కరోనావైరస్: మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీతో ప్రజలకు జరిగే మేలు ఎంత?

    • రచయిత, నితిన్ సేఠీ
    • హోదా, బీబీసీ కోసం

21 రోజులపాటు లాక్‌డౌన్‌లో దారుణంగా మారబోతున్న ఆర్థిక పరిస్థితి నుంచి ప్రజలు కోలుకోడానికి మార్చి 26న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానికి ఒక రోజు ముందే దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించారు.

కానీ, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం చూస్తుంటే, ఆశించిన దానికంటే చాలా తక్కువగా, సరిపోని విధంగా ఉంది. రాబోవు నెలల్లో ఆర్థిక సాయం చాలా అవసరమైన వారికి ఇది చాలా తక్కువగా ఉపయోగపడేలా ఉంది. ప్రభుత్వం ఈ ప్యాకేజీ ప్రకటించడంలో చాలా పీనాసితనం చూపించింది.

మొదట ప్రస్తుత సమయంలో ప్రభుత్వం సాయం అసలు ఎవరికి అవసరం అనే విషయానికి వద్దాం.

ఇది, అసంఘటిత రంగాల్లో పనిసేవారికి, చట్టపరంగా పరిహారం అందని వారికి, రోజూ కడుపు నింపుకోడానికి ఎలాంటి చట్టపరమైన సంరక్షణ లేని 90 శాతం మంది భారత పౌరుల కోసం. వీరిలో కోట్ల మంది పట్టణ, గ్రామీణ కూలీలు ఉంటారు.

వీరు సమాజంలో నిరుపేదలు. ఎలాంటి ఆర్థిక కష్టం వచ్చినా అధిక ప్రభావం పడేది వీరిపైనే...

రోజుకూలీ, వారాల కూలీ, లేదా నెలసరి కూలీలపై వీరు బతుకీడుస్తారు. వీరికి వచ్చే ఆ ఆదాయం హఠాత్తుగా ఆగిపోతే, ఏదైనా కష్టాన్ని ఎదుర్కోడానికి పొదుపు అనే పేరుతో వీరిదగ్గర ఎలాంటి మొత్తం ఉండదు. లేదంటే ఏ పదో, యాభయ్యో మిగిలుంటుంది.

లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభిస్తే.. భారత సమాజంలోని వీరంతా లాక్‌డౌన్ సమయంలో అత్యంత కష్టాల్లో పడతారు.

ఏదైనా ప్రభుత్వం వీరి సంక్షేమం కోసం పనిచేస్తుంటే, అది ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి లాక్‌డౌన్ ప్రకటించే ముందే దేశంలో అత్యంత బలహీనులైన వీరికోసం సాయం అందించడానికి ఆర్థిక ప్యాకేజీని, దానిని అమలు చేయడానికి వనరులను సమీకరించి ఉంటుంది.

కానీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అలా చేయడంలో ఘోర నిర్లక్ష్యం చూపింది. ఎలాంటి వ్యూహం లేకుండా లాక్‌డౌన్ చేసిన 48 గంటల్లోనే, భయాందోళనలతో కూలీలు, పేదలు అందరూ తమ ఇళ్లు వదిలి పారిపోతున్నారనే సంకేతాలు వెలుగులోకి వచ్చాయి.

కొన్ని రోజుల్లో ఈ పరిస్థితి ఎంత ఘోరంగా మారవచ్చంటే వారి చేతిలో డబ్బు లేకుంటే, వారు ఆకలికి బాధితులు కావచ్చు.

అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆర్థిక సాయం కోసం ఒక ప్యాకేజీ ప్రకటిస్తారు అనే వార్తలు రాగానే, ప్రభుత్వం ప్రజల కష్టాలను తెలుసుకుందని, తమ కష్టాలు దూరం చేయాలని అనుకుంటోందని చాలామంది ఆశించారు. కానీ, ఆ ఆశలను నెరవేర్చడంలో నిర్మలా సీతారామన్ పూర్తిగా విఫలం అయ్యారు.

