You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 గురించి మీ పిల్లలకు ఎలా చెప్పాలి?
కరోనావైరస్ ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తుండటంతో.. ఈ వైరస్ విస్తరణ గురించి ప్రతి రోజూ కొత్త వార్తలు వస్తున్నాయి.
ఈ వైరస్ సోకే ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరిలో ఆందోళన పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నారులు సహజంగానే సలహాలు, మద్దతు కోసం తమ తల్లిదండ్రుల మీద ఆధారపడతారు.
మరి.. ఈ వైరస్ విస్తరణ గురించి భయపడుతున్న, ఆందోళన చెందుతన్న చిన్నారులతో మీరు ఎలా మాట్లాడాలి?
భరోసా
బ్రిటన్‌లో కుటుంబ వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ పూనమ్ క్రిషన్‌కు ఆరేళ్ల వయసు కొడుకు ఉన్నాడు. ఆమె బీబీసీ రేడియో స్కాట్లండ్‌తో మాట్లాడుతూ.. ''పిల్లల్లో ఆందోళనను తొలగించాలి. ఈ వైరస్ కూడా జలుబు, డయేరియా వంటి వాటికి కారణమయ్యే వైరస్ లాంటిదేనని చెప్పాలి'' అని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలతో దాపరికాలు లేకుండా, నిజాయితీగా చర్చించాలని ఆమె నమ్ముతారు. ''నా కొడుకుతో నేను అలాగే చేస్తున్నా. నా దగ్గరకు వచ్చే ఇతర తల్లిదండ్రులకూ అలాగే చేయాలని చెప్తుంటా'' అని తెలిపారు.
కరోనావైరస్ వంటి పెద్ద సమస్యల గురించి పిల్లలతో మాట్లాడే విధానం.. ఆ పిల్లల వయసు వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుందని పిల్లల సైకాలజిస్ట్ డాక్టర్ రిచర్డ్ వూల్ఫ్‌సన్ చెప్పారు.
''ఆరేడేళ్లు, అంత కన్నా తక్కువ వయసు పిల్లలు.. తమ చుట్టూ జరిగేదాని గురించి తాము వినే ప్రతి అంశం పట్ల ఆందోళన చెందే అవకాశముంది. తల్లిదండ్రులు మాట్లాడుకునే తీవ్రమైన విషయాలు పిల్లలకు చాలా భయం కలిగించవచ్చు'' అని ఆయన పేర్కొన్నారు.
చిన్న పిల్లలకు మొదటిగా భరోసా ఇవ్వాలని ఆయన సూచిస్తారు. ''ఏం జరుగుతుందనేది మీకు తెలియదు. కానీ.. 'నీకేమీ కాదు.. మనకేమీ కాదు... అంతా బాగానే ఉంటుంది' అని పిల్లలకు చెప్పాలి. 'కొంత మందికి ఈ వైరస్ సోకుతుంది కానీ.. మనకేమీ కాదు' అంటూ భరోసా కల్పించాలి'' అని వివరించారు.
కార్యాచరణ
మీ పిల్లలకు ఈ వైరస్ రాదనే గ్యారంటీ లేదని ఆయన అంగీకరిస్తారు. అయినాసరే పిల్లలను అనవసరంగా భయాందోళనలకు గురిచేయటం కన్నా ఆశావహంగా ఉండటం చాలా ఉత్తమమని చెప్తారు.
ఇలా చెప్పటంతో పాటు.. వైరస్ సోకే అవకాశాలను తగ్గించే ఆచరణాత్మక చర్యలను వివరించి, వాటిని పాటించేలా చేయాలని సూచించారు. దానివల్ల పరిస్థితి మీద తమకు కొంత నియంత్రణ ఉందనే ధైర్యం పిల్లలకు వస్తుందన్నారు.
''మిమ్మల్ని, మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే అంశాలు కొన్ని ఉన్నాయి.. అందుకోసం మీరు మీ చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి...' అని మనం చిన్న పిల్లలకు చెప్పాలన్నారు.
దీనితో డాక్టర్ క్రిషన్ ఏకీభవిస్తారు. ఇన్‌ఫెక్షన్ సోకకుండా నివారించే నియంత్రణను బలోపేతం చేయటం.. స్వీయ రక్షణను పెంపొందించటం చేయాలని ఆమె సిఫారసు చేశారు. 'చేతులు శుభ్రంగా కడుక్కోవటం ఎలా' వంటి విషయాలను పిల్లలతో చర్చించాలన్నారు.
ఇలా భరోసా కల్పిస్తూ, వైరస్ సోకకుండా నివారించే ప్రణాళిక అందించటం ఉత్తమ వ్యూహమని నిపుణులు చెప్తున్నారు.
నివారణ
అయితే.. మంచి పరిశుభ్రత పాటించాలని పిల్లలకు కేవలం గుర్తుచేస్తే సరిపోదు.
