You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ: ‘‘ఈ రోజు నుంచి జనసైనికుడిని’’
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మీనారాయణ ఆదివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు కుండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
లక్ష్మీనారాయణతో పాటు, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రాజగోపాల్ కూడా జనసేన పార్టీలో చేరారు.
శనివారం రాత్రే ఆయన విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి పవన్‌కు కలిశారు. సుమారు గంట 45 నిమిషాలపాటు పవన్ కల్యాణ్‌తో ఆయన భేటీ అయ్యారు.
ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటించినట్లు చెప్పారు.
‘‘లక్ష్మీనారాయణ, రాజగోపాల్‌ను పార్టీ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జనసేన ఆవిర్భావానికి ముందే నేను జేడీ లక్ష్మీనారాయణను కలిసి మాట్లాడాను. అప్పుడే కలిసి పని చేయాలని భావించినా కుదరలేదు. 2014 లో అనుకున్నది 2019 లో సాధ్యం అయ్యింది’’ అని పవన్ పేర్కొన్నారు.
‘‘నేడు రాజకీయం అంటే వేల కోట్లు కావాలి. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు యాభై, వంద కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో డబ్బు రాజకీయాలు పెరిగిపోయాయి. ధన ప్రవాహం చూసి ప్రజలు కూడా చీదరించుకుంటున్నారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు మేము రాజకీయాల్లోకి వచ్చాం’’ అని చెప్పారు. ‘‘ప్రజా సేవ చేయడానికి కోట్ల రూపాయలు ఎదురు పెట్టుబడులు పెట్టాలా? డబ్బులతో ప్రమేయం లేకుండా ఎన్నికలకు వెళుతున్నాం’’ అన్నారు.
‘‘ఒక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో పవన్ జనసేన స్థాపించారు. సమసమాజ నిర్మాణం కోసం మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆనాడు కుటుంబ సమస్యలు కారణంగా కుదరలేదు. ఈరోజు కలిసి పని చేసే అవకాశం కలిగింది’’ అని లక్ష్మీనారాయణ తెలిపారు.
‘‘భారత దేశం యువతరంతో ఉత్సాహంగా ఉంది. వచ్చే ఐదేళ్లలో వారికి మార్గం చూపితే దేశం రూపురేఖలే మారిపోతాయి. మార్పు తెచ్చే నేత పవన్ కల్యాణ్. పవన్ మ్యానిఫెస్టో కూడా చాలా బాగుంది.. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంది’’ అని కితాబునిచ్చారు. ‘‘ఇటువంటి మ్యానిఫెస్టో రూపొందించాలంటే ఎంతో సాధన చేసి ఉండాలి. డబ్బులు లేకుండా రాజకీయం జరగదు అన్న నేటి రోజుల్లో మార్పులు కోసం వచ్చారు. జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ మూడు లక్షణాలు పవన్‌లో ఉన్నాయి. నేను ఈరోజు నుంచి జనసైనికునిగా ఉంటాను’’ అని చెప్పారు.
తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది పవన్ ప్రకటిస్తారని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తాను టీడీపీలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలు మీడియా సృష్టేనన్నారు.
వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు రెండు వందల శాతం అబద్ధమంటూ ‘‘నా వృత్తిని ఎలా నిర్వహించానో నా అంతరాత్మకు తెలుసు’’ అని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)