You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మందుల కొరతకి దారి తీయవచ్చా?
కరోనావైరస్ ప్రపంచ దేశాలని భయపెడుతున్న నేపథ్యంలో భారతదేశం కొన్ని మందుల ఎగుమతిని నిలిపి వేసింది. ఇది అంతర్జాతీయంగా కొన్ని ముఖ్యమైన మందుల కొరతకి దారి తీయవచ్చు.
ప్రపంచంలోనే అత్యధికంగా సాధారణ మందులను ఎగుమతి చేసే దేశం మందులు తయారీకి వాడే 26 రకాల పదార్థాల ఎగుమతిని నిలిపి వేసింది.
నొప్పి నివారణకు చాలా మంది ఎక్కువగా వాడే పారాసెట్మాల్ కూడా ఇందులో ఒకటి.
చైనాలో మందుల్ని ఉత్పత్తి చేసే కంపెనీలు తాత్కాలికంగా మూత పడటంవలన, ఉత్పత్తి తగ్గడం వలన ఈ పరిస్థితి తలెత్తింది.
మందుల తయారీలో వాడే 70 శాతం పదార్థాల కోసం భారతదేశం చైనా మీద ఆధారపడుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే మందుల కొరత తప్పదని నిపుణులు హెచ్చరించారు. కొన్ని మందులు చైనాలో ఉత్పత్తి అవ్వనప్పటికీ, వాటి తయారీలో వాడే ముడి పదార్థాలు మాత్రం చైనా నుంచే సరఫరా అవుతాయి.
చైనా, భారత్‌లలో కరోనావైరస్ ప్రభావం తీవ్రమైతే ప్రపంచవ్యాప్తంగా మందుల కొరత ఏర్పడవచ్చని చైనా మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ విశ్లేషకుడు షాన్ రీన్ అన్నారు.
ఈ జాబితాలో టినిధజోల్, ఎరిత్రిమోసిన్ లాంటి యాంటీబయోటిక్స్, ప్రొజెస్టిరాన్, విటమిన్ బి12 లాంటి మందులు ఉన్నాయి. భారత్ ఎగుమతి చేసే మొత్తం మందుల ఎగుమతుల్లో ఇవి 10 శాతం ఉంటాయి.
మందుల కొరత వలన ఇప్పటికే వీటి ధరలు పెరుగుతున్నాయని ఆక్స్‌ఫర్డ్‌లో ఆర్థిక నిపుణుడు స్టీఫెన్ ఫోర్మన్ బీబీసీకి చెప్పారు. "భారతదేశానికి ఎగుమతులు తగ్గడంతో ఇప్పటికే అక్కడ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి" అని అయన అన్నారు.
అయితే భారత ప్రభుత్వం మాత్రం తమ దగ్గర మరో మూడు నెలల వరకు సరిపడ మందులున్నాయని చెబుతోంది.
2018లో అమెరికా ఉత్పత్తి చేసే మందుల్లో పావు భాగం, 30 శాతానికి పైగా మందులు తయారు చేసే ముడి పదార్థాలు భారతదేశానికి దిగుమతి అయ్యాయని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
కరోనావైరస్ నేపథ్యంలో విధించిన ఆంక్షలు అమెరికాలోని మందుల సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపకుండా ఉండటానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ స్టీఫెన్ హాన్ యూఎస్ సెనేటర్లకి వివరించారు.
మందుల కొరత ప్రభావం తమపై పడకుండా ఉండటానికి యూఎస్‌లో ప్రముఖ మందుల కంపెనీలు తమ మందుల సరఫరా, నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.
మందుల కొరత ఏర్పడవచ్చని కొంత మంది విశ్లేషకులు హెచ్చరిస్తే, మరి కొంత మంది కరోనావైరస్ ప్రభావం తమ ఉత్పత్తులపై పడదని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు
- కరోనావైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 గురించి మీ పిల్లలకు ఎలా చెప్పాలి?
- కర్నాటక బీజేపీ మంత్రి కుమార్తె పెళ్లి... ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న ఖరీదైన వేడుక
- ఇంటర్ విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దీనికి పరిష్కారం ఏంటి?
- వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సంస్థలు 93,000 కోట్లు చెల్లించడంలో విఫలమైతే ఏమవుతుంది?
- అమరావతి ఉద్యమంలో పెరుగుతున్న కేసులు... జైళ్ళలో ఉద్యమకారులు
- దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న భారత్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)