చిన్న పిల్లలు సహజంగానే అమితమైన ఆసక్తితో ఉంటారు. వస్తువులను తాకటం, ఆహారం, తాగే పదార్థాలను పంచుకోవటం ఇష్టపడతారు.
''ఇన్‌ఫెక్షన్లు వ్యాపించటానికి ఇవే ప్రధానమైన మార్గాలు. వీటి విషయంలో పిల్లలకు చాలా కీలకమైన నైపుణ్యాలను మనం చాలా చిన్నప్పటి నుంచే నేర్పించటం మొదలుపెట్టాలు'' అని డాక్టర్ క్రిషన్ పేర్కొన్నారు.
సమర్థవంతమైన పరిశుభ్రతా నైపుణ్యాలను పిల్లలకు నేర్పించటం.. ఆ సమాజం మొత్తానికి రక్షణ కల్పించటానికి సాయపడగలదు.
నకిలీ వార్తలు
పిల్లల్లో ఆందోళన కలగటానికి ఆ పిల్లల తల్లిదండ్రులే ఒక కారణం కావచ్చునని డాక్టర్ వూల్ఫ్‌సన్ చెప్పారు.
''చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల వల్ల చాలా ప్రభావితమవుతారని నేను భావిస్తాను. తమ తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతుండటం పిల్లలు చూసినపుడు, తల్లిదండ్రులు తమ స్నేహితులతో చేసే సంభాషణలను విన్నపుడు.. చిన్న పిల్లలు దానివల్ల ప్రభావితమయ్యే అవకాశం చాల ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల సమక్షంలో ఎలా ప్రవర్తించాలనేది నియంత్రించుకోగలరు. కానీ స్కూలులో ఏం జరుగుతుందనేది వారి చేతుల్లో ఉండదు.
''నాకు ముగ్గురు మనవలు ఉన్నారు. వారి వయసు పన్నెండేళ్లు, పదేళ్లు, ఎనిమిదేళ్లు. ఎన్ని వదంతులు వ్యాపిస్తున్నాయో చెప్పలేం. 'మా స్కూలుకు ఎవరో వచ్చారు. మేం ఇంకెక్కడో ఉన్నాం. మమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్లమని చెప్పారు. మా అందరికీ ఆ వైరస్ వచ్చింది' అని ఒక మనవడు నాతో చెప్పాడు'' అని వూల్ఫ్‌సన్ తెలిపారు.
''ఈ కథలు ఎంత వేగంగా వ్యాపిస్తాయనేది ఇది చెప్తోంది. పిల్లలకు భరోసా ఇవ్వటం, వారితో నిజాయితీగా మాట్లాడటం చాలా ముఖ్యం'' అని చెప్పారు.
టీనేజర్లు
ఇక తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించిన వార్తల కోసం తల్లిదండ్రుల మీద తక్కువగా ఆధారపడుతూ, తమ స్నేహితుల నుంచి ఎక్కువగా సమాచారం పొందే టీనేజర్ల సంగతి భిన్నంగా ఉంటుంది.
''వాళ్లకి వాళ్ల సొంత సమాచార వ్యవస్థలు ఉంటాయి. తమ సొంత స్నేహితుల బృందం మీద ఎక్కువగా ఆధారపడతారు. కానీ దానివల్ల వచ్చే సమస్యల్లో.. మరింత ఎక్కువ వాస్తవికంగా ఉండటం ఒకటి. ఒక పద్నాలుగేళ్ల పిల్లవాడికి.. 'ఏం కాదు.. అంతా బాగానే ఉంటుంది' అని చెప్పటం కష్టం. ఎందుకంటే 'నీకు ఖచ్చితంగా తెలీదు కదా' అని వాళ్లు అడుగుతారు'' అని డాక్టర్ వూల్ఫ్‌సన్ వివరించారు.
''పెద్ద పిల్లలు గట్టిగా వాదించే విధంగా ఉంటారు. మనం చెప్పింది అంగీకరించటానికి సంసిద్ధంగా ఉండరు'' అని పేర్కొన్నారు.
అయితే.. పిల్లలు వయసు ఎంతైనా కానీ అందరికీ వర్తించే అంశం ఒకటుందని ఆయన అంటారు.
''పిల్లల వయసుతో నిమిత్తం లేకుండా.. వారు చెప్పదలచుకున్న విషయం చెప్పటానికి అనువైన వాతావరణం కల్పించటం ముఖ్యం'' అని సూచించారు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీలో అలర్లు చేయించేందుకు ముస్లింలకు డబ్బులు పంచారా? : Fact Check
- ఇవాంకా ట్రంప్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషాప్ ఎడిట్ ఫొటోలు..
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- అమరావతిలో భూముల ధరలు: ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఎలా మారాయి?
- కరోనావైరస్ ఎఫెక్ట్: పడిపోతున్న బీర్ల అమ్మకాలు... డెటాల్కు పెరుగుతున్న గిరాకీ
- 'ప్రపంచం మౌనంగా ఉంది... నిశ్శబ్దం భయంకరంగా ఉంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)