కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి? - ప్రజలు అడిగిన 10 కీలక ప్రశ్నలు... నిపుణుల సమాధానాలు

ప్రపంచంలో 123 పైగా దేశాల్లో కరోనావైరస్ విస్తరించింది. ఈ వైరస్‌ను ఓ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

ఈ పరిస్థితుల్లో కరోనావైరస్, దాని ప్రభావం గురించి ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందులో 10 ముఖ్యమైన ప్రశ్నలకు నిపుణులు ఇచ్చిన సమాధానాలు ఇవీ...

1. కరోనావైరస్ 'ఇంక్యుబేషన్ పీరియడ్' ఏమిటి?

వైద్య పరిభాషలో 'ఇంక్యుబేషన్ పీరియడ్' అంటే.. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ వ్యాధి లక్షణాలు కనిపించటానికి పట్టే కాలం.

కరోనావైరస్ సోకిన తర్వాత దాని లక్షణాలు కనిపించటానికి సగటున ఐదు రోజుల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే.. కొంతమందిలో లక్షణాలు కనిపించటానికి ఇంతకన్నా ఎక్కువ కాలమే పట్టొచ్చు.

ఈ వైరస్ విషయంలో ఇంక్యుబేషన్ పీరియడ్ 14 రోజుల వరకూ ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ చెప్తోంది. కానీ.. 24 రోజుల వరకూ కొనసాగవచ్చునని కొందరు పరిశోధకులు అంటున్నారు.

ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ గురించి తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. డాక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులు ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించటం కోసం సమర్థవంతమైన చర్యలు చేపట్టటానికి ఇది తోడ్పడుతుంది.

2. కరోనావైరస్ సోకి.. కోలుకున్న వ్యక్తి మీద ఆ వైరస్ మళ్లీ ప్రభావం చూపకుండా ఉంటుందా?

ఈ విషయం ఇప్పుడే చెప్పలేం. ఈ వైరస్ గత డిసెంబర్ చివరిలోనే వెలుగులోకి వచ్చింది. కానీ.. ఒకసారి వైరస్ సోకి కోలుకున్న తర్వాత.. వైరస్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీస్ శరీరంలో ఉంటాయని, అవి రక్షణ కల్పిస్తాయని ఇతర కరోనావైరస్‌ల అనుభవం చెప్తోంది.

సార్స్ తదితర కరోనావైరస్‌లు ఒకసారి సోకిన వారికి మళ్లీ సోకిన ఉదంతాలు చాలా అరుదు. ఇప్పుడు చైనాలో కరోనావైరస్ (కోవిడ్-19) సోకిన తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొంది బయటపడిన వారిలో కొంతమందికి కరోనావైరస్ ఉన్నట్లు వైద్య పరీక్షలు చెప్తున్నాయి. అయితే ఆ పరీక్షలు ఎంతవరకూ ఖచ్చితమనేది ఇంకా తెలియదు.

కీలకమైన విషయం ఏమిటంటే.. వారి ద్వారా మిగతా వారికి కరోనావైరస్ సేకే ప్రమాదం లేదు.

3. కరోనావైరస్‌ - ఫ్లూ మధ్య తేడాలు ఏమిటి?

కరోనావైరస్, ఫ్లూ రెండిటి లక్షణాలు చాలా వరకూ ఒకే రకంగా ఉంటాయి. ఆ లక్షణాలకు కారణం ఏమిటనేది పరీక్ష చేయకుండా నిర్ధారించటం కూడా కష్టమవుతుంది.

కరోనావైరస్ లక్షణాల్లో ప్రధానంగా చూడాల్సింది జ్వరం, దగ్గు. ఫ్లూ వల్ల తరచుగా గొంతు నొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. కరోనావైరస్ సోకిన వారికైతే శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారుతుంది.

4. ఎవరైనా తమకు వైరస్ ఉన్నట్లు భావించినపుడు సెల్ఫ్-ఐసొలేషన్ (స్వీయ ఏకాంతం) ఎలా చేయాలి?

సెల్ఫ్-ఐసొలేషన్ అంటే.. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండటం. ఆఫీసుకు కానీ, పనులకు కానీ, పాఠశాలకు కానీ, ఇతరత్రా బహిరంగ ప్రదేశాలకు కానీ వెళ్లకుండా ఉండాలి. ప్రజా రవాణా కానీ, ట్యాక్సీలను కానీ వాడకూడదు. ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులకు కూడా పూర్తిగా దూరంగా ఉండాలి.

సరుకులు, వస్తువులు, మందులు ఏవైనా అవసరమైతే ఎవరినైనా తెచ్చి పెట్టాలని సాయం కోరాలి. అయితే.. అలా తెచ్చిన వాటిని గుమ్మంలోనే వదిలిపెట్టి వెళ్లిపోయేలా చూసుకోవాలి. ఎవరినీ కలవకూడదు.

ఇంట్లో పెంపుడు జంతువుల నుంచి కూడా దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోయినట్లయితే వాటిని పట్టుకునే ముందు, పట్టుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

5. ఆస్తమా ఉన్న వారికి కరోనావైరస్ ఎంత ప్రమాదకరం?

కరోనావైరస్ వంటి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో.. ఆస్తమా లక్షణాలు పెరిగే అవకాశముంది.

ఈ వైరస్‌ వల్ల ఆందోళన చెందుతున్న ఆస్తమా పేషెంట్లు.. కొన్ని చర్యలు తీసుకోవాలని ఆస్తమా యూకే సూచిస్తోంది.

