేసిన ప్రకటనను వేడుకగా జరుపుకోవడానికి ఈజిప్ట్‌లోని ఎర్ర సముద్రం రిసార్ట్ అయిన షర్మ్-ఎల్-షేక్‌లో తనతో పాటు చేరాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలను కిందటేడాది అక్టోబరులో ట్రంప్ ఆహ్వానించారు.
ఆయన శాంతి ప్రణాళికలో తొలి కీలకదశలో భాగంగా.. గాజాలో అత్యంత అవసరమైన కాల్పుల విరమణను తీసుకొచ్చింది. అలాగే, ఇజ్రాయెల్ బందీల తక్షణ విడుదల కూడా ఆ ప్రణాళికలో ఉంది.
నెతన్యాహును,హమాస్‌ను బలవంతంగా ఆ ప్రణాళికకు అంగీకారం తెలిపేలా చేసింది ట్రంప్ అనుసరించిన బలమైన దౌత్యమే. ఇది కేవలం ట్రంప్ మాత్రమే సాధించగలిగే కీలకమైన ముందడగు.
కానీ, దురదృష్టవశాత్తు అది శాంతికి దారితీయలేదు.
గత ఏడాది ట్రంప్ అనుసరించిన విధానాన్ని ''మేనిఫెస్టో డెస్టినీ''గా చెబుతున్నారు. ఈ ఏడాది 19వ శతాబ్దం తొలినాళ్ల మన్రో సిద్ధాంతాన్ని వెనెజ్వెలా ఆక్రమణ తరువాత ‘డోన్రో సిద్ధాంతం’గా పిలుస్తున్నారు.
కొన్నిసార్లు ఆయన్ను ఏమీ పట్టనివాడుగానూ, మరికొన్ని సార్లు అన్నింటిలో తలదూర్చేవాడిగా పిలుస్తారు. కానీ ఆయన్ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిన '' మేక్ అమెరికా గ్రేట్ అగైన్'' అనే నినాదం ఎల్లవేళలా ప్రతిధ్వనిస్తూనే ఉంది.
"అమెరికాకు ఏది మంచో, అదే ఆలోచిస్తాను"
నార్వే ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌కు రాసిన లేఖలో ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం తనకు రాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
"ఎనిమిదికిపైగా యుద్ధాలను ఆపినప్పటికీ నాకు మీ దేశం నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడంతో… ఇక నేను ఎంతమాత్రం పూర్తిగా శాంతి కోసం కట్టుబడి ఉండాలని అనుకోవడం లేదు. ఇది ప్రధానమైన అంశమైనప్పటికీ… అమెరికాకు ఏది మంచో, ఏది తగినదో దానిపై మాత్రమే ఆలోచిస్తాను" అని స్టోర్‌కు రాసిన లేఖలో ట్రంప్ చెప్పారు.
దీనిపై నార్వే విదేశాంగ మంత్రి ఎస్పెన్ బార్త్ ఐడ్‌ను అడిగినప్పుడు, ' ఎలాంటి ఉద్వేగాలకు లోనుకాకుండా వ్యవహరించేందుకు ఇది చాలా మంచి రోజు అంటూ..'' లౌక్యంగా సమాధానమిచ్చారు.
ఈ జారుడుబండ రాజకీయాలపై యూరోప్ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ప్రతీకార సుంకాలకు సంబంధించి ‘ట్రేడ్ బజూకా’ను ప్రారంభిస్తానని, ఈయూ లాభదాయక మార్కెట్లోకి ప్రవేశాన్ని కట్టడి చేస్తామని మేక్రాన్ వాగ్దానం చేశారు.
అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహిత యూరోపియన్ మిత్రుల్లో ఒకరైన ఇటాలీ ప్రధానమంత్రి.. ''ఇది అవగాహన, సమాచారం లోపం వల్ల జరిగే సమస్య'' అని అస్పష్టంగా స్పందించారు.
గ్రీన్‌లాండ్ ప్రాదేశిక సమగ్రతను బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ బహిరంగంగానే, గట్టిగానే సమర్థించారు. అయితే, గత ఏడాది కాలంగా తాము ఏర్పరుచుకున్న బలమైన వ్యక్తిగత సంబంధాన్ని ప్రతీకార సుంకాల జోలికి వెళ్లకుండా కాపాడుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)