దీనిని నిజమని నిరూపించే ఆధారాలపై ఇప్పుడు మనం ఒక కన్నేద్దాం.

ప్రభుత్వం తను రూ. 1.7 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీని ప్రకటిస్తున్నామని చెప్పింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ సవరించిన జీడీపీలో ఈ మొత్తం కేవలం 0.83 శాతమే. మిగతా దేశాలు కరోనావైరస్ వల్ల వచ్చిన ఈ ఆర్థిక సంక్షోభ స్థితిలో తమ ఆర్థికవ్యవస్థ నిష్పత్తితో చూస్తే చాలా పెద్ద ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాయి. అలాంటప్పుడు కేంద్రం సాయం అందించడం నిజమే అయినా, అది చాలా తక్కువ.

కానీ, ఈ సాయం వాస్తవాలకు మించిందా?

ఆర్థిక మంత్రి ప్రకటించిన ఈ ప్యాకేజీని నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వం తన మీడియా ప్రకటనలో ప్రాథమిక ఉమ్మడి డిపాజిట్లలోనే తప్పు చేసింది. నిర్మలా సీతారామన్ ప్యాకేజీలో ప్రతి ఒక్కో భాగం కోసం తమ ఆర్థికప్యాకేజీలో ఎంతెంత మొత్తం ప్రస్తావించారో, వాటన్నిటినీ కలిపినా, మొత్తం ప్యాకేజీ లక్ష కోట్లకు చేరుతుంది. ఉదాహరణకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల కూలిని పెంచే ప్యాకేజీనే తీసుకుంటే, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని దీనిపై ప్రశ్నించినపుడు, ప్రభుత్వం ఒక జాయింట్ ప్రకటన జారీ చేసింది. ఇందులో ప్యాకేజ్‌లో వివిధ భాగాలకు సంబంధించిన ఆర్థిక సమాచారం స్పష్టంగా లేదు.

ప్రకటన-1

ఉపాధి హామీ పథకం కింద కూలి పనులు చేసే కూలీలకు ప్రతి రోజూ 20 రూపాయల చొప్పున పెంచుతారు. ప్యాకేజీలో దాని బడ్జెట్ రూ.5600 కోట్లు.

ప్రభుత్వం కొన్ని రోజుల ముందే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలిపై ప్రభావం చూపే ఈ పెంపు ప్రకటన జారీ చేసింది. ఇలా ప్రతి ఏటా చేస్తుంటారు. కానీ ఈ పెంచిన కూలి లాక్‌డౌన్‌లో ఉన్న పేదలకు ఉపయోగపడదు. ఎందుకంటే, వారు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి వస్తోంది.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఒక పని చేసినందుకు ప్రయోజనం అందించే పథకం. ఏ పనీ లేదు అంటే, ఎలాంటి కూలీ లభించదు అని అర్థం. ఒక్క మార్చి నెలకే చూస్తే, గత ఏడాదితో పోలిస్తే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో 6 నుంచి 8 కోట్ల రోజుల పనులు తగ్గాయి. (చివరి గణాంకాలు మార్చి నెల ముగిసిన తర్వాత వెల్లడిస్తారు, పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి.)

ప్రకటన-2

80 కోట్ల మందికి మూడు నెలల అదనపు రేషన్ అందిస్తాం.ప్రతి కుటుంబానికి ప్రతి నెలా ఒక కిలో పప్పు ఇస్తారు. ప్యాకేజ్ బడ్జెట్40 వేల కోట్లు.

