You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: తెలంగాణలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఎక్కడికి వెళ్లాలి?
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోవిడ్ 19 వ్యాధి చికిత్స కోసం తెలంగాణలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, ఛాతి ఆస్పత్రులతో పాటు వికారాబాద్‌లోని మిలటరీ, టీబీ ఆస్పత్రులలో తగిన ఏర్పాట్లు చేశారు.
వాటికి ఆదనంగా ప్రైవేటు ఆస్పత్రులలో కూడా చికిత్స అందించేందుకు కేంద్రం అనుమతించిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం తెలిపారు. ఇప్పటికే 22 ప్రైవేటు వైద్య శాలలు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయన్నారు.
రోగి పరీక్షల నిమిత్తం తీసుకున్న నమూనాలను మాత్రం గాంధీ ఆస్పత్రికే పంపాలని ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. ఒకవేళ ఎవరికైనా వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలితే మాత్రం వారిని అక్కడ నుంచి మార్చడం సమస్యగా మారుతుందని, ఆ క్రమంలో కొత్తవారికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు.
ఇప్పటివరకు తెలంగాణలో ఎంత మందికి పరీక్షలు నిర్వహించారు?
దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనావైరస్ సోకిన తర్వాత మొత్తం 86 మందికి సంబంధిత పరీక్షలు నిర్వహించామని, వారందర్నీ ప్రస్తుతం ఎవ్వరినీ కలవకుండా ప్రత్యేక పరిస్థితుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని మంత్రి రాజేందర్ చెప్పారు.
దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒక్కరికే వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యిందని ఆయన తెలిపారు. ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావద్దని కోరారు.
ఇక వ్యాధి సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ బీబీసీకి తెలిపారు.
ఇప్పటివరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే 18667 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మొదట్లో చైనా, హాంకాంగ్‌లతో పాటు జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, సింగపూర్, మలేసియా, వియత్నాం, ఇండోనేషియా, నేపాల్, ఇరాన్, ఇటలీ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మాత్రమే పరీక్షించేవారు. మార్చి 4నుంచి విదేశాల నుంచి వచ్చే అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఒక్క మార్చి 4వ తేదీనే మొత్తం 392 మంది అనుమానితులను క్వారంటైన్ (గృహ నిర్బంధం)లో ఏ ఒక్కర్నీ కలవకుండా 28 రోజుల పాటు ఉండాలని పంపినట్టు ప్రభుత్వం వెల్లడిచింది.
వారిలో 193 మందికి సంబంధించి రక్త నమూనాలను సేకరించారు. ఇప్పటివరకూ వారిలో 149 మందికి వైరస్ లేదని సమాచారం వచ్చింది. మరో 43 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
ఐటీ కారిడార్లో ఏం జరుగుతోంది?
రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్‌లో డీఎస్ఎం సంస్థకు చెందిన ఓ యువతి ఇటీవల కంపెనీ కార్యకలాపాల్లో భాగంగా ఇటలీ వెళ్లి వచ్చారు. ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆ సంస్థ తమ ఉద్యోగులందర్నీ ఇంటికి పంపించి వేసింది.
సదరు యువతి తన ఆరోగ్య పరిస్థితిని తనకు తానుగానే యాజమాన్యానికి వివరించిందని డీఎస్ఎం సంస్థ తెలిపింది. అయితే తరువాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెకు కోవిడ్-19 లక్షణాలు లేవని వైద్యులు నిర్ధరించారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఇంటి వద్ద నుంచే పని (వర్క్ ఫ్రం హోం) చేయాలని ఆదేశించాయి.
తదుపరి ఆదేశాలిచ్చేంత వరకు విధులకు ఎవ్వరూ హాజరు కావద్దని, అలాగే కంపెనీ పరిసరాలను పూర్తిగా స్టెరిలైజ్ చేయిస్తున్నామని డీఎస్ఎం సంస్థ వెల్లడించింది.
