కరోనావైరస్: ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’ - కోవిడ్-19 బారిన పడి కోలుకున్నవారి అనుభవాలు

ఇది చైనాలో జింగ్జో నగరంలో నివసిస్తూ కరోనావైరస్ బారిన పడి తిరిగి కోలుకున్న ఓ కెమరూన్ విద్యార్థి కథ.

21 ఏళ్ల వయసున్న కెమ్ సెనౌ పావెల్ దర్యల్ తనకు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ తనకేం జరిగినా తనకొచ్చిన ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదన్న ఉద్ధేశంతో చైనాలోనే ఉండిపోయారు.

ప్రస్తుతం తన యూనివర్శిటి డార్మెటరీలో ఐసోలేషన్‌లో ఉంటున్నారు. జ్వరం, పొడి దగ్గు, ఫ్లూ లక్షణాలతో ఆయన బాధపడ్డారు.

నా చావు గురించే ఆలోచించా

అనారోగ్యం బారిన పడినవెంటనే దర్యల్‌కు చిన్నతనంలో కెమెరూన్‌లో ఉండగా తనకు వచ్చిన మలేరియా గుర్తొచ్చింది. పరిస్థితి విషమిస్తుందన్న భయం ఆయనలో మొదలైంది

"మొదటి సారి నేను ఆసుపత్రికి వెళ్లినప్పుడు నా చావు గురించే ఆలోచించా. అది ఎలా సంభవిస్తుందన్న దిశగానే నా ఆలోచనలు సాగాయి."

అయితే సిటీ స్కాన్‌లో ఆ వ్యాధి లక్షణాలు కనిపించలేదు. కరోనావైరస్ బారిన పడ్డ ఆఫ్రికాకు చెందిన తొలి వ్యక్తి ఆయనే. అలాగే ఆ వ్యాధి నుంచి కోలుకున్న మొదటి వ్యక్తి కూడా ఆయనే. ఆయన చికిత్స బాధ్యత అంతా చైనా ప్రభుత్వమే చూసుకుంది.

"నా చదువు పూర్తవకుండా నేను వెళ్లాలనుకోవడం లేదు. నేను ఇంటికి వెళ్లాల్సినవసరం కూడా లేదనుకుంటున్నా. ఎందుకంటే హాస్పటల్ ఫీజు దగ్గర నుంచి నా బాధ్యత అంతా చైనా ప్రభుత్వమే చూసుకుంటోంది"అని దర్యల్ బీబీసీకి చెప్పారు.

ఊపిరి పీల్చడం కూడా కష్టమైపోయింది

ఇది సింగపూర్‌లోని కరోనావైరస్ బారిన పడి ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొంది తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న జూలీ అనే మహిళ కథ. తనకు ఆ వ్యాధి సోకినప్పటి నుంచి తిరిగి కోలుకున్న వరకు తన అనుభవాల్ని బీబీసీతో పంచుకున్నారు.

"ఫిబ్రవరి 3న నాకు జ్వరం మొదలయ్యింది. సుమారు 101-101.3 డిగ్రీలు ఉండేది. జ్వరానికి మాత్ర వేసుకున్నా. ఆ తర్వాత అంతా మామూలుగా ఉంది. ఎలాంటి దగ్గు కూడా లేదు. ఆ నాలుగు రోజులు బాగానే ఉన్నాను. కానీ ఫిబ్రవరి 7 తెల్లవారు జామున 3 గంటలకు తెలివి వచ్చింది. లేచి చూస్తే కళ్లు తిరుగుతున్నట్టు అనిపించింది."

ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెకు కోవిడ్-19 సోకిందని తేలింది. ఆమెను ఐసోలేషన్‌ గదిలో ఉంచారు. నాలుగు గోడల మధ్య జీవితం చాలా కష్టంగా అనిపించిందన్నారు.

మాట్లాడానికి మనుషులు లేరని, తనకిచ్చే ఆహారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కూడిన కిటికి ద్వారా ఇచ్చేవారని చెప్పారు. ఫోన్ ఉంటుందని ఎవ్వరికైనా టెక్ట్స్ మెసేజ్‌లు పంపవచ్చని , అలాగే వీడియో కాల్ కూడా మాట్లాడవచ్చని అన్నారు.

అయితే అస్సలు మనుషులతో సంబంధం లేకుండా ఉండటం ఇబ్బందిగా ఉండేదని ఒక్కోసారి గోడను కొట్టి అవతలున్న రోగితో మాట్లాడే ప్రయత్నం చేసేదానినని చెప్పారు. ఇక వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ప్రధానంగా శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేదన్నారు.

"ఒక్కోసారి నా ఊపిరితిత్తులు అలసిపోయేవేమో అనిపించేవి... అస్సలు ఎలా శ్వాస తీసుకుంటన్నది కూడా తెలిసేది కాదు. ఐదు మీటర్ల దూరంలో ఉన్న బాత్రూంకి వెళ్లడం కూడా కష్టమైపోయింది. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు" అని తన భయంకరమైన అనుభవాన్ని ఆమె వివరించారు.

అయితే పాజిటివ్ అని తేలిన 9 రోజుల్లోనే ఆమె ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు ధ్రువీకరించారు.

ఒక్కరి వల్ల 11 మందికి వచ్చింది

మిస్టర్ స్టీవ్ వాల్ష్... బ్రిటన్‌కు చెందిన వ్యక్తి. వృత్తి పరంగా ఓ గ్యాస్ ఎనాలసిస్ ఎక్వీప్‌మెంట్‌కు చెందిన సంస్థలో పని చేస్తున్నారు. వృత్తి పరమైన పనుల్లో భాగంగా సింగపూర్ వెళ్లినప్పుడు ఫ్రెంచ్ స్కీ రిసార్ట్‌లో ఉండగా ఆయనకు కరోనావైరస్ సోకింది.

ఆయన కారణంగా మరో 11 మంది కూడా వైరస్ బారిన పడ్డారు. వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలోనే ఐసొలేషన్ వార్డులో ఉన్నారు. అక్కడ ఉన్నన్నాళ్లు తన వల్ల వైరస్ బారిన పడ్డ మిగిలిన వారి గురించే ఆలోచించానని చెప్పుకొచ్చారు.

ముందు జాగ్రత్తలో భాగంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా తమకు తాముగా ఇంటివద్దే ప్రత్యేక పర్యవేక్షణలో ఉంటామని తనకు చెప్పినట్టు వాల్ష్ చెప్పారు.

ఆయన కారణంగా కరోనావైరస్ సోకిన వారిలో ఐదుగురు బ్రిటన్‌కు చెందిన వారు కాగా మరో ఐదుగురు ఫ్రాన్స్‌కి చెందిన వారు. మిగిలిన ఒక్క వ్యక్తి స్పెయిన్‌లోని మజొర్కాకు చెందిన వారు. స్టీవ్ వాల్ష్ నివసించే ప్రాంతంలో మరో ఇద్దరు వ్యక్తులు బాబ్ సెనర్, అతని భార్య కత్రియోనా గ్రీన్‌వుడ్‌లకు కూడా వైరస్ సోకింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)