స్పష్టంగా ఇది చాలా సాదాసీదా ఉపశమనం. టోకు బజార్లకు తాళాలు ఉన్నప్పుడు, రిటైల్ ధరలు వరుసగా పెరుగుతూ పోతాయి. అలాంటప్పుడు పేదలకు ఉప్పు, పప్పు, నూనె, చక్కెర లాంటి నిత్యావసర వస్తువులు కొనడానికి కూడా సాయం అవసరం అవుతుంది. గోధుమలు, బియ్యం అదనపు రేషన్, ఇలాంటి కష్టకాలంలో పేదలకు ఎలాంటి ఉపశమనం అందిస్తుంది, అవి వారి వరకూ ఎలా చేరుతాయి. ఈ సరుకుల సప్లై చెయిన్ తెగిపోవడంతో, అవి ప్రభుత్వ రేషన్ షాపుల వరకూ, ముఖ్యంగా బయట నుంచి వచ్చి కూలి పనులు చేసుకునేవారికి అందడం కష్టంగా మారింది. అందుకే ఈ వలస కూలీల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.

మరో విషయం ఈ ఏడాది మొత్తం రేషన్ సబ్సిడీ భరించేందుకు ప్రభుత్వం మొదటి నుంచే కష్టాల్లో ఉంది. తమ వంతు ఆర్థిక భారాన్నీ ప్రతి ఏటా మీరే భరించాలని అది ఆ భారాన్ని భారత ఆహార సంస్థపై మోపింది.

ప్రకటన-3

స్వయం సహాయక గ్రూపులకు ఇచ్చే రుణాల మొత్తాన్ని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం

అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే నగదు చెల్లింపులు లేవు. ప్రభుత్వం తన గణాంకాలు చెప్పడానికి ఈ పథకం కింద ఈ ఏడాది స్వయం సహాయక గ్రూపులకు ఇప్పటివరకూ 1500 కోట్ల రూపాయలు అందించామని చెప్పింది. వీటి నుంచి 3 లక్షల లోను వరకూ వడ్డీలో మినహాయింపు లభిస్తుంది. మిగతా మొత్తం మీద రుణాలు ఇచ్చిన గ్రూపులకు బ్యాంక్ సాధారణ రేటు ప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయానికి తెర పడడం వల్ల ఏ కుటుంబాలకు హఠాత్తుగా డబ్బు కొరత వచ్చిందో వారికి ఇల్లు నడపడానికి వెంటనే డబ్బు అవసరం. అప్పు తీసుకుంటే, ఈ సమయంలో స్వయం సహాయక గ్రూపులు బ్రోకర్లను, బ్యాంకులను భరించాల్సి ఉంటుంది. లోన్ అర్జీ ఇవ్వడానికి, అది రావాడానికి మధ్య చాలా సమయం పడుతుంది.

ప్రకటన-4

20.40 కోట్ల మహిళల జన్-ధన్ ఖాతాల్లో మూడు నెలల్లో 1500 రూపాయలు వేస్తారు. బడ్జెట్ 30 వేల కోట్లు

ప్రభుత్వం అనుకుంటే, ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని మహిళలకు మాత్రమే కాదు, అన్ని జన్-ధన్ ఖాతాల్లో వేయవచ్చు. నెలకు 500 అంటే అది ఎంత తక్కువంటే, నిపుణుడైన ఒక కూలీ ఒక్క రోజు పని చేసి దానికంటే ఎక్కువ మొత్తం సంపాదించగలిగితే, చాలామంది నైపుణ్యం లేని కూలీలు అంత డబ్బు రెండ్రోజుల్లో సంపాదించగలరు. అవసరమైన సరుకుల ధరలు ఇప్పటికే చాలా పెరిగాయి. చాలా ప్రాంతాల్లో ఇక ముందు కూడా ఆ ధరలు అలాగే ఉండిపోనున్నాయి. పనులే ఉండనప్పుడు, చాలా ప్రాంతాల్లో జీవనవ్యయం పెరగబోతోంది.

ప్రకటన-5

8.7 కోట్ల మంది రైతులకు ఏప్రిల్ నెలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండు వేల రూపాయలు ఇస్తారు. బడ్జెట్ 16 వేల కోట్లు

భూమి యాజమాన్య హక్కులు ఉన్న రైతులకు ఏప్రిల్‌లో ఈ మొత్తం ఇవ్వాలని ఇంతకు ముందే నిర్ణయించారు. ఇది ఇప్పుడు వేరుగా ఇస్తున్న సాయం కాదు. భూమి లేని రైతులు లేదా పొలాల్లో కూలిపనులు చేసుకునే సాయం అత్యవసరమైన వారిలో ఎక్కువమందికి ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లభించదు.

