You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్‌లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- రచయిత, రేచెల్ ష్రాయెర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్‌లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు (ఉత్పరివర్తనాలు) వచ్చినట్లు అమెరికా, బ్రిటన్‌లలోని పరిశోధకులు గుర్తించారు.
మ్యుటేషన్ అంటే వైరస్ జన్యు నిర్మాణంలో మార్పులు రావడం.
కరోనావైరస్‌లో వస్తున్న ఈ కొత్త మ్యుటేషన్లు వైరస్ వ్యాప్తి చెందే విధానం, దాన్ని ఎదుర్కొనేందుకు తయారు చేస్తున్న వ్యాక్సీన్ల పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదానిపై స్పష్టత లేదు.
మ్యుటేషన్లు రావడం చాలా సహజమైన విషయం. కానీ ఇలా వచ్చిన మ్యుటేషన్లలో ఏవి వ్యాధిని మరింత ప్రమాదకారిగా మార్చగలవన్నది అసలు ప్రశ్న.
అమెరికాలో జరిగిన ఓ ప్రాథమిక పరిశోధనలో కరోనావైరస్‌లో వచ్చిన డీ614జీ అనే మ్యుటేషన్ ప్రభావం పెరగొచ్చని, ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడాన్ని అది మరింత పెంచవచ్చని గుర్తించారు.
అయితే, ఈ పరిశోధన ఇంకా అధికారికంగా ప్రచురితం కాలేదు. మిగతా శాస్త్రవేత్తలెవరూ ఆ ఫలితాలను ఇంకా సమీక్షించలేదు.
అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో ఉన్న లాస్ అలమోస్ నేషనల్ లాబొరేటరీలోని పరిశోధకులు కరోనావైరస్ నిర్మాణంలో ప్రత్యేకంగా కనిపిస్తున్న ‘స్పైక్’ (ముల్లు లేదా కొమ్ము లాంటి ఆకృతి)లో వస్తున్న మార్పులపై దృష్టిపెట్టారు. ఇందుకోసం గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్ఏఐడీ) అనే డేటాబేస్‌ను వారు ఉపయోగించుకున్నారు.
డీ614జీ అనే మ్యుటేషన్ ఏదో కారణంతో త్వరగా పెరుగుతోందని... కానీ, దాని పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇంకా తెలియదని వాళ్లు చెప్పారు.
బ్రిటన్‌లోని షెఫీల్డ్‌లో కరోనావైరస్ రోగుల శాంపిల్స్ ద్వారా వచ్చిన సమాచారాన్ని పరిశోధకుల బృందం విశ్లేషించింది. ఈ మ్యుటేషన్‌తో ఉన్న వైరస్ కలిగిన రోగుల నుంచి సేకరించిన శాంపిళ్లలో వైరస్ లోడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ మ్యుటేషన్ వారి అనారోగ్య తీవ్రతను పెంచినట్లు గానీ, నయమయ్యేందుకు ఎక్కువ రోజులు తీసుకున్నట్లు గానీ ఆధారాలు లభించలేదని పరిశోధకులు చెప్పారు.
కరోనావైరస్‌లో పదే పదే కనిపిస్తున్న 198 మ్యుటేషన్లను యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో జరిగిన ఓ అధ్యయనం గుర్తించింది.
మ్యుటేషన్లు రావడం చెడ్డ విషయమేమీ కాదని, కరోనావైరస్‌లో ఊహించినదాని కన్నా వేగంగా గానీ, నెమ్మదిగా గానీ మ్యుటేషన్లు వస్తున్నట్లు చెప్పే ఆధారాలు ఏమీ లభించలేదని ఈ అధ్యయనం చేపట్టినవారిలో ఒకరైన ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బాలోక్స్ వెల్లడించారు.
కరోనావైరస్ మరింత ప్రమాదకారిగా, ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందే విధంగా మారుతుందా అన్నది ఇప్పటికైతే చెప్పలేమని ఆయన అన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో కూడా మ్యుటేషన్లను విశ్లేషిస్తూ ఓ అధ్యయనం జరిగింది. వైరస్‌లో కొత్త రకం ఏర్పడినట్లుగా కనిపించడం లేదని, ఈ మ్యుటేషన్లన్నీ ఒకే రకానికి చెందినట్లుగా ఉన్నాయని అందులో పరిశోధకులు తేల్చారు.
వ్యాక్సీన్లపై ప్రభావం ఎలా చూపుతుందంటే...
వైరస్ నిర్మాణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను గుర్తించడం వ్యాక్సీన్ల అభివృద్ధిలో చాలా ముఖ్యం.
ఉదాహరణకు ఫ్లూ వైరస్‌నే తీసుకుంటే, దానిలో చాలా వేగంగా మ్యుటేషన్లు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త రకాలుగా రూపుదిద్దుకుని, వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అందుకే, ప్రతి ఏడాదీ వ్యాక్సీన్లలో వాటికి తగ్గట్లు మార్పులు చేస్తారు.
ప్రస్తుతం కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సీన్లలో చాలావరకూ ఆ వైరస్ నిర్మాణంలో ప్రత్యేకంగా ఉండే స్పైక్‌లను లక్ష్యంగా చేసుకున్నవే. వైరస్‌లో ప్రత్యేకంగా కనిపించే ఆ లక్షణాన్ని శరీరం గుర్తించేలా చేసి, దాన్ని ఎదుర్కొనేలా చేయడం వ్యాక్సీన్ పని. కానీ, ఆ స్పైక్‌లో మార్పులు వస్తే, దాన్ని లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేసిన వ్యాక్సీన్లు ప్రభావం కోల్పోతాయి.
ఇప్పటికైతే ఆ వైరస్ కొత్త మ్యుటేషన్ల వల్ల ఏం జరుగుతుందో శాస్త్రవేత్తలకు సమాచారం లేదు.
‘‘ఔషధాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలకు ఇంత భారీ స్థాయిలో వైరస్ జన్యుక్రమాలను విశ్లేషించే వీలు ఉండటం చాలా ఉపయోగపడుతుంది. కానీ, వాటి నుంచి వచ్చే సమాచారం చాలా తక్కువే ఉంటుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోకు చెందిన పరిశోధకురాలు డాక్టర్ లూసీ వాన్ డార్ప్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రెమ్డెసివీర్: కరోనావైరస్పై పోరాడే శక్తి ఈ ఔషధానికి కచ్చితంగా ఉందంటున్న అమెరికా
- మాజీ క్రికెటర్ కంపెనీ రూపొందించిన వెంటిలేటర్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్
- ‘ఆర్థికవ్యవస్థ గాడిన పడాలంటే లాక్డౌన్ త్వరగా ముగించాలి’
- లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేయాలో ఎలా నిర్ణయిస్తారు
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో సర్కస్‌లు ఇక అంతరించిపోయినట్లేనా?
- కరోనావైరస్: శ్రీకాళహస్తిలో కోవిడ్ కేసులు హఠాత్తుగా ఎలా పెరిగాయి? ఈ రెడ్ జోన్ గురించి ఎవరేమంటున్నారు
- సామాజిక దూరం పాటించమంటే దేశంలో వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)