డాక్టరు నిర్దేశించిన ప్రకారం.. రోజూ ప్రివెంటర్ ఇన్‌హేలర్ వాడటం అందులో ఒకటి. దీనివల్ల కరోనావైరస్ సహా ఎటువంటి శ్వాసకోశ వైరస్ వల్ల అయినా ఆస్తమా పెరిగిపోయే ప్రమాదం తగ్గుతుంది.

6. తలుపు గడియలు, హ్యాండిళ్ల ద్వారా కరోనావైరస్ వ్యాపిస్తుందా? ఈ వైరస్ ఎంత సేపు బతుకుతుంది?

ఈ వైరస్ సోకిన వారు ఎవరైనా తమ చేతుల్లో దగ్గి.. ఆ చేతులతో దేనినైనా ముట్టుకున్నట్లయితే.. అలా ముట్టుకున్న ప్రాంతంలో వైరస్ అంటుకుని ఉండొచ్చు.

అలాంటి ప్రమాదం ఉండే అవకాశమున్న ప్రాంతాలకు డోర్ హ్యాండిళ్లు మంచి ఉదాహరణ.

ఇలాంటి ప్రాంతాల్లో కరోనావైరస్ కొన్ని రోజుల పాటు జీవించి ఉండగలదని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి.. ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని, వైరస్ వ్యాప్తిని తగ్గించటానికి మీ చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవటం ఉత్తమం.

7. బహిరంగ ఈతకొలనులో ఈత కొట్టటం సురక్షితమేనా?

చాలా వరకూ స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరిన్ ఉంటుంది. ఇది వైరస్‌లను చంపగల రసాయనం. కాబట్టి.. ఈతకొలనుల్లో సక్రమంగా క్లోరిన్‌ను ఉపయోగించినంత వరకూ వాటిని ఉపయోగించటం సురక్షితంగానే ఉంటుంది.

అయినప్పటికీ.. స్విమ్మింగ్ పూల్ దగ్గర దుస్తులు మార్చుకునే గదిలో కానీ, ఆ ప్రాంతాల్లో డోర్ హ్యాండిళ్ల వంటి వాటి ద్వారా కానీ వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఈ వైరస్ సోకే అవకాశం ఉండొచ్చు.

అలాగే.. వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్నట్లయితే వారి దగ్గు, తుమ్ముల ద్వారా కూడా వైరస్ సోకవచ్చు.

ఇలా వైరస్ సోకకుండా, వ్యాప్తి చెందకుండా నిరోధించటానికి తోడ్పడేందుకు పలు మార్గాలు ఉన్నాయి.

8. నాకు వైరస్ సోకకుండా, లేదా వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్క్ ఉపయోగించటం మొదలుపెట్టాలా?

డాక్టర్లు, సర్జన్లు తరచుగా ఫేస్ మాస్కులు వాడుతుంటారు. అయితే.. ప్రజలు ఫేస్ మాస్కులు ధరించటం వల్ల ప్రయోజనం ఉంటుందనేందుకు పెద్దగా ఆధారాలు లేవు.

''కరోనావైరస్ నుంచి రక్షణగా ఫేస్ మాస్క్ ఉపయోగించాలని మేం సిఫారసు చేయటం లేదు'' అని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ చెప్పింది. ఆస్పత్రుల వంటి చికిత్స ప్రాంతాల వెలుపల ఫేస్ మాస్క్‌లను ఉపయోగించటం ద్వారా విస్తృత ప్రయోజనాలు ఉంటాయనేందుకు ఆధారాలు లేవని ఆ సంస్థ చెప్తోంది.

ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ముఖ్యంగా మన ముఖాలను మన చేతులతో తాకటానికి ముందు చేతులను పూర్తిగా కడుక్కోవటం వంటి పరిశుభ్రత చర్యలు చాలా బాగా పనిచేస్తాయని నిపుణులు చెప్తున్నారు.

9. పిల్లలకు పొంచివున్న ముప్పు ఎటువంటిది?

మామూలుగా అయితే.. చైనా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పెద్దలతో పోల్చినపుడు కరోనావైరస్ వల్ల పిల్లల మీద ప్రభావం లేదు.

ఇందుకు.. వారిలో ఇన్‌ఫెక్షన్‌ను వదిలించుకోగలిగే సామర్థ్యం ఉండటమో, లేకపోతే లక్షణాలు ఏవీ లేకపోవటమో, ఒకవేళ ఉన్నా జలుబును పోలిన తేలికపాటి లక్షణాలు ఉండటమో కారణం కావచ్చు.

అయితే.. అంతర్లీనంగా ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి రావచ్చు. ఎందుకంటే ఈ వైరస్ వారిలో ఆస్తమా దాడిని ప్రేరేపించే అవకాశముంది.

ఎక్కువ మంది పిల్లలకు ఇది కూడా.. పెద్దగా ఆందోళన అవసరం లేని ఇతరత్రా శ్వాస సంబంధిత ఇన్‌పెక్షన్ లాగానే ఉంటుంది.

10. ఈ వైరస్ సోకిన వ్యక్తి తయారు చేసిన ఆహారం ద్వారా మనకు సోకుతుందా?

కరోనావైరస్ సోకిన వ్యక్తి ఆహారం తయారుచేసేటపుడు పరిశుభ్రంగా వ్యవహరించకపోయినట్లయితే.. ఆ వ్యక్తి నుంచి మరొకరికి ఈ వైరస్ సోకే అవకాశం ఉంది.

కరోనావైరస్.. దగ్గినపుడు చేతుల్లో పడే ఉమ్ము తుంపరల ద్వారా వ్యాపించగలదు.

సూక్ష్మక్రిముల వ్యాప్తిని నిరోధించటానికి.. ఆహారాన్ని ముట్టుకునే ముందు, తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవటం అందరికీ వర్తించే మంచి సలహా.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)