కరోనావైరస్: కోవిడ్ పరీక్షలు చేయడం ఎందుకంత కష్టం?

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా వ్యాప్తిని తగ్గించాలంటే, వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం చాలా అవసరం. అలా చేసినప్పుడు అది ఇప్పటివరకూ ఎంతమందికి వ్యాపించింది, ఎంతమందిలో తీవ్రంగా ఉంది, ఎంతమందిని వేరుగా ఉంచాలి అనే విషయం తెలుస్తుంది.

కోవిడ్-19 టెస్ట్ కిట్ల కొరత దానికి అత్యంత పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది. అన్ని దేశాల్లో ఒకే పరిస్థితి ఉంది. వేరే దేశాల నుంచి టెస్టింగ్ కిట్లు, మెడికల్ పరికరాలు తెప్పించినా, సమయానికి వారి దగ్గరకు చేరుకోవడం, శాంపిల్ సేకరించడం ఒక పెద్ద సవాలుగా నిలుస్తోంది. అంతే కాదు, కరోనా టెస్ట్ ఎలా చేయాలనేది కూడా అందరికీ తెలిసిన విషయం కాదు.

ఇప్పటివరకూ ఏ దేశాలు కరోనా టెస్టులు చేయడంలో వేగంగా చర్యలు తీసుకున్నాయో, అక్కడ మాత్రమే కోవిడ్ వ్యాప్తి తగ్గడం కనిపిస్తోంది.

దక్షిణ కొరియా జనవరి 20న మొదటి కరోనా కేసు బయటపడగానే, దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు ప్రారంభించింది. ఆరు వారాల తర్వాత మార్చి 16న ఆ దేశం ప్రతి వెయ్యి మందిలో 2.13 మందికి పరీక్షలు చేసే స్థితిలో నిలిచింది.

ఇటలీలో కరోనా కల్లోలం

అటు ఇటలీలో మొదటి కేసు జనవరి 31న బయటపడింది. కానీ, ఆరు వారాల తర్వాత కూడా అక్కడ వెయ్యి మందిలో 1.65 మందికే పరీక్షలు చేశారు.

కరోనావైరస్‌ను సీరియస్‌గా పట్టించుకోని దేశాల్లో ఆ పరీక్షలను వేగవంతం చేయడం చాలా అవసరం. పరీక్షలు చేయడంలో ఇప్పటికీ వెనుకబడ్డ దేశాలు, తమ వేగం పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి.

కోవిడ్-19 పరీక్ష ఒక క్లిష్టమైన ప్రక్రియ. దానిని భారీ స్థాయిలో చేయడం అంత సులభం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా మనకు టెస్ట్ కిట్ చాలా అవసరం. కానీ, అది అంత సులభంగా దొరికేది కాదు.

తర్వాత, రోగి ముక్కు నుంచి నమూనాను సేకరించాలి. దానికి చాలా రసాయనాలు కలపాలి. ఆ తర్వాతే వాటిని ప్రయోగశాలల్లో ఉన్న అనుభవజ్ఞులైన టెక్నీషియన్ల దగ్గరకు పంపిస్తారు.

స్వచ్ఛతకు గ్యారంటీ

శాంపిల్‌ను పీసీఆర్ మెషిన్‌లో పరీక్షిస్తారు. చాలా క్లిష్టమైన ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఇప్పటికే కరోనాపై రీసెర్చ్ జరుగుతున్న ప్రయోగశాల్లో పనిని వేగవంతం చేయడంతోపాటు, వీలైనన్ని ఎక్కువ మంది శాంపిల్స్ తీసుకోడానికి, రిపోర్టులు త్వరగా ఆస్పత్రులకు పంపించడానికి కొత్త కంప్యూటర్లు, కొత్త మేనేజ్‌మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా టెస్టింగ్ కిట్లు తగినన్ని లేవు. ఇక్కడ సమస్య టెస్టుల కోసం కిట్లు లేకపోవడమే కాదు. ఈ పరీక్ష కోసం అన్ని రసాయనాలను తగిన పాళ్లలో కలపడం, అవి స్వచ్ఛంగా ఉన్నాయనే గ్యారంటీ ఇవ్వడం కూడా ఒక సవాలే.

