You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజీల్‌పై వ్యాట్ పెంపు.. ఎందుకీ నిర్ణయం?
- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి రైతుల ఆందోళన, శాసన మండలి రద్దు వంటి అంశాలతో దేశ వ్యాప్తంగా వార్తల్లో ఉంటూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాజాగా మరో అంశంలో కూడా వార్తల్లో నిలిచింది. పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరోసారి రాష్ట్రం పేరును వార్తల్లో నిలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై ఇప్పటి వరకూ 31 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా.. దాన్ని 35.20 శాతానికి పెంచారు. డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా దాన్ని 27 శాతానికి పెంచారు. ఈ పెంచి వ్యాట్ శాతాలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డి.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈమేరకు పెట్రోల్, డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ శాతాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యాక్ట్ 2005 లో షెడ్యూల్ ఆరు సవరిస్తూ, దాని ప్రకారమే పెంచి కొత్త వ్యాట్ శాతాలు జనవరి 30, 2020 నుంచి అమల్లోకి వస్తాయంటూ జీవో MS నెంబర్ 19ని బుధవారం విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి రావడంతో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా... పెట్రోల్ ధరపై లీటరకు 50 పైసల నుంచి 70 పైసల వరకూ అదనపు భారం పడనుంది. ఇక డీజిల్ పైనా లీటరుకు రూపాయి వరకూ భారం పడే అవకాశం ఉంది.
ఇప్పటికే పొరుగు రాష్ట్రాల కన్నా ఏపీలో ఎక్కువ
పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ, తెలంగాణల్లోనే పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ శాతం ఎక్కువగా ఉంది. పొరుగు రాష్ట్రం కర్నాటకతో పోలిస్తే, ఏపీలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉంటూ వస్తోంది.
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ముందుకెళ్తోంది. అయితే ఈ క్రమంలో రాష్ట్రం ముందున్న ఆర్థిక ఇబ్బందులు అధిగమించే చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వినిపించాయి. ఈ తరుణంలో రాష్ట్రానికి పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రధానంగా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు.. వాటిపై విధిస్తున్న వ్యాట్ శాతాల్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకూ వ్యాట్ పై అదనంగా వసూలు చేస్తున్న స్థిరధర రెండు రూపాయలను మాత్రం తొలగించింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం... ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యాక్ట్ 2005 లో షెడ్యూల్ ఆరులో చేసిన రెండు సవరణలు కింది విధంగా ఉన్నాయి.
1)కాలం నెంబర్ 4లో పేర్కొన్నట్లు ఐటమ్ నెంబర్ 2లో ఉన్న పెట్రోల్ అమ్మకాల్లో ప్రతి లీటర్ పెట్రోల్ మీద విధించే రేట్ ఆఫ్ ట్యాక్స్ 31శాతం + రూ.2 స్థిర ధరకు బదులుగా ఇకపై 35.20 శాతం వ్యాట్ వసూలు చేయాలి
2)కాలమ్ నెం4లో పేర్కొన్న ఐటమ్ నెంబర్ 5లో ఉన్న సీ-9తో పాటు అన్నిరకాల డీజిల్ ఉత్పత్తులపై విధించే రేట్ ఆఫ్ ట్యాక్స్ లీటర్‌కు 22.25 శాతం + రూ.2 స్థిర ధరకు బదులుగా... 27 శాతం వ్యాట్ వసూలు చేయాలి.
అంటే ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద వసూలు చేస్తున్న వ్యాట్ రేటు, అదనంగా రెండు రూపాయల స్థిరధరను సవరిస్తూ.. పూర్తిగా వ్యాట్ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇప్పటి వరకూ ముడి చమురు ధర మీద ఆధారపడకుండా ప్రతి లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తున్న రెండు రూపాయల స్థిర ధర ఇకపై ఉండబోదు. కానీ దాని స్థానంలో వ్యాట్ రేటు పెరగడంతో ఆ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.
ఇక ఈ నిర్ణయం వల్ల... పెట్రోల్, డీజిల్ మూల ధర పెరిగేకొద్దీ.. ప్రజలపై పడే భారం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు లీటర్ పెట్రోల్ మూలధర 60 రూపాయలు ఉందనుకుందాం. 29 జనవరి వరకూ ఉన్న వ్యాట్ + స్థిరధర ప్రకారం 31 శాతం వ్యాట్ లెక్కేస్తే అది 18రూపాయల 60 పైసలు అవుతుంది. ఇక దానికి అదనంగా 2 రూపాయల స్థిర ధర కూడా కలిపితే లీటర్ పెట్రోల్ ధర.. 80 రూపాయల60 పైసలు అవుతుంది. కానీ ఇప్పుడు సవరించిన వ్యాట్ రేట్ల ప్రకారం చూస్తే 60 రూపాయిల పెట్రోల్ మూల ధరపై 35.2 శాతం వ్యాట్ లెక్కేస్తే అది 21 రూపాయిల 12 పైసలు అవుతోంది. అంటే గతంతో పోలిస్తే లీటర్ పెట్రోల్ ధర 52 పైసలు పెరుగుతుంది. ఇక భవిష్యత్తులో పెట్రోల్ మూల ధర పెరిగే కొద్దీ... దాని మీద వ్యాట్ శాతం కూడా పెరుగుతుంది.
