హంటావైరస్: భయపెడుతున్న మరో వైరస్... దీని లక్షణాలేంటి?

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ భయం గుప్పిట్లో చిక్కుకున్న ప్రజలను ఇప్పుడు హంటావైరస్ మరింత భయపెడుతోంది.

హంటావైరస్ వల్ల చైనాలో మార్చి 23 నాటికి ఒక వ్యక్తి చనిపోయాడని వార్తలు వస్తున్నాయి.

“హంటావైరస్ సోకిన వ్యక్తి ఏ బస్సులో ప్రయాణించాడో అందులోనే ఉన్న మొత్తం 32 మంది ప్రయాణికులకు కూడా పరీక్షలు నిర్వహించారు” అని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం చెప్పింది.

ఈ వార్తలు బయటికి రాగానే ట్విటర్‌లో #HantaVirus ట్రెండ్ అవడం మొదలయ్యింది.

సోషల్ మీడియాలో అందరూ కరోనాతో పోరాడుతున్న సమయంలో... హంటావైరస్ గురించి తమ స్పందలు, భయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ హంటావైరస్ అసలు ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

హంటావైరస్ లక్షణాలు

సీడీసీ నివేదిక ప్రకారం, హంటావైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది.

ఎవరైనా ఒక వ్యక్తి ఎలుకల మలమూత్రాలు లేదా లాలాజలం తాకిన తర్వాత ఆ చేతులతో ముఖాన్ని తాకితే వారికి హంటావైరస్ సోకే అవకాశాలు ఉంటాయి.

అయితే, సాధారణంగా హంటావైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించదు. ఇది సోకిందని తెలియడానికి 8 వారాల సమయం పడుతుంది.

హంటావైరస్ సోకిన ఒక వ్యక్తికి జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుపు, వాంతులు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

హంటావైరస్ సోకిన వ్యక్తి పరిస్థితి క్షీణిస్తే, అతడి ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.

2019 జనవరిలో హంటావైరస్ వల్ల పెటాగోనియాలో 9 మంది చనిపోయారు. ఆ తర్వాత పర్యాటకులను హెచ్చరికలు జారీ చేశారు.

అప్పటి ఒక అంచనా ప్రకారం హంటావైరస్ వ్యాపించిన మరో 60 కేసులు వెలుగులోకి వచ్చాయి. వారిలో 50 మందిని నిర్బంధంలో ఉంచారు.

సీడీసీ విషయానికి వస్తే, ఈ వైరస్‌ వల్ల మరణరేటు 38 శాతం ఉంటుంది. ఈ వ్యాధికి ఎలాంటి ప్రత్యేక చికిత్స లేదు.

హంటావైరస్ గురించి భారత్‌లో చర్చ

హంటావైరస్ వార్తలు రాగానే, ట్విటర్‌లో జనం దీనిగురించి స్పందించడం మొదలైంది.

“కరోనావైరస్.. ఇప్పుడు నేనింకా నా పని పూర్తి చేయలేదే అంటుందేమో” అని ఆస్టిన్ రాశారు.

“ఈ ప్రపంచం త్వరలో అంతం కాబోతోంది” అని హారిస్ రాశారు.

“ఈ వైరస్ పేరు విన్న తర్వాత మొత్తం ప్రపంచం పరిస్థితి చావుదెబ్బలు తిన్న బాక్సర్‌లా ఉంది” అని కింగ్ అనే ట్విటర్ హాండిల్‌లో ట్వీట్ చేశారు.

“మీరు హంటావైరస్‌తో చనిపోతే, కరోనావైరస్‌ వల్ల మీరు చనిపోరు” అని హసన్ పోస్ట్ చేశాడు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)