కోవిడ్ కోసం టెస్ట్ కిట్ తయారు చేసే ప్రతి కంపెనీకి తమదైన ఫార్ములా ఉంటుంది. ఒక టెస్ట్ కిట్‌లో 20 రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. అన్నీ తగిన పాళ్లలో ఉండడం చాలా అవసరం. తర్వాత ప్రతి కిట్‌ ప్యాకేజింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.

అంతేకాదు, కిట్‌లో ఉన్న ప్రతి వస్తువూ అదే కంపెనీది అయ్యుండాలి. వేరే కంపెనీ వస్తువుల సహకారం తీసుకోకూడదు.

అమెరికా దక్షిణ కొరియా

చాలా ప్రయోగశాలల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన మెషిన్లు లేవు. కోవిడ్-19 తీవ్రం అయినప్పుడు అమెరికా, దక్షిణ కొరియాలు తమ దేశాల్లో చాలా ప్రైవేటు ల్యాబ్స్ కు ప్రభుత్వ నిమయాల ప్రకారం పరీక్షలు చేయడానికి అనుమతి ఇచ్చాయి. భారత్‌లో కూడా అలా చేశారు.

కోవిడ్-19 పరీక్ష కోసం ప్రత్యేక సామర్థ్యం కావాలి. మొదట్లో ఈ పరీక్షలు పూర్తి చేయడానికి నాలుగు గంటల సమయం పట్టేది. శాంపిల్ తీసుకోడానికి, వాటిని సిద్ధం చేయడానికి రెండు గంటలు పడితే, మెషిన్ ఆ ఫలితాలు సిద్ధం చేయడానికి మరో రెండు గంటలు పట్టేది.

రోషే, ఎబట్ కంపెనీ కిట్‌తో ఒకే సమయంలో 80 నుంచి 100 శాంపిల్స్ తీసుకోవచ్చు. ఈ కిట్ కాస్త ఆటోమేటెడ్‌గా ఉంటుంది. అయితే, ఈ పరీక్ష రిపోర్టు సిద్ధం చేయడానికి, శాంపిల్ ఉన్న రసాయనాన్ని పరిశీలించడానికి ప్రత్యేకమైన శిక్షణ కూడా అవసరం.

ఒకసారి ప్రయోగశాలలను సిద్ధంగా ఉంచితే, కోవిడ్-19 పరీక్షల కోసం అవసరమైన అన్నిరకాల మెషిన్లు అందుబాటులో ఉంటే, ప్రీ టెస్టులు ప్రారంభించవచ్చు.

ఈ ప్రీ టెస్టును ముక్కు నుంచి తీసిన నమూనాలతో ప్రారంభిస్తారు. ఆ నమూనాను మామూలు దూదితో కాకుండా, పొడవుగా, సన్నగా ఉండే నైలాన్ రాడ్‌తో తీసుకుంటారు. ఇక్కడ అతిపెద్ద సవాలు రోగి నుంచి ఆ నమూనాను సేకరించడమే.

బయోసేఫ్టీ హజార్డ్ బాక్స్

కొంతమంది పరిశోధకులు దీనికోసం త్రీడీ ప్రింటింగ్ కూడా సిద్ధం చేస్తున్నారు. నమూనా ల్యాబ్‌కు చేరగానే అనుభవజ్ఞులైన లాబ్ టెక్నీషియన్లు దానిని బయోసేఫ్టీ హజార్డ్ బాక్సులో ఉంచుతారు.

అది గాజుతో చేసిన ఒక పాత్రలా ఉంటుంది. దానిలోపల వైరస్ సజీవంగా ఉండడానికి గాలిని నియంత్రణలో పంపుతుంటారు.

ల్యాబ్‌లో పనిచేసే వారికి కూడా తుమ్ములు, దగ్గు రావచ్చు. అలా జరిగితే, అక్కడ పనిచేసేవారికే కాదు, అక్కడ ఉన్న శాంపిల్ కూడా ఇన్‌ఫెక్ట్ కావచ్చు. ఫలితంగా కరోనా నెగటివ్ ఉన్న రోగి ఫలితాలు పాజిటివ్‌గా రావచ్చు.

