You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లక్ష్మీనారాయణ: ‘‘నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు... ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తా‘‘
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీ నారాయణ సోమవారం కీలకమైన రాజకీయ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.
హైదరాబాద్‌లో లక్ష్మీనారాయణ తన అభిమానులతో సమావేశం నిర్వహించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు సందర్భంగా క్విట్ కరప్షన్ మూమెంట్ పేరుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
లోక్‌సత్తా పార్టీలో చేరాలని లక్ష్మీనారాయణను జయప్రకాశ్ నారాయణ ఆహ్వానించారు. దీనికి స్పందించిన మాజీ జేడీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
'నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు'
కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. తెలంగాణలో అభ్యర్థులకు మద్దతిస్తామని, దేశమంతా ఉంటామని పేర్కొన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మీద కత్తి దాడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆయన విమర్శించారు.
అలాగే.. ‘‘నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు. బాణాలు వేసే ధనుస్సును. ఎవరి మీదో పోరాడటానికి కాదు.. ప్రజలను ఆనందంగా ఉంచడానికి వస్తున్నా’’ అని లక్ష్మీనారాయణ చెప్పారు.
తమ భావజాలంతో కలిసి పనిచేసే ఎవరితోనైనా తాము చర్చిస్తామన్నారు.
‘త్వరలో రాజకీయ కార్యాచరణ’
ప్రజలు తమకేం కావాలో తయారు చేసుకునే ప్రజల మేనిఫెస్టోయే తమ మేనిఫెస్టో అని చెప్పారు. ‘‘మేం కల్పించిన అవగాహనతోనే ప్రజలు మేనిఫెస్టోను బాండ్ పేపర్లపై పెట్టి సంతకం చేయమని అడుగుతున్నారు’’ అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ఫలితంతో సంబంధం లేకుండా పని చేసుకుపోతాననని త్వరలోనే రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. ‘‘ఇప్పుడే గెలుస్తాను అని చెప్పలేను కానీ తప్పకుండా గెలుస్తా’’ అని ధీమా వ్యక్తంచేశారు.
మహిళలకు 50 శాతం సీట్లు ఇస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ... ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ల బలం తక్కువగా ఉందని.. అందుకే కలిసి పనిచేయాలని, లోక్‌సత్తాను ముందుకు తీసుకువెళ్లాలని లక్ష్మీనారాయణను కోరారు.
‘‘మాజీ జేడీ రాజకీయ ప్రవేశంతో పెద్దగా మార్పు ఉండదు...’’
‘‘రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు పతనావస్థకు చేరినపుడు మంచి వాళ్లు వస్తే బాగుంటుంది. ఆర్థిక రాజకీయాలు ప్రధానంగా ఉన్నపుడు లక్ష్మీనారాయణ లాంటి వాళ్లు వస్తే బాగుంటుందని అనిపిస్తుంది’’ అని విశ్లేషకుడు డానీ వ్యాఖ్యానించారు.
‘‘కానీ వారు వచ్చి చేసేది ఏమీ లేదు. లోక్‌సత్తాలో జేపీ ఏం చేశారు.. ఇప్పుడు జేడీ కూడా అంతే’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘కులం ఓటు మీద బతకాలి. ఆయన పార్టీ పెడితే.. గెలిస్తే ఆయన ఒక్కడే గెలవగలరు’’ అని డానీ పేర్కొన్నారు.
‘‘లక్ష్మీనారాయణకు మంచి అధికారి అన్న ఇమేజ్ ఉంది. దానివల్ల ఐదారు శాతం ఓట్లు వస్తాయి. మిగతా అంతా ఇతర పార్టీలు, రాజకీయాల్లాగానే ఉంటుంది’’ అని విశ్లేషించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)