ప్రకటన-6

60 ఏళ్లకు పైబడినవారికి, వితంతువులకు మూడు నెలల వరకూ ఒక వెయ్యి రూపాయల సాయం అందుతుంది. బడ్జెట్ 3 వేల కోట్లు

చట్టప్రకారం ప్రభుత్వం ఇంతకు ముందే వితంతువులు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వడానికి రాష్ట్రాలకు 200 నుంచి 500 వరకూ సాయం అందిస్తోంది. చాలా రాష్ట్రాలు తమవైపు నుంచి కొంత డబ్బు కలిపి ఈ నామమాత్రపు మొత్తాన్ని మరింత పెంచుతున్నాయి. ఇప్పుడు అదనంగా కేంద్రం ప్రతి నెలా 333 రూపాయలను తను ఇచ్చే మొత్తంలో కలుపుతుంది. ఈ మొత్తం వల్ల పెద్దగా ప్రయోజనం అందేలా లేదు.

ప్రకటన-7

8 కోట్ల కుటుంబాలకు ఉజ్వల యోజన కింద 3 నెలల వరకూ.. ఉచిత గ్యాస్ సిలిండర్. బడ్జెట్ 13 వేల కోట్లు

2019-20 ధరలతో ప్రభుత్వం ఉచిత సిలిండర్లు పంచితే, ఒక్కో సిలిండర్ కోసం దాదాపు 681 రూపాయలు ఖర్చు అవుతుంది. వినియోగదారులకు సిలిండర్ 500 రూపాయలకే దొరుకుతున్నప్పుడు, చాలా కుటుంబాలకు ఏడాదికి నాలుగుకు మించి వినియోగించేవారు కాదు. అప్పుడు వారు ఎక్కువ సిలిండర్లు భరించలేకపోయేవారు. ఎక్కువ ఆదాయం ఉన్న వినియోగదారులు ఏడాదిలో సగటున ఏడు సిలిండర్లు ఉపయోగిస్తారు. అలాంటప్పుడు ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఈ సిలిండర్లు ఉచితంగా ఇచ్చినట్లే అవుతుంది. అలా, ప్రతి కుటుంబం మరో రెండు సిలిండర్లు తీసుకుంటోందనే అనుకోవాలి. గ్యాస్ గరిష్టంగా ఉపయోగించే ఈ స్థితిలో కూడా ప్రభుత్వంపై పది వేల కోట్ల రూపాయల కంటే తక్కువ భారమే పడుతుంది.

ప్రకటన-8

100 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీ, 15 వేలు అంతకంటే తక్కువ వేతనం ఉన్న వారికి ఉద్యోగులున్న కంపెనీ.. రెండు వైపుల ఈపీఎఫ్ భరిస్తుంది

ఈ అంశంపై ఆర్థిక మంత్రి ప్రకటన, ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనల్లో గందరగోళం ఉంది. పత్రికా ప్రకటనలో వంద కంటే తక్కువ మంది ఉద్యోగులు, 15 వేల కంటే తక్కువ వేతనం ఉన్న ప్రతి కంపెనీ ఈ ప్రయోజనాన్ని పొదుతుంది అని రాశారు. కానీ ప్రభుత్వం దయాగుణాన్ని నమ్మినా, అందులో ఒక అర్థం ఉంది అని బిజినెస్ స్టాండర్డ్ సోమేష్ ఝా రాశారు.

