జనసేన పార్టీకి రాజీనామా చేసిన వీవీ లక్ష్మీనారాయణ

జనసేన పార్టీకి మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్షీ నారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఒక లేఖ రాశారు.

''పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించినని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది. కావున, నేను జనసేన పార్టీ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను'' అని లక్ష్మీ నారాయణ తన లేఖలో పేర్కొన్నారు.

2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి పోటీచేసిన లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు. గత కొంతకాలంగా పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఎన్నికల తరువాత అనేకసార్లు ఆయన ఆలోచనలను పక్కన పెట్టారని, ఇటీవల పవన్‌ కల్యాణ్ ఓ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు రావడంతో లక్ష్మీనారాయణ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

జనసేనలో చేరడం గురించి గతంలో వీవీ లక్ష్మీనారాయణ బీబీసీతో మాట్లాడారు. పార్టీలో చేరడానికిగల కారణాలను వివరిస్తూ... ‘‘జనసేన ఆవిర్భావానికి ముందు నుంచే పవన్‌ కల్యాణ్, నేను రెండుమూడూ సార్లు చర్చించాం. తర్వాత నేను మహారాష్ట్రకు వెళ్లాను, ఆయన పార్టీ పెట్టారు.

2018లో కలాంగారి మాటలు గుర్తొచ్చాయి. 2025 సంవత్సరం వరకు దేశ భవిష్యత్తును నిర్ణయించే విధంగా మనం ప్రయత్నం చేయాలని కలాం చెప్పారు.

దేశంలో యువతరం అధికంగా ఉంది. యువతరాన్ని సక్రమమైన మార్గంలో ముందుకు తీసుకెళ్తే అదొక 'అణు శక్తి'గా మారుతుంది. లేదంటే, అదొక అణు బాంబుగా మారి ప్రపంచానికే ప్రమాదంగా మారుతుంది.

ఆ యువతను ఒక మార్గంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత నామీద ఉందన్న ఆలోచనతో పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని జనసేనలో చేరాను’’ అని ఆయన చెప్పారు.

‘‘రైతులు, యువత, మహిళా సాధికారత, విద్య, వైద్యానికి ప్రాధాన్యమిస్తూ, జీరో బడ్జెట్ రాజకీయాలు చేసేవారితో కలవాలని అనుకున్నాను.

నన్ను దాదాపు అన్ని పార్టీలూ ఆహ్వానించాయి. పవన్ కల్యాణ్ మేనిఫెస్టో చూసిన తర్వాత జనసేనలో చేరాను’’ అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)