గత 14 రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేయించాలని సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్‌కి సూచించినట్టు తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ బీబీసీకి చెప్పారు.
సోషల్ మీడియాలో వస్తోందంతా నిజమేనా?
ఇక సోషల్ మీడియాలో అనేక తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతునే ఉంది.
తాజాగా ముఖానికి మాస్క్ కట్టుకున్న ఓ వ్యక్తి ఫొటోను పెట్టి "ఇతనే ఇప్పుడు హైదరాబాద్‌ను భయపెడుతున్న వ్యక్తి" అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు.
ప్రజారవాణా సురక్షితమేనా?
మంత్ర కేటీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ,హెచ్ఎంఆర్ఎల్ సంస్థలు బస్సులను, మెట్రో రైళ్లను శానిటైజ్ చేస్తున్నారు. ఎక్కువ మంది జనం ఒకే చోట గుమికూడవద్దని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్చి 15న తలపెట్టిన హైదరాబాద్ బహిరంగ సభ వాయిదా వేసుకున్నారు.
సరిపడా వనరులున్నాయా?
కోవిడ్ 19 విషయంలో ఒక్క హైదరాబాద్లోనే 500 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తున్నట్టు డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. వీరిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
"అత్యవసర సమయాల్లో 70 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 నుంచి 70 మంది ఊపిరితిత్తుల నిపుణుల సేవల్ని వినియోగించుకుంటామని చెప్పారు.
ప్రభుత్వం అత్యవసర సేవల నిమిత్తం రూ. 100 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. 24 గంటలూ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి.
ప్రజారోగ్య రంగం
గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది అదనంగా ఆరోగ్య శాఖకు నాలుగువేల కోట్ల రూపాయలను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రం వరకు ఫరవాలేదని, కేంద్ర బడ్జెట్లో మాత్రం కేటాయింపులు తక్కువగా ఉంటున్నాయని, ఫలితంగా కేంద్ర పథకాలపై రాష్ట్రం పెట్టే ఖర్చు పెరిగిపోతోందని తన పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఆరోగ్య శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
కరోనావైరస్ వ్యాప్తి నివారణ ప్రయత్నాల్లో భాగంగా ఆయుష్ శాఖ హోమియో మందు సరఫరా చేస్తోంది. మూడు రోజుల పాటు రోజుకు ఆరు మాత్రలు తీసుకోవాలని సూచిస్తోంది. అయితే ఈ మందులు ఎంత బాగా పనిచేస్తాయన్న దానిపై స్పష్టత లేదు.
భారత్ సిద్ధమేనా?
ఇలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు మన దేశంలో సుస్థిరమైన పరిశోధనా వ్యవస్థ లేదంటున్నారు నిపుణులు. భారత్‌లో జన సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇటువంటి వ్యాధులు విజృంభించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు ప్రజారోగ్యం, పౌష్టికాహార విధానాలపై పరిశోధన చేస్తున్న కొట్టే సందేశ్.