ప్రయోగశాలల్లో నమూనాలను కచ్చితంగా పద్ధతి ప్రకారం పరీక్షించేలా చూసుకోడానికి అనుభవజ్ఞుడైన ల్యాబ్ ఇంచార్జ్ చాలా అవసరం. కానీ, దురదృష్టవశాత్తూ చాలా దేశాల్లో అలాంటి ల్యాబ్ ఇంచార్జిల కొరత భారీగా ఉంద

రైబో న్యూక్లిక్ యాసిడ్

శాంపిల్ తీసుకున్న తర్వాత ఆ నమూనా నుంచి వైరస్ తీసి, దాన్ని గుర్తించడం మరో ముఖ్యమైన, సవాలుతో కూడిన దశ.

మొట్టమొదట శాంపిల్‌ను రసాయనాలు నిండిన టెస్ట్ ట్యూబ్‌లో ఉంచుతారు. అక్కడ వైరస్‌ మీద ఉన్న పొరలను తొలగిస్తారు.

కరోనా కేసులో దీనిని క్రౌన్ అంటారు. అంటే అది మనం ఇప్పుడు ఫొటోల్లో చూస్తున్నట్లు ఉంటుంది. తర్వాత వైరస్ రైబో న్యూక్లిక్ యాసిడ్(RNA)ను మరో డిస్క్ మీద ఉంచుతారు.

అక్కడ కూడా చాలా రకాల రసాయనాలు దీనిపై తమ పనిని పూర్తి చేసి, దాని జీనోమ్‌ను గుర్తిస్తాయి. ఆ ప్రక్రియ తర్వాత RNA ఉన్న డిస్కును మెషిన్లో పెడతారు.

అక్కడ వైరస్ జీనోమ్‌ను కొన్ని లక్షల చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఇన్ని చేసిన తర్వాత కరోనావైరస్‌ను గుర్తించడం సాధ్యం అవుతుంది.

ఒకవేళ, శాంపిల్‌లో కరోనావైరస్ లేకపోతే, అది లక్షల ముక్కలుగా విరిగిన తర్వాత కూడా వేరే ఎలాంటి వైరస్ కనిపించదు.

వైరస్‌తో పోరాడే సామర్థ్యం

శాంపిల్ తీసుకోవడంలో ఏదైనా గందరగోళం జరిగితే, దాని ఫలితం నెగటివ్ అనే వస్తుంది. చాలాసార్లు వైరస్ ఊపిరితిత్తుల దగ్గరకు చేరుకుంటుంది. దాంతో, అది ముక్కు నుంచి తీసుకోవడం సాధ్యం కాదు.

అలాంటి పరిస్థితుల్లో, నమూనాను సరిగ్గా తీసుకోకపోతే ఆ పరీక్ష వృథా అవుతుంది.

ఇప్పుడు ఇలాగే బ్లడ్ టెస్టులు కూడా చేస్తున్నారు. వీటివల్ల రోగికి ఇంతకు ముందే ఈ వ్యాధి ఉందా, దానితో పోరాడ్డానికి వారి శరీరం రోగనిరోధక కణాలను సిద్ధం చేసుకుందా అనేది తెలుస్తుంది.

దీనినే సీరాలజీ లేదా యాంటీబాడీ టెస్ట్ అంటారు. ఈ పరీక్ష వల్ల రోగి శరీరంలో ఇప్పటికే ఎలాంటి వైరస్‌లతో పోరాడే సామర్థ్యం ఉంది అనేది కూడా తెలుస్తుంది.

కొందరు యాంటీబాడీస్ అభివృద్ధి చెందకపోయినా జలుబు లాంటి, ఎలాంటి వైరస్‌తో అయినా పోరాడగలరు.

కరోనాకు ఎన్నో రకాల యాంటీబాడీ టెస్టులు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకూ ఏ పరీక్షా సమర్థవంతంగా పనిచేసినట్లు తేలలేదు.

అది ఏ వైరస్ అయినప్పటికీ, నిపుణులు సూచించే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం తగదని మనం ఇప్పటికే తెలుసుకున్నాం.

ప్రస్తుతానికి మనం ప్రపంచవ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మందికి టెస్టులు చేసేలా, వీలైనంత త్వరగా టెస్టు కిట్స్ అందేలా చూసుకోవడం, పరీక్షలు చాలా జాగ్రత్తగా చేయడం చాలా అవసరం.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)