“సామాజిక భద్రతలో భాగమైన ఈ వ్యవస్థకు బయట ఉన్న ఎక్కువమంది ఈ ప్రయోజనం పరిధికి బయటే ఉండిపోతారు. వాస్తవం ఏంటంటే, ప్రభుత్వం ఈ చర్యల వల్ల దేశంలో మొత్తం 47 కోట్ల పరిశ్రమల్లో కేవలం 16 శాతం ఈపీఎప్ వినియోగదారులకు మాత్రమే ప్రయోజనం లభిస్తుంది” అన్నారు.

మనం కావాలంటే ప్రభుత్వం అన్ని ప్రకటనలనూ ఇదే విధంగా విడివిడిగా పరిశీలించినా, పెద్ద మనసు చూపాల్సిన ఈ సమయంలో ప్రభుత్వం ప్రజలకు సాయం పేరుతో చిల్లర విదిలిస్తోంది అనేది అర్థం అవుతుంది.

కానీ, నిజాయితీగా చెప్పుకోవాలంటే, ఇది ప్రభుత్వ ఉద్దేశం లేదా పెద్ద మనసు గురించి కాదు. నిజానికి ఇది బుర్ర ఉపయోగించాల్సిన విషయం. మొత్తం ప్రపంచమంతా కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నా, ప్రభుత్వం మేల్కోలేదు, ఆర్థికవ్యవస్థను కాపాడడానికి ప్యాకేజీని రూపొందించే ప్రయత్నం చేయలేదు.

ఇప్పుడు ఆ దిశగా ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా మనం దీనిని అనుకోవచ్చు. ముందు ముందు ఆర్థికవ్యవస్థకు ఉపశమనం కలిగించే మరిన్ని చర్యలు చేపడుతారు. నోట్లరద్దు జరిగినపుడు, జీఎస్టీ అమలు చేసినప్పుడు ప్రభుత్వం హడావుడిగా ఎలా పథకాలు రూపొందించి, వాటిని అమలు చేయడంలో తన తప్పును ఒప్పుకుందో, అలాగే ప్రభుత్వం ఈసారీ తన తప్పును అంగీకరిస్తుంది.

ప్రభుత్వం ఎదుట కఠిన సవాళ్లు స్పష్టంగా తెలుస్తున్నాయి. ప్రభుత్వం మరింత పెద్ద, మెరుగైన ప్యాకేజీ ఇచ్చే పథకం రూపొందించి, దాని ప్రయోజనాన్ని ప్రజల వరకూ చేర్చాలి. దానికోసం ప్రజల వరకూ చేరుకునే విధి విధానాలను అన్వేషించాలి. అప్పుడే అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అవి అత్యవసరమైన పౌరుల వరకూ చేరుతాయి.

కొత్త ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ కేటాయింపులను కొత్తగా నిర్ణయించినపుడు ఈ ప్యాకేజీలు సరిపోతాయి. ఆ ప్రాతిపదికన.. ఆర్థికవ్యవస్థ ముందు ఇప్పుడు ఒక కొత్త రకమైన యుద్ధం చేస్తోంది. అందుకే, ఈ ప్యాకేజీ ప్రభావవంతంగా ఉండాలి. అలా ఉండాలంటే, నిత్యావసరాలు సరఫరా చేసే వనరులు, దీనికంటే సుదీర్ఘ లాక్‌డౌన్ సమయంలో కూడా సరైన పద్ధతిలో అవసరమైన సరుకులను ప్రజల చెంతకు చేర్చేలా ఉండాలి.

కరోనా వైరస్ వ్యాప్తి పెరగకుండా అడ్డుకోడానికి విధించిన లాక్‌డౌన్ బహుశా భారత ప్రభుత్వానికి అవసరమే. ఎందుకంటే, ఈ మహమ్మారి ప్రమాదం గుర్తించడంలో ఆలస్యం చేసినా, ఇప్పుడు ప్రభుత్వం నిద్రపోతూ ముప్పును కొనితెచ్చుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యాధి మరింత జోరుగా వ్యాపిస్తోంది. తగిన చర్యలు తీసుకోకపోతే.. ఈ మహమ్మారి భయంకర ప్రభావానికి, అది సృష్టించే విలయానికి దేశంలోని పేదలే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)