గతంలో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయలు దాటినప్పుడు 2018 సెప్టెంబర్‌లో పెట్రోల్, డీజిల్‌పై రూ.2 పన్ను తగ్గిస్తూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడుల్లో ప్రభుత్వం పన్ను భారాన్ని తగ్గిస్తూ రావడంతో అక్కడ పెట్రోల్ ధరలు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. కానీ ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో వాహనదారులకు భారం తప్పేలా లేదు. బుధవారం నాటికి రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్రోల్ ధర రూ .77.93, డీజిల్ ధర రూ .71.94. తాజాగా పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ పెంచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సాలీనా కనీసం 500 కోట్ల రూపాయల అదనపు రాబడి ఉండొచ్చన్నది ఆర్థిక శాఖ అధికారుల అంచనా.
గురువారం నాటికి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.36 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.66.36 పైసలు ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.78.97 ఉండగా.. డీజిల్ ధర రూ.69.56గా ఉంది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.77.94గా ఉంది. డీజిల్ ధర రూ.72.27గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.56 ఉండగా.. డీజిల్ ధర రూ.71.91గా ఉంది. పెంచిన ధరలలో ప్రతి లీటర్ పెట్రోల్ మీద ప్రస్తుతానికి 50 పైసలు భారం పెరుగుతోంది. ఇదే ధరలు ఒక నెల రోజుల పాటు కొనసాగితే.. సగటున లీటర్‌కి 50 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే బైక్ ఉన్న సగటు ఉద్యోగి, నెలకు కనీసం వెయ్యి కిలోమీటర్లు ప్రయాణిస్తే... అతనికి 20 లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది. అంటే లీటర్ మీద 50 పైసలు వేసుకుంటే... మొత్తంగా అతనికి 10 రూపాయిల అదనపు భారం పడుతుంది. ఒకవేళ పెట్రోల్ రేట్లు రోజువారీ సమీక్షా విధానంలో పెరుగుతూ ఉన్నట్లయితే.. ఈ భారం మరింత పెరుగుతుంది.
సరకు రవాణా మరింత భారం
పెట్రోల్ ధరల కన్నా డీజిల్ ధరల పెరుగుదల అన్ని వర్గాల మీద, అన్ని రంగాల మీద పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది. డీజిల్ రేట్లు పెరిగితే సరకు రవాణా, కూరగాయల ధరలు, నిత్యావసరాల ధరలు అన్నీ పెరుగుతాయి. ఇవి పరోక్షంగా సామాన్యుడి బడ్జెట్ మీద అదనపు భారం మోపుతాయి. 2017 జూన్ 16 నుంచి రోజువారీ సమీక్షా విధానంలో ధరలు మారుతూ వస్తున్నాయి. ఆరోజు డాలర్ మారకం రేటును బట్టి ఉదయం ఆరు గంటలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్ని నిర్ణయిస్తూ వస్తున్నాయి. దీనికి తోడు స్థానిక పన్నులు మారుతూ ఉండటంతో దేశంలో ఒక్కో చోటా ఒక్కో రకమైన పెట్రోల్ ధరలు కనిపిస్తాయి. రోజువారీ సమీక్షా విధానంలో పెరిగే పెట్రోల్, డీజిల్ మూలధనంతో పోలిస్తే తాజాగా ఏపీలో పెంచిన వ్యాట్ రేట్లతో సామాన్యుడిపై భారం పడే అవకాశమే ఎక్కువ. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో ఇలా ఏపీలో అదనంగా వ్యాట్ వడ్డించడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వివాదం - ‘మా’లో ఏం జరుగుతోంది? సమస్య ఎక్కడ మొదలైంది?
- నంబి నారాయణన్: ఒక నకిలీ ‘గూఢచార కుంభకోణం’ ఈ సైంటిస్టు జీవితాన్ని ఎలా నాశనం చేసిందంటే..
- అడవిలో తప్పిపోయి, 34 రోజులపాటు బెర్రీలు తింటూ ప్రాణాలు నిలబెట్టుకున్న తల్లీ పిల్లలు
- కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య: ‘అది ఆడమనిషి శరీరంలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?
- కరోనా వైరస్: చైనాలో 106కు చేరిన మరణాలు... ఇతర దేశాల్లో పెరుగుతున్న బాధితులు
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- భారత్‌లో ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు అయిదేళ్లలోపే చనిపోతున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)