"మన దగ్గర సరైన ప్రణాళిక లేదు. ఉదాహరణకు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో జనసాంద్ర ఎక్కువ. కానీ ఎక్కడా, ఎప్పుడూ సరైన ప్రణాళిక ఉండదు. కరోనా ఒక్కటే కాదు, గతంలో వచ్చిన ఏ భయాల నుంచీ మనం గుణాపాఠాలు నేర్చుకోలేదు. ఉదాహరణకు మన దగ్గర అంతర్గత వలసల గురించి సరైన సమాచారం లేదు. ఒకవేళ ఒక వ్యక్తి వైరస్ వచ్చాక ప్రజా రవాణాలో ప్రయాణిస్తే, ఆయనతో పాటు ప్రయాణించిన వారిని ట్రాక్ చేసే అవకాశం లేదు. ప్రజల సమాచారాన్ని ఒక్క చోట చేర్చేందుకు (డాటాబేస్), మౌలిక వసతుల కోసం బడ్జెట్ కేటాయించాలి" అని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమ బడ్జెట్లో ఆరోగ్యానికి రాష్ట్ర జీఎస్డీపీలో కేవలం 0.82 శాతం నిధులు కేటాయిస్తున్నాయి. వెనుకబడిన ఇతర రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు వైద్యానికి పెట్టే ఖర్చు కంటే కూడా ఈ కేటాయింపులు తక్కువేనని సందేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి పది వేల మందికీ 23 మంది ఆరోగ్య కార్యకర్తలు, ప్రతి వెయ్యి మందికీ ఒక డాక్టరు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
"ఇక్కడ మనకు సమస్య ఏంటంటే, అసలు ఎంత మంది ఆరోగ్య కార్యకర్తలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారో కూడా స్పష్టత లేదు. అయితే ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉండొచ్చు" అని సందేశ్ చెప్పారు.
గతంలో తీవ్ర భయాందోళనలకు గురి చేసిన హెచ్1ఎన్1 వంటి వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదంటారు విష జ్వరాల వైద్యుడు డాక్టర్ ప్రభు కుమార్.
"ఇవాళ మనదేశంలో వైరస్‌ని నిర్ధరించే ల్యాబ్ కేవలం ఒకే ఒక్కటి ఉంది. చాలా చోట్ల ఇంకా టెస్ట్ కిట్లను వాడాల్సి వస్తోంది. ఇప్పటికే మరిన్ని ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ఉండాలి" అని ఆయన బీబీసీతో అన్నారు.
మరోవైపు హైదరాబాద్‌లో శానిటైజర్ల స్టాక్ అయిపోతోంది. మేం వెళ్లిన మందుల దుకాణానికి మాస్కుల కోసం జనాలు వస్తున్నారు. కానీ తమ వద్ద స్టాకు తక్కువే ఉందని ధరలు కూడా బాగా పెరిగిపోయాయని షాపు యజమాని మాతో చెప్పారు.
జనంలో కూడా భయం పెరుగుతోంది. ఆ ప్రభావం హోలీ సందర్భంగా నిర్వహించే ఈవెంట్లపై కూడా పడింది. ఏటా వివిధ కార్యక్రమాలను నిర్వహించే ఓ ఈవెంట్ మేనేజర్ ఈ ఏడాది తమ వ్యాపారంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని చెప్పారు. ఏటా ఈ పాటికే తాము నిర్వహించే ఈవెంట్లకు టిక్కెట్లు అమ్ముడుపోయేవని, కానీ ఈ ఏడాది మాత్రం అటువంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రముఖుల సాయం తీసుకుంటోంది. అంతర్జాతీయ క్రీడాకారులైన పీవీ సింధు, సానియా మీర్జా వంటి సెలబ్రిటీలతో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- వెనెజ్వెలా: మహిళలు ఒక్కొక్కరు ఆరుగురు పిల్లల్ని కనాలని చెప్పిన అధ్యక్షుడు మదురో
- జోసెఫ్ స్టాలిన్: అలనాటి సోవియట్ అధినేత జీవితం... ఇలా ముగిసింది
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజీల్‌పై వ్యాట్ పెంపు.. ప్రజలపై భారమెంత
- మహిళల టీ20 ప్రపంచ కప్: ఫైనల్లో భారత్... తుదిపోరు ఆస్ట్రేలియాతో
- దిల్లీ హింస: అల్లర్లలో మరణించినవారి వ్యధలివీ..
- వుహాన్‌లో చిక్కుకుపోయిన కర్నూలు జ్యోతి పరిస్థితి ఏంటి?
- కరోనావైరస్ను అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యుహెచ్ఓ
- #RIPTwitter: 24 గంటల్లో ఈ మెసేజ్‌లు మాయం.. ట్విటర్ ప్రయోగంపై యూజర